"అంటే ధనుష్టాంకారం మాత్రం చేయాలి. ధనుర్బాణాలు ప్రయోగించరాదు" అన్నాడు వేదాంతం.
'దేశ నాయకుల మీద....' అంటూ కలిపాడా సంపాదకుడు.
'ఈ విషయమై మీ పత్రికలో మీరో సంపాదకీయం రాయకూడదూ? అ అజ్ఞాత వ్యక్తీ చదివితే ప్రయోజన ముంటుంది' అన్నాడు వేదాంతం.
'సంపాదకీయ మెందుకు ?" మంత్రి పేరు కూడా నేను సూచిస్తూ వ్రాయగలను. అయితే ఆ ఆరోపణల యుగంలో ఆ అజ్ఞాత వ్యక్తిని నేనేనన్న ఆరోపణ వస్తే తట్టుకోవడం కష్టం...."
"నా స్వంత బాధ్యత మీద నేనో వ్యాసం వ్రాస్తాను. ఆ మంత్రెవరో చెప్పండి" అన్నాడు వేదాంతం.
'మా పత్రికలో వేసుకోము "
'ఇలాంటి వ్యాసాలు ప్రచురించే పత్రికలే లేవా?"
'చాలా వున్నాయి. వాటికి విలువలేదు. ప్రజలు వాటిని కాలక్షేపం పత్రికలుగా తీసి పారేస్తారు."
"మామూలు పత్రికలు ?"
ఆ సంపాదకుడో క్షణం అలోచించి "ఆంధ్ర భూమికి పంపవచ్చు" అన్నాడు.
"గుడ్ అయితే నాకా వివరాలివ్వండి. ఏం జరుగుతుందో చూద్దాం."
"నువ్వు ముందే ఆ పత్రికా సంపాదకుణ్ణి కలుసుకోలేదా "
వేదాంతం తల అడ్డంగా ఊపి "ఒకరి అభిప్రాయాలు ఇంకొకరికి చేరవేయడం జర్నలిజం లో తగదు. ఇతర పత్రికల అభిప్రాయాలు గురించి నేను నీకు చెప్పను" అన్నాడు.
"నీ ఇష్టం" అంటూ అయన తన అభిప్రాయం చెప్పాడు. అప్పటి కాయనకతడి పై రవ్వంత నమ్మకం కలిగింది. "ఎక్కడా నా పేరు రాకూడదు" అన్నాడాయన.
వేదాంతం ఆయనకు హామీ ఇచ్చి అక్కణ్ణించి బయటపడ్డాడు.
అతడు తన పధకాన్ని త్వరగా తయారు చేస్తున్నాడు.
"నా మకాం రాజధానికి మార్చాలి" అని మనసులో అనుకున్నాడు.
అనుకున్న ప్రకారం వారం రోజుల్లోనే అతడి పనులై పోయాయి. తిరిగి తన ఊరు బయల్దేరాడు.
ప్రయాణం సాఫీగా జరిగిపోయింది.
ఇంటికి వెళ్ళాడతడు.
అక్కడ హల్లో విశ్వనాద్ కూర్చుని ఉన్నాడు.
వేదాంతాన్ని చూస్తూనే ఉత్సాహంగా "గనేయ్య పనైపోయింది" అన్నాడు.
"నిజంగా" అన్నాడు వేదాంతం సంతోషంగా.
"నేను నామాట నిలబెట్టుకున్నాను" అనేసి లోపలకు వెళ్ళిపోయాడు విశ్వనాద్.
వేదాంతాని కప్పుడు తల్లి గుర్తుకు వచ్చింది.
ఎప్పుడూ హాల్లోనే కూర్చుని తన్ను పలకరించేది. ఆమె ఇక్కడ లేదంటే ఆరోగ్యం బాగుండి వుండదు.
వేదాంతం హడావుడిగా లోపలకు వెళ్ళాడామె గదిలోకి.
ఆ గదిలో ఉదయ వుంది.
ఆమె గదిలో ఓ కుర్చీలో కూర్చుని గుమ్మం వైపే చూస్తోంది.
గుమ్మం దగ్గర వేదాంతం ఆగిపోయాడు.
ఆమె అతడినే చూస్తోంది. కానీ అతణ్ణి గుర్తించినట్లు లేదు. శూన్యంలోకి చూస్తున్నట్టుందామే.
గదిలో సీతమ్మ లేదు.
"ఉదయా అమ్మేది" అన్నాడు వేదాంతం.
ఉదయ బదులు పలకలేదు.
వేదాంతం తన ప్రశ్నను రెట్టించాడు.
ఉదయ ఉలిక్కిపడి "ఊ" అంది. అప్పుడామే వేదాంతాన్ని గుర్తించింది. "నువ్వా ఎప్పుడొచ్చావ్" అంది.
"అమ్మేది" అన్నాడు వేదాంతం. ఇంటికి రాగానే తల్లి పలకరింపు అవసరం అతడికి.
ఉదయ తన వేలితో ఇంటి పై కప్పు వైపు చూపించింది.
"ఉదయ అమ్మెక్కడ ?" అన్నాడు వేదాంతం అసహనంగా.
'అమ్మ చచ్చిపోయింది' అంది ఉదయ. ఒక్కసారిగా ఆమె భోరుమంది.
"ఏమిటి?' అంటూ వేదాంతం ఆమెను సమీపించాడు.
ఉదయ వెక్కి వెక్కి ఏడుస్తోంది.
వేదాంతం ఆమె భుజాలు పట్టుకుని కుదిపాడు.
సీతమ్మ నిజంగా చచ్చిపోయిందని తెలిసేసరికి వేదాంతం కుప్పలా కూలిపోయి భోరున ఏడ్చాడు.
ఉదయ కాసేపటికి తమాయించుకుంది.
"తనకు ముగ్గురు కొడుకులని సంతోష పడేది అత్త. సమయానికి ఒక్కరు కూడా ఇంట్లో లేరు. అంత్య క్రియలితరులు జరిపించారు. అమ్మ నువ్వెళ్ళిన రోజు రాత్రే చచ్చిపోయింది. విస్సీ బావ ఆ పూటే ఇల్లొదిలి పెట్టి నిన్న తిరిగి వచ్చాడు" అంది ఉదయ . అప్పుడామే కు మళ్ళీ ఏడుపు వచ్చింది.
'అంటే అమ్మ నిజంగా చచ్చిపోయింది" అంటూ మరోసారి వేదాంతం వెక్కి వెక్కి ఏడ్చాడు.
ఇద్దరూ తమకు తామే దుఖం నుంచి తమాయించు కున్నారు.
'అమ్మ చనిపోయిందని బావ షాక్ తిన్నాడు. దగ్గరుండి అంత్య క్రియలు జరిపించడానికి బదులు వెంటనే ఇల్లొదిలి వెళ్ళిపోయాడు. ఒక రోజంతా బావ కోసం ఎదురు చూసాను. చుట్టూ పక్కల వాళ్ళ సాయంతో చివరికి నేనే అంత్య క్రియలు జరిపించాను" అంది ఉదయ.
'అంత హటాత్తుగా అమ్మెలా పోయింది? ఏమయిందసలు" అన్నాడు వేదాంతం జీరబోయిన కంఠంతో.
'అంతకు ముందొకసారి గుండె జబ్బు వచ్చింది కదా. అలాంటిదే మరోసారి వచ్చింది" అంది ఉదయ.
'భూషణ్ రాలేదా"
"ఎక్కడున్నాడో కూడా తెలియదు" అంది ఉదయ.
వేదాంతానికి మతి పోయినట్లయింది. ఆ ఇంట్లోనే పిచ్చివాడిలా తిరిగాడతను.
తల్లి రుణం తీర్చుకునే సమయానికి తల్లే లేకుండా పోయింది.
అది సీతమ్మ ఇల్లు. స్వయం కృషితో ఆమె సాధించిన ఆ ఇంట్లో ఆమె ప్రాణం పోసి పెంచిన శరీరాలవి.
సీతమ్మ లేదంటే వేదాంతం భరించలేకపోతున్నాడు.
అలాగే కాలం గడుస్తోంది.
వేదాంతం వచ్చిన రెండ్రోజులకి కులభూషణ్ వచ్చాడు.
తన పరిశోధనా ఫలితాల గురించి ఉత్సాహంగా ఏదో చెప్పడానికి వచ్చిన కులభూషణ్ అమ్మ సీతమ్మ చావు గురించి విని వేదాంతం లాగే షాక్ తిన్నాడు.
అప్పటికి కాస్త తమయించుకున్న వేదాంతం కులభూషణ్ ని ఓదార్చాడు.
కులభూషణ్ చంటి పిల్లాడిలా వేదాంతం ఒడిలో తల పెట్టుకుని ఏడుస్తున్న సమయంలో ఉన్నట్టుండి ఉదయ "భూషణ్ నన్ను రక్షించు" ఈ దుర్మార్గుడు నన్ను కూడా చంపేస్తాడు" అంది.
వేదాంతానికి, కులభూషణ్ కి ఆమె మాటలు అర్ధం తెలియలేదు.
"భూషణ్ నన్ను రక్షించు....నన్ను రక్షించు...." అంటూ ఉదయ కుప్పలా కూలిపోయింది.
కులభూషణ్ తమాయించుకుని వేదాంతం ఒడిలోంచి లేచి ఉదయను సమీపించి "ఏమైంది ఉదయ?" అన్నాడు.
ఆమె వెక్కి వెక్కి ఏడుస్తోంది.
కులభూషణ్ ఆమె భోజాలు పట్టుకుని లేవదీసాడు.
ఉదయ అతడి చాతిపై వాలిపోయింది. ఆమె కన్నీళ్ళతడని స్నానం చేయించాయి.
"ఏమిటి ఉదయా ఏం జరిగింది?" అన్నాడు కులభూషణ్.
'విస్సీ బావ మనిషి కాడు పిశాచం" అంది ఉదయ.
"ఏం జరిగిందో చెప్పు' అన్నాడు కులభూషణ్.
"ఆ రాత్రి నేను అత్త గదిలో పడుకున్నాము. ఒక రాత్రి వేళ విస్సీ బావ గదిలోకి వచ్చి నన్ను లేపి తన గదికి రమ్మన్నాడు. వెళ్ళాను. అక్కడే పడుకోమని బలవంత పెట్టాడు. ఇద్దరం చెరో మంచం మీద పడుకున్నాం. నాకు నిద్ర పట్టలేదు. కాసేపటికి విస్సీ బావ లేచి అత్త గదిలోకి వెళ్ళాడు. నేనది గమనించి బావను అనుసరించాను. రహస్యంగా . బావ అత్త గది తలుపులు వేసాడు. నేను తలుపు సందులోంచి చూడసాగాను. విస్సీ బావ అత్తను లేపాడు. అప్పుడు...." ఉదయ ఆగి మళ్ళీ ఏడుపు ప్రారంభించింది.
"ఊ ఏమయింది?" అన్నాడు కులభూషణ్.
'విస్సీబావ రకరకాల భయంకర రూపాలతో అత్తను భయపెట్టాడు. పిశాచం లా అత్త ముందు నాట్యం చేసాడు. అత్త ముందు గట్టిగా అరిచింది. తర్వాత మాట ఆగిపోయింది. అప్పుడు నాకెంత భయం కలిగిందో చెప్పలేను. ఆ భయంతోనే నాకు స్పృహ తప్పింది. తెల్లవారే దాకా నాకు మెలకువ రాలేదు. అప్పుడు విస్సీ బావ ఇంట్లో లేడు. అత్త చచ్చిపోయింది."
వేదాంతం ఆవేశంగా ఆమెను సమీపించి "ఇది నువ్వు నాకు ముందు ఎందుకు చెప్పలేదు?" అన్నాడు.
ఉదయ ఆవేశంగా "నీకు తెలీకుండానే ఇది జరిగిందా?" అంది.
"ఉదయా ఏమిటా మాటలు? వేదాంతం అమ్మను చంపుకుంటాడా?" అన్నాడు కులభూషణ్ ఆమెను హెచ్చరిస్తూ.
"విస్సీ బావ మాత్రం అమ్మను చంపుకుంటాడా?" అంది ఉదయ.
'అవును ఇదంతా ఏదో కధలాగుంది. నువ్వు భ్రమ పడి వుంటావు" అన్నాడు కులభూషణ్.
"భ్రమ -- నేనెప్పుడైనా నా విస్సీబావ హత్య చేస్తాడని అదీ అత్తను చంపేస్తాడని భ్రమ పడగలనా? అంది ఉదయ. వేదాంతం ఏ క్షుద్ర శక్తులనో ఆరాధించి ఓ పిశాచాన్ని కూడా వెంటబెట్టుకుని వచ్చాడు. ఆ పిశాచం విస్సీ బావ రూపంలో ఇంట్లో తిరుగుతోంది. ఊళ్ళో తమాషాలు చేస్తోంది. అయితే అత్త ఆ పిశాచాన్ని విస్సీ బావే అని నమ్మింది. విస్సీ బావ కార్యకలాపాలకు అడ్డు వచ్చింది. ఆ అడ్డు తొలగించుకో,మని పిశాచానికి చెప్పి వేదాంతం చల్లగా ఇక్కడినుంచి జారుకున్నాడు. పిశాచం అమ్మను చంపేసింది. భయపెట్టి చంపేసింది. వేదాంతం అంతా అయ్యాక ఏమీ ఎరుగనట్లే ఇక్కడికి వచ్చాడు. నాకు నిజం తెలిస్తే చంపెస్తాడని భయపడ్డాను. నీకోసం ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు నాకిక భయం లేదు. నీ మిత్రుడి నిజస్వరూపం తెలుసుకో. నన్ను రక్షించి నిన్ను నువ్వు రక్షించుకో.'
కులభూషణ్ ఆమెను వదిలిపెట్టి వేదాంతాన్ని సమీపించాడు .
వేదాంతం తల వంచుకున్నాడు.
"వేదా నిజం చెప్పు, నువ్విండీయాకు తిరిగి వచ్చాక ఏదో జరిగింది ఏమిటది?" ఇంక నువ్వు దాచడానికి వీల్లేదు చెప్పు ' అన్నాడు కులభూషణ్.
వేదాంతం తలెత్తలేదు.
