Previous Page Next Page 
డాళింగ్ పేజి 42

 

    వాళ్ళిద్దర్నీ అక్కడే ఉండమన్నట్లుగా సంజ్ఞ చేసి గదిలో కొచ్చాడు సుజన్ మిత్ర.
    విమల్ ని చూసి, రాని నవ్వుతో పలుకరించాడు. కుర్చీలో కూర్చుంటూ మాధురి వేపు చూసి, సిగరెట్ తీసి వెలిగించాడు.
    "నీతో కొంచెం ప్రైవేటుగా మాట్లాడాలి." పొగను వదులుతూ నెమ్మదిగా అన్నాడు.
    "ఐ థింక్ దిసీజ్ నాట్ ది టైమ్ టు డిస్ కస్. "కొంచెం వ్యంగ్యంగా అంది మాధురి.
    ఆ మాటకు కోపం వచ్చింది సుజన్ మిత్రకు.
    "నాకు తెలసు. చూడు మాధురీ........నేను శత్రువును కాను, పరాయి వాడ్ని కాను. బావని నీతో నేనెప్పుడైనా , ఎలాంటి సమయంలోనైనా మాట్లాడే హక్కు నాకుంది. నీకూ, నాకూ మన కుటుంబానికి ఏమీ కాని వాళ్ళే, నీతో ఇరవైనాలుగ్గంటలూ మాట్లాడుతుంటే, నేను మాట్లాడకూడదా" సోఫా మీద కూర్చున్న విమల్ వేపు అసహనంగా చూస్తూ అన్నాడు.
    సుజన్ మిత్ర మాటలకు అటు మాధురికి, ఇటు విమల్ కీ కోపం వచ్చింది తనేం అన్నా విమల్ రెచ్చిపోతాడు.
    "ఓ.కే. సుజన్. పద........డ్రాయింగ్ రూంలో కెళ్దాం." ముందుకడుగేస్తూ అంది.
    కదిలాడు సుజన్ మిత్ర.
    "చెప్పు, ఏం చెప్పాడానికోచ్చావో ." కోపంగా అంది మాధురి.
    "ఎర్లీ మార్నింగ్ ఫ్లయిట్ లో నేనెళ్ళిపోతున్నాను."
    "అయితే"
    "మీ డాడీతో మాట్లాడాను."
    "దేని గురించి?"
    "దేని గురించో ........నీకు తెలీదా. మన మారేజ్ గురించి. త్రీ ధర్టి ఫ్లయిట్. బీ రెడీ. అది చెప్పడాని కే వచ్చాను."
    ఆ సమయంలో సుజన్ మిత్ర మీద అసహ్యం వేసింది మాధురికి.
    "డాడీ ఓ.కే. అంటే సరిపోతుందా ఫస్ట్ పాయింట్. నా కిప్పుడే పెళ్ళి చేసుకోవాలని లేదు........రెండో పాయింట్. ఇప్పుడు నా చేతిలో వున్న పిక్చర్స్ ఫినిష్ చెయ్యాలి. ఆ తర్వాత ఆలోచిస్తాను."
    "ఆ పిక్చర్స్ నువ్వేం ఫినిష్ చెయ్యనవసరం లేదు. వాళ్ళు నీకెంత డబ్బిచ్చారో చెప్పు. రెట్టింపు పడేస్తాను. ఆ సినిమాలు చేసేది డబ్బు కోసమే కదా. మద్రాసు సినిమా ఇండస్ట్రీలో ఎంత డబ్బుందో , అంతకు రెట్టింపు వుంది నా దగ్గిర. చెక్ రాసిస్తాను. వాళ్ళ కిచ్చెయ్. మరో ఆలోచన పెట్టుకోకు." చాలా పొగరుగా అన్నాడు సుజన్ మిత్ర.
    "సారీ మిస్టర్ సుజన్. " కోపాన్ని అణుచుకుంటూ అంది మాధురి.
    "నువ్వంటే నా కిష్టం. ఐ లైవ్ యూ. నిన్నుప్పుడే బలవంతంగా తీసికెళ్ళి పోగలను. అది నా కిష్టం లేదు. ఎందుకంటె , నిన్ను నేను ప్రేమిస్తునన్ను కాబట్టి , ఐ నో మీ సినిమా ఫీల్డ్ లో ఎట్రాక్షన్స్ సహజం. నేను మద్రాసులో లాండ్ అవడంతోనే ఎన్నో గ్యాసిప్స్ న్యూస్ విన్నాను- అయినా నేనేం పట్టుంచుకోను......నాకు లేవా కనెక్షన్స్......నాకు లేరా గాళ్ ఫ్రెండ్స్ అలాగే నీకూ నీ బాయ్ ఫ్రెండ్స్. ఓ.కే. విమల్ ని నువ్వు ఇష్టపడుతున్నావో, ప్రేమిస్తున్నావో నాకు తెలీదు కానీ మీ ఇద్దరూ పెళ్ళి చేసుకోవాలన్నా పెళ్ళి చేసుకోలేరు."
    మాధురి వళ్ళు కుతకుత లాడిపోయింది.
    "ఐ సే యూ.......గెటౌట్." అరిచి, విసవిసా వెనక్కి తిరిగి వచ్చేస్తున్న మాధురి చెయ్యి పట్టుకున్నాడు సుజన్.
    ఆ చెయ్యిని విడిపించుకోడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది మాధురి.
    సుజన్ మిత్ర మాటలన్నీట్ని వింటున్న విమల్ లోన గదిలో ఉండలేకపోయాడు.
    బయటికొచ్చాడు.
    విసురుగా, సుజన్ మిత్ర చేతిని విరిసి కొట్టాడు.
    "మళ్ళీ మాధురిని ముట్టుకున్నావో, నీ మనుషులు నీ శవాన్ని తీసికెళ్ళాల్సి వస్తుంది........జాగ్రత్త....." కోపంతో ఊగిపోతూ అన్నాడు విమల్.
    "మిస్టర్ విమల్ .......ఇది మా ఫామిలీ వ్యవహారం.....నువ్వు మధ్యలోకి రాకు......మర్యాదగా చెప్తున్నాను. దిసీజ్ మై ఫస్ట్ అండ్ లాస్ట్  వార్నింగ్......." అంటూ విమల్ ని తోసుకుని ముందుకెళ్ళి మాధురి చేతిని పట్టుకుని , ముందుకి నడవబోయాడు సుజన్ మిత్ర.
    మరి వూరుకో దలచుకోలేదు విమల్.
    కుడిచేతి పిడికిలిని బిగించాడు. విసురుగా ముందుకెళ్ళి ఎడంచేత్తో సుజన్ మిత్ర కంఠం మ్మీద చెయ్యేసి, కుడిచేత్తో దవడ మీద పెదేలున కొట్టాడు.
    ఆ దెబ్బతో సుజన్ మిత్ర అల్లంత దూరాన పడ్డాడు.
    "ఒరేయ్........వీడ్ని పట్టుకుని కారులో పడేయండ్రా........" ఇద్దరి అనుచరుల వేపు చూస్తూ అరిచాడు మిత్రా.
    అనుచరిలిద్దరూ అప్పటికే రెడీ అయ్యారు. ఇద్దరూ ఒక్క ఉదుటున విమల్ మీద పడ్డారు.
    మాధురి పరిస్థితి గ్రహించింది. పోలీస్ స్టేషన్ కు ఫోన్ చెయ్యడానికి టెలిఫోన్ వేపు వెళుతున్న మాధురిని గబగబా వచ్చి పట్టుకుని, కిందకు లాక్కెళ్ళిపోతున్నాడు సుజన్ మిత్ర.
    "విమల్" గట్టిగా అరిచి, సుజన్ మిత్ర చేతుల్లోంచి విడిపించుకోడానికి శతవిధాల ప్రయత్నిస్తోంది మాధురి.
    ఇద్దరు దృడకాయులతో హొరాహోరీ పోరాడుతున్నాడు విమల్. వాళ్ళ నుంచి చాకచక్యంగా తప్పించుకుని, మెట్ల వేపు పరిగెత్తాడు . అప్పటికే మాధురిని బరబరా లాక్కుని ముందుకెళ్ళి పోతున్నాడు సుజన్ మిత్ర.
    హాల్ దాటి, మెయిన్ డోర్ దాటి . పోర్టికో దగ్గరి కొచ్చి సుజన్ మిత్ర కెదురుగా ఉగ్ర నరసింహంలా నిలబడ్డాడు విమల్. మరొక్క క్షణం సుజన్ మిత్ర మీద దూకటానికి సిద్ధమయ్యేవాడే -----
    కానీ -------
    సుజన్ మిత్ర చేతిలో -
    పిస్టల్ !
    "మర్యాదగా అడ్డు తప్పుకో .......లేకపోతే రేపు మీ సిన్మా ఫీల్డ్ కి శెలవొస్తుంది." అంత సీరియస్ లోనూ, జోక్ చేసాడు సుజన్ మిత్ర.
    అదే సమయంలో మాధురి, సుజన్ మిత్రను ఒక పక్కకు లాగడానికి ప్రయత్నం చెయ్యడంతో, విమల్ తన కాలి బూటుతో , సుజన్ మిత్రా డొక్కలో తన్నాడు. సుజన్ మిత్ర చేతిలోని పిస్టల్ ఎగిరి దూరంగా పడిపోయింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS