"అన్నయ్యనడిగి చెబుతాను...." అంది దీప్తి.
"నేనంటే నీ కిష్టంలేదా?"
"అన్నయ్య నడగాలి...."
"నేనంటే నీకు ప్రేమలేదా?"
"అన్నయ్య నడగాలి...."
ఆనందరావు చిరాకును మనసులోనే అణచుకుని-"నీకంటూ అభిప్రాయాలుండవా?" అన్నాడు.
"ఉన్నాయి కానీ అన్నయ్యనడిగికానీ చెప్పలేను...."
"ఎందుకని?"
"ఎన్నో విషయాలపై నా కెన్నో అభిప్రాయాలుండేవి. వాటిని అన్నయ్యకు చెప్పేదాన్ని. కొన్నింటితో అన్నయ్య అంగీకరించేవాడు కొన్నింటిని ఖండించేవాడు. నేను గ్రహించినదేమిటంటే అన్నయ్య అభిప్రాయాల్లో తప్పుండదు. అన్నయ్య అభిప్రాయాలతో సరిపోయినప్పుడే నా అభిప్రాయాలు రైటవుతాయి....అప్పట్నించీ నాకే అభిప్రాయమేర్పడినా అన్నయ్య నడక్కుండా ఇతరులకు చెప్పడం మానేశాను. అంటే ఏ విషయంలోనైనా అన్నయ్య అభిప్రాయమే నా అభిప్రాయం. మీ గురించి నేనేమనుకుంటున్నానో తెలుసుకోవాలనుకుంటే అన్నయ్య నడగండి-చెబుతాడు. నానుంచే వినాలనుకుంటే-ముందు నన్నయ్యతో మాట్లాడనివ్వండి అప్పుడు చెబుతాను...."
"ప్రతిదానికీ అన్నయ్య అన్నయ్యంటే....రేపు పెళ్ళైతే ఎలా?"
దీప్తినవ్వి-"ఎవరైనా మొక్కకే నీళ్ళుపోస్తారు. చెట్టు తన నీరు తనే సంపాదించుకుంటుంది. పెళ్ళైన ఆడపిల్ల చెట్టువంటిదని అన్నయ్య అభిప్రాయం...." అంది.
"అన్నయ్య.....అన్నయ్య...." అని మనసులో విసుక్కుని-"ఇప్పుడు నేను చాలా ముఖ్యమైన పనిమీద వచ్చాను...." అన్నాడు.
"ఏమిటది?"
"పెళ్ళికి ముందు నీతో అనుభవం పంచుకోవాలనిపించింది...." అనేసి తన ధైర్యానికి తనే ఆశ్చర్యపోయాడు ఆనందరావు.
దీప్తి అతడివంక అదోలా చూస్తోంది.
ఆమె తనవంక గ్రుడ్లురిమి చూస్తోందనీ-తనను తూర్పారబెడుతుందనీ భావించాడతడు. అందుకే-"నువ్వు నన్ను తిట్టకూడదు. అన్నయ్యనడిగి అప్పుడు తిట్టాలి...." అన్నాడు. తను చాలా తెలివిగా మాట్లాడేననే అనుకున్నాడతను.
దీప్తి తాపీగా-"రైటే చెప్పారు. మీరన్నమాటలు అన్నయ్యకు చెబుతాను. అన్నయ్యెలా చెబితే అలాచేస్తాను" అంది.
ఆనందరావు తెల్లబోయాడు. శ్రీహరిలాగే దీప్తి కూడా అసాధారణ యువతి అని అతడు గ్రహించాడు.
"సరే-నీ పద్ధతి నీది నేనిప్పుడు నిన్ను బలవంతం చేస్తాను. అన్నయ్య నడగలేదు కాబట్టి నువ్వు అరవకూడదు. ప్రతిఘటించకూడదు...." అన్నాడతడు.
దీప్తిముఖం ఎర్రబడింది-"అన్నయ్య నడక్కుండా నేను కొన్ని పనులు చేశాను. మీరు తెలుసుకోవడం మంచిది...."
"చెప్పు..."
"దొడ్లో పాము కనబడింది. అది బుస్సుమంటూ నా మీదకు లేచింది. అప్పుడు నా చేతిలో కర్రవుంది. దాంతో పాముని చంపేశాను. తర్వాత అన్నయ్యకు చెప్పాను. అన్నయ్య నన్ను మెచ్చుకున్నాడు...."
ఆనందరావులిక్కిపడ్డాడు.
