Previous Page Next Page 
శంఖారావం పేజి 44

 

    గ్రహాంతర వాసి తన పని పూర్తీ కాగానే గాలిలోకి నడుచుకుంటూ పైకి వెళ్ళిపోయాడు. కృత్రిమ మనిషిని నా ఆదేశాలకు బద్దుడిని చేసి అతడి నెలా ఉపయోగించుకోవాలో నాకు క్షుణ్ణంగా నేర్పి -- అతడిని నాకు వదిలి తను వెళ్ళిపోయాడు.
    నేను ఆటవికుల ప్రాంతంలో ఉండదలుచు కోలేదు. వారు నన్ను దేవ దూతగా అక్కడే ఉండి పొమ్మని బలవంత పెట్టారు. నేను సాధించాల్సిన కార్యాలు చాలా ఉన్నాయని ఆటవిక నాయకుడికి చెప్పుకున్నాను. అప్పుడతడు నాతో "నువ్వెప్పుడైనా ఇక్కడకు రావచ్చు . సమీప గ్రామంలో సుబ్బారావనే అతడు నీకిక్కడికి రావడానికి దారి చూపిస్తాడు. మా ఆటవికుడొకడు నిన్నక్కడ దిగబెట్టి అతడికి పరిచయం చేసి మా గురించి చెబుతాడు. ఆటవికులం మేము కావాలనే నాగరికతకు దూరంగా ఉంటున్నాం. మా ప్రాంతాలను సమీపించిన ,మనుషుల్ని నిర్ధాక్షిణ్యంగా వేటాడుతాం. సుబ్బారావు తాత వల్ల మా ఆటవికులు మహోపకారం జరిగింది. అందుకే అతడి కుటుంబానికి మాకూ పొత్తు ఉంది. మా ఆటవిక సంపదను అతడి ద్వారా బయటి ప్రపంచానికి చేరవేసి బదులుగా ప్రతిఫలం పొందుతుంటాం . సుబ్బారావు మాకు నమ్మకస్తుడు . మమ్ముల్నేప్పుడు దేనికీ మోసం చేయలేదు--" అంటూ చెప్పడమే కాక మరోసారి తన గ్రామానికి రావలసినదిగా నన్నాహ్వానించాడు.
    నేనీ గ్రామం నుంచి బయట పడ్డాను. సుబ్బారావు పరిచయమయింది. అయినా అంతా కలలాగే ఉంది నాకు.
    అప్పటికింకా కృత్రిమ మనిషిని విశ్వనాద్ గా మార్చలేదు నేను.
    నాకు లభించిన వ్యక్తీ నిజంగా అడ్జస్టబుల్ మనిషి అని ఆవునా కాదా అనడానికి కొన్ని ప్రయోగాలు చేసి దృవపరచుకుని నగరంలో అడుగుపెట్టాను.
    అప్పుడు నా ధ్యేయాలు రెండే రెండు ....
    అమ్మను సంతోష పెట్టాలి.
    నేను తలపెట్టిన ధనుష్టంకార కార్యక్రమాన్ని కొనసాగించాలి.
    దేశాన్నో ఊపు ఊపాలి.
    ఇది నాకు మహాదావకాశం.
    మన విస్సీ మనకు దక్కకుండా పోవాలన్నది దైవ నిర్ణయం.
    ప్రొఫెసర్ ఆర్నాల్డ్, డాక్టర్ గ్రే విస్సీ నేదో చేయాలనుకున్నారని నేననుమానించాను. కనీ వారు తమ బాధ్యత అందులో లేదని నాకు ఉత్తరం ద్వారా తెలియబర్చారు. అతడి వంటి మేధావి పోయినందుకు వారు బాధను వ్యక్తం చేశారు. అయితే వారు తెలియపర్చిన మరో విశేషం -- "యాంటీ న్యూక్లియర్ వాక్సిన్" విషయంలో విశ్వనాద్ అంచనాలో కొన్ని తప్పులున్నాయి. ఆ తప్పులను సవరించడం ఇప్పట్లో జరిగే పని కాదు. ఈ విషయమై భారత రిసెర్చి శాఖ కూడా అంగీకరించింది. అందులో నిజమెంతో అబద్దమెంతో తెలియదు. కానీ సైన్సు ప్రపంచంలో విశ్వనాద్ చచ్చి పోయాడు.
    అమ్మ కోసం మాత్రమే అతడు బ్రతికి ఉన్నాడు.
    విశ్వనాద్ గురించిన నిజం అమ్మకు తెలియకూడదనే నేను కులభూషణ్ కి గానీ, ఉదయకు గానీ అసలు వివరాలు చెప్పకుండా దాచి పెట్టాను.
    కానీ అమ్మ ఎంత గొప్పది ?
    కృత్రిమ మానవుడిలో ఆమె మాతృ ప్రేమ మమతానురాగాలు నింపింది. విస్సీ నిజంగా విస్సీ అయిపోయాడు. కానీ అది అమ్మకు సంబంధించినంత వరకే!
    అమ్మ నాకు దైవం. అమ్మ నా ప్రాణం. అమ్మ తర్వాతే నేను ....
    ఈ నా భావాలు విస్సీ పై ప్రభావం చూపాయో లేక అమ్మ వాడిన మాతృప్రేమతో లొంగదీసుకుందో చెప్పలేను.
    వాడు అమ్మ ఆదేశం మీద న ఆదేశాలను కూడా నిర్లక్ష్యం చేయసాగాడు.
    వాడు మనుషులను రహస్యంగా కలుసుకుని పిశాచ రూపాలలో బెదరగొట్టి క్షణాల మీద వారి రహస్యాలను గ్రహించి మనో గత భావాలను తన మెదడులో రికార్డు చేసి వారిని బందీల్ని చేసి తను వారి రూపులో వారి తప్పు లొప్పుకుని తర్వాత తప్పించుకుని వారిని పోలీసుల పరం చేసేవాడు.
    ఈ నా కార్యక్రమానికి అమ్మ అడ్డు తగిలింది.
    అమ్మ అడ్డు తొలగించుకుని నా ఆదేశాల్ని పాటించే ప్రయత్నం చేయమని తీవ్రంగా హెచ్చరించాను -- కృత్రిమ విశ్వనాధాన్ని.
    ఫలితంగా అమ్మనే వాడు తొలగించాడు. ఇది నేనూహించాల్సింది.
    తప్పంతా నాది! అమ్మ లేకుండా పోయాక నా జీవితానికే అర్ధం లేదు...."
    వేదాంతం చెప్పడం ఆపి గంభీరంగా చూశాడు.
    అతడేవరినీ చూస్తున్నట్లు లేదు. శూన్యంలోకి చూస్తున్నాడు.
    అమ్మ లేక అతడి కంటి కంతా శూన్యమై పోయింది.
    ఆ ఇంట్లో నెల రోజులు గడిచాయి.
    క్రమంగా ఒక్కొక్కరే మామూలు మనుషు లవుతున్నారు.
    సీతమ్మ పోయిన దుఃఖం నుంచి -- ఆమె లేని కొత్త జీవితాని కెలా అలవాటు పడాలా అన్న ఆలోచన వారి మనస్సులో బయల్దేరింది.
    వేదాంతం ఆలోచనలు
    ఉదయ ఆలోచనలు కులభూషణ్ చుట్టూ తిరుగుతున్నాయి.
    కులభూషణ్ ఆలోచనలు తన పరిశోధనల చుట్టూ తిరుగుతున్నాయి.
    విశ్వనాద్ యాంత్రికంగా తన పనులు చేసుకుని పోతున్నాడు.
    ఉదయ అతణ్ణి పట్టించుకొనడం లేదు. ఉదయనతడు పట్టించుకొనడం లేదు.
    అందరూ కలిసి మాట్లాడుకొనడం బాగా తగ్గిపోయింది.
    ఒకరోజు ఉదయ కులభూషణ్ ని పలకరించి -- 'ఇలా ఎంతో కాలం సాగదు. నలుగురూ నాలుగు రకాలుగా మాట్లాడుకుంటున్నారు. మీరు మగాళ్ళు. మీరేలాగున్నా ఫరవాలేదు. నాకు పెళ్ళి జరగాలి. ఇంట్లో అత్త లేకపోవడం నాకిబ్బండిగా ఉంది.' అంది.
    'ఈ విషయం వేదాంతానికి చెప్పు.'
    "వేదాంతానికెలా చెబుతాను?" అంది ఉదయ.
    "వాడు నిన్ను ప్రేమిస్తున్నాడు -" అన్నాడు కులభూషణ్.
    "కానీ విధి మనను కలిపింది -' అంది ఉదయ.
    "ఉదయా నాకిది నచ్చలేదు. నీ ప్రేమ విస్సీ బావపై నీ గౌరవం వేదాంతపై , గతి లేక నువ్వు నన్ను పెళ్ళి చేసుకున్నావు. నీకు నూరేళ్ళ బ్రతుకున్నదని తెలిస్తే నువ్వు నన్ను పెళ్ళి చేసుకుని ఉండేదానివి కాదు. నీ విస్సీ బావ తిరిగి వచ్చాడని తెలిసి నీకు ఆయువు ఉన్నదని తెలిసి మన పెళ్ళిని నువ్వు కాదని విస్సీ బావ చుట్టూ తిరిగావు. నీ గురించి నేనప్పుడే ఆశలు త్రుంచేసుకున్నాను.' అన్నాడు కులభూషణ్.
    "కానీ మన పెళ్లి నీ ప్రవర్తనలో మార్పు తెచ్చింది. ఆ పెళ్ళిని నమ్మి నీవు పవిత్రతను పాటించావు. పాత పరిచయాలు కాదన్నావు. నీ వృత్తి పై దృష్టిని కేంద్రీకరించావు. నేను విస్సీ బావను ప్రేమించానన్నది నిజం. అయితే జీవితంలో ప్రాక్టికల్ గా ఉండాలి. నీకు భార్యగా నీ చేత ఎన్నో బృహత్తర కార్యాలు సాధింపచేయగలనని నా నమ్మకం. నేను లేకుంటే నీ బుద్ది పెడదారులు తొక్కి సమాజానికి ప్రయోజనకారి కాలేదని అనుమానం. నా మాట కాదనకు--' అంది ఉదయ.
    'మరి వేదాంతం విషయమేమిటి ?"
    'అతడు తన్ను గురించి తానాలోచించగలడు...." అంది ఉదయ.
    "కానీ నీ మనసులో ఇన్సీరియారిటీ కంప్లేక్సుంది . నీపై నాకు ఆశ  ప్రేమ వుంది కానీ పరిస్థితులు తప్ప నా గొప్పతనం నిన్ను నాకు దగ్గర చేయడం లేదని నాకనిపిస్తోంది. ఈ కాంప్లెక్సుతో నేను నీకు దగ్గర కాలేను--" అన్నాడు కులభూషణ్.
    ఉదయ కాసేపు అలోచించి "నా అభిప్రాయంలో నీవు వేదాంతం కన్నా ఎన్నో రెట్లు ఉన్నతుడివి. కాదని అతణ్ణి రుజువు చేయమను. అప్పుడతడినే పెళ్ళి చేసుకుంటాను --" అంది.
    'అదెలా సాధ్యం?"
    "భూషణ్ వేదాంతం చిన్న తనం నుంచీ క్రమశిక్షణ పాటించాడు. అందువల్ల అతడి సద్భుద్దిలో ప్రత్యేకత లేదు. నాకోసం నీవు నీ ప్రవర్తన మార్చుకున్నావు. అతడు మానవాతీత శక్తితో మానవాధములను నాశనం చేయమని సంకల్పం కట్టుకుంటే నీవు నీ స్వశక్తితో మానవ జాతిని మృత్యుకోరల నుంచీ రక్షించాలనుకుంటున్నావు. అన్ని విధాలా నీవే ఉత్తముడివి. వేదాంతం తనకు తానై ఈ ప్రపంచానికి చేసినది చేస్తున్నది లేదు. పరిస్థితులలా కలిసి వచ్చాయి.' అంది ఉదయ.
    'అయితే?"
    'అయితే ఏముంది? కాదని అతణ్ణి రుజువు చేసుకోమను...."
    కులభూషణ్ ఆమెతో వాదించకుండా ఈ మాటలు వేదాంతానికి చేరవేశాడు. వేదాంతం అదోలా నవ్వి "ఉదయను నువ్వు బాగా ఇంప్రెస్ చేశావు" అన్నాడు.
    "నేను చెయ్యలేదు. ఆమె ఇంప్రెస్ అయ్యింది --" అన్నాడు కులభూషణ్.
    'ఆమెతో అయ్యిందనుకున్న పెళ్ళి నీలో ఎలాంటి మార్పులు తెచ్చిందో నువ్వామెకు చెప్పుకున్నావు.
    ఆ అవసరంమేమిటి?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS