Previous Page Next Page 
డాళింగ్ పేజి 43

 

    ఏ మాత్రం ఆలస్యం చెయ్యలేదు విమల్. ఆ పిస్టల్ ని అందుకున్నాడు. సుజన్ మిత్ర గుండెలకు సూటిగా గురిపెట్టి , ఎదురుగా నిల్చున్నాడు, విమల్ ని పట్టుకోవటానికి , అక్కడ కొచ్చిన అనుచరులు భయంతో ఆగిపోయారు.
    "మర్యాదగా మాధురిని వదులు, లేకపోతే నువ్వూ నీ అనుచరులిద్దరూ చస్తారు."
    సుజన్ మిత్ర, చెమట్లు కారుతున్న, విమల్ ముఖం వేపు చూసాడు.
    విమల్ ముఖంలో కనిపించిన క్రోర్యం, ట్రిగ్గర్ మీద అతని చేయి చూసి ఏం చెయ్యాలో తోచలేదు సుజన్ మిత్రకు.
    రెండే రెండు క్షణాలు......
    మాధురిని వదిలేశాడు......మరుక్షణం మాధురి విమల్ దగ్గర కొచ్చేసి, విమల్ ని పట్టుకుంది భయంగా.
    "చూడు మాధురి ....నిన్నెలా నా దగ్గరకు రప్పించుకోవాలో నాకు తెలుసు.......నీకు తెలీని ఇంకో విషయం నువ్వు ఎవర్నయితే పెళ్ళాడాలని చూస్తున్నావో......విమల్ .....ఆ విమల్ కు ఎప్పుడో పెళ్లయింది.....ఇది ఎందుకు చెప్తున్నానంటే తెలివైనదానివి కదా.......ఆలోచించుకుంటావని."
    నుదుట మీద చెమటని కర్చీఫ్ తో అడ్డుకుంటూ, సీరియస్ గా విమల్ ముఖంలోకి చూసి, విషపు నవ్వు నవ్వి, వెళ్ళిపోయాడు.
    అతని వెనకే అతని అనుచరులిద్దరూ బయటికి నడిచారు.
    అస్పష్టపు వెలుతురు నిండిన లాన్ లో ఇద్దరే మిగిలారు.
    విమల్.......
    విమల్ కెదురుగా మాధురి.
    సుజన్ మిత్ర వెళ్ళిపోతూ ప్రయోగించిన ఆఖరి అస్త్రం దెబ్బ ఇద్దరికీ తగిలింది.
    తన గురించి తన భార్య పిల్లల గురించి, వాళ్ళు అమెరికాలో వున్న విషయం సుజన్ మిత్రకు ఎలా తెలుసు!
    అంతెత్తు శిఖరమ్మీద నుంచి లోయలోకి పడిపోయినట్లు అయిపొయింది విమల్ మానసిక పరిస్థితి.
    ప్రేమ పేరుతొ తనని వంచించడానికి చూసాడా విమల్! భార్య దూరంగా వున్న సమయంలో, అవసరానికి తనను ఉపయోగించుకుని, తన జీవితంతో ఆడుకోవడానికి చూసాడా విమల్.
    అంత అమాయకంగా , అంత సున్నితంగా కన్పించే విమల్ వెనక కన్పించని ఇంతటి రాక్షసత్వం ఉందా? ఇద్దరి మధ్యా.
    అయిదు అడుగుల దూరం.
    అయినా ఏదో పెద్ద అడ్డు గోడ.
    ఏదో మాట్లాదబోయాడు విమల్. గొంతులోంచి మాటలు బయటకు రావడం లేదు.
    తలెత్తి ఒకసారి చూసి గబుక్కున వెనక్కి తిరిగింది మాధురి.
    "మాధురీ." వెళ్ళిపోతున్న మాధురుని పిలిచాడు విమల్.
    అప్పటికే పరుగున ముందుకెళ్ళిపోయింది.
    పరుగు పరుగున ముందుకెళ్ళాడు.
    "మాధురీ.......ఒక్క నిమిషం."
    గబుక్కున తలుపులు వేసేసింది.
    "మాధురీ......."
    మాధురీ........"
    మాధురీ....."
    పది నిమిషాల సేపు అక్కడే నిలబడ్డాడు.
    పోర్టికోలో లైట్ ఆరిపోయింది.
    చీకటిలో చీకటి ముద్దలా వున్నాడు. అతని కెందుకో పెను దుఃఖం వచ్చింది.
    కళ్ళంట జలజలమని కన్నీళ్ళోచ్చాయి.
    "మాధురీ........" పెనుకేక వేసాడు. ఆ చీకటి సమయంలో ఆ కేక ప్రతి ధ్వనించింది. ఆ శబ్దానికి నిద్రపోతున్న చెట్ల తొర్రల్లోని పక్షులు ఉలిక్కి పడ్డాయి.
    నెమ్మదిగా వెనక్కు తిరిగాడు విమల్.
    అదే సమయంలో -----
    తన బెడ్ రూమ్ లో , సోఫామీద నిస్త్రాణగా కూర్చుంది మాధురి.
    మాధురి కనుల నుండి జ్జారుతున్న కన్నీళ్ళు బుగ్గలమీద నుంచి బొట్లు, బొట్లుగా కారుతున్నాయి.
    ఒకింతసేపటికి-
    తన అనుమానాలపై తనకే అసహ్యం వేసింది మాధురికి.
    విమల్ ముమ్మాటికి అలాంటివాడు కాడు-------విమల్ కి పెళ్ళయింది.కృష్ణ నందన అనే నటిని పెళ్ళి చేసుకున్నాడు- ఆ తరువాత ఆమె సినిమాల్లో నటించటం మానేసింది - వాళ్ళకో బాబు కూడా పుట్టినట్లు తెలుసు తనకు - అంతవరకే తెలిసుంటే తను విమల్ పట్ల ఆకర్షితురాలయ్యేది కాదేమో.........
    కృష్ణ నందన తన తండ్రిని వదిలి న్యూయార్క్ నుంచి రావటానికి ఇష్టపడటంలేదని- కొడుకుని పంపించటానికి కూడా ఇష్టపడటం లేదని తెలుసు.......ఇవన్నీ ఎప్పుడో తెలుసు........కొత్తగా తెలిసింది మరొకటి ఉంది.
    కృష్ణ నందన ఏదో జబ్బుతో బాధ పడుతోందని - ఆమె రికవర్ కావటం సాధ్యం కాదని - జీవితాంతం పేషెంట్ గానే మిగిలిపోతుందని.
    ఆ పరిస్థితుల్లోనే సున్నిత మనస్కుడైన విమల్ పట్ల తను ఆకర్షితురాలైంది. అది క్రమేపి ఇష్టంగా, ప్రేమగా మారింది. విమల్ కి దూరంగా ఉండటం సాధ్యం కాలేదు.
    కాని.......విమల్ కి పెళ్లయింది తెలుసా అని సుజన్ మిత్ర అనగానే తను ఒక్కసారి డిప్రెషన్ కి గురయింది ........తీవ్రంగా కదిలిపోయింది........ఎందుకని........? విమల్ ని తను అమితంగా ప్రేమించబట్టా.........?ఏమో .......ఏది ఏమైనా విమల్ ముఖం మీద అలా తలుపు వేసి ఉండవలసింది కాదేమో........అమాయకమైన విమల్ ముఖం గుర్తుకు రాగానే ఒక్కసారి ఏడ్చేసింది మాధురి.


                                                         *    *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS