Previous Page Next Page 
శంఖారావం పేజి 41


    "ఒక్కటి కూడా నువ్వు చేయలేదు"
    'అవును "
    'అవుననడం కాదు. ఎందుకు చేయలేదో చెప్పాలి"
    "అమ్మ వద్దంది"
    'అమ్మకు చెప్పావా"
    "నువ్వు చెప్పిన పనులు చెప్పలేదు . అమ్మ ఉదయతోనే తిరగమంటోంది. నాకు వేరే పనులున్నయన్నాను. అమ్మ నన్ను ఇల్లు కదలవద్దని ఆదేశించింది. తనకు చెప్పకుండా ఏ పనీ చేయవద్దంది" అన్నాడు విశ్వనాద్.
    'అమ్మ వద్దంటే నేను చెప్పిన పనులు కూడా మానేస్తావా ?"
    "ఊ"
    "విస్సీ నీకు అమ్మ ఎక్కువా నేనేక్కువా ?"
    "అమ్మే ఎక్కువ..."
    వేదాంతం తెల్లబోయి అతడి వంక చూసి "నువ్వెవరివో  తెలిసే మాట్లాడుతున్నావా?" అన్నాడు.
    "నేను నేను కాకుండా పోయినంత మాత్రాన అమ్మ నాకు అమ్మ కాకుండా పోదు " అన్నాడు విశ్వనాద్.
    'అయితే అమ్మ చెబితే నువ్వు ఉదయను కూడా పెళ్ళి చేసుకుంటావా?"
    'ఊ"
    "అందువల్ల జరిగే దుష్పరిణామాలు నీకు తెలియవా?"
    "వాటితో నాకు నిమిత్తం లేదు...."
    "విస్సీ ,మొండిగా మాట్లాడకు --" అన్నాడు వేదాంతం.
    "నేనేం చేయను ?"
    'నువ్వు సాధించాల్సి కార్యక్రమాలెన్నో ఉన్నాయి. నువ్విలా అమ్మ మాటకు లోబడిపోతే మనమేం చేయగలం?" అన్నాడు వేదాంతం.
    "నేనేం చేయానో నువ్వే చెప్పు...."
    వేదాంతం అతడికి గనేయ్య వివరాలన్నీ చెప్పాడు.
    "సరిగ్గా నాలుగు రోజుల్లో ఆ గ్రామస్థులకు గనేయ్య పీడా విరగడ కావాలి "
    "కానీ అమ్మ వద్దంటే !"
    'అమ్మ వద్దనకుండా చూడు...."
    "నావల్ల కాదు . నువ్వే ఆ ఏర్పాటు చేయాలి"
    "విస్సీ -- నువ్వు నాకంటే తెలివైనవాడివి. సర్వశక్తుల్లోనూ నన్ను  మించినవాడివి. నీకు కానిది నాకు సాధ్య పడుతుందా ?"
    'అమ్మ నెదిరించడం తప్ప ఏమైనా చేయగలను..."
    వేదాంతం ముఖం గంభీరంగా అయిపొయింది. "తప్పదు ఇందుకేదో ఉపాయం నువ్వే ఆలోచించక తప్పదు'. నీకు అమ్మను మించినది కర్తవ్యం. సామాన్యుడికిలా నీశక్తిని దాచి పెట్టకు. వృధా చేసుకోకు...."
    విశ్వనాద్ ఆలోచనలో పడ్డాడు.
    "రేపుదయం నేనీ ఊరు వదలి వెడుతున్నాను. వారం రోజుల తర్వాత వస్తాను. నేను తిరిగి వచ్చేసరికి గనేయ్య బ్రతుకు బయటపడాలి. అమ్మ వద్దందని కుంటిసాకులు చెప్పకూడదు. నేను లేకుండానే నువ్వు అమ్మను నీ పనులకు ఒప్పించడం నేర్చుకుంటావనే నేనూరు వదిలి వెడుతున్నాను..."
    "నువ్వు వెళ్ళొద్దు...." అన్నాడు విశ్వనాద్.
    "ఏం?"
    "నువ్వు లేకపోతే నాకు భయం...."
    "భయపడకు. ఈ ఒక్కసారికీ ఇలా జరగనీ....అప్పుడే అమ్మతో నీ అంతట నువ్వే వ్యవహరించగల్గుతావు. అప్పుడే ఉదయను పెళ్ళి చేసుకోనని చెప్పే ధైర్యం నీకు వస్తుంది ."---
    విశ్వనాద్ ఆలోచిస్తూ "మనం వరుసగా నీ కార్యక్రమాలన్నీ అమలుజరపాలి. నేను ఉదయను పెళ్ళి చేసుకోకూడదు. ఈరెండింటికీ అమ్మ అభ్యంతర పెట్టకూడదు. అవునా?" అన్నాడు.
    "ఊ" అన్నాడు వేదాంతం ఉత్సాహంగా.
    "సాధిస్తాను....' అన్నాడు విశ్వనాద్.
    "థాంక్యూ విస్సీ" అన్నాడు వేదాంతం.
    "మరి మనం వెళ్ళి పడుకుందామా?" అన్నాడు విశ్వనాద్.
    "ఊ" అన్నాడు వేదాంతం.
    ఇద్దరూ పడక గదికి వెళ్ళారు.
    భూషణ్ పక్క ఖాళీగా ఉంది.
    విశ్వనాద్ కళ్ళు మూసుకున్నాడు.
    వేదాంతం కళ్ళు తెరిచే ఏదో ఆలోచిస్తున్నాడు.
    కాసేపటికతడి పక్కన ఎవరో నిలబడినట్లయింది. తలతిప్పి చూస్తె ఉదయ.
    ఆశ్చర్యపోతూనే "విస్సీ బావ పడుకున్నాడు" అన్నాడు వేదాంతం.
    "నేను నీకోసమే వచ్చాను" అంది ఉదయ.
    వేదాంతం లేచి కూర్చున్నాడు. అతడి కళ్ళు మెరిసాయి.
    "ఎందుకు" అన్నాడు.
    "నేను మీ సంభాషణంతా విన్నాను గది బైట నిలబడి" అందామె.
    "నువ్వు సిఐడి పని ప్రారంభించావన్నమాట"
    'ఆ అవసరం పడింది మరి" అంది ఉదయ.
    "ఉదయా నువ్వు విన్నది మర్చిపో. నన్ను తప్పుగా అర్ధం చేసుకోకు" అన్నాడు వేదాంతం.
    'నువ్వు విస్సీ బావను నాక్కాకుండా కావాలని చేస్తున్నావు. నువ్వలా వెళ్ళగానే అత్తను పురికొల్పి బావను నావాణ్ణి చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ నువ్విలా ఊరికి వెళ్ళగానే అత్తను పురికొల్పుతాను."
    "ఉదయ! నువ్వు పులి మీసాలతో ఆడుకుంటున్నావు" అన్నాడు వేదాంతం. అది బెదిరింపులా లేదు. అతడి గొంతు దీనంగా వుంది.
    "తలచుకుంటే నేను పులుల్ని కూడా పిల్లి పిల్లలా ఆడించగలను ' అంది ఉదయ. ఆమె గొంతులో అవేశముంది.
    "అది నీ భ్రమ ' అన్నాడు వేదాంతం.
    "భ్రమ కాదు . నీకిది నా ధనుష్టంకారం ' అంది ఉదయ.
    వేదాంతం మ్రాన్పడిపోయాడు.
    ఉదయ చరచరా అక్కణ్ణించి వెళ్ళిపోయింది.
    "ఇది దేనికి పరిణమిస్తుందో ' అనుకున్నాడు వేదాంతం.
    అయితే మర్నాడతడి ఊరు ప్రయాణం మానలేదు. తల్లి దీవెన కూడా తీసుకున్నాడు.
    "విదేశాల్లో వున్నంతకాలం తప్పలేదు. దేశానికి తిరిగొచ్చాక నన్ను వదిలి పోకండిరా. త్వరగా వచ్చేసేయి" అంది సీతమ్మ తడి కన్నులతో అతడికి వీడ్కోలు చెబుతూ.
    "నేనేం చేసినా నిన్ను సంతోషంగా వుంచడానికేనమ్మా. వారం రోజుల్లో తిరిగి వచ్చేస్తాగా" అన్నాడు వేదాంతం.
    అప్పుడు వేదాంతం సీతమ్మ పక్కనే వున్న ఉదయ వంక చూసాడు.
    ఆమె చూపుల్లో కసి వుంది.
  విశ్వనాద్ తన గదిలోనే ఉండిపోయాడు. వేదాంతానికి వీడ్కోలు చెప్పడానికి రాలేదతడు.                                        

                                      ***

    వేదాంతం హైదరాబాద్ వెళ్ళి ఓ హోటల్లో మకాం పెట్టాడు.
    అతడు జర్నలిస్టు పద్దతిలో చాలామందిని కలుసుకుని ప్రముఖుల గురించి పలువురి అభిప్రాయాలు సేకరించాడు.
    "ప్రజక్షేమాన్ని కొరేదేవరో ప్రజా వినాశనాన్ని కొరేదేవరో తెలియడం లేదు. మురహరి పద్దతిలో తమ గురించి వారే చెప్పుకుంటే తప్ప అసలు నిజాలు తెలియవు" అనుకున్నాడతను.
    బాగా ఆలోచించాక "కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి. రాష్ట్రపు దౌర్భాగ్యానికి కారణాలు తెలుసుకోవాలంటే ముఖ్యమంత్రి చేత పదిమందిలో అతడి భావాలు బయట పెట్టించాలి. తను పదవిలోని కెందుకొచ్చాడో? తను వాగ్దానాలు నెందుకని నిలుపుకోలేక పోతున్నాడు? అందులో తన పాత్ర ఎంత? కేంద్ర ప్రభుత్వం పాత్ర ఎంత? ప్రతిపక్షాల పాత్ర అన్న నిజానిజాలు అయన నోటి వెంటనే తెలుసుకోవడం మంచిది' అనుకున్నాడతడు'.
    ఈ విషయమై అతడు నగరంలోని కొందరు పత్రికా సంపాదకులతో మాట్లాడాడు.
    ఒక సంపాదకుడు 'ఇది చాలా బాగుంది. ఈ దెబ్బతో ముఖ్యమంత్రి ఆటకట్టవుతుంది అన్నాడు" మరో సంపాదకుడు 'పదవిలో వున్నవారు తప్పులు చేయడం తప్పనిసరి. వారి జోలికి  వెళ్ళడం మంచిది కాదు" అన్నాడు ఇంకో సంపదకుడైతే అలా జరుగుతుందేమోనని వాపోయాడు కూడా.
    ఒక సంపాదకుడు మాత్రం 'మంచివారైనా చేద్దవారైనా రాజకీయ నాయకులు ప్రజల మనుషులు. ప్రజలు వారి ఒప్పుల్ని గొప్పగా చెప్పుకుంటారు. తప్పుల్ని మన్నిస్తారు. దేశ నాయకుల చేత తప్పు లొప్పుకునేలా చేయడం వల్ల ప్రజల్లో అవాంచనీయమైన సంచలనం రేగుతుంది. వారు రెండు వర్గాలుగా విడిపోతారు. ఒకోసారి దేశ నాయకులు చెప్పే రహస్యాలు దేశ భద్రతకే భంగం కలిగించవచ్చు. అందువల్ల ఎవ్వరూ సరాసరి ముఖ్యమంత్రుల జోలికి వెళ్ళకూడదు. వారి మంత్రి వర్గంలో ఓ బలహీన వ్యక్తిని ఎన్నుకోవాలి. అతడి చేయ నిజం చెప్పించాలి. ఆ   నిజాలు దేశంలో సంచలనం కలిగిస్తాయి. నాటికి ముఖ్యమంత్రి బడులిచ్చుకోవాల్సి వుంటుంది. అదంత సులభం కాదు. అయినా రాజకీయ నాయకుల అసాధ్యాల్ని సాధ్యాలుగా మార్చగలరు. ఇందువల్ల ప్రయోజనమేమిటి అని నువ్వనుకోవచ్చు. ముఖ్యమంత్రికి గొప్ప హెచ్చరిక అవుతుంది. తప్పు చేయాలంటే భయ మేర్పడుతుంది" అన్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS