అవధాని తండ్రికి రమారమి అరవై ఏళ్ళుంటాయి. ఆయన భార్యకు యాభైకిపైగా వుంటాయి. అవధాని భార్యవయస్సు ముప్పయిపైబడి వుంటుంది. ఇంట్లో అవధాని మరదలు ఇరవై ఏళ్ళామెవుంది. అవధాని పిల్లలు ముగ్గురు-వాళ్ళ వయసులు పన్నెండు లోబడే అవధానికి ముగ్గ్రురు చెల్లెళ్ళున్నారు. పదహారు, పద్దెనిమిది, ఇరవై రెండు-వాళ్ళ వయస్సులు. పెద్ద చెల్లెకు వివాహమై ఏదో పనిమీద పుట్టింటికి వచ్చింది. మిగతా వాళ్ళకు పెళ్ళిళ్ళు కాలేదింకా.
అవధాని తండ్రి చావుదెబ్బలు తిన్నాడు. నోటమాట కూడా రాకుండా ఆయన పడిపోయారు. అవధాని పిల్లల్నీ ముసలామెను ఇంట్లో స్థంభాలకి కట్టేశారు. ఆడవాళ్ళ నలుగురికీ బట్టలువిప్పేసి వాళ్ళ కాలనీలోని వీధులన్నీ తిప్పి-"అల్లాని అపవిత్రులన్నవారిగతి-ఇంతే" అంటూ నినాదాలు చేశారు.
ఆ కాలనీలో వుండే ముస్లింలందరూ ఉత్సాహంగా జయ జయధ్వానాలతో ఆ దృశ్యాన్ని తిలకిస్తే హిందువులు భయంభయంగా తిలకించారు. ఆడవాళ్లనలా ఊరేగించడం అయ్యాక తిరిగి వాళ్ళని అవధాని ఇంటికి తీసుకువెళ్ళి-అవధాని తండ్రిని "ఒరే-పరమ పవిత్రమైనది కదూ నీ వంశం-తురక బీజంతో అదింకా పవిత్రమైనది కదూ నీ వంశం-తురక బీజంతో అదింకా పవిత్రమౌతుంది-" అంటూ ఆయనకళ్ళముందే ఆ ఆడవాళ్ళ మానం చెరిచారు.
ఊరేగింపును తిలకించిన హిందువుల్లో కొందరి రక్తం మరిగింది. ఆ కాలనీలో తమది మైనారిటీ అని తెలిసినప్పటికీ ఒకరిద్దరు కత్తులు తీసుకొని హుస్సేన్ నీ, ఆలీనీ చంపుతామంటూ బయల్దేరారు. కాని వాళ్ళే చచ్చారు. అంతటితో ఆగలేదు. అక్కడున్న ముస్లింలంతా హిందూవులను ఊచకోత కోయసాగారు.
ఈవార్త ఎలాగో ఊళ్ళోకి పాకింది. ఊళ్ళో ఎక్కడెక్కడి ముస్లింలను హిందువులు వెతికి వెతికి చంపడం మొదలయింది.
మనుషులు పశువులకంటే దారుణంగా చస్తున్నారు. ఆడవాళ్ళు అమానుషంగా చెరచబడుతున్నారు. ఆ నగరం ఒక రణరంగంలా కనబడుతోంది. ప్రజలు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకున్నారు.
8
అప్పుడే ఒక ముస్లిం యువతి విశ్వనాధం వద్ద భంగపడింది. తన అనుచరులిద్దరితో-"దీన్ని ఇలాగేకాసేపు వీధులంమాట పరుగెత్తించండి-" అని చెప్పాడు. ఆ తర్వాత తనవారు మరికొందరివేపు తిరిగి "ఇక్కడ ముస్లిం లను మనం చంపడంలో పెద్ద థ్రిల్ లేదు. విజయమో, వీర స్వర్గమో ముస్లిం కాలనీలో చూసుకుందాం" అన్నాడు.
దీనికి చాలామంది ఆవేశానందాలతో అంగీకరించారు. వారివద్ద మెషిన్ గన్స్ వున్నాయి. హాండ్ గ్రేనేడ్సున్నాయి. ఒక్కరాత్రిలో ఇవన్నీవారెలా సంపాదించారో అనూహ్యం.
విశ్వనాధం మాత్రమేకాక అతనివంటివారు మరికొందరున్నారు. సాధనసామగ్రితో వీరు ముస్లిం కాలనీపై పడ్డారు. అక్కడున్నవారూ తక్కువ తినలేదు.
చాలాసేపు యుద్ధం జరిగింది. ఆ యుద్దమలా జరుగకూండగానే విశ్వనాధం అక్బర్ ఆలీ ఇంటిమీద పడ్డాడు. అవధాని ఇంట్లో జరిగినదానికి మించి అతనక్కడ హింసాకాండ చేశాడు. ఆడవాళ్ళను మినహాయించి మిగతా అంధరిని మెషిన్ గన్ తో కాల్చిపారేశాడు. వున్న ఆడవాళ్ళను పశువుల మందలా తరలించుకుపోయాడు.
హిందూ ముస్లిం గొడవల గురించి వార్త అప్పటికి బయల్దేరింది. పోలీసులుకూడా అప్పటికి రంగప్రవేశం చేశారు. అప్పటికి జరుగవలసిన దారుణాలన్నీ జరిగిపోయాయి.
ఇలాంటి విషయాల్లో పోలీసులకు తప్పుబట్టి ప్రయోజనంలేదు. జనాన్ని దుర్మార్గుల బారినుండి రక్షించడానికే వారున్నారు కానీ మొత్తం జనమంతా దుర్మార్గులుగా మారితే-వారిని అర్ధం చేసుకుని అదుపులోకి తీసుకురావడానికి వారికీ కొంత వ్యవధి కావాలి. తమ దుర్మార్గానికి తామే ఫలితం అనుభవించడం-తప్పదు ప్రజలకు.
ధననష్టం, ప్రాణనష్టం, మాననష్టం-అంతులేనిదని ఆ నగరంలోని వారందరికీ తెలుసును. కానీ యితర ప్రాంతాల్లో యిటువంటివి తలెత్తకుండా వుండడంకోసం, ప్రజలు భయభ్రాంతులు కాకుండా ఉండడంకోసం-ప్రభుత్వం వాటికి సంబంధించిన సంఖ్యలను బాగా తగ్గించి ప్రకటించింది ప్రచురించింది.
అల్లర్లు, కొట్లాటలు తగ్గాయి. ప్రజలు శాంతించారు. తమ ఆవేశానికీ, అవివేకానికీ చింతిస్తున్నారు.
9
అవధాని ఊర్నించి తిరిగివచ్చేసరికి అంతా అయిపోయింది. అతను షేక్ మహమ్మద్ హుస్సేన్ కు సంబంధించిన ఒక ముఖ్యకారణం మీద ఊరికి వెళ్ళాడు. ఆ పని పూర్తిచేసుకుని వచ్చేసరికి అతని కుటుంబానికి సంబంధించి అతనొక్కడే మిగిలాడు.
ఒక్కసారిగా అతనికి ముస్లింలమీద పగ రగిలింది కంటికీ మంటికీ ఏకధారగా ఏడుస్తూనే అతను మనసులో ముస్లింలను శాపనార్ధాలు పెట్టసాగాడు. అయితే అక్బర్ ఆలీతో సహా అతని యావత్కుటుంబమూ సర్వనాశనమై పోయిందని తెలియగానే అవధానికి మతి పోయినట్లయింది.
తప్పెవరిది హిందువులదా? ముస్లిములదా?
అసలీ గొడవలన్నీ ఎలావచ్చాయి?
గొడవలెలా వచ్చాయో తెలియదు కానీ-వారికి పూర ముగింపు వారంరోజుల అనంతరం జరిగిన సమావేశంలో లభించింది.
ఆ సమావేశాన్ని నిర్వహించినది షేక్ మహమ్మద్ హుస్సేన్, జగన్మోహనరావు.
మతాలు, దేవుళ్ళూ పెరుకేగానీ ఈ ప్రపంచానికంతకూ ఒక్కడే దేవుడు. ఆ దేవుణ్ణి అల్లా అని కొందరూ, యెహోవా అని కొందరూ, రాముడని కొందరూ పిలుస్తూంటారు. ఎవరే పేరులో పిలిచినా దేవుడు పలుకుతాడు. ఎవరేవిధంగా కొలిచినా దేవుడు సంతోషిస్తాడు. అందరూ దేవుడిబిడ్డలే. వారిమధ్య కలహం అన్నదమ్ముల కలహం లాంటిది. ఆ కలహం దేవుణ్ణి ఎంతగానో బాధిస్తుంది.
ఈ పరమసత్యాన్ని హుస్సేన్, జగన్మోహనరావు శ్రోతలకు వివరించి చెప్పారు.
ఆ సత్యాన్ని నమ్మక ధన మాన ప్రాణాల్ని కోల్పోయిన వారూ, వారి బంధువులూ వున్న అక్కడి శ్రోతల వర్గం మౌనంగా ఆ మాటలను విని కళ్ళనీళ్ళు తుడుచుకున్నారు. ఎవరికెవరున్నారు? ఎవరికేమి ఒరిగింది? చివరకు మిగిలిందేమిటి?
ఆవేశం క్షణికమే. కాని దాని ప్రభావం జీవితకాలమూ ఉంటుంది.
హిందూ, ముస్లిం మైత్రికి చిహ్నంగా హుస్సేన్ మసీదు పక్కనున్న స్థలాన్ని రామాలయనిర్మాణానికిగానూ జగన్మోహనరావుకిచ్చేస్తున్నానని ప్రకటించేడు. పేదముస్లింల కోసం ఒక సహాయాసంస్థ ఏర్పాటు చేయడానికి పాతికవేల విరాళాన్ని ప్రకటించాడు జగన్మోహనరావు.
హిందూముస్లిం భాయిభాయ్ అంటూ శ్రోత లందరూ నినాదాలు చేశారు. ఆ శ్రోతల్లో ఇంచుమించు అందరూ నష్టపడినవారే!
అప్పుడే అవధానికి స్ఫురించింది-"ఒకనాడు బద్ద శత్రువులుగా వుండి ఈనాడు చేతులుకలిపి వేదికమీద నిలబడ్డ ఆ పెద్దలందరూకూడా ఈ గొడవల్లో ఏ విధంగానూ నష్టపోలేదని-"
అందుక్కారణం-వారు, వారి కుటుంబాలతో సహా ఒకరోజు ముందుగానే ఆ ప్రాంతాల నుంచి తప్పుకుని పొరుగూరు వెళ్లడమని అందరికీ తెలుసు. అయితే అవధానిని పట్టి పీడిస్తున్న సమస్య వేరు-కొట్లాటలు జరుగుతాయని అంతకుముందుగా వారికెలా తెలుసు?
అవధానిపేరుతో మసీదుపై కాగితాలంటింపజేసినది షేక్ మహమ్మద్ హుస్సేన్. అవధాన్ని ఊర్నించి పంపివేసినది షేక్ మహమ్మద్ హుస్సేన్. అక్బర్ ఆలీని రెచ్చకొట్టినదీ అతను. అతన్ని సమాధానపరచగల అవధాని లేకుండా చేసినదీ అతనే!
అవధాని కుటుంబానికి జరిగిన అవమానానికి ప్రతిగా రెచ్చగొట్టినది జగన్మోహనరావు, మసీదుపైన కాగితాలను చూస్తూనే అతను హుస్సేన్ ఆంతర్యాన్ని గ్రహించగలిగాడు. అందుకు ప్రతిగా అన్నీ సిద్దం చేసుకున్నాడు.
హుస్సేన్ కీ. రావుకీ కూడా జరగబోయేది తెలుసు. అందుకే తాము జాగ్రత్తపడి తమ అనుచరులను ఉసికొలిపారు. జరగవలసింది జరిగాక మతావేశపు పరిణామాలు తెలుసుకొన్నాక వేదిక ఎక్కి చేతులుకలిపారు.
అంతులేని ప్రాణనష్టం జరిగాక-యుద్దంలో ఒకరిని విజయమైనా వర్తిస్తుంది-లేదా ఇద్దరు రాజులూ సంధిచేసుకుంటారు. సంధి జరిగితే యిద్దరు రాజులకూ ఫరవాలేదు. ఓటమి లభించినా-ఓడిన రాజును సగౌరవంగా ఖైదుచేస్తారు. రాచమర్యాదలతో సత్కరిస్తారు.
ఓడినా గెలిచినా యుద్దంలో పోయేది సైన్యమే కానీ రాజులు కారు!
ఈ సత్యం గ్రహించిన అవధాని-దేవుడ్ని నమ్ముతున్న, దేవాలయాలకు వెడుతున్న, దేవుడిపేరుతో తన సోదరుణ్ణి చంపుతున్న-మనుష్యులను చూసి జాలిపడ్డాడు. దేవుడు ఈ మనుష్యులకి చెందడు-అదిగో ఆ వేదికమీదవున్న హుస్సేన్. రావు-లాంటి వారికి చెందుతాడు. దేవుడి పేరుతో దేవుడికన్న దారుణంగా శాసించగలరు వాళ్ళు ప్రజలను!
అవధానికి దేవుడిమీద నమ్మకం పోతేనేం-ముస్లిం కాలనీలో మసీదుపక్క రామాలయం వెలసింది.
* * *
