Previous Page
మారిన విలువలు పేజి 44

 

    "శాంత తో పాటుగా గోవిందబాబు ఉన్నారా?" తిరిగి ప్రశ్నించేడు.
    "ఆ విషయం ఇంకా తెలియదు. నేనిప్పుడే ఊరు నుండి వచ్చెను" అన్నది జానకి.
    'అవును. శాంత చెప్పింది. ఏదో పెళ్ళికి వెళ్ళేవుట కదూ? నేను సాయంకాలం వస్తాను. శాంతతో గోవిందబాబు ఉన్నదీ, లేనిదీ తెలుసుకొని నాకు ఫోన్ చెయ్యి" అన్నాడు ప్రకాశం.
    జానకి తిన్నగా అనసూయమ్మ దగ్గిరకి వెళ్ళింది. ఆవిడా అప్పుడే తయారై చావిట్లోకి వచ్చింది.
    "ఏదో అర్జెంటు పని మీద గోవిందబాబు వారం రోజులు సెలవు పెట్టి ఇంటికి వెళ్ళేడు , జానకీ! ఇంక ఈ వారం రోజులూ పనంతా నువ్వే చూసుకోవాలి. అసలే అలసి పోయి ఉన్నావు. ఈరోజు పని సాధ్యమైనంత తొందరగా తెముల్చుకొని విశ్రాంతి తీసుకో" అన్నది ఆవిడ.
    "గోవిందబాబు కు తగిలిన అర్జెంటు పని ఏమిటా?' అని ఆలోచిస్తున్నది జానకి. గోవిందబాబు ఊరికి వెళితే శాంత ఎవరితో తిరుగుతున్నట్లు? మనస్సు తటపటాయిస్తూనే సంశయం వెల్లడించింది.
    "పద, జానకీ! పిల్లల్ని చూసి వద్దాం! నాలుగు రోజులై చూడలేదు." అంటూ దారి తీసింది అనసూయమ్మ.
    ఆవిడ చేతి కర్ర నీడను చూస్తూ నడక సాగించింది జానకి. ఆఫీసు గది దాటి పోతుంటే బంట్రోతు జానకి చేతిలో ఒక కవరు పెట్టేడు. "బాబుగారు మీకు ఇయ్యమన్నారు" అన్నాడు.
    జానకి ఆ కవరు ఇటు అటు తిప్పి చూసింది. మనుష్యులు ఎదుట పడి చెప్పుకోలేని అనేక విషయాలు ఉత్తరాల ద్వారా తెలియజేయడం తేలిక. తన ఉత్తరంలోని మాటల మీద నా అభిప్రాయం ఏర్పరచుకొందుకు వారం రోజులు గడువు అవసరం అనుకోని ఉంటారు గోవిందబాబు . అందుకే పని పేరు పెట్టుకొని వెళ్ళిపోయి ఉంటారు అనుకొంది.
    ఆమె ముఖం లోని భావ పరివర్తనాన్ని చూసి చిన్నగా నవ్వుకొంది అనసూయమ్మ. ఈసారి గోవిందబాబు వచ్చినప్పటి నుండి వారిద్దరిని గురించిన ఆలోచనలు జంటగానే అనసూయమ్మ మనస్సు లోకి వస్తుండేవి. చాలాసార్లు మనస్సు లో 'చక్కని జంట' అనుకొన్నది కూడా.
    సాయంకాలం వరకు ప్రశాంతంగా ఆ ఉత్తరం చదువుకొనే అవకాశమే లేకపోయింది జానకికి. ఆత్రత ఆమెను ఇంటి వరకు నడవ నియ్యలేదు. లాన్ కు పక్కగా నూరు వరహాలు చెట్టు మొదట్లో ఉన్న రాతి మీద కూర్చుని కవరు చించింది.
    క్షణ కాలం కళ్ళు మూసుకొని అందులోని భాష తన కందీయబోయే ఆనందాన్ని మననం చేసుకొంది. ఆ సమయంలో ఆమెకు శాంత గుర్తు రాలేదు. ఇంటికి తిరిగి వచ్చిందో, లేదో అనే ఆత్రత కలగలేదు. గోవిందబాబు ఊరులో లేరన్న సంగతి తెలిసేక ప్రకాశానికి ఫోను చెయ్యలేదనే మాట మనస్సులోకి రాలేదు.
    సుందరంగా సుళ్ళు తిరిగుతున్న ఆనందపు వెల్లువలో, అనురాగపు తెప్పలో తేలిపోతూ తనూ, పక్కన గోవిందబాబూ మధురంగా, లయబద్దంగా జీవితం గానం చేస్తుంటే, వింటూ, తన్మయవస్థలో మునిగి తేలుతూ......
    "ఊ.... ఇంక ఆలోచనలు కట్టి పెట్టు. అందులో ఏమి వ్రాసి ఉందొ చూడు." జానకి మనస్సు హెచ్చరించింది.
    "ఏముంటుంది? నా ప్రియమైన జానకీ! నీ ముందు ఈ మాట చెప్పడానికి సిగ్గుపడి....
    ఛీ.... గోవిందబాబు కు ఇంత సిగ్గేమిటి? ఈ మాట అయన నోటి మీదుగా వినాలని ఎంత కాలంగా ఎదురు చూస్తున్నాను౧ మగవాళ్ళు ఇటువంటి మాటల్ని తీయతీయగా చెప్పడం లో నేర్పరులంటారే? ఇంత ఆనందకరమైన మాట గోవిందబాబు ఈ నిర్జీవమయిన కాగితం ద్వారా అందజేసేరేం?"
    ఆలోచనల మధ్య చేతిలో కాగితం నలిగిపోయిన సంగతి జానకి గ్రహించలేదు . తన ఉద్రేకానికి సిగ్గుపడి కాగితాన్ని సాపు చేసింది. చదివే ముందు దాని వైపు క్షణ కాలం నిదానించి చూసింది. ప్రాణం లేని ఆ కాగితం ప్రాణినైన నన్ను ఎలా ఆడిస్తున్నది అనుకొన్నది.
    మొదటి మూడక్షరాల సంభోధన దగ్గిర క్షణ కాలం ఆలోచనా శూన్యంగా ఆమె చూపు నిలిచింది.
    "జానకీ!
    ఈ ఉత్తరం మొదట్లో నే నా స్వార్ధ పరిత్వానికి మిమ్మల్ని క్షమించమని కోరుతున్నాను. నా జీవితం కోసం మీ అనురాగాన్ని ఆటబొమ్మ లా చేసి అడుకోన్నందుకు నన్ను మన్నించమని మరోసారి ప్రార్ధిస్తున్నాను.
    మొదటిసారి బాలవిహార్ వదిలి వెళ్ళిపోయే ముందు నా మనస్సు లో యేవో ఆలోచనలు గజిబిజిగా అల్లుకొని ఉండేవి. మీ ఉత్తరం అందిన నాడు వాటిలో రూపంటూ ఏర్పడింది. నిండు మనస్సుతో మీ ఆహ్వానాన్ని అందుకొని మీరూపం మనస్సు నిండా నింపుకొంటూ వచ్చెను.
    శాంత మన ఇద్దరి మధ్య ఎప్పుడు ప్రవేశించిందో నాకు గుర్తు లేదు. మీ సోదరిగా పరిచయమైన శాంత చొరవగా ముందుకు తోసుకు వచ్చింది. అచిర కాలంలోనే ఏదో ఆకర్షణతో నన్ను, తన వైపు లాక్కుంది.
    నేను మందకొడిగా ఉంటే ఉత్సాహంతో ఉరకలు వేస్తూ కబుర్లు చెప్పేది. నా పిరికితనానికి ఎద్దేవా చేసి రెచ్చకోట్టేది. శాంత నా దగ్గర ఉన్నంత సేపూ నాలో జీవం తొణికిసలాడేది. పొంగి, పొంగి ఒడ్డును తాకుతున్న కెరటాలు, గట్టు నగల కల్మషాన్ని కడిగి శుభ్రం చేసినట్లు, శాంత తన ఉత్సాహపు నైజంతో నాలోని నిర్లిప్తత, స్తబ్ధత, తొలిగించింది. బహుశా బండబారిన ఈ మనస్సు కరిగించగల వేడి శాంత దగ్గిర నా కెక్కువగా లభ్యమై ఉంటుంది.
    చల్లని మీ ప్రేమ సదనం లో పురుషుడు తన్ను తాను మరిచి హాయిగా జీవితం పొడుగునా విశ్రమించగలడు. అలసట అన్న మాట ఎరగకుండా ఆనందంగా జీవించగలడు. కాని, శాంత ప్రేమ అందుకు వ్యతిరేకం. కాళ్ళ కింద మంటలు పెట్టి మనిషిని ముందుకు పరుగులు పెట్టిస్తుంది. వెనక్కు తిరిగి చూడకుండా 'ముందుకే పద' అని తొందర చేస్తుంది. నావంటి స్తబ్దుడికి , జీవితంలో ముందుకు పోయేందుకు అటువంటి సహచరి ఆవశ్యకం ఉన్నదనుకుంటాను.
    ముప్పయిఏళ్ళు పై బడ్డా ఇప్పటి వరకు నా జీవిత భాగస్వామి ని ఎంచుకోలేక పోయేనంటే, నేనెంత నిరాశావాదినో మీరు గ్రహించగలరనుకొంటాను. శాంత తన కలలతో నాలో ఆశలు పోసింది. తన కోర్కెలతో నా బతుకులో జీవం నింపింది.
    ఇదంతా నన్ను నేను సమర్ధించుకొందుకు వ్రాయలేదు. ఈ నిశ్చయం నాలుగు నెలలు ముందుగా నేను చేసుకోగలిగి ఉంటే ఎంతో సంతోషించేవాడిని. కాని, అలా జరగలేదు. మొన్నటివరకు నాకేమీ కావాలో నేను నిర్ణయించు కోలేక పోయాను. మీ ఇద్దరి మధ్య పడి సాలె వాడి మగ్గంలో కండె లా కొట్టుకోన్నాను.
    నాకు కావలసింది శాంత అని ఇప్పుడే తెలుసుకొన్నాను. శాంత మీ చెల్లెలు. ఆమె తప్పుల్ని మీరు ఇదివరలో క్షమించినట్లే ఇప్పుడూ మన్నించండి. మీ ఆశీర్వాదం మా ఇద్దరికీ కావాలి.
    మీరు ఇంట లేని సమయంలో మీ చెల్లెల్ని ఇలా తీసుకు పోవడం నాకు భావ్యం కాదు. శాంత తన మొదటి అనుభవాన్ని నాతో చెప్పింది. మీపట్ల నేనెంత అన్యాయం గా ప్రవర్తించినా శాంతను అటువంటి అగచాట్ల కు గురి చెయ్యను. నామీద ఆపాటి నమ్మకం మీకు ఉంటుందని భావిస్తాను. మీ ఆశీర్వాదం కోసం కొద్ది రోజులలోనే తిరిగి వస్తాము. మమ్మల్ని నిండు  మనస్సుతో మన్నిస్తారని ఆశిస్తూ ---

                                                                                     గోవిందబాబు"
`    కళ్ళనీళ్ళతో కాగితాన్ని మడత పెట్టబోయింది జానకి. కాగితానికి వెనక వైపున శాంత దస్తూరి కనపడింది.
    "అక్కా! పాలు పోసి పెంచినా పాము కాటు వేసి పోతుంది. నీ అభిమానంతో పెరిగి నీకే అన్యాయం చేస్తున్నాను. క్షమించమని అడిగేందుకు కాని, కోపగించుకోకని బతిమాలేందుకు కాని నాకు నోరు రావడం లేదు.
    నీ చెల్లెలి గుణం నీకు తెలియంది కాదు. నీ మంచితనం నాకు తెలియంది కాదు. అందుకే ఇంత బాధ.

                                                                                          శాంత."
    జానకి మెదడు మొద్దుబారింది. కంటి నీరు గడ్డ గట్టి పోయింది. ఒంటిలో తపన చల్లారి పోయింది. మనస్సులో ఆశలు ఎండి పోయేయి. మనిషిలో చలనం లేకుండా అలాగే కూర్చుంది.
    మూసిన కనురెప్పలు మూతలు పడే ఉన్నాయి. కణతల్ని నొక్కిపట్టుకొన్న చెయ్యి అక్కడే నిలిచిపోయింది. ఆవేశాన్ని అపుకొందుకు అదిమి పట్టిన పెదవులు అలాగే బిగుసుకు పోయేయి.
    చలనం లేని ఆమెలో అనిశ్చితంగా ఎక్కడో ప్రాణం కొట్టుకొంటున్నది. అందుకే ఆమె బతికి ఉంది. ఆమెలో జీవించాలనే కాంక్ష మిగిలి ఉంది. మనిషి కొట్టే ఎదురు దెబ్బలకు ఎదురుదేబ్బలకు ఒరిగి పోకూడదనే పౌరుషం ఉంది. ఏ ఆలంబన లేకపోయినా తమ మనిషి గా జీవించగలననే నమ్మకం ఉంది.
    అందుకే లేచింది. తడి ఆరిన కనుకొలకులు తుడుచుకోంది. చేతిలోని ఉత్తరాన్ని భద్రంగా మడిచి బాగ్ లో  పెట్టుకుంది. నిదానంగా అడుగులు వేస్తూ ఇంటి వైపు నడక సాగించింది. ఎదురుగా చౌకీదారు వచ్చేడు.
    "మీ కోసం ఎవరో బాబుగారు చాలాసేపై వచ్చి కూర్చున్నారు. మీరెంత కూ రాకపోతే, హాస్టలు లో ఉంటారంటే, అలా వెళ్ళేరు" అన్నాడు.
    తనకోసం ఎవరు వచ్చి ఉంటారు? ప్రకాశం అయితే చౌకీ దారుకు తెలుసు. అన్నయ్య కాని వచ్చేడా? అనుకొంది జానకి.
    చిన్న చిన్న జల్లులు పడితే వీధులు బురదగా ఉంటాయి. పెద్ద వాన నిలిచి కురిస్తే అదివరలో ఉన్న మాలిన్యం అంతా కడిగివేసి పోతుంది. ఆనాటి సంఘటనతో జానకి మనస్సు కడిగిన అద్దంలా ఉంది. అందులో తన రూపు చూసుకొని గర్వించింది జానకి.
    "భగవాన్! ఈపాటి ధైర్యస్తైర్యాలు నాకు అండగా నిల్పు. నా జీవితాన్ని నా చెప్పు చేతల్లో నడుపుకోగలిగిన స్తోమతు ఇయ్యి. అంతకన్నా నేనేం కోరడం లేదు. అనుకొంది.
    వేళకాని వేళ వచ్చిన జానకిని పిల్లలు చుట్టూ ముట్టేరు
`    'అక్కా! ఇప్పుడు వచ్చావెం? ఈరోజు మా దగ్గిర పడుకుంటావా?"
    "మాకు మంచి మంచి కధలు చెబుతావా?"
    "నన్ను నీ దగ్గర పడుకోనిస్తావా?"
    పిల్లల్ని అనురాగంతో దగ్గిరికి తీసుకోంది జానకి. ఆరోజు తనకు, వారికి చాలా దగ్గిర సామ్యం కనిపించింది ఆమెకు. వాళ్ళకు ఎవరూ లేరు. 'తనకు ఎవరూ లేరు' అనే భావన వచ్చింది ఆమె మనస్సులోకి.
    "ఊరికే మిమ్మల్ని అందర్నీ మరోసారి చూడాలనిపించి వచ్చానర్రా! ఒక్క క్షణం నన్ను వదలండి. నాకోసం ఎవరో వచ్చేరని చౌకీదారు చెప్పేడు. చూసి వస్తాను" అని పక్కగా విజిటర్స్ కోసం ఏర్పాటు చేసిన గదిలోకి వెళ్ళింది.
    ఆమె కొంగు పట్టుకొని రైలు బండిలా ఒకరి తరవాత ఒకరు నడుస్తూ ముందుకు వెళ్ళేరు పిల్లలు. జానకమ్మ వస్తే పిల్లలు ఇంక విడిచి పెట్టరు -- అనుకొన్నది ఆయా వాళ్ళ ఆటలు చూసి.
    జానకి గదిలో అడుగు పెట్టింది. అక్కడ కూర్చున్న వ్యక్తీ లేచి నిలబడ్డాడు. ఇద్దరూ జ్ఞాపకాలను తవ్వుకుంటూ ఒకరినొకరు క్షణ కాలం చూసుకొన్నారు.
    అతడే ముందుగా మాట్లాడేడు.
    "నేను, రాజారావుని, ఈరోజు నేను వస్తున్నట్లు మీ అన్నగారు రాసిన ఉత్తరం అందిందనుకొంటాను" అన్నాడు.
    "నమస్కారం. కూర్చోండి. నాలుగు రోజులై నేను ఊళ్ళో లేను. ఈరోజు ఉదయం నుండి ఇంటికి వెళ్ళలేదు. ఉత్తరం వచ్చిందో లేదో నాకు తెలియదు" అన్నాది జానకి నిదానంగా.
    అతడు మాట్లాడలేదు.
    "ఇంతకీ మీరు వచ్చిన పని?"
    "నా భార్య పోయింది. ముగ్గురు పిల్లలు ఉన్నారు."
    "అవును. విన్నాను. చాలా దురదృష్టకరమైన వార్త." అన్నది జానకి సానుభూతి తో.
    "అమ్మా, నాన్నా పోయేరు. పిల్లల్ని పెంచుకు రావడం కష్టంగా ఉంది."
    "తండ్రి ఉండగా పిల్లల్ని బాలవిహార్ లో చేర్చుకొనే అలవాటు లేదు, రాజారావు గారూ! అందులో మీకు కావలసినంత డబ్బు ఉన్నది. అయాని పెట్టుకొని పెంచుకోగలరు" అన్నది జానకి నిశ్చలంగా.
    ఆమె మాటలు విన్న తక్షణం రాజారావు ముఖం కఠినంగా మారిపోయింది. అంతలో తను వచ్చిన పని గుర్తు చేసుకొని తేరుకొన్నాడు.
    "నా పిల్లల్ని మీ ఆశ్రమం లో చేర్పించడానికి నేను రాలేదు, జానకీ! నేను బతికి ఉండగా వాళ్ళకంత గతి పట్టనీయను. నేను నీ కోసమే వచ్చెను.
    "పెద్దవాళ్ళ పట్టుదలల మూలంగా ఆవాంచిత పరిస్థితుల్లో ఇద్దరం విడిపోయాం. ఈనాడు ఆ పెద్ద వాళ్ళు లేరు. ఆనాటి దుడుకుతనం, ఉడుకు రక్తం మనలో కూడా తగ్గిపోయింది. చేసిన తప్పు తప్పుగా వదిలివెయ్యడం కంటే, ఎప్పటికైనా దిద్దుకో గలిగితే మంచిదని నా అభిప్రాయం. మీ అమ్మగారు, అన్నయ్య నా అభిప్రాయాన్ని బలపరిచేరు. నీ నీతి, నిజాయితీ పట్ల నాకే మాత్రం అనుమానం లేదు. ఆనాటి నా మాటల్లో ఆవేశమే తప్ప అర్ధం లేదు.
    "నిన్ను తీసుకు వెళ్ళాలని వచ్చెను. తల్లి లేని నా పిలలకి తల్లివై , నా బ్రతుకు చక్కదిద్దుతావన్న ఆశతో వచ్చెను."
    "రాజారావుగారూ! మీకు ముగ్గురు పిల్లలు. మీ పిల్లల్ని మీరు పెంచుకోలేక నా సాయం కోరుతున్నారు. వీరంతా నా పిల్లలు. వీరి నెవరికి అప్పగించి రాను?"
    "ఈ ఉద్యోగాలు శాశ్వతం కావు, జానకీ! రేపు ఆవిడికి ఇష్టం లేకపోతె వెళ్ళి పొమ్మంటుంది. ఆడదాని బ్రతుక్కి  ఓ ఆలంబన ఉండాలి. లత లాటి స్త్రీ జీవితం అల్లుకుందికి బలమైన ఒక చెట్టుండాలి. నా మాట విని, నాతొ రా" అన్నాడు రాజారావు అనునయంగా.
    "క్షమించండి , రాజారావు గారూ! ఒక మానుకి అల్లుకొన్న లత ఆ మాను విరిగి పడితే నాశనం అయిపోతుంది. ఈ చిన్న చిన్న మొక్కలకు అల్లుకొన్న నా జీవనలత, ఎప్పుడూ పచ్చగా, ఏపుగా పెరుగుతూంటుంది. ఈ చిన్న మొక్కలు పెరిగి పెద్దవైనా , వాటి దిగువను చిన్న మొక్కలు ఎప్పుడూ పుట్టుకు వస్తూనే ఉంటాయి. నాకీ ఆలంబన చాలు. నాకీ జీవితం చాలు" అన్నాది జానకి నిశ్చలంగా.

                                 (సమాప్తం) 


 Previous Page

WRITERS
PUBLICATIONS