7


"ఇలా జరుగుతుందని నేననుకోలేదు. అమ్మ చనిపోయిందన్న బాధ కంటే ఆమెను నేనే చంపానన్న ఆరోపణ నన్ను కాల్చేస్తోంది. భూషణ్. నన్ను చంపేసెయి. నీ ఇష్టం వచ్చిన పద్దతిలో నన్ను హింసించు. నేను నోరెత్తను. మారు పల్కను. ఆత్మహత్య చేసుకున్నానని కాగితం కూడా రాసిస్తాను. నాకింక బ్రతకాలని లేదు. భూషణ్ నన్ను చంపెసేయి....చంపెసేయి.... చంపెసేయి...."
కులభూషణ్ అతడి భుజం మీద చేయి వేసి "ఈ ప్రపంచమంతా ఏకమై నీవు హంతకుడివని చెప్పినా అమ్మ సీతమ్మను నువ్వు చంపించావంటే నేను నమ్మను. అయితే ఏదో నిజం నువ్వు దాస్తున్నావు . అది నాకు తెలియాలి ' అన్నాడు.
"నువ్వు నిజంగా నన్ను నమ్ముతున్నావా ' అన్నాడు వేదాంతం.
"నీతో కలిసి పెరిగాను. నీకంటే బాగా నీ గురించి నాకు తెలుసు..."
వేదాంతం తలెత్తి "నీ మాట నాకు వేయి ఏనుగుల బలం . జరిగిందంతా చెప్పేస్తాను. ఇక దాచి ప్రయోజనం లేదు. అయితే ముందుగ ఒకమాట" అంటూ అతడు ఉదయ వైపు తిరిగి "ఉదయా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. కానీ మా మనసులో ప్రధమ స్థానం అమ్మది. రెండో స్థానం విస్సీది. మూడు భూషణ్ ది. ఆతర్వాతే నీది.." అన్నాడు.
"ముందు విషయం చెప్పు" అన్నాడు కులభూషణ్.
ముగ్గురూ అక్కడే చతికిల పడ్డారు.
విశ్వనాద్ ని పిలవాలని వారిలో ఎవరూ అనుకోలేదు.
వేదాంతం చెప్పడం ప్రారంభించాడు.
అతడు చెబుతున్నది కులభూషణ్ , ఉదయ ఆశ్చర్యంగా వింటున్నారు. వాళ్ళు మధ్యలో అతణ్ణి ఒక్క ప్రశ్న కూడా అడగలేదు.
వేదాంతం చెప్పుకుపోతున్నాడు.
"పైన ఆకాశం, క్రింద అగాధం. మధ్యలో ఏ ఆధారం లేకుండా గాలిలో తేలుతున్నాను. భూమి నన్ను తన వైపు లాక్కొంటుంది. ఒకసారి భూమిపై పడ్డాక నా శరీరానికి రూపురేఖలు మిగలవని నాకు తెలుసు. అప్పుడు నా మెదడు శూన్యమై పోయింది. ఏం జరుగుతుందో నాకు తెలియదు. ఆ సమయంలో ఉన్నట్టుండి నేను నేనుగానే మిగిలినట్లు గ్రహించాను. కళ్ళు విప్పి చూస్తె ఇంకా పైన ఆకాశం. క్రింద అగాధం. మధ్యలో గాలి పరుపుల మీద తేలుతున్నాను నేను. నేనిక క్రింద పడడం లేదు. ఏ ఆధారమూ లేకపోయినా ఏదో అధారమున్నట్టే అనిపిస్తోంది నాకు. నెమ్మదిగా చేతులతో అనుకుని లేచి నిలబడ్డాను. నాకు కలో నిజమో తెలియడం లేదు. నేను గాలిలో వున్నాను. కానీ భూమీదున్నట్టే వుంది. అక్కడే నేనటూ ఇటూ తిరగసాగాను. నాకు చాలా ఉత్సాహంగా వుంది. అయితే చచ్చి దేయ్యమయ్యానా అన్న అనుమానం కూడా నన్ను పీడించింది. ఆ సమయంలో నా కళ్ళకు కాస్త దూరంగా గాలిలో తేలుతున్న ప్రకాశవంతమైన బంతి కనబడింది. అటుగా నడిచాను. నేనింకా దూరంగా వుండగానే ఆ బంతి పరిమాణంలో చాలా పెద్దదని గ్రహించాను. ఉన్నట్టుండి ఆ బంతిలోంచి ఓ తలుపు తెరుచుకుంది. ఒ వ్యక్తీ బయటకు వచ్చి నన్ను సమీపించాడు. గాలిలో తేల్తున్న నన్ను గాలిలో నడుస్తూ వచ్చి కలుసుకున్నాడు.
అతడి శరీరం బంగారు రంగుతో మెరిసిపోతోంది.
ఆరడుగుల పొడవు. నల్లటి పొడవాటి శిరోజాలు.
ఆకాశంలో దేవత వెలిసినట్లుంది.
నేను చచ్చిపోయనా? నన్ను తీసుకుని వెళ్ళడానికి దేవదూతలు తమ వావానాల్లో వచ్చారా?"
ఇలాంటి ప్రశ్నలు నన్ను బాధిస్తుండగానే అతడు లోకాలను తన్మయం చేయగల మందహాసంతో "నేను భగవంతుణ్ణి కాను" అన్నాడు.
"ఎవర్నువ్వు?" అన్నాను .చెప్పినా నీకర్ధం కాదు. ఇక్కడికి అరవై కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న గ్రహవాసిని నేను. సంకల్ప మాత్రాన విశ్వాంత రాళంలో ఎక్కడైనా ప్రత్యక్షం కాగల మనోవేగం నాకూ,నా వాహనానికి ఉంది. నా వాహనపు తాకిడిని భూమి భరించలేదు.అందుకే వాహనాన్ని గాలిలో వదిలి నా చుట్టూ ఉన్న వాతావరణాన్ని అనుకూలంగా మార్చుకున్నాను. నా ప్రభావం ఉన్నంతవరకూ ఈ వాతావరణం శరీరానికి బాధను కలిగించని ఘనవాయువు లక్షణాలను కలిగి ఉంటుంది. ఇందులో నీవు తిన్నగా నడవగలవు. మెట్లెక్కి దిగినట్లు పైకి క్రిందకూ పోగలవు. ఏకారణం వల్లనో నేనూ సృష్టించిన ఈ స్థితిలోకి నీవు వచ్చి పడ్డావు. ఇది నీకు మేలు చేసిందో , కీడు చేసిందో నాకు తెలియదు" అన్నాడతను.
"నాకేమీ అర్ధం కావడం లేదు" అన్నాను.
అతడు నవ్వి "నువ్వు చూస్తున్న రూపం నాది కాదు. నీవీ వింటున్న భాష నాది కాదు. నీ ఆలోచనలకనుగుణంగా నా రూపం, భాష దిద్దుకుంటాయి. నే నాభాష మాట్లాడినా ఆ పదాలు నీ ఆలోచనల కనుగుణంగా అనువదించబడతాయి. నీవూహించుకునే దైవాన్ని నువ్వు నాలో చూడగలవు. నా చుట్టూ ఆహ్లాదకరమైన వాతవరణముంటుంది. నాకు మిత్రులే తప్ప శత్రువులుండరు. మీ మానవులూహించుకునే దైవ లక్షణాలన్నీ నాలో ఉన్నాయి. కానీ నేను దేవుణ్ణి కాను....' అన్నాడు.
"నువ్విక్కడి కెందుకు వచ్చినట్లు ?' అన్నాను.
"విజ్ఞానం ఎంతటి ప్రగతిని సాధించినా ఏ జీవికీ ఇబ్బందులూ తప్పవు . ఎప్పటికప్పుడు కొత్త ఎఒగాలు పుట్టు కొస్తున్నాయి. వాటిని జయించడానికి మా ప్రయత్నాలు చేస్తున్నాము. వాతావరణ కాలుష్యానికి, ప్రాణుల అనారోగ్యానికి వ్యతిరేకంగా మేము చేస్తున్న ప్రయోగాలకు భూలోకంలోని కొన్ని వృక్ష జాతులను పరిశీలించడం వల్ల ప్రయోజన ముంటుందని తోచి నేనిక్కడకు వచ్చాను. నేనిక్కడకు వచ్చి మీ లెక్కల్లో ఏడాది దాటింది. మొత్తం అన్ని ప్రాంతాలూ సర్వ్ చేయడమయింది. ఇది ఆఖరు ప్రాంతం. ఇక్కడ లోయలో ఒక ఆటవిక గ్రామం ఉంది. ఆ పరిసరాల్లో కుతూహలకరమైన వృక్ష జాతులున్నాయి. ఒకటి రెండు రోజుల్లో అవన్నీ సర్వ్ చేస్తాను. ఆ తర్వాత మా గ్రహానికి వెళ్ళిపోతాను. నీ అదృష్టం కొద్దీ మనం కలుసుకున్నాం. నీ వివరాలు చెప్పు" అన్నాడతను.
వేదాంతం అతడికి తన వివరాలు చెప్పుకుని -- "మా అమ్మ అదృష్టం నన్నూ మిమ్మల్నీ కలిపిండనుకుంటాను. అమ్మ సంతోషమే నా జీవిత పరమావధి. మీరు నాకే విధంగా సాయపడగలరో చెప్పండి" అన్నాడు. కొత్తగా ఏర్పడిన గౌరవ భావంతో.
అప్పుడా గ్రహాంతర వాసి నన్ను తన వాహనంలోనికి తీసుకుని వెళ్ళాడు.
లోపలకు ప్రవేశిస్తే ఓ హోటల్ రూంలోకి అడుగు పెట్టినట్లుంది. అక్కడ సకల సదుపాయాలూ ఉన్నాయి. అన్నింటినీ ఒకే ఒక మనిషి అమరుస్తున్నాడు.
గ్రహాంతర వాసి ఆ మనిషిని నాకు చూపించి "భూమ్మీద నా అవసరాల కోసం తయారు చేసుకున్న మనిషి ఇతడు. అనగా సింధటిక్ మనిషి. ఈ మనిషిలోని ప్రత్యేకత ఏమిటంటే -- ఇతడి రూపాన్నో నీ ఇష్ట ప్రకారం మార్చుకోవచ్చు. పొడుగు చేయొచ్చు-- పొట్టి చేయవచ్చు. లావు చేయవచ్చు. సన్నం చేయొచ్చు. ముఖంలో రూపు రేఖలు మార్చవచ్చు. సరైన అదేశాలిస్తే అన్నీ అతడు తనను తానే చేయగలడు. మీ సాహిత్యంలోని కామరూపుడతడు. సాంకేతిక పరిభాషలో "హి ఈజ్ యాన్ అడ్జస్టబుల్ మాన్" ఇతడిని విశ్వనాద్ రూపంలో నీకూడా తీసుకుని వెళ్ళి నీ తల్లికి చూపించి ఆమెను సంతోషపెట్టు. ఇతడి మెదడు -- పూర్తిగా కంప్యూటర్లతో తయారైంది కాబట్టి -- మనిషి మేధకందనిది ఇతడి కందుతాయి. ఎటువంటి సమస్యనైనా కంప్యూటర్ వేగంతో పరిష్కరించగలడు. అయితే ఇతడు మీ కంప్యూటర్లన్నింతినిమించినవాడు. ఇలాంటి కంప్యూటర్ని తయారు చేయడానికి మీ భూమ్మీద ఇప్పట్లో అవకాశం లేదు. చెప్పాలంటే మనిషి మెదడును మించిన కంప్యూటర్ లేదు. కానీ మనిషి కంటే రకరకాల అనుభూతులు మెదడు పూర్తిగా ఉపయోగించుకొనివ్వవు. అందుకే ఈ కృత్రిమ మానవుడిలో ముఖ్యంగా రోమాన్స్ అన్నది లేకుండా చేశాను. తన యజమాని ఆదేశాలు పాటించడం తప్ప ఇతడికి మరే అనుభూతులూ ఉండవు. ఇతడిని జాగ్రత్తగా ఉపయోగించుకో. నీవు తలపెట్టిన కార్యక్రమం కొనసాగించు" అని చెప్పాడు.
నాకెంతో సంతోషమయింది.
కాసేపటికి మేము ముగ్గురం ఆ వాహనం లోంచి బయటకు వచ్చి గాలిలోంచి భూమ్మీద దిగాము.
మేము దిగిన ప్రదేశంలో ఆటవిక నాయకుడున్నాడు. మంత్రికుడున్నాడు. గాల్లోంచి దిగివచ్చిన మమ్ము వారు దేవతలుగా భావించారు. నేను మాత్రం దేవతను కాదని ఆటవిక నాయకుడి కీ చెప్పుకున్నాను.
ఆటవికులు నాగరికులను స్నేహ భావంతో ఆదరించరు. గ్రహాంతర వాసి సృష్టించిన స్నేహ్నమయ వాతావరణం నన్నాటవుకులకు మిత్రుణ్ణి చేసింది. అక్కడ అతడు కృత్రిమ మనిషి సాయంతో తన పరిశోధనలు కొనసాగిస్తుంటే నేను ఉదయ జబ్బు గురించి చెప్పాను. అతడక్కడున్న ఒక జాతి మొక్కల్ని చూపించి -" "భూమి మీకు సకల సదుపాయాలూ ఇచ్చింది. వాటి నర్దం చేసుకుందుకే మీకింకా కొన్ని వేల సంవత్సరాలు పట్టవచ్చు. అంత వరకూ మీరు భూమిని బ్రతకనిస్తారో లేదో-" అన్నాడు. ఆ మొక్కల ఆకులూ ఉదయను మంత్రించినట్లుగా క్షణాల మీద మామూలు మనిషిని చేస్తాయని చెప్పాడు.
