Previous Page Next Page 
ప్రేమకు పగ్గాలు పేజి 42

                                   54

    మూర్తికి ప్రేమంటే శైలజతో కబుర్లు చెబుతూ శైలజ తియ్యని మాటలు వింటూ గడపడం కాదన్న విషయం అదివరకే అవగాహన అయినా, ఇప్పుడు భాస్కరం ఇరుక్కున పరిస్థితులను చూడగానే మరింత గట్టిగా తెలిసిపోతుంది. పద్మావతికి భాస్కరం మీద అపోహ తొలగించాలని శైలజకు చెబుదామనుకున్నవాడు తరుముతున్నట్లు శైలజ దగ్గరికి వెళ్ళాడు.
    "అరె! ఎవరు తరుముతున్నారు?" అన్నది శైలజ వికసించిన వదనంతో.
    "మనం ప్రేమించడంకోడం మానేద్దాం శైలూ!" అన్నాడు ఆవేశంగా మూర్తి.
    కిలకిలా నవ్వేసింది శైలజ.
    "మానేసి?....." అడిగింది కొంటెగా.
    "మీ నాన్నగారు, అమ్మగారు వద్దంటే నువ్వు నన్ను ప్రేమించగలవా?" మూర్తి ఆశగా, భయంగా అడిగాడు.
    శైలజ గంభీరంగా అయిపోయింది. తల దించుకుని 'మీకి వాలేం జరిగిందీ?" అన్నది.
    "ఇవాళ జ్ఞానోదయమైంది. నాకు అమ్మా నాన్నా లేరూ. ఏకాకిని....మా మానమేమకీ నాకూ ఋణ ముందేగాని, అతని మాట మనకి ఖాతర్ లేదు.....అంచాత నేను ఈ లోకమంతా ఎదురైనా కాదని నిన్ను అనుసరించగలను గాని నువ్వు? నువ్వో.......?"
    "నేనూ అంతే....." శైలజ అప్రయత్నంగా అన్నదేగాని స్పష్టంగా అనలేకపోయింది.
    "ఉహూ.....నీకు తల్లీ దండ్రీ; వాళ్ళ కుటుంబ గౌరవం అనే ముసుగులో దాక్కున్న కోరికలూ, ఇష్టానిష్టాలు మొదలగునవి ఉండవచ్చును శైలజా!"
    "అబ్బ! మీరు నన్ను చంపేస్తున్నారు........ఇలా తిన్నగా పరిగెత్తుకుని వచ్చి, నిలదియ్యడానికి కారణమేనా ఉండొద్దా? బాధ పడ్డది శైలజ.
    మూర్తి కాస్త నిగ్రహించుకుని "మగాడు మోసగాడు అంటూ ఆనక మీరు గుర్రాలను గాడిదల్ను ఒక గాట కడతారు.....పైగా త్యాగాల పేరిట మా కొంపలు ముంచేస్తారు" అన్న మూర్తి మాటలకు విసుక్కుంది శైలజ.
    "మీకు పైత్యం చేసిందా? ఎవరు ఎవర్ని మోసగాడి నన్నారు? నేను మిమ్మల్ని పల్లెత్తు మాటేనా అనందే?"
    "పద్మావతి భాస్కరాన్ని ఏమనుకున్నది?" మూర్తి ప్రశ్నకు శైలజ నవ్వింది.
    "పద్మావతిగార్నడగండి! భాస్కరంగారు. మీ ఫ్రెండు కాని నాకు కాదు"-
    "శైలూ! నిజం చెప్పావ్! భాస్కరం, సురేఖ, నువ్వూ, నేనూ అంతా బందీలమ్! చదరంగం గళ్ళల్లోని పావులకు కొన్ని రకాల స్వేచ్చలే ఉన్నట్లు మనకి కొన్ని రకాల అవకాశాలే ఉంటాయి! పైగా....."
    శైలజ మధ్యలోనే అన్నది "నేను మాత్రం మిమ్మల్ని మోసం చేశారనుకోను గాని నన్నిలా భయపెట్టకండి!"
    మూర్తి కూడా అక్కడకు ఆగిపోయి 'భాస్కరం, పద్మావతి' కధ అంతా చెప్పాడు. "నీకు ఆవిడ కనిపిస్తే ఇదంతా కాస్త చెప్పు-" అన్నాడు.
    శైలజ అంతా విని బరువుగా నిట్టూర్చింది.
    "భాస్కరంగారు పద్మావతికి మొదటే ఇదంతా చెప్పకూడదూ?" అన్నది భారంగా.
    "ఏమని? నేను నిన్ను ప్రేమించడంవల్ల నా పిన్నికి కష్టం. నా చెల్లెకి పెళ్ళి అవదు......నీ కుటుంబానికి గల చెడ్డ సాంప్రదాయాలు అందుకు కారణాలు అవేనా?" మూర్తి కోపంగా చూశాడు.
    శైలజ బేలగా చూసింది.
    మూర్తి బుజ్జగింపుగా అన్నాడు.
    "అప్పుడు పద్మావతిగారు భాస్కరాన్ని అతని సుఖంకోరి శాశ్వతంగా దూరం చేసుకుంటున్నాను అని పూర్తిగా దూరం కావచ్చునుగా."
    "లేదా తన సాంప్రదాయాలను ఎంచిన నేరనికి పద్మావతి భాస్కరాన్ని తిరస్కరించి చచ్చిపోవచ్చును కూడా." మూర్తి చెప్పాడు.
    "నన్ను నమ్ము శైలజా! భాస్కరం పద్మావతిని ఏ విధంగానూ ఒదులుకోలేడు" అన్నాడు.
    శైలజకు కూడా గుండె బరువుగా తోచింది. "పాపం! సురేఖగారు మంచిది. ఆమెను కూడా పద్మావతిగారు తెలియక నిందించింది" అన్నది.
    ఇద్దరూ మరొక్క మాట లేకుండా భారంగా విడిపోయారు.
    
                                     55

     డాక్టరువచ్చి సురేఖను పరీక్ష చేసి, "మీరుపడుతున్నంత ఆందోళన అక్కరలేదు" అన్నట్లు నవ్వి, "మరేం ఫర్వాలేదు-రెండు ఇంజెక్షన్ లు ఇస్తాను" అన్నాడు.
    ధనమ్మగారు "అరుంధతీ" అని పిలిచింది.
    "అమ్మాయికి ఆ సూదులు పోడుస్తూంటేనే చూడలేను-కాస్త జాగర్తా చూడు తల్లీ!" అని అటు మొహం తిప్పుకుంది.
    నిజానికి మెత్తని తన జబ్బల్లో వరం దొరకక డాక్టర్లు "సూదులు" పొడుస్తూ, తీస్తూ ఉన్నా నిర్భయంగా చూసేది ధనమ్మగారు. అటు వంటిది సురేఖకు ఇంజక్షన్ ఇస్తే మాత్రం చోడటానికి ఆమె గుండె "చివుక్కు" మంటుంది! అరుంధతమ్మకు ధనమ్మ ఆస్తి కూతురుకిరావడం యిష్టమే. కాని తన కూతురుపట్ల ఆమెకు ఇంత ఆపేక్ష ఉండటంమాత్రం కష్టమనిపిస్తుంది. రుస రుస మవడంతప్ప ఏం చెయ్యలేదు మరి!    
    డాక్టర్ ఇంజక్షన్ ఇస్తున్నంత సేపూ ధనమ్మగారటు తిరగనేలేదు.
    "అమ్మా! అమ్మాయి నిద్ర మాత్రలు మింగుతున్నదేమో కాస్త గమనించండి. వెంటనే వేడి టీ కాని పాలుకాని ఇవ్వండి" అన్నాడు డాక్టర్ బాగా అనుభవజ్ఞుడు గనుక.
    ధనమ్మగారు "ఓసినీ! దీనికి నిద్ర పట్టకపోడం ఏమిటండీ! తిని తిరిగి పడుక్కొని హాయిగా నిద్రపోయే వయస్సుకదా?" అన్నది.
    "ఏవో మాత్రలు మూడు రోజులుగా కొంగున సీసాతో కట్టుకు మింగుతూనే ఉంది" ఆందోళన చెందింది అరుంధతమ్మగారు.
    "అవి ఎక్కువగా తింటే మళ్ళీ మీరు నన్ను పిలవ నక్కర లేనంత నిద్ర పట్టేస్తుంది......కాస్త కనిపెట్టండి" అంటూ డాక్టర్ వెళ్ళిపోయాడు.
    ధనమ్మగారికి నుదుట చిరు చెమట కమ్మేయి. సురేఖ దిండుకింద పరుపుక్రింద అత్యవసరంగా వెతికింది.
    "నేను చచ్చాక ఏమాత్రలేనా మింగుదువు గాని కాని, పాజీకానా! ఇప్పుడు నువ్వు చచ్చినన్ను చంపకు" మని నొచ్చుకుంది, విసుక్కుంది. బాధపడింది.
    సురేఖకు కాస్త తెలివివచ్చి, ధనమ్మగారి మాటలు
    వినో వినకో "అలాగే దొడ్డమ్మా!" అంది.
    ఆవిడ మాటలకు సమాధానమన్నట్లు.
    ధనమ్మగారు అటూ, ఇటూ చూసి ముందుకు వంగిసురేఖ చెక్కిలి ముద్దు పెట్టుకుంది ప్రేమగా.

                               *    *    *

    సురేఖ మర్నాడు ఉదయమే లేచి కూచొనిరాయడం ప్రారంభించింది.
    "ఏమిటి రాస్తున్నా వమ్మాయీ!" అన్నది ధనమ్మగారు.
    "శలవు చీటీ!"
    "అంత దీర్ఘంగా రాయాలా? రెండఠావులూ"
    "కాదమ్మా! మరి హాస్టలులో మావార్డెనమ్మకి కాస్తంత లెటర్ రాస్తే కోపం......శలవ్ లేదు ఫో" అంటుంది..." సురేఖ నవ్వింది పొడిగా.
    "సరేగాని, ఇక నన్ను భాస్కరం వూసు ఎత్త వద్దంటావ్ నిష్కారణంగా ఇంత శ్రమపడి వూరుకోమంటావ్?" ధనమ్మగారు ఆశగా అడిగింది.
    "నీకు భాస్కరంగారి ఆశ ఎందుకు దొడ్డమ్మా! అతనికి నేనంటే ఇంత పిసరు ప్రేమ లేదు- ఒకవేళ రేపు బలవంతాన అలాంటిది వచ్చినా గిచ్చినా అది నీ డబ్బుమీద వస్తుందేమోగాని నామీద కాదు......అంచాత నీ డబ్బూ "మరాల"కే రాయి-నీకూ నాకూ కూడ మన శ్శాంతి"-
    "సరా! ఇవాళే మరో సమ్మంధం చూడమని మీ నాన్నకి చెప్తాను. అతగాడు రానీ-నీకు 'కాని వాడు' నా కెందుకు? జీవితంలో పరాభవం లేదనుకున్నాను. ఇదొక్కటి మచ్చుకు ఉన్నానూ అని జరిగింది" అంటూ ఆమె అక్కణ్ణించి సాధ్యమైనంత కోపాన్ని అణుచుకుంటూ వెళ్ళిపోయింది.
    సురేఖ ఉత్తరం శైలజకి రాసింది. వార్డెనుకూ కాదు, కాలేజీకీ కాదు.
    "ప్రియమైన శైలజా!
    దేవుడేవుంటే అతను మనల్ని స్వర్గమే ఉండి మనం అక్కడికి వెళ్తే "నువ్వు ఎంత సుఖపడ్డావు" అని అడగడట! "ఎంతమందిని సుఖపెట్టావు?" అని అడుగుతాడని మా పెద్దనాన్నగారు అనేవారు. సుఖపెట్టడంకన్నా సుఖపడటమే ఎక్కువ చేసినవారికి స్వర్గ ద్వారాలు తెరవనే తెరవరని ఆయన అనేవారు.
    కాని ఇవాళ ఆయనలేరు. ఆ దేవుడు అగుపించడు.......దొడ్డమ్మని సుఖపెట్టాలీ అంటే భాస్కరంగారినీ, పద్మావతి (నా వూసు వదిలీ) నీ క్కూడా దుఃఖ పెట్టాలి. లేదు వల్లనే సుఖపెట్టెలీ అంటే మా దొడ్డమ్మను పరాభవించానంటుందామె. ఇలాంటి సమయంలోనే ఆత్మహత్య చాలా సులువైన పరిష్కారం అనిపించింది నాకు, కాని అప్పుడు కూడా ఈ 'బంధాలను' బేధించిన దాన్నిగాక, 'చచ్చి' కూడా వీళ్ళను సాధించిన దాన్నవుతానేమో......పైగా 'ప్రేమ'కు 'అనుబంధా'నికి లొంగి స్త్రీలు తమ 'బలహీనత'వల్ల అహంకారంవల్లా చచ్చి, చాలా సంకుచితమైన ఉనికిని తమ జాతికి తామే ఆపాదిస్తున్నారేమో నని అనిపిస్తుంది.

                      
    ఆడ పిల్లల అహంకారం లేదా బలహీనత ప్రేమకూ త్యాగానికీ ఆత్మహత్యకూ ముడిపెట్టుకో డం వల్లనే సామాజిక ప్రతిపత్తికి బదులుగా స్త్రీకి నేటి సమాజంలో సానుభూతి, గుప్పెడు జాలి మాత్రం దక్కుతున్నాయని నాకు తోచింది.
    నేను 'చావాల'ని మా దొడ్డమ్మగాని, పద్మావతి "ప్రేమ" కాని కోరలేదు. మా ప్రేమే అలా అనిపించింది నాలో.....అందుకే నేను దానికే పగ్గాలు వేస్తున్నాను......బహుశా నీకు ఈ ఏడాది అంతా కనిపించనేమోగాని - మళ్ళీ ఏడాదికైనా వస్తాను.....అందాకా నీ "సురేఖగారి"ని క్షమించు. పద్మావతి అమాయకురాలు.....ఆత్మహత్యకు ప్రేమలోని పవిత్రతకూ అవినాభావ సంబంధ ముందని భ్రమ పడగలదు. దయచేసి నా కోసమేనా దాన్ని బ్రతకమను. భాస్కరంగారిలాంటి పిరికివాణ్ణి, ప్రేమించిన అదే అర్ధం చేసుకోకపోతే, బహుశా ఆయనకు వాళ్ళ పిన్నమ్మగారు లేకపోయినా తర్వాత ప్రపంచమంతా శూన్యమై పోతుంది. అప్పుడు పద్మావతి తప్పక వుండాలి...... నువ్వు నా కన్నా చిన్న దానివేగాక, సొంత చెల్లెలి లాంటి నేస్తానిని గనుక నీకు నా హృదయ వేదన అంతా రాసుకున్నాను. నేను మిమ్మల్నిందర్నీ భాస్కరంగారితో సహా ప్రేమిస్తున్నానుగాని, మా దొడ్డమ్మ నన్ను మాత్రం ప్రేమిస్తున్నది. అందుకే ఈ ఏడాది అన్నిటికి 'బంధనాలు' వేసుకుని......వాల్తేరు రాను......పై ఏడాదిదాకా మర్చిపోకు.
    ఈ ఉత్తరం చదివి చింపేయి. మంచిదానివి కదూ..
                                                                               ప్రేమతో
                                                                             "సురేఖగారు."
    ఉత్తరం అంటించేముందు సురేఖకు మరో మాట తోచింది. "పద్మావతితో భాస్కరంగారిని సురేఖ ప్రేమించిందట అని చెప్పకూ" అని రాద్దామనుకుని మానేసింది. దొడ్డమ్మతో కూడా వచ్చిన "గురువుల్ను" పిలిచి "ఈ ఉత్తరం వెంటనే పోస్టు చేసిరా" అని రూపాయి తీసి ఇచ్చింది.
    "ఐపోయింది! దొడ్డమ్మా! ఇక సురేఖ నీదే" అనుకుని కళ్ళు మూసుకుంది. తేలిగ్గా వుంది ఎదను బరువుగానూ ఉంది. వెలితిగా నిండుగా నిండుగా వెలితిగా వుంది.
    
                                  56

    పద్మావతి ఒక రోజంతా మంచాన పడిఉండటం వల్ల ఆత్మహత్యమీద మనసు పోతున్నదే తప్ప మనశ్శాంతి చిక్కటంలేదు. పైకి ఏమనుకుంది కేనా జయమ్మ కదిపితే కన్నీరైపోయేలాగుంది"
    "అమ్మా! వూరికే కాలేజీకి వెళ్ళొస్తానే" అన్నది భయంగా-"ఎందుకోయిక" తనకే తెలియదు.
    జయమ్మగారు "తల్లీ! నా కొంప ముంచుతా నంటావ్? అంతేగా!" నన్నది దగ్గరిగా వచ్చి.
    "మరి ఇంట్లో ఎలా చావ మన్నావ్?" విసుక్కుంది పద్మావతి.
    "ఇంకా ఆ భాస్కరం మీద...." అంటూ ఉండగానే పద్మావతి పిచ్చిగా కేకలు వేసింది.'    
    "ఆ భాస్కరం ఆ భాస్కరం......ఎందుకమ్మా? అలా చంపేస్తావ్ నన్నూ.....చెప్పానుకదా"
    "ఆ పెద్ద మనిషికి నేనేనాడో చచ్చిపోయాను సరా!"
    జయమ్మగారు చాలా కుమిలిపోయింది.
    "నాతల్లి దండ్రులను వాళ్ళు కలలుగన్నపరువు ప్రతిష్టలతో నేను చావనివ్వలేదు......నువ్వూ అంతే. నన్ను నేను కోరినవిధంగా సవ్యంగా చావనివ్వవు!" ఇది మనకు సంప్రదాయమవుతుంది కాబోలు...." ఆమె నిట్టూర్చింది.
    పద్మావతి తల్లిని శత్రువును చూసినట్లు చూసింది.
    "అబ్బబ్బ! నువ్వు కట్టుకొని చావమన్న సమ్మంధం ఇంకా రాందేనన్నెందుకు ఇటిబందీనై పోమంటావ్? అదేదోరానీ!" అన్నది.
    "సరే! నీ ఇష్టం" జయమ్మగారు అస్పష్టంగా అన్నది.
    పద్మావతి తల్లి దగ్గిర కూలబడి ఏడిచింది.
    "నీమీద ఒట్టు......ఇక భాస్కరంగారి మాటలు నమ్మడం అతనీమీద ఆశ పెట్టుకోడం చెయ్యనమ్మా! కాలేజీకి వెళ్ళకపోతే నలుగురూ ఏమేనా అనుకోరా?" అన్నది.
    జయమ్మగారు కూతురిపట్ల విశ్వాసం తెచ్చుకుని "పోయిరా! రాజుకి మరో ఉత్తరం రాస్తాను.
    కార్డు మీద వాడి ఎడ్రసు రాసిపో మొన్నటి ఉత్తరం సరిగ్గా అందిందో లేదో" నన్నది.
    "నిజమే. ఒక్కసారిగా కూతుర్ని యింట్లో కట్టిపడేస్తే లోకులు యేమేనా అనొచ్చునూ అనిపించింది.
    వాస్తవానికి పద్మావతికి ఒక క్షణంలో తనమీద మరో క్షణంలో భాస్కరంమీదా మరుక్షణంలో లోకం మీద కోపం వస్తున్నది.
    "ప్రేమించుకోడం అనేది ఒక భ్రమ అనుకున్నది" అసలు ఈ జీవితమే భ్రమ......"
    సురేఖ కాలేజీకి వచ్చిందా? లేదా? అన్న కుతూహలం కూడా కలిగింది "పాపం! దాన్నేనా ఆయన తిన్నగా చూస్తాడా?" అని ఖేదపడ్డది.
    "సరే! ఇక నాకు మిగిలింది అమ్మ మాట విని తన ఋణం తీర్చుకుందికి మరొకడితో కాపురానికి వెళ్ళడం అంతేగా........ఛీ! ఇంతకంటే ఆత్మహత్య మేలు"
    జయమ్మగారు ఆ పిల్ల ఆలోచనలు చదివిందా అన్నట్లు.
    "చూడు పద్మా! ఏమీ కాని పని తలపెట్టకు. దానివల్ల నువ్వు మరో హత్య కూడా చేసిన దాని వవుతావు." కావాలంటే "కాలేజీకి వెళ్ళు ఖర్చైన సొమ్ము ఎలాగ అయిందిగదా! ఆ తర్వాత దైవమె ఉన్నాడు" అన్నది.
    "ఎందుకని ఛస్తానమ్మా?" బాధగా మూలిగింది పద్మావతి.    "తల్లీ! తల్లి ప్రాణం పడే బాధ నీకు, నీ కడుపున ఓ కాయి కాస్తేగాని తెలియదే......నా చావు నా చేతుల మీదుగా అయిపోడం కన్నా, ఇప్పుడు నేనేం కోరనమ్మా"-ఆమె మళ్ళీ కన్నీరు పెట్టుకుంది.
    "ఛీ! ఏం మాటలమ్మా అని.....నేను లైబ్రరీకి పుస్తకాలు తిరిగి ఇచ్చెయ్యాలి. ఇచ్చేస్తాను" అన్నది పద్మావతి. కాని ఆ పిల్లకి తల్లిమీద చాలా కసిగా ఉంది.
    "చస్తానంటే కూడా నాకు స్వేచ్చ లేదా?" అని మండి పడ్డది మనసులో.
    నడుస్తున్నంతసేపూ ఒకటే బాధ. "నిజమే......భాస్కరంగారిని మొదట్లోనే దూరంగా ఉంచేస్తే తీరిపోను........ఇప్పుఏ రంపపుకోతలు తప్పును" అనుకున్నది.
    అమ్మాయిల విశ్రాంతి భవనం షష్టిపూర్తి భవనంలో మొదట కనిపించింది శైలజ.
    నవ్వింది పద్మావతి. "ఏం శైలజా?" అని-శైలజ దగ్గరగా వచ్చి.
    "మీకో శుభవార్త చెప్తారండి" అంది శైలజ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS