"క్లాసులకు వెళ్ళవూ?" నిర్లిప్తంగా అడిగింది పద్మావతి.
"రేపు వెళ్తాను........ ఈవాళ మీతో చాలా మాట్లాడాలి.......రాండి ఎక్కడికేనా వెళ్దాం......" అని లాక్కొనిపోయింది.
"మూర్తిగా రెంత మంచివారో చెబుతుంది పిచ్చిపిల్ల! అంతేగా......పోనీ విందాం" అనుకుంది పద్మావతి.
కాని శైలజ పద్మావతి గురించే అంతా మాట్లాడింది.
"సురేఖగారు, భాస్కరంగారూ, అందరూ కలిసి మీకు ఏదీ చెప్పకుండా చావడానికి కారణం మీమీద ప్రేమయే" నన్నది శైలజ పెద్ధదానిలా!
"నాతో చెప్పకుండా నన్ను ప్రేమిస్తున్నాను అని లోకానికి చెప్పడంవల్ల ఏం ప్రయోజనం శైలజా......ఇప్పుడిక ఆయనాకు నేను యివ్వగలిగేదేమీలేదు" పద్మావతి కన్నీరింకి పోయినట్లు కరుడు బారిపోయింది.
"వాళ్ళ పిన్నీగారూ, సురేఖ దొడ్డగారూలాంటి మనుషులున్నంత కాలం ప్రేమకు పగ్గాలు వేయాలి తప్పదు - అదే చేశాడు భాస్కరంగారు అన్నారు మూర్తిగారు" చెప్పింది శైలజ.
"కాని నేను చాలా దురదృష్టవంతురాలిని చెల్లీ! ఎందుకంటే మా అమ్మలాంటి వాళ్ళున్నప్పుడు కూడా ప్రేమకు పగ్గాలు వేయాలి-కాని నా కది చాతకాదు అంచాత యిప్పుడు నా కొక్కటే దారి..." అంటూ.
పద్మావతి లేచి శైలజతో వస్తానని కూడా చెప్పకుండా వెళ్ళిపోయిం దక్కన్నుంచి.
* * *
శైలజ రెండు క్షణాలు దిమ్మబారిపోయింది. పద్మావతికి మతి స్థిమితం తప్పలేదు కదా! అనుకుంది. కాని పద్మావతి వెనుదిరిగి చూడకుండా వెళ్ళిపోయింది. శైలజ కేక వేసింది వెనకనించి. కాని పద్మావతి ఆగలేదు. పరిగెత్తినట్లు వెళ్ళి "ఏం పద్మావతిగారూ! నామీద కోపం వచ్చిందా?" అన్నది ఆమెను భుజాలు పట్టుకుని ఆపి.
"ఉహు.......లేదు......ఇప్పుడిక నామీద నాకే కోపమమ్మా!.......నీకూ మూర్తిగారికీ థాంక్స్....... చేతులు కాలాయి ఆకులెందుకిక? దయచేసి నన్ను ఇంటికి వెళ్ళనీ"-విడిపించుకుని వెళ్ళిపోతున్న పద్మావతిని ఆపలేదు శైలజ. ధైర్యంచాలలేదు ఎందుకనో!
పద్మావతికి జరుగుతున్నది కలో, నిజమో తెలియలేదు. జయమ్మగారి కంటబడకుండా ఎటేనా పారిపోదామా! అనిపించింది.
"ఎంత నీచం! నన్ను ప్రేమిస్తున్న వ్యక్తి నాతో చెప్పకుండా......నా మీద అంత విశ్వాసం...... లేకుండా ఇప్పుడు మళ్ళీ యీ ఆశ పెట్టడమా? ఇంత శిక్ష ఇంత యాతన భగవంతుడా! పగవాళ్ళకేనా వద్దు"
పద్మావతి భాస్కరాన్ని చంపేసి, తాను చచ్చిపోదామనిపించింది. "ఉహు.......నేనే చస్తాను. ఆయన గారినే సుఖపడమను........ నా బ్రతుకు గాకపోయినా నా చావేనా వీళ్ళ సంప్రదాయలకు పునాదులు పెళ్ళగించుతుందేమో.......అంతే" ననుకుంది.
కాని శైలజ అన్నమాటలు ఇంకా ఆమె చెవుల్లో గింగుర్లు మంటున్నాయి. "వాళ్ళపిన్ని గారిని ఒప్పించి నిన్ను పెళ్ళి చేసుకోవాలనే అతను తపస్సు చేస్తున్నాట్ట!"......
"కాని కాని.......ఇప్పుడు అమ్మకి నేను ఇచ్చిన మాట?..... తను ఆత్మహత్యైనా చేసుకుంటుంది గాని ఈ పెళ్ళికి ఒప్పుకోదే......."
అందుకే ఇదంతా భ్రమ......డగా......ప్రేమకు బంధనాలు ఒక ఆటంకమైతే త్యాగం ఒక పర్యవసానం......"
"నన్ను కన్నతల్లికి దుఃఖాన్నీ-ప్రేమించిన వ్యక్తికి గుండెలమీద కుంపటినీ అయి బ్రతకడంకన్నా చావడం మేలు........."
పద్మావతి ఆలోచనలు ఒకే దిక్కు తెలిసిన గంతలగుర్రంలాపరిగెడుతున్నాయి. వీటిని ఆపగలశక్తి ఎవ్వరికీ లేదు. సురేఖకుంది. భాస్కరానికుంది. కాని ఆ ఇద్దరూ అక్కడలేరు. జయమ్మగారికి జరిగిన అవమానం ఎలాగున్నా ఆమెకు ఇక భాస్కరంమీద నమ్మకంలేదు. పద్మావతిమీద కూడా భరోసా లేదు.
* * *
ఇంటికి వస్తూనే మంచాన మొహం తిరిగి నట్లు పడిపోయిన కూతుర్ని చూసి గాభరా పడ్డది జయమ్మగారు.
ఆఎకు కూతురి పొట్ట చూడాలన్న అనుమానం, శంక, ఎంత కాదనుకున్నా పీడిస్తున్నాయి...... కాని "కడుపు చించుకుంటే కాళ్ళమీదా......"అని ఎవరితో అనడం "ఒక్క ఆ సర్వేశ్వరుడితో తప్ప"
"అమ్మా! నేను చచ్చిపోతే నువ్వు ఏడవనని ఒట్టెయ్యి" పిచ్చిగా తల్లిని గౌగాలించుకుంది పద్మావతి.
"ఛీ! ఏం మాటలే అవి? ఒక మగాడు మాట మార్చుకున్నంత మాత్రాన చస్తారా? అమ్మా?" ఆమె ఆ మాటలంటున్నదేగాని పద్మావతి "కాలు జారిన" నేరానికి "ఈ క్షోభ పడుతున్నదేమో" నన్న శంక మాత్రం పోలేదు.
"లేదమ్మా! నేను నేనేనమ్మా పాపిష్టిదాన్ని......అందర్నీ అపార్ధం చేసుకున్నాను" తల్లిని పెనవేసుకుని "నన్ను క్షమించమ్మా! నాకు పెళ్ళి చెయ్యకమ్మా" అన్నది ఏడుస్తూ.
"లేదు పద్మావతీ! నేను రాజుకి ఉత్తరం రాశాను. నాకు అతని ఎదుట అపవాదు తేకు.........ఎవ్వరిని అపార్దం చేసుకున్నానో వాళ్ళ నిక మీదట ఒక జీవితకాలంపాటు అపార్ధం చేసుకోడం మంచిది" ఆమె కూతుర్ని విడిపించుకునే ప్రయత్నం చేసింది.
"అయితే నా శవానికి చెయ్యి పెళ్ళి" పద్మావతి, తలలిని వదిలి అటు తిరిగి మంచంలో తల దాచుకుంది. "దీనికి నెల తప్పలేదు కదా?" అనుకుని గుండెల్ల్లో గునపాలతో పొడిచినట్లు బాధ పడ్డది జయమ్మగారు.
కాని కూతుర్ని నిలదియ్యలేక పోయింది.
ఆమెకు ఒకవేళ అటువంటి అప్రతిష్ఠయే వస్తే ఏం చెయ్యాలో తోచలేదు. రాజు ఇప్పుడు రాకపోయినా బాగున్ను అనుకుంది.
"పోనీ, ఆ భాస్కరం ఎవరో వాళ్ళ తల్లి దండ్రులనే వెళ్ళి కాళ్ళు పట్టుకుంటాను" అనుకున్నది. ఆమెకు పద్మావతిని శంకించడం పూర్తిగా సాధ్యపడలేదు.
"ఉత్తదే! పిచ్చిపిల్ల మాయమాటలు నమ్మి ప్రేమా-గీమా అంటూ వాపోతున్నది" అని సరిపుచ్చుకున్నది.
పద్మావతికి బుర్రలో భయంకరమైన ఆలోచనలన్నీ ఉధృతమవుతూ ఉన్నా, రెండు మార్గాలు మాత్రం తోస్తున్నాయి. ఈ రెండు రకాల ఆలోచనాలు, రెండు అగ్నిగోళాల్లా ఢీకొంటున్నాయి.
భాస్కరంగారిని తానెలాగ సుఖపెట్టలేదు. అతని జీవితానికి సుఖ శాంతులను ఇవ్వలేను' గనుక ఇక ఆ జీవితంనుంచి తప్పుకుపోదాం ఒకటీ-లేదా, అవతల తల్లికి ఇచ్చిన మాట ప్రకారం భాస్కరంగారిని మరిచిపోయి మరొకరికి శారీరకమైన సేవ చేస్తూ, కృశించిపోవడం-రెండూ.....
"ఔను! భాస్కరంగారి నెల్లాంటి పగ్గాలు ఆపాయో నాకూ, నా తల్లితో అనుబంధం అటువంటి బంధనాలనే వేస్తున్నది కదా?" అనుకున్నది. కాని తాను భాస్కరం లేకుండా మరొకనితో కాపురం చేయడమా?......అదీ కూడా భాస్కారంగారు నన్ను ప్రేమిస్తున్నాడనీ" "అనుబంధనాల బంధాలతన్ని ఇన్నాళ్ళూ బంధించి వేశాయనీ" తెలిశాక మరొకడికి వశమైపోడం ఎట్లా? ఎట్లా.....?
"సరే! నే ఛస్తే అమ్మకి అంత బాధా తీరిపోతుంది" అనుకుంది చివరికి. ఒక నిర్ణయానికి వచ్చినట్లు-తనకు తెలీకుండానే ఆ పిల్లకు అలసట' వల్ల కాస్త నిద్ర పట్టింది.
జయమ్మగారు ఇదిచూసి విస్తుబోయింది.
57
ఇరవైఏళ్ళకు పైగా కాపురం చేసినా జానికమ్మ గారి గాంభీర్యాన్ని కదిలించగల నేర్పుగానీ, ధైర్య స్తిమితలు గాని సుబ్బారావుగారికీ లేవు. ఆమెకు జ్వరం తీవ్రంగా ఉన్నదంటే ఆందోళనపడ్డ సుబ్బారావుగారు అది కాస్త తగ్గి ఆమె లేచి తిరుగుతూ ఉండగానే, కోర్టు వ్యవహారాలలో తల దూర్చేసుకున్నాడు. వాస్తవానికి భాస్కరం వెళ్ళిన నాలుగు రోజులలోనే ఆమెకు ఊష్ణం తీవ్రత తగ్గి పోయింది. కాని, ఆమె అదివరకు వసంత జ్ఞానం వచ్చిన తర్వాత చూడనంత యిదిగా చిక్కిపోయింది.
గుండెల్లో పాటుగా ఉంది. అని రక్తం తోడేస్తున్నట్లుగా ఉన్నదనీ అయిదారుసార్లు అన్నది కూడా - వసంత ముకుందరావు రాసిన ఉత్తరం కూడా మరోసారి చదువుకోలేదు. ఆ పిల్లకు అమ్మ గురించే బెంగపడిపోయింది.
జానికమ్మగారు ఉండి ఉండి ఎటో దీర్ఘంగా చూడటం - అలాగే కొద్ది క్షణాలు స్తంభించినట్లు వుండిపోడంచూసి వసంతకు బెంగ ఎక్కువైపోయింది. సరళా రామం పోట్లాడుకున్నారు ఆమధ్యాహ్నము. "అక్కయ్యకన్నా ఒదినె అందంగా ఉంటుంది" అన్నది సరళ - "అసలు వదినె రానే రాదు, అన్నయ్యకి యిష్టంలేదు" అన్నాడు రామం. మొదట వెక్కిరించుకున్నారు. ఆనక్ గిల్లి రక్కుకున్నారు. జానికమ్మగారు వాళ్ళను విడిపించి హైరాన పడిపోయింది. "నువ్వూ వాడూ-(భాస్కరం) ఎన్నడూ ఇలా పోట్లాడుకోలేదు" అన్నదామె. "సరిలే! వీళ్ళ పోట్లాటలైనా, ఐకమత్యమయినా నే నెన్నాళ్ళు చూడాలి కనుక-మీ అన్నయ్య వస్తే వాడికి అప్పజెప్పేస్తాను" అన్నదామె.
తర్వాత కాస్సేపాగి వసంతను కేకేసి "అన్నయ్యను రమ్మని రాశావా? ఏమిటి?" అన్నది.
వసంతకు ఏం చెప్పాలో తెలియలేదు.
"రాస్తాను" అన్నది.
నిరుత్సాహ పడిపోయిన జానికమ్మగారు, దాన్ని దాచేసుకుని "వద్దు వద్దు ఒకవేళ రాశావేమోనని భయపడ్డా - అనవసరంగా వాడి చదువు పాడౌతుందనీ-అలా అన్నా" నందామె.
కాని, ఆమె ఉద్దేశంలో వసంత తనకు తెలియకుండా భాస్కరానికి "రమ్మ"ని రాస్తేనే బాగుండుననిపించింది.
పనిపాటల మధ్య ఉండి ఉండి "పోనీ అమ్మాయి! వాణ్ణి రమ్మని వాడికి నచ్చిన సమ్మంధం ఏదో చెప్పమందునా! అదే చేస్తాను....." అంటూ ఉంటే వసంత ఇక ఉండబట్టక సుబ్బారావుగారితో చెప్పింది.
"నాన్నగారూ! అన్నయ్యని రమ్మని రాస్తాను" అని.
"ఎందుకమ్మా!-" -సుబ్బారావుగారు కాయితాల్లోనుంచి తల పైకి ఎత్తనేలేదు.
"నాకు చూడాలనుంది" వసంత మాటలకు ఉలిక్కిపడి-తన వెనుక నించున్నది జానికమ్మా? వసంతా? అన్నట్లు చూశారు సుబ్బారావుగారు.
భాస్కరం గురించి అంత స్పష్టంగా తనను వచ్చి అడిగేది ఒక్క జానికమ్మ మాత్రమే. కాని వసంత మొహంలోకి చూస్తూనే ఆయనకు ఎందుకో కాస్త ఆందోళన కలిగింది. అడిగాడు.
"అమ్మకి వొంట్లో బాగోలేదా?"
వసంత తల వూపింది.
కాయితాలు, ఫైళ్ళూ అన్నీ ప్రక్కకి నెట్టేసి, భార్యకోసం వంటయింటికేసి వెళ్ళాడు సుబ్బారావుగారు.
జానికమ్మగారిని పరీక్షగా చూశాడు.
"ఏం? ఎందుకలా? చూస్తారూ?" ఆమె అడిగింది. మళ్ళీ పొడిగా నవ్వి "భాసడికి సురేఖ వొద్దుట..... మరో సమ్మంధం తక్షణం చూడండి..." అన్నదామె.
సుబ్బారావు నూతుల్లో జ్యోతుల్లా మెరుస్తున్న ఆమె కళ్ళల్లోకే చూస్తూన్నాడు.
"ఏం! నాకేసి ఏముందని అలా పరీక్షగా చూస్తున్నారూ?....."
