మారుతున్న తన మనో రీతుల్ని బట్టి, శాంత కొంత కాలం తనకు ఎడంగా ఉండడం మంచిదనుకొంది జానకి. ఈ చదువు మూలంగా శాంత రెండేళ్ళ పాటు దూరంగా ఉంటె, ఈ ,లోగా అస్తవ్యస్తంగా ఉన్న తన ఆలోచనలకూ ఒక రూపు ఏర్పడి, జీవితంలో నిలకడ రావచ్చునని భావించింది. ఆర్ధికంగా తనకు భారమైనా శాంతను ఏమ్. ఎస్.సి చదివేందుకు ప్రోత్సహించింది.
"ఇంక పై చదువు నావల్ల కాదక్కా! రాత్రి పగలు పుస్తకాలు ముందేసుకుని కూర్చునే ఓపిక నాకు లేదు" అని తెగేసి చెప్పింది శాంత.
"మరేం చేద్దామని నీ ఉద్దేశం?" జానకి ప్రశ్నించింది.
"ఏదైనా ఉద్యోగం చేస్తాను."
"ఈ రోజుల్లో బి.ఎస్సి పాసైనా మంచి ఉద్యోగాలు దొరకడం కష్టం శాంతా! ఏమ్.ఎస్ సి. అయితే ఏ కాలేజీ లో నైనా లెక్చరర్ గా ప్రవేశించవచ్చు."
"నీపాటి అందం, తెలివితేటలు ఉన్నవాళ్ళకి ఉద్యోగాలు సులువుగానే దొరుకుతాయి ,శాంతా" అన్నాడు గోవిందబాబు.
"తనకి తెలిసిన వాళ్ళతో మాట్లాడి ఏదో ఒకటి అయ్యేలా చూస్తారట." నమ్మకంగా అన్నది శాంత.
"ఒకరి బలవంతాన చదువులోకి దిగితే ఫలితం ఉండదు. శాంత ఇష్టప్రకారమే కానీ. ఉద్యోగం చేసుకుంటూ దానికి తగిన వరుణ్ణి అదే చూసుకొని పెళ్ళి చేసుకొంటుంది. నీలా చివరంటా ఉద్యోగం పట్టుకు వేళ్ళాడేరకం కాదు శాంత. ఇంకా డబ్బు తగలేసి చదువు చెప్పించినా అంతే ఫలితం" అన్నాడు ప్రకాశం.
"మీ శాంత ఉద్యోగం విషయం నేను చూస్తాను. మీకేం బెంగ వద్దు" అన్నాడు గోవిందబాబు.
రెండు, మూడు నెలలు తొందరగా దొర్లిపోయేయి. గోవిందబాబు శాంత ఉద్యోగ ప్రయత్నం శ్రద్దగా చేస్తున్నట్టు కనిపించలేదు జానకికి. అతను మాట మాత్రంగా అంటే సులువుగా వచ్చే రెండు మూడు ఉద్యోగాల్ని కావాలనే దాటించినట్లు అనిపించింది ఆమెకు.
"మీరు కాస్త శ్రద్ధ చూపితే అ ఉద్యోగం శాంతకి దొరికేది" అన్నది జానకి.
"అది శాంతకి తగిన ఉద్యోగం కాదు, జానకీ! పగలంతా ఆ లేబరేటరీ లో , ఆసిడ్ల మధ్య కునుకుపాట్లు పడుతూ శాంత కూర్చోలేదు. ఆమెకి అంతకన్న ఉత్సాహవంతమైన పని కావాలి. శాంతకి సరిపడే ఉద్యోగం కోసమే చూస్తున్నాను. తొందర్లోనే అది లభ్యం కావచ్చు" అన్నాడు గోవిందబాబు నిదానంగా.
"ఏదో, ఒకటి, గోవిందబాబూ! పని చెయ్యకుండా ఎవరు మాత్రం జీతమిస్తారు? చదువు, ఉద్యోగం లేక శాంత ఇలా తిరుగుతుండడం నాకు బాగు లేదు" అన్నది జానకి.
"అది సరే అనుకోండి. అయినా రెండు, మూడు వస్తువులు ఎదురుగా పెట్టి, ఏది కావాలో తీసుకో అంటే మనిషి క్షణకాలం యోచించి, తనకి మంచిదని తోచింది ఎంచుకొంటాడు. ఉన్నది ఒక్కటే అంటే ఏ ఆలోచనా ఉండదు" అన్నాడు.
గోవింద'
బాబు వల్ల ఈ పని అయ్యే సూచన లేదనే అభిప్రాయానికి వచ్చింది జానకి. కావాలని అతడు ఎందుకు వాయిదాలు వేస్తున్నాడో ఆమెకు అర్ధం కాలేదు. అనసూయమ్మ వల్ల ఏమైనా సహాయం దొరుకుతుందేమోనని అక్కడికి వెళ్ళింది. శాంత డబ్బు గణించి తన దోసిట్లో పోయ్యాలనే తాపత్రయం ఆమెకు లేదు. ఇలా పనీ పాటా లేకుండా తిరుగుతుంటే శాంత బుద్ది పెడతల బట్టి ఎటువైపు ఈడుస్తుందోనని ఆమె భయం. అక్క మనస్సులోంచి అనుమానం తొలగించేందుకు శాంత ఏవిధమైన ప్రయత్నం చెయ్యలేదు. చెల్లెలు మానసికంగా పెరిగే వరకూ, పని బాధ్యత అనే పలుపుతాళ్ళతో ఆమెను కట్టి ఉంచడం అవసరం అని జానకి అభిప్రాయం.
ఒక పని కోసం జానకి అనసూయమ్మ దగ్గరికి పొతే, ఇంకొక పని ఎదురయింది. అనసూయమ్మ భర్త తరపు బంధువుల ఇంట్లో ఏదో శుభకార్యం జరుగుతున్నాదిట ఆవిడకి వెళ్ళక తప్పని పరిస్థితి. అనసూయమ్మ ప్రత్యేకం వీలునామా రాయకుండా చనిపోతే ఆవిడ ఆస్తిలో కొద్ది భాగం ఆ దాయాదులకు చెందుతుంది. ఆ కారణాన వాళ్ళు అనసూయమ్మ దగ్గిర అభిమానం ఒలకబోస్తూ, "పెద్దవారు మీరు లేకుండా ఈ శుభకార్యం జరుగదు. తప్పక రావాలి" అని పట్టు పట్టేరు.
"నాకు సాయంగా నువ్వు రావాలి, జానకీ" అన్నాది ఆవిడ.
"వాళ్ళెవరో నాకు తెలియదు. అసలు ఇటువంటి శుభకార్యాలలో పాల్గొనే అలవాటు కూడా నాకు లేదు. కొత్తగా ఉంటుంది" అని తప్పించుకోబోయింది జానకి.
"నీకు తెలియక పోతేనేం? నాకు తెలుసుగా? నువ్వు నాతొ వస్తున్నావు. ఇంతకీ ఎన్ని రోజులని? రేపు బయలుదేరితే మూడో నాటికల్లా తిరిగి రామూ?" అన్నది ఆవిడ.
అనసూయమ్మ మాటకు లేదు, కాదు అని జవాబు చెప్పడం జానకి కి అలవాటు లేని పని. ఆ ప్రయాణం ఆమెకు తప్పనిసరి అయింది.
* * * *
అనసూయమ్మ అన్న విధంగానే మూడవ నాటి కల్లా తిరిగివచ్చేరు జానకీ, ఆవిడా. ఆవిడను ఇంటి దగ్గర విడిచి తన గది వైపు నడక సాగించింది జానకి. ముందు రోజు పడ్డ వర్షం వల్ల నేలంతా తడిగా ఉంది. తడి నేలలోంచి ఎండిన చోట్ల ఆవిర్లు పైకి వస్తున్నాయి. వర్షపు నీటితో దుమ్ము కడుక్కుపోయిన ఆకులు, పువ్వులు చక్కని రంగులతో కలకల్లాడుతున్నాయి. లేత మొక్కలు రెమ్మలు ఊపుకుంటూ గాలితో అట లాడుతున్నాయి.
కొంచెం సేపు తన్మయంగా ఇటు అటు చూస్తూ నిలిచిపోయింది జానకి. మోయలేనన్ని నగలతో , పట్టు చీరల బరబరలతో , రకరకాల పువ్వులు, సెంట్లు మిళితమై ఏర్పడిన ఘాటైన సువాసనలతో మత్తు మందులా ఉండే ఆ పెళ్ళి ఇల్లు వదిలి, ఈ ప్రకృతి మాత ఒడిలోకి తిరిగి రాగలిగినందుకు సంతృప్తిగా నిట్టూర్చింది. భగవంతుడు మనుష్యులకు ప్రసాదించిన ఈ వారానికి కృతజ్ఞత తెలుపుకొన్నది. కమ్మని ఊహలు కదులాడుతుండగా , ఇల్లు చేరింది జానకి.
ఇంట్లో శాంత లేదు. "చీకటి తోనే శాంతమ్మ గారు ఎక్కడికో వెళ్ళేరు. ఇంకా రాలేదు." అన్నాడు మొక్కలకు పాదు చేస్తున్న తోటమాలి.
"ఈ తాళం మీరోస్తే ఇమ్మన్నారు. "మొల్లోంచి తాళం తీసి అక్కడి గట్టు మీద పెట్టేడు.
తాళానికి అంటుకొన్న దుమ్ము దులుపుకొంటూ గుమ్మం దగ్గిరికి వెళ్ళి తలుపు తీసింది జానకి. ఇంట్లో ఎక్కడి కక్కడ గిన్నెలు, బట్టలు పోగు పెట్టబడి ఉన్నాయి. ఈరోజు బడలికతో తను వస్తున్నట్లు తెలిసి కూడా, ఆవిధంగా ఇంటిని వదిలి శాంత షికారు పోవడం జానకికి కష్టమనిపించింది. అభిమానం అన్నదిపుట్టుకకు రావాలి. ఒకరు చెబితే వచ్చేది కాదు-- అనుకొంది.
ఇల్లు, వాకిలి సరిచేసి, స్నానం చేసి కాఫీ పెట్టుకు తాగింది. అప్పటికి శాంత వచ్చిన జాడ లేదు. వీధి గుమ్మంలోకి వచ్చి ఫర్లాంగు దూరంలో ఉన్న మెయిన్ గేటు వైపు చూసింది. ఆ రోడ్డు పొడుగునా నిర్మానుష్యంగా ఉంది.
'శాంత ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? షికారుకు వెళ్ళినా ఈపాటికి తిరిగి రావాలే. గోవిందబాబు తో కబుర్లు చెబుతూ కాలం మరిచి పోయిందా? లేక ఇద్దరూ కలిసి ఇంకెక్కడికైనా వెళ్ళేరా?' ఆమెకు ఏదీ పాలుపోలేదు.
తోటమాలి ఇంకా ఆ పక్కపక్కనే పని చేస్తున్నాడు. అరటి స్థంబాలకు వాడి, వాలిపోయిన అరటాకులు చుట్ట బెడుతున్నాడు.
"మల్లయ్యా! శాంతతో ఇంకెవరైనా ఉన్నారా?" అని ప్రశ్నించింది.
"లేదమ్మా. చిన్నమ్మగారు ఒక్కరే వెళ్ళేరు" అన్నాడు వాడు.
ప్రకాశానికి ఏమైనా తెలుస్తుందేమో అనుకొన్నది జానకి. అతని పుస్తకాల కొట్టు పక్క ఉన్న బట్టల కొట్లో టెలిఫోను ఉన్నది. ఎప్పుడైనా అవసరం అయితే అక్కడి నుంచి మాట్లాడతాడు ప్రకాశం. జానకి కావాలన్నా ప్రకాశానికి కబురు అందజేస్తాడు. ఆ కొట్టు యాజమాని.
బట్టలు వేసుకొని ప్రకాశానికి ఫోను చెయ్యడానికి ఆఫీసుకు బయలుదేరింది జానకి.
"నాకు తెలియదే" అన్నాడు ప్రకాశం.
"నిన్న సాయంకాలం చీకటి పడేవరకు నేను మీ ఇంటి దగ్గరే ఉన్నాను. గోవిందబాబు కాని, శాంత కాని ఏమీ చెప్పలేదే? సరే, అనుకోకుండా వాళ్ళేదో ప్రోగ్రాం వేసుకొని ఉంటారు. గంటకో, గడియకో తిరిగి వస్తారు. మరేం కంగారు పడకు" అన్నాడు.