"తర్వాత నడిబజార్లో ఒకడు నా చేతిలోంచి పర్సులాక్కుని పరుగెడుతూంటే కేకలువేసి పరుగెత్తి వాడి నందుకున్నాను. నేను తన్నకపోయినా పదిమందీ వాడిని తన్నారు. నా పర్సు నాకు దక్కింది. ఒక్కపైసా కూడా పోలేదు.....అప్పుడూ అన్నయ్యనన్ను మెచ్చుకున్నాడు....."
ఆనందరావు కంగారుపడుతూనే..... "ఇంకా...." అన్నాడు.
"ఇప్పుడేదో బలవంతం అన్నారుకదా.....అదేంటో చూసి అప్పుడు చెబుతాను...." అంది దీప్తి.
"ఇప్పుడే చెప్పొచ్చుగా!"
"అవసరమైనవి తప్ప చెప్పకూడదని అన్నయ్య చెప్పాడు. మీరు నన్ను బలవంతం చెయ్యరని నా నమ్మకం. తప్పు చేయబోయేవాడు తను తప్పు చేస్తానని చెప్పి చేయడని అన్నయ్యన్నాడు...."
ఆనందరావుక్కోపం వచ్చింది-"నా గురించి నువ్వే మనుకుంటున్నావో తెలియదు. నేను సరదాకా మాటలు అనలేదు." అంటూ లేచి ఆమెను సమీపించి చేయిపట్టుకుని లేపాడు.
ఆమె లేచింది. నిలబడింది.
అతడిచేయి ఆమె చేతిలోవుంది ఆమె ఒక్కక్షణం ఆగింది. అతడాస్పర్శలోని ఆనందాన్ననుభవిస్తున్నాడు.
ఆమె ఒక్కసారి అతణ్ణి ముందుకు లాగింది. తనామె పైపడుతున్నానని ఆనందరావనుకున్నాడు. కానీ ఆమె పక్కకు తప్పుకోవడంతో నేలకరిచాడతడు.
ఆ తర్వాత ఆమె అతడిని ఫుట్ బాల్ ను చేసి ఆడింది.
అతడికి వళ్ళంతా నొప్పులు, దెబ్బలు.....
"ఇందాకా నీకు చెప్పని విశేషమిదే! ఒకసారి ఓ రౌడీ నా చేయి పట్టుకుంటే ఇదేపని చేశాను. పాముల్ని కొట్టడానికి కర్రలున్నట్లే-మనుషుల్లో పాముల్లాంటి వాళ్ళున్న ప్పుడుపయోగపడుతుందని అన్నయ్య నాకు కరాటే నేర్పించాడు-" అంది దీప్తి.
ఆనందరావుకు వళ్ళంతా హూనమైపోయింది. లేచి నిలబడడానికే అతడికి చాలాసేపు పట్టింది.
"ఇంతటితో నిన్ను వదిలిపెట్టను. నీలో రాక్షసుడున్నాడు. అందుకు శిక్ష అనుభవించాలి. అతివపై అత్యాచారం చేయబోయానని నీకు జైలుశిక్ష పడుతుంది. అన్నయ్యకు తెలిసిన పోలీసాఫీసరున్నాడు.....ప్రస్తుతానికి వెళ్ళు..."
ఆనందరావక్కన్నించి పారిపోయాడనే చెప్పాలి.
4
శోధన్ అతడిని తిట్టని తిట్టులేదు. నువ్వు మూలగడమే కాక నమ్ముకున్నవాళ్ళను కూడా నట్టేట్లో ముంచేస్తాననని తిట్టాడు. అలాంటివాడు జైల్లో మగ్గి చావడమే మేలన్నాడు.
ఆడపిల్లను మానభంగం చేయబోయి-తనే భంగపడ్డమగవాడిగా ఆనందరావు చరిత్ర పేపర్లలో కెక్కుతుంది. అతడి ఉద్యోగం ఊడుతుంది. పరువు గంగపాలవుతుంది. ఇంతకాలం వున్న చిరుద్యోగ సుఖజీవితం కూడా పోయి భవిష్యత్తులో శూన్యాంధకారం మిగుల్తుంది.
"నేను చచ్చిపోతాను...." అన్నాడు ఆనందరావు.
"నిజంగా చావాలని నీకుంటే ముందు పగతీర్చుకో. శ్రీహరిని చంపేసేయ్ దీప్తికి మానభంగంచేయ్. అప్పుడు నువ్వు చచ్చినా ఆ చావుకో అర్ధముంటుంది....." అన్నాడు శోధన్.
