Previous Page Next Page 
వసుంధర కథలు-7 పేజి 42


                                 ఆత్మార్పణ
                                                           --వసుంధర


    ముసుగు తన్ని నిద్రపోతున్నాడు సతీష్. తల్లి అతణ్ణి పేరు పెట్టి లేపింది. లేవలేదు ఒరేయ్ లేవరా అని అరిచింది. లేవలేదు.
    "బారెడు పొద్దెక్కినా పిలిచి లేపాల్సిందే-ఇంకా చిన్న పిల్లాడిననుకుంటున్నావా?" అంటూ తిట్టింది.
    సతీష్ లేవలేదు.
    ఇక లాభంలేదని వంగి మనిషిని కుదిపింది.
    సతీష్ కదలలేదు. మెదలలేదు.
    "తాతయ్యకు జ్వరమొచ్చిందిరా- డాక్టర్ని పిల్చుకుని రావాలి-" అంది తల్లి ఆఖరి అస్త్రంగా.
    సతీష్ చటుక్కున లేచి కూర్చుని - "ఆ మాట ముందే చెప్పవేం?" అన్నాడు.
    "నీకు మెలకువ తెప్పించి అప్పుడు చెప్పాలనుకున్నాను-...." అంది తల్లి.
    "ఏమయింది తాతయ్యకి? నిన్నటిదాకా బాగానేవున్నాడుగా-" అన్నాడు సతీష్ కంగారుగా.
    "ఏమో-వెళ్ళి నువ్వే అడుగు...." అంది తల్లి.
    సతీష్ గబగబా అక్కణ్ణించి తాతయ్య గదికి వెళ్ళాడు. ఆయన అప్పుడే స్నానంచేసి దైవప్రార్ధన చేసుకుంటున్నాడు.
    "తాతయ్యా! నీకు జ్వరం వచ్చిందా?" అన్నాడు సతీష్.
    ఆయన వెనక్కు తిరిగి-"ఏం? నిన్ను నిద్ర లేపడానికి మళ్ళీ మీ అమ్మ ఆ అబద్ధమే చెప్పిందా?" అన్నాడు.
    "హమ్మయ్య! అమ్మ చెప్పింది అబద్దమన్నమాట....." అంటూ సతీష్ తేలికగా నిట్టూర్చాడు.
    "రోజూ మీ అమ్మ అబద్ధమే చెబుతుంది. అయినా అదెందుకు నమ్ముతావురా?" అన్నాడు తాతయ్య ముచ్చటగా మనుమడివంక చూస్తూ.
    "ఏమో మరి-ఒకవేళ అమ్మ నిజం చెబితే-అప్పుడు నిజంగా నీకు మందులవసరపడతాయి. డాక్టర్ని పిలవడానికింట్లో నేను తప్ప ఎవరున్నారు? నీ విషయంలో నేను రిస్కు తీసుకోలేను తాతయ్యా!" అన్నాడు సతీష్.
    సతీష్ తాతయ్య నారాయణరావు తృప్తితో కూడిన చిరునవ్వు నవ్వి-"ఇలా రా!" అన్నాడు.
    సతీష్ ఆయన్ను సమీపించాడు.
    "ఎందుకురా-నీకు నేనంటే అంత ప్రేమ?"
    "ఏమో తాతయ్యా-నువ్వే చెప్పాలి!"
    నారాయణరావు గంభీరంగా - ఇక మీదట మీ అమ్మకు అబద్ధం చెప్పాల్సిన అవసరం కల్పించకు. లేపగానే లేచిపో-" అన్నాడు.
    "ఎందుకని?"
    "పైన తథాస్తు దేవతలుంటారు. అస్తమానూ మీ అమ్మ నాకు జ్వరం జ్వరం అంటూంటే ఒకరోజున నిజంగానే నాకు జ్వరం వచ్చేస్తుంది-"
    "అమ్మ మాటలను తథాస్తు దేవతలు నిజం చేయాలంటే-ఈ ప్రపంచపుతీరే మారిపోతుంది. నీకా భయం లేదులే తాతయ్యా!" అన్నాడు సతీష్.
    "అయితే అమ్మచేత ఆ మాటనిపించిగానీ నిద్రలేవదన్నమాట!"
    "ఏం చేయను తాతయ్యా? ఎందుకో నా కిటీవల విపరీతంగా నిద్రపడుతోంది. మత్తులో నిద్ర లేవలేక పోతున్నాను...."
    "రాత్రిళ్ళు ఆలస్యంగా యింటికొస్తున్నావని మీ అమ్మంటోంది...."
    సతీష్ మాట మార్చడంకోసం-"నువ్వు ఈ ముసలి తనంలోకూడా రోజూ పొద్దున్నే స్నానం చేస్తావేం? నీ ఆరోగ్యం పాడవదూ?" అన్నాడు.
    "స్నానం చేయకుండా దైవప్రార్ధనెలా చేసుకోనూ?"
    "దేవుణ్ణి ప్రార్ధించడానికి నీకింకా కోరికలేమున్నాయి?"
    నారాయణరావు నవ్వి-"నీకుద్యోగం రావాలి. నువ్వు పెళ్ళిచేసుకుని వేరు కాపురం పెట్టాలి-...." అన్నాడు.
    "ఏం తాతయ్యా? నే నీ యింట్లోంచి వెళ్ళిపోవాలని నీకు కోరికగా వుందా?"
    "అవున్రా-మీ నాన్న వ్యవహారం నాకు నచ్చడం లేదు. నువ్వెప్పుడు వేరు కాపురం పెడతావా-నీతో వచ్చి వుందామా-అని చూస్తున్నాను.....అందుకే ఈ చలిలోకూడా పొద్దున్నే లేచి స్నానంచేసి దైవప్రార్ధన చేస్తున్నాను....." అన్నాడు నారాయణరావు.
    "నాకుద్యోగం రావాలంటే ఆ దేవుడుకూడా సాయపడలేడనుకుంటాను. ప్రపంచం తీరలావుంది-" అన్నాడు సతీష్.
    నారాయణరావు నిట్టూర్చాడు.

                                   2

    నారాయణరావు కిద్దరే పిల్లలు ఉద్యోగంలో వుండగానే ఆయన కూతురి పెళ్ళి చేశాడు. కొడుక్కుద్యోగం వేయించాడు. ఓ మంచిల్లుకూడా కట్టాడు.
    ఇప్పుడాయన అరవై ఏళ్ళు రిటైరైనాడు ప్రతి నెలా అయిదువందల రూపాయలు పెన్షను వస్తుంది. ఆయన రిటైరైన ఊళ్ళోనే కొడుక్కూ ఉద్యోగం రావడంవల్ల స్వంతింట్లో కొడుకు దగ్గర సుఖంగా వుంటున్నాడు. డబ్బుకు తమపై ఆధారపడని మామగారంటే కోడలికి గౌరవం.
    నారాయణరావు కొడుకు జగన్నాధం కోడలు మాలతి ఆ దంపతులకిద్ధరే పిల్లలు. పెద్ద పిల్ల రేవతికి ఆరేళ్ళ క్రితమే పెళ్ళయింది. రెండోవాడు సతీష్ బియ్యేప్యాసై రెండేళ్ళయింది.
    సతీష్ అతికష్టంమీద బియ్యే ప్యాసయ్యాడు. ఇంక చదువుకోనని మొరాయించాడు. అతడికుద్యోగ మిప్పించాలని నారాయణరావు, జగన్నాథంకూడా ప్రయత్నాలు చేస్తున్నారు.
    బియ్యే ప్యాసవగానే ఓ కంపెనీలో ఉద్యోగమిప్పిస్తే సతీష్ అక్కడ బాస్ తో దెబ్బలాడాడు. అతడి వుద్యోగం ఊడింది. ఆ తర్వాత మరో ఆర్నెల్లకు మరోచోట అదే జరిగింది. ఆ తర్వాత నుంచి జగన్నాధం కొడుకు గురించి బెంగ పెట్టుకున్నాడు.
    సతీష్ మనస్తత్వానికి మామూలుద్యోగాలు సరిపోవు. అతడు అధికారుల జులుం అంగీకరించడు. అలాగని విశాల భావాలూ లేవు. తన క్రింది వాళ్ళపై అతడు జులుం చేస్తూనే వుంటాడు. ఎన్నోసార్లు అతడు కూలివాళ్ళతో,  రిక్షావాళ్ళతో, బస్సు కండక్టర్లతో గొడవపడ్డాడు.
    సతీష్ ఇంట్లో యెంతో గారాబంగా పెరిగాడు. అతడాడింది ఆట, పాడింది పాట-అతడి క్రమశిక్షణ గురించి ఇంతో అంతో పట్టించుకునేది తల్లి మాలతి మాత్రమే! నారాయణరావామెనందుకు మందలిస్తూండేవాడు.
    "మితిమీరిన గారాబంచేస్తే కుర్రాడు చెడిపోతాడు మామయ్యా!" అనేది మాలతి ఆయనతో.
    "మనవాడేం చెడిపోయాడని? క్లాసులో ఫస్టు రాక పోయినా పరీక్షలు ప్యాసవుతూనే వున్నాడు గదా-" అనేవాడు నారాయణరావు.
    సతీష్ పరీక్షలు ప్యాసవడమే ఆయనకు కొలబద్దగా వుండేది. ఇంట్లో వాళ్ళకు తెలిసి సతీష్ కు దురాలవాట్లు కూడా లేవు.
    మామగారి మాటలకు మాలతి తృప్తిపడేది.
    ఏభయ్యో యేట భార్య పోయింది నారాయణరావుకు. అప్పట్నించీ అయన మనుమడే ప్రాణంగా జీవిస్తున్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS