Previous Page Next Page 
ఆచరణ లో అభ్యుదయం పేజి 42


    'అమ్మా " అంటూ రెండు చేతులలోనూ మొహం దాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తున్న కళ్యాణి ని చూసి తెల్లబోయి ఏదో కీడుని శంకిస్తూ ఆమె చేతిలో వున్న వుత్తరం తీసుకు చదివాడు మురళీ-- ఆ వుత్తరం చదువుతుంటే అతని మొహం అదోలా నల్లగా అయిపొయింది.  తప్పు చేసిన వాడిలా సిగ్గు పడిపోయాడు. కళ్యాణి ని వోదార్చాలంటే నే అతనికి చచ్చే మొహమ్మాటంగా వుంది-- ఏం చెయ్యాలో తెలియక ఆమెకి దగ్గరగా అలాగే నిలబడి పోయాడు. కళ్యాణి ఏడుస్తుంటే ఏమైనా మాట్లాడుతుందేమో, వెంటనే వెళ్ళలేక పోయినందుకు తనని తనే నిందించు కుంటుందేమో లేకపోతె నాకు ఎంతగా వెళ్లాలని వున్నా మీ వాలకం నా కాళ్ళు రెండూ బంధించేసి అడుగు ముందుకు పడనియ్య కుందా చేసింది అని అంటుందేమో ఈ దుఃఖం లో తను ఏమన్నా ఏమీ అనకోకూడదు అనిపించిందతనికి.
    కాని కళ్యాణి, ఒక్క మాట కూడా పైకి మాట్లాడలేదు. అలా మౌనంగా వెక్కిళ్ళు పెడుతూ కుమిలిపోతుంటే ఆ దృశ్యం చాలా హృదయ విదారకంగా అనిపించింది.
    మెల్లిగా వెళ్లి ఆమె ప్రక్కన మరో కుర్చీలో కూర్చున్నాడు చాలాసేపు మౌనంగా వుండి చివరికి ఎలాగో గొంతు పెగాల్చు కుని అన్నాడు. 'ఊరుకో కళ్యాణి..... ఆవిడకి కాలం చెల్లిపోయింది. వెళ్ళిపోయింది-- ఎంత బాధపడితే మాత్రం పోయిన మనిషి తిరిగి రాదు కదా........'
    అతని వోదార్పు మాటలు కళ్యాణి మీద ఏమీ పని చెయ్యలేదు. చాలాసేపటి దాకా అలా ఏడ్చి ఏడ్చి చివరికి ఎలాగో దుఃఖాన్ని రవంత దిగమింగు కుని కొంగుతో మొహం తుడుచు కుంది. వోసారి మురళీ వంక చూసి ఆ వెంటనే చూపులు తిప్పుకుని ఎటో చూస్తూ కుర్చీలో వెనక్కి జార్లపడి కూర్చుంది. ఆమె కళ్ళ వెంట టపటప నీటి బొట్లు జారి బుగ్గల మీదికి పడుతున్నాయి.
    వాటి వంకే చూస్తూ కూర్చున్నాడు మురళీ....ఆ కన్నీటికి, కళ్యాణి ఇందాక అతని వంక చూసిన చూపుకి మాటలు వచ్చి వుంటే, అని అతనితో ఇలా చెప్పేవి. 'అనాది నుంచి స్త్రీ బాధ్యతని స్వీకరించి ఆమెను పోషించి, భరించి, రక్షిస్తున్నాడు మొగవాడు-- యుగయుగాలుగా ఆ అహంకారంతో ఆ గర్వంతో ఊపిరి పోసుకుని వెన్ను విరుచుకుని తిరిగే పురుష జాతికి వారసులు....అందులోనూ మీకు -- నాలాంటి దానిని వుద్దరించిన మీకు నా శ్యాసని కూడా శాసించే అధికారం వుంది. నా ప్రతి కదలికనీ నిర్చేశించే హక్కు వుంది ....నాకు తెలుసు, అడపా తడపా అయినా మా అమ్మకి వుత్తరం వ్రాయటం, ఆవిడ దగ్గర నుండి జవాబులు అందుకోతం కూడా మీకు ఇష్టం వుండేది కాదు-- అయినా పైకి ఆ మాట ఏనాడూ చెప్పలేదు. ఇంక అయోపోయింది -- మీ ఇష్టం అయినా కాకపోయినా నన్ను గురించి బాధపడే వాళ్ళెవరూ లేరు. నా క్షేమం తెలియ జేయాల్సిన వాళ్ళెవరూ లేరు.' అని.
    కాని ఇందులో ఒక్క అక్షరం అయినా అవి మన భాషలో చెప్పలేవు-- వాటి భాష మురళీ కి అర్ధం కాలేదు.
    ఆ రోజంతా నిశ్శబ్దంగా బరువుగా గడిచిపోయింది.

                                    17
    'టక్, టక్, టక్.....
    రమకి పౌడరు అద్ది ముస్తాబు చేసి గౌను తోడగబోతున్న కళ్యాణి, వీధి తలుపు తడుతున్న చప్పుడు వినిపించి, 'మీ నాన్నా రివాళ పెందరాల్లె వచ్చేసారు పాపా.' అంటూ పాపని ముద్దు పెట్టుకుని, పాపని వో చేతిలోనూ, తోడగ బోతున్న గౌను మరో చేత్తో నూ పట్టుకుని గది లోంచి ఇవతలకి వచ్చి వీధి తలుపు తెరిచింది. అంతే -- కళ్యాణి మొహంలో నవ్వు మాయం అయిపొయింది.
    ఎదురుగా నిలబడి వున్న వ్యక్తిని చూసి నిర్ఘాంత పోయి నిలబడి పోయింది. మురళీ అనుకుని ఏదో చెప్పబోయిన మాటలు అలాగే మింగేయటమే కాకుండా ఆ వచ్చిన వ్యక్తిని పలకరించాలని కాని లోపలికి రమ్మని ఆహ్వానించాలని కాని తోచని దానిలా అలాగే నిలబడి పోయింది.
    'ఏం? నన్ను లోపలికి రానివ్వదలుచు కోలేదా?'
    'ఆహా కాదు....అదేం లేదు..రా,' అప్పటికి కళ్యాణి నోరు పెగలి మాట రావటమే కాకుండా మనిషిలో కూడా చలనం వచ్చి రెండడుగులు వెనక్కి వేసి ఆ వ్యక్తీ లోపలికి రావటానికి దారి ఇచ్చింది.
    'ఇది నీ కూతురు కదూ,' చనువుగా చేతులు జాచి పాపని అందుకో బోయింది  ఆమె -- ఆ వచ్చింది కళ్యాణి అక్క వల్లీ.'
    కొత్త మనిషిని చూసి సిగ్గుపడుతూ తల వెనక్కి తిప్పేసుకుని తల్లి బుజం మీద వాలి పడుకుంది రమ.
    'కొత్త బాగా వున్నట్లుంది-- ఎన్నో నెల' అంది వల్లి రమ వెన్నూ, తలా నిమురుతూ ....మిసమిస లాడుతున్న పచ్చటి ఒంటి మీద ఎర్రబట్ట మీద పసుపూ, తెలుపూ పువ్వులున్న లాగు, నల్లటి వుంగరాల జుట్టు వల్లీ కళ్ళ నిట్టె ఆకట్టేసు కుంది రమ.
    'ఎనిమిదో నెల వచ్చింది.'
    'కాసిని మంచినీళ్ళు ఇద్దూ' అంది వల్లీ. అక్కడున్న కుర్చీలో కూలబడి కర్చీప్ తో నుదురూ మెడా అద్దుకుంటూ.
    కళ్యాణి యంత్రంలా నడుచి వెళ్లి గ్లాసుతో చల్లటి నీళ్ళు తీసుకు వచ్చి ఇచ్చింది.
    నీళ్ళు తాగి ఖాళీ గ్లాసు టీపాయ్ మీద పెడుతూ "కూర్చోవెం?' అంది వల్లీ నవ్వుతూ.
    'ఈ వూరు ఎప్పుడు వచ్చావు?' మరో కుర్చీలో కూర్చుని పాపని ఒడిలో కూర్చో బెట్టుకుని ఇందాకటి నుంచి చేతిలో వుండి పోయిన గౌను తోడుగుతూ.
    "అమ్మయ్య -- ఇప్పటికి నీ అంతట నువ్వు ఒక ప్రశ్న వేశావు-- ఫరవాలేదు. నన్ను గురించి తెలుసుకోవాలని కాస్తయినా ఆసక్తి వుందన్న మాట -- నేనూ మామయ్యా ఈ వూరోచ్చి నెలయింది.'
    ఇంక తరువాత ఏం అడగాలో తెలియని దానిలా మౌనంగా వుండి పోయింది కళ్యాణి. ఆమె మొహం కూడా ఎలాగో ఇబ్బందిగా వున్నట్లుంది.
    'నేను ఇలా మీ యింటికి రావటం నీకిష్టం లేనట్లుంది. ఆ సంగతి నాకూ తెలుసు-- నిన్నూ పాపనీ చూడాలని ఒకటే ప్రాణం కొట్టుకు పోయి ఇలా వచ్చేశాను. మధ్యాహ్నమే రావాలనీ, మీ అయన ఆఫీసు నుంచి వచ్చే లోపునే వెళ్లి పోవాలనీ పెందరాళ్ళనే బయలుదేరాను. కాని ఇల్లు కనుక్కోటం కష్టం అయిపొయింది. అడ్రసు కాగితం పట్టుకుని గంటసేపు రిక్షాలో నాలుగు వీధులూ వూరేగితే కాని ఈ ఇల్లు పట్టుకోలేక పోయాను-- సరే ఇంతకీ మీ అయన ఎన్ని గంటలకి వస్తాడు?'
    'వచ్చే వేళయింది.' అంది కళ్యాణి బితుకు బితుకు మంటూ వీధి గేటు వేపు చూస్తూ.

                                      
    'అయితే నన్నిప్పుడే వెళ్లి పొమ్మంటావా? లేకపోతె నన్ను నీ స్నేహితురాలిగానో పరిచయం చేయరాదా/ మీ ఆయన్ని చూడాలని నాకూ బలే ముచ్చటగా వుంది.'
    పిల్లికి చలగాటం ఎలుకకి ప్రాణ సంకటం అన్నట్లుంది వాళ్ళ పరిస్థితి.
    కళ్యాణి దగ్గర నుంచి ఎలాంటి సమాధానం రాకపోవటంతో వల్లీయే మళ్లీ అడిగింది ప్రసంగం మారుస్తూ.
    'అమ్మకి జబ్బుగా వుందని వుత్తరం వ్రాస్తే రాలేదేం?'
    'రాలేదు' అంది. తల్లి జ్ఞాపకం వచ్చి కళ్యాణి కళ్ళల్లో నీళ్ళు నిలిచాయి. నాలుగు నెలల నుంచీ కొద్ది కొద్దిగా మానుకు వస్తున్నా గాయం మళ్లీ రేగినట్లయింది.
    'నాకు తెలుసు-- నీకు రావాలని వున్నా అతను పంపించి ఉండడు-- ఏడాది క్రితం అమ్మమ్మ కి జబ్బు గా వుందని వ్రాస్తే జవాబయినా వ్రాశావు కాదు. ఆవిడ పోయింది -- ఇప్పుడయినా అంతే అవుతుందని నేనూ మామయ్యా చెప్తున్నా వినకుండా ఓ పూటంతా కూర్చుని హైరానా పడి పెద్ద వుత్తరం వ్రాసింది నీకు-- సరేలే ఏదో ఏదో అయిపొయింది-- ఇంక ఆ వూళ్ళో ఏముంది-- డబ్బు చాలా భాగం ఖర్చాయి పోయింది. ఆ మిగిలిందేదో పట్టుకుని నేనూ మామయ్యా ఈ వూరు వచ్చేశాం.'


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS