Previous Page Next Page 
వసుంధర కధలు -11 పేజి 41


    "ఎలా?"
    "అతడి చెల్లెల్నే అందు కుపయోగించుకో ఎలాగో మాయమాటలు చెప్పి ఆమెను లొంగదీసుకో పెళ్ళికి ముందే శారీరక సంబంధం యేర్పరచుకో అటుపైన పెళ్ళి చేసుకోనని అప్పుడు శ్రీహరి నువ్వు చెప్పినట్లు వింటాడు" అన్నాడు శోధన్.
    "అది సరేకానీ...." అన్నా డానందరావు అనుమానంగా-"ఈ పనికి నన్నే యెందుకెన్నుకున్నట్లు?"
    "ఎందుకేమిటి? నువ్వు శ్రీహరికి నచ్చావు...." అన్నాడు శోధన్ నవ్వుతూ.

                                     2

    ఆరంభంలోనే ఆనందరావు చిన్నపొరపాటు చేశాడు. అతడు శ్రీహరిని కలుసుకుని దేశాన్నేలే నాయకులు కూడా అవినీతికి లోనవుతున్న ఈ దేశంలో-సామాన్యులు నీతి, అవినీతి అంటూ ప్రాకులాడరాదని ఓ చిన్న ఉపన్యాస మిచ్చి-"నీకు నీతిపైన మోజుండవచ్చు కానీ నీ చెల్లెలి కోసం కొన్నాళ్ళు నాకు సహకరిస్తే నేను సుఖంగా జీవించడాని కవసరమైనంత డబ్బు సంపాదించుకుంటాను...." అని చెప్పాడు.
    దీనికి శ్రీహరి మండిపడలేదు. తాపీగానే అతడుచెప్పిన మాటలు ఆనందరావులో మంటలు పుట్టించాయి.
    దేశాన్నేలే నాయకులు స్వార్ధపరులు కావచ్చు. కానీ దేశం ముందుకు పోతూనే వుంది. మన మంచితనాన్నితరుల స్వార్ధానికి ముడిపెట్టకుండా వున్నంత కాలం-మనం దేశాన్ని వెనక్కు లాగడం లేదన్న తృప్తి వుంటుంది.
    నీతిగా బ్రతకడంలో వున్న తృప్తి-అవినీతికి లోనయ్యేవరకూ తెలియదు. ఒకసారి అవినీతికి లోనైన వాడు క్రమంగా అధఃపాతాళానికి పతనమై పోతాడు.
    ఒకసారి అవినీతికి పాల్పడి పదిలక్షలు సంపాదించుకున్నాక-తర్వాత మడికట్టుకుని కూర్చుందుకు వీలుపడదు చిన్న తప్పుతో ప్రారంభించినవాడు పెద్ద తప్పుతో అంతమవుతాడు.
    దీప్తిని వివాహం చేసుకునేవాడికి ధనకాంక్ష వుండకూడదు అందువల్ల చెల్లెలికోసం డబ్బు సంపాదించడమన్న ప్రసక్తి లేనేలేదు. ఏ రూపేణా అయితేనేం-ధన సంపాదన భార్యద్వారా సాధించ లనుకునేవాళ్ళంటే శ్రీహరికి అసహ్యం.
    అన్నిటికంటే ఆఖరున అతడు-"నువ్వంటే నా కభిమానముంది. ఎవరి మాటలో వినడంవల్ల నీ బుద్ది తప్పుదారులు తొక్కుతోంది తప్పితే స్వతహాగా నువ్వు మంచి వాడివి. అందుకే నిన్ను క్షమించాను. ఇంకొకసారిలాంటి ప్రసక్తి తెచ్చావంటే నిన్ను పోలీసుల కప్పగించగలను" అన్నాడు.
    ఆనందరావు బాగా దెబ్బతిన్నాడు. శోధన్ కు జరిగింది చెబితే-"నువ్వలా ఎందుకు చేశావు.....అతడికిప్పుడు నీ మీద అనుమానం కలిగిందంటే నిన్ను దరిదాపులక్కూడా రానివ్వడు..." అని మందలించాడు.
    శోధన్ సలహామేరకు ఆనందరావు శ్రీహరిని కలుసుకుని-"నువ్వెలాంటి  వాడివోనని పరీక్షించాను తప్పితే నాకు డబ్బుమీద వ్యామోహం లేదు. అన్నింటికీ మించి విలువయినది నీ స్నేహం. దాన్ని వదులుకోలేను...." అన్నాడు.
    శ్రీహరి నవ్వి -"నువ్వు నిజంగానే నన్ను పరీక్షించి వుంటావని నమ్ముతున్నాను ఒకవేళ అది అబద్దమే అయి నప్పటికీ-అప్పటి నీ ప్రవర్తనకు సిగ్గుపడి-ఆ అబద్దం చెప్పానని అనుకుంటున్నాను..." అన్నాడు.
    "చాలా తెలివైనవాడు...." అనుకున్నాడు ఆనందరావు.
    ఆ తర్వాతనుంచి అతడు పొరపాటున కూడా శ్రీహరి వద్ద అవినీతి ప్రస్తావన తీసుకుని రాలేదు. అతడట్నించి నరుక్కురావడం మొదలుపెట్టాడు.
    దీప్తికి ఆనందరావు నచ్చినట్లే వున్నాడు. ఆమె అతడితో ఎంతో ఉత్సాహంగా మాట్లాడేది. ఎంతసేపటికీ చిరాకుపడేది కాదు.
    ఇద్దరూ అప్పుడప్పుడు పార్కులకూ, నది ఒడ్డుకూ వెళ్ళివస్తూండేవారు  శ్రీహరి ఆమెక స్వేచ్చ నివ్వడమే కాక-"ఆడపిల్లను అదుపు చేయాలనుకోవడం-అవమానించడమే అవుతుంది..."అనేవాడు.
    ఏకాంతంలో వాళ్ళు ప్రణయం గురించి మాట్లాడుకునే వారుకాదు. దీప్తికి అన్నగారంటే ఆరాధన. అతడి గురించి యే మాటలు చెప్పినా ఆమె కళ్ళలో వెలుగు కనపడేది.
    "శ్రీహరి సామాన్యుడు కాడు. తలచుకుంటే అతడు బంగళాల్లో వుండగలడు. కార్లలో తిరగ్గలడు. దాసదాసీ జనాల సేవ లందుకోగలడు....కానీ అతడు నీతికి నిలబడి సామాన్య జీవితం గడుపుతున్నాడు...." అని మెచ్చుకున్నాడు ఆనందరావు.
    "మీరు చెప్పింది నిజమేకానీ ఈ మాటలు నా దగ్గరైతే అన్నారుకానీ అన్నయ్య దగ్గరనొద్దు...." అంది దీప్తి.
    "ఎందుకని?" అన్నాడు ఆనందరావాశ్చర్యంగా.
    "అవినీతిని గుర్తించాలి. శిక్షించాలి. అది అన్నయ్య అనుమతిస్తాడు. నీతిని పాటించడం సామాన్యుడికర్తవ్యం. నీతిని అభినందిస్తే అది నీతికే అవమానమంటాడన్నయ్య" అని-"మనిషి బ్రతకడానికి గాలి పీలుస్తాడు, దాహానికి నీళ్ళు తాగుతాడు. వాటిని మనం విశేషంగా చెప్పుకుంటున్నామా....నీతి విషయమూ అంతేనంటాడన్నయ్య...." అంది దీప్తి.
    ఆనందరావుకు మతిపోయినట్లయింది. ఆమె చెప్పే ప్రతిమాటా అతడిని అంతులేని నిరాశకు గురిచేస్తోంది. ఎలాంటి మనిషి దొరికాడు తనకు? అవతల లక్షల్లో ఆదాయం......ఇవతల శ్రీహరి....ఒక్క శ్రీహరి కారణంగా ఆ ఆదాయమంతా ఆగిపోతోంది.    
    "అవునవును....నాకు తట్టనేలేదు...." అన్నాడానందరావు.
    దీప్తిని సంపదలవైపూ, సౌఖ్యాలవైపూ మళ్ళించాలని అతడు చేసిన ప్రయతాలన్నీ వృథా అయ్యాయి.    
    చివరికతడు శోధన్ చెప్పిన ఆఖరి ఉపాయం ప్రయోగించాలనుకున్నాడు.
    
                                      3

    ఆ రోజు ఉన్నపళంగా ఆఫీసుకు సెలవుపెట్టి శ్రీహరి యింటికి వెళ్ళాడు ఆనందరావు.    
    అప్పుడు దీప్తి మాత్రమే యింట్లో వుంది. శ్రీహరి ఆఫీసుకు వెళ్ళాడు.
    "మీరా?" అంది దీప్తి ఆశ్చర్యంగా.
    "నీతో మాట్లాడాలని వచ్చాను...."
    "అర్జంటా?"
    "ఏం?" అన్నాడు ఆనందరావు.
    "ఏమీలేదు. అవతల స్నానానికన్ని ఏర్పాట్లూ చేసుకుని వచ్చాను మీరు కాసేపు కూర్చోగలరా?"
    "ష్యూర్...." అన్నాడు ఆనందరావు వుత్సాహంగా.
    అతడు ఇండియా టుడే మాగజైన్ చూస్తూ కూర్చున్నాడు. ఈలోగా దీప్తి స్నానం చేసి వచ్చింది.
    దీప్తి తలంటుకుని వచ్చింది. డ్రైయర్ తో ఆరబెట్టు కుందేమో జుత్తు పాయలు పాయలుగా విడి ఎగురతోంది. ఆమె జడ వేసుకోలేదు. వదులు వదులుగా వదిలేసింది. నుదుట ఎర్రని బొట్టు. లేత గులాబీరంగు చీర. అదేరంగు జాకెట్.....
    మనిషి దేవతలావుంది.
    "ఈ లోకంలో అందం ఆడదానిదే...." అనుకున్నాడు ఆనందరావామెను చూస్తూ.
    "చెప్పండి..." అందామె అతడి కెదురుగా కూర్చుని.
    "నువ్వంటే నాకెంతో యిష్టం...." అన్నాడు ఆనందరావు.
    "థాంక్స్!" అంది దీప్తి.
    "నేను నిన్ను ప్రేమిస్తున్నాను...." అన్నాడు ఆనందరావు.
    "థాంక్స్!" అంది దీప్తి.
    "ఉత్త థాంక్సేనా?"
    "మరేం చెప్పాలి...." అంది దీప్తి అమాయకంగా.
    "నేను నీ గురించిన నా అభిప్రాయాలు చెప్పాను. నువ్వూ నా గురించిన నీ అభిప్రాయాలు చెప్పాను. నువ్వూ నా గురించిన నీ అభిప్రాయాలు చెప్పాలి..." అన్నాడు ఆనందరావు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS