Previous Page Next Page 
వసుంధర కథలు-1 పేజి 42


    వార్త వింటూనే అక్బర్ ఆలీ దిగ్భ్రాంతుడైపోయాడు. అతను తక్షణం అవధాని ఇంటికి వెళ్ళాడు. అతను వెళ్ళేసరికి అవధాని ఇంట్లోలేడు. ఏదో చిన్నపనిమీద పొరుగూరు వెళ్ళాడట. అవధాని తల్లి తలుపుతీసి అతన్ని చూడగానే అనుకోకుండా కాస్త ఎనక్కు తగ్గి కబురు చెప్పింది. ఆమె వెనక్కు తగ్గడంలోనే ఆలీకి హిందూ ముస్లిం వైరం గుర్తుకొచ్చింది. అక్కణ్ణించి అతను హుస్సేన్ ఇంటికి వెళ్ళాడు.
    ఆలీ వెళ్ళేసరికి హుస్సేన్ అపరిమిత ఆగ్రహావేశంలో వున్నాడు. హిందూవులనదే పనిగా దుయ్యబడుతున్నాడు. అక్కడ చేరిన వారందరూ అతని మాటలువిని రెచ్చిపోతున్నారు. అక్బర్ ఆలీని చూసి- "జరిగింది తెలిసిందా?" అన్నాడు.
    "తెలిసింది. ఈపని చేసిందెవరో నిజం కక్కిద్దాం. ఈ రాత్రి ఏడూ గంటలలోగా ఆ కాగితం అంటించిన మనిషి ముందుకువచ్చి తప్పొప్పుకుని అందరిముందూ క్షమార్పణ అడగాలి...."
    అక్బర్ ఆలీ ఇంకా ఏదో అనబోతుండగా- "ఆ మనిషి చెసిందేదో నిర్భయంగానే చేశాడు. తన పేరుకూడా రాసుకున్నాడు...." అన్నాడు హుస్సేన్.
    "అవధాని నాకు తెలుసు. అతనిలాంటి పనిచేయడు. చేసినా తెలివి తక్కువగా తన పేరెందుకు బయట పెట్టుకుంటాడు? ఎవరో ఈపనిచేసి అతన్నిందులో ఇరికించారు" అన్నాడు ఆలీ.
    "పిచ్చివాడిలా మాట్లాడకు. మనం దద్దమ్మలని ఈ హిందూవుల అభిప్రాయం, తనపేరు వ్రాసినా తన్నేమీ చేయలేమని నిరూపించడానికే వాడలా చేశాడు. వాడనుకున్నట్లే- రాసింది వాడవునోకాదో కూడా ఆలోచిస్తున్నారు మనం...." అన్నాడు హుస్సేన్.
    చుట్టూవున్న జనం ఈ మాటలకు బాగా ఆవేశపడ్డారు. "అవును నిజమే. వెంటనే ప్రతీకారం చేయాలి" అంటూ అరిచారు కొందరు.
    "అయితే ఇప్పుడేం చేయాలి?" అన్నాడు ఆలీ.
    "ఆ అవధాని ఇంటికి అంతా కలసివెళ్ళి నిజం ఒప్పించి కక్కించి-చేయగలిగింది చేయాలి" అన్నాడు హుసేన్.
    "అంతే" అంటూ అరిచారు చాలామంది.
    "నేనిప్పుడక్కన్నించే వస్తున్నాను. అవధాని ఇంట్లో లేడు. అతనసలు ఊళ్ళోనేలేడు....."    
    "నీ కతడు స్నేహితుడేమోకదా-ఊరువదలి వెళుతున్నట్లు నీకు చెప్పాడా? ఉన్నపళంగా ఊరెళ్ళిపోవలసిన పంతానికేమొచ్చింది? చేసింది చేశాడు కాళ్ళు చేతులు ఆడకఊరు వదిలాడు. పరిస్థితి చక్కబడ్డాక వస్తాడు. అయినా వాడిని వదిలిపెట్టకూడదు. సరయిన విధంగా బుద్ధిచెప్పాల్సిందే" అన్నాడు హుస్సేన్.
    "అయితే ఏం చేయాలని?"
    "అవధాని ఇంటికి వెళ్ళండి....." అన్నాడు హుస్సేన్. "కానీ వాడి ఇంటికి నువ్వువెళ్ళు. నీ వెనుక జనంవస్తారు మనలో అందర్నీ అదుపు చేయగలిగిన వాడివీ, కాస్త నిదానం గలవాడివీ నువ్వొక్కడివే."
    ఆలీకి హుస్సేన్ చెప్పింది నచ్చింది. అతను జనాన్ని వెంట పెట్టుకుని అవధాని ఇంటికి వెళ్ళాడు.
    "చూడునాయనా అబ్బాయింట్లో లేడు. ఎల్లుండిదాకారాడు. మాకు కాస్త మడీ ఆచారమూవుంది. మావాడయితే మతం ఇదీ అదీ అని పట్టింపు లేకుండా అడ్డమైనవాళ్ళతో స్నేహం చేస్తాడు. అంత మాత్రాన అన్నీ తెలిసినవాడివి నువ్విలా మీదమీదకి వచ్చి మాట్లాడటం బాగోలేదు...." అన్నాడు అవధాని తండ్రి.
    ఆలీకి కాస్త కోపం వచ్చింది, "నేను వచ్చినపనివేరు. మా మసీదు మీద మా దేవుణ్ణి నిందిస్తూ అసభ్యకరమైన కాగితాలు అంటించారెవ్వరో. దానికింద మీ అబ్బాయి సంతకముంది. అలా ఎందుకు జరిగిందో తెలుసుకుందుకు వచ్చాను."
    అవధాని తండ్రికీ కోపం వచ్చింది. "కాగితాలంటించడం తప్ప వేరే పనేమీలేదా మావాడికి. అయినా మీ తురకాళ్ళకి స్నేహమూలేదు, పాడూ లేదు, మీ అనుమానమే మీది. అందుకే నీతో స్నేహం వద్దని చిలక్కిచెప్పినట్లు చెప్పాను....."
    "అయ్యా-మీరనవసరంగా మతం ప్రసక్తి తీసుకురావద్దు. అవతల మావాళ్ళు చాలా ఆవేశంలో ఉన్నారు. మాకు నిజం కావాలి. మీ అబ్బాయి చేసినపని మీ ఇంట్లో అందరికీ తెలిసేవుంటుంది. అందుకు మీరు సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వుంటుంది...." అన్నాడు ఆలీ శాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తూ.
    "ఒక తురకాడికి సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన స్థితికి కింకా దిగజారిపోలేదు నేను" అన్నాడు అవధాని తండ్రి చికాగ్గా.
    ఆయనది అహంకారం. ఆ అహంకారం ఒక మతావేశంతో ఢీకొట్టబోతున్నదని ఆయనకు తెలియదు.
    ఆలీ ఆయన మాటలకు దెబ్బతిన్నాడు. ఆయనతో సంభాషించడానికి ప్రయత్నించినకొద్దీ అతని మతాభిమానం దెబ్బతింటోంది. అతనిలో కోపం పెరిగి విచక్షణాజ్ఞానం నశించసాగింది. అతను అక్కణ్ణించి బయటకు వచ్చే ముందు "మీ అబ్బాయి అంటించిన కాగితంలో అల్లా అపవిత్రుడైపోయాడని రాశాడు. ముస్లిములా వాక్యాన్ని సహించగలరా?" అన్నాడు.
    అవధాని తండ్రికి చిరాకు యింకా పెరిగింది. "పచ్చి మాంసం అమ్ముకు బ్రతికే కసాయిజాతి మీది. మీకు పవిత్రత ఏమిటి? మా అబ్బాయి రాసినా రాయకపోయినా ఆ కాగితంలో మాటలు నిజమే?" అన్నాడు.
    ఆలీ ఆవేశాన్ని అదుపులోకి తెచ్చుకుని "కసాయివాళ్ళు అన్ని మతాల్లోనూ వున్నారు. ఒక మతానికిచెందిన దేవుణ్ణి అపవిత్రుడనే మీ పవిత్రత ఎంతో ఆలోచించుకోవాలి?" అన్నాడు.
    "మేము సదాచార సంపన్నులం, పరమనిష్టాగరిస్టులం పవిత్రాతిపవిత్ర బ్రాహ్మణ వంశంమాది. తురుష్కులకు దూరంగా ఉండటం చేతనే మా పవిత్రత కలకాలం నిలబడ గలుగుతోంది."
    ఆలీ అక్కడ క్షణంకూడా నిలబడకుండా బయటకు నడిచి తనకోసం ఎదురు చూస్తున్నవారికి తమ సంభాషణ సారాంశాన్ని యథాతథంగా వివరించాడు.
    ఆ క్షణంలో అక్కడ రేగిన ఆవేశజ్వాలలు వర్ణనా తీతం. తక్షణం పదిమంది అవధాని ఇంటిమీద పడ్డారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS