"భాస్కరం దగాకోరుతనంకన్నా తనకి శిక్ష ఏంకావాలి?" అని తలపోస్తూ తల్లి మాట లను విషపు గుళికలలా మింగుతూ వూరుకుంది పద్మావతి.
52
సురేఖకు తన తొందరపాటు తనకే విస్మయంగా తోచింది. ఒకవేళ "నాకేమేనా పిచ్చెత్తిందా?" అని ఆలోచించింది. తనేనా? దొడ్డమ్మను కాదని వచ్చేస్త? తనేనా? దొడ్డమ్మమాటకు ఎదురు చెపుత? ఎంత విపరీతమైన పని చేశాను?
"కాని ఎందుకు చేశాను? పద్మావతి కోసరమా? ఎందుకు పద్మావతికోసరం? దొడ్డమ్మ కన్నా పద్మావతి యెక్కువధా?..... ఇంతకీ నేనేం చేస్తున్నాను?"
సురేఖకు దుఃఖం వచ్చింది. తన మీదనే అన్ని ఆశలు పెట్టుకుని, తనకోసరమే అహంకారాన్ని ఫలవృక్షంలా పెంచుకున్న దొడ్డమ్మను కాదని తాను తల్లినీ తండ్రినీ సుఖపెడుతుందా? కాని "నాతరంకాదు....మరొకరిని ప్రేమించిన మనిషితో ఒక జీవితంపాటు సంసారమనే జైలుశిక్ష పడటంకన్నా ఇప్పుడే రైలుక్రింద పడటం మేలు" అనుకుంది.
సురేఖకు ఆలోచించినకొద్దీ మనసు భాస్కరం కోసరం పీకుతున్నదని తెహ్లిసిపోయింది. ఇన్నాళ్ళూ లేని బాధ, ఎడబాటు లాంటిది భాస్కరం గురించి తనలో కలగసాగింది. అరె! ఇక భాస్కరం అనే వ్యక్తి తనకు ఏమీ కాడా? అతనెక్కడో పద్మావతితో కాపురం చేస్తాడు..... పిల్లల్ని కంటాడు......సుఖపడతాడు..... అంతేనా? సురేఖ ఏ కోర్కె నైతే ఇన్నాళ్ళూ దాచుకున్నదో, తన సర్వశక్తులూ ధారపోసి వొక్కి పట్టుకున్నదో ఆ కోర్కెయే తల యెత్తుతున్నది. భాస్కరం పట్ల తనకు ఒక ఆత్మీయత ఉన్నది. అది ఫలానిది అని తాను తెలుసుకోక పోయినా ఇప్పుడు, గుండెలు దొలుస్తున్నది!
"హే భగవాన్! నన్ను చంపెయ్యకూడదూ?"
సురేఖకు 'ఆత్మ హత్య' మీద గౌరవంలేదు. నేను ఛస్తే నలుగురూ నాకు సానుభూతి చూపిస్తారు..... ఛీ! ఎందుకూ?" అనుకుంది.
"ఇతరులు చేసిన అవమానానికి, తమ బలహీనతకీ కూడా స్త్రీలు ఆత్మహత్యకు పూనుకోవడం సాంఘికమైన నేరంగా పరిగణించాలి" అని ఎన్నిసార్లో డిబేట్లలో వాదించి పేరు, బహుమానాలు గెల్చుకున్న సురేఖ- ఇప్పుడు తానే ఆత్మహత్య గురించి ఆలోచించడంతో లోపల లోపలే సిగ్గు పడిపోయింది.
సురేఖ బాదనంతా లోపలే అణుచుకుని తల్లిని నవ్వుతూ పలకరించింది కాని ఆవిడ కూతుర్ని ఇలా అనుకోకుండా చూడటంతో విస్తుపోయి "అరె! ఆవిడగారు సాధారణంగా నిన్ను ఉత్తరం రాసిగని రైలెక్కనివ్వదే.....ఇప్పుడెలా వెళ్ళనిచ్చిందే తల్లీ!" అంటూ సురేఖని ఆప్యాయంగా తల నిమిరి దగ్గరికి తీసుకుంది.
"నిన్ను, నాన్నగారినీ చూస్తానంటే వెళ్ళమంది దొడ్డమ్మ" సురేఖ బెరుకుగా చెప్పింది.
ఐతే సురేఖ తలలితో ఏ విషయమూ చెప్పడం పూర్తిగాకుండానే సురేఖ తండ్రి శ్యామలరావుగారు రొప్పుతూ వచ్చాడు.
వస్తూనే కూతుర్ని చూసి అంతలో కాస్త తమాయించుకుని భార్య అరుంధతమ్మకేసి తిరిగి "ఏం జరిగిందేమిటి?" అన్నాడు. అతని చేతిలోని తంతి కాయితం చూస్తూనే అరుంధతమ్మగారు కూడా అతణ్ణి ఆ ప్రశ్న వేద్దామనుకుంది.
"ఏం జరగడం ఏమిటండీ?...." అన్నది గాభరాపడుతూ.
"నిన్ను ఎవడు ఇలా వచ్చేయమన్నాడు?" ఈ సారి ఆయన కూతుర్నే గద్దించాడు. సురేఖ్ తల్లి వెనుకకు చేరింది. ఆవిడ భర్తను కాస్త అదమాయించింది.
"అసలు ఏం జరిగిందో చెప్పకుండా పిల్లదాన్ని కసురుతారెందుకు?"
"వదినె నన్ను వెంటనే అక్కడకు తగలడమని వైరిచ్చింది.... అంటే ఇది చెప్పకుండా బయలు దేరిందన్నమాట" అతని మాటలకు అరుంధతమ్మ గారు నోరు నొక్కుకుని "అవ్వ! అయితే అదే మేనా అపరాధమా? నా కూతురు దొంగతనం చేసిందా? దోచుకుందా?" అన్నది కసిగా. కాని శ్యామలరావుగారు చల్లబడలేదు. మండి పడ్డాడు.
సురేఖకు ఇక నిగ్రహం చాలలేదు.
"నేనే వచ్చేచానమ్మా! నాకు తను చేస్తానన్న పెళ్ళి ఇష్టంలేదూ "అనేసి అక్కణ్ణించి గబగబా వెళ్ళిపోయింది.
శ్యామలరావుగారు నడ్డి విరిగినట్లు కూలబడ్డాడు. అరుంధతమ్మగారు కూడా ఉత్సాహం తీసేసినట్లు పాలిపోయింది.
"ఏం కర్మ వచ్చిందండీ" అంది నోరు తడి చేసుకుని ఎట్టకేలకు.
"ఇక వదిన దీనికి చిలిగవ్వ ఇవ్వదు" నిరుత్సాహం నిరాశా, పడిపోయాడు శ్యామలరావుగారు.
"ఆఁ ఏదో పిల్లది...... తొందరపడ్డది నిక్షేపం లాంటి సమ్మంధమూ ఆస్తీ వదులుకుంటామా? నేను బోధపరుస్తాలెండి" అన్నది అరుంధతమ్మ.
"ముందు వంటవార్చి విస్తట్లో పడేయ్! నేనామె దగ్గరికి పోతాను. ఈ పాటికే ఆమె చిందులు తొక్కుతూ ఉంటుంది" అన్నాడు ధనమ్మ గారిని తల్చుకుని శ్యామలరావుగారు.
* * *
ధనమ్మగారికి సురేఖ ఎదరించిందన్న కోపం, తన మాట కాదన్నదే అన్న అహంకారమూ చల్లారిపోయి, ఆ పిల్ల ఎడబాటును సహించడం దుర్భరమై పోయింది. "కీడెంచిమేలెంచమన్నారు? ఇంతకీ ఈ పిల్ల వూరికే వెళ్ళిందా లేక....." అన్న అనుమానం ఆమెలో ఇంతై అంతై ఎదనంతా వ్యాపించి వ్యాకుల పరచసాగింది.
"తన హానీ; లోకనిందా! నేనే వెళ్తా నక్కడికి" అనుకుని ఆమె కూడా శ్యామలరావుకు తంతి ఇచ్చాను అతగాడు వస్తాదు అన్న మారు ఆలోచన కూడా లేకుండా గుడివాడ బయలుదేరిపోయింది.
అనుకోకుండా ఆమెను చూసిన అరుంధతమ్మకి ముచ్చెమటలు పోశాయి......
"వారు వారు మీ కోసరమే మధ్యాహ్నమే.....వెళ్ళారక్కయ్యా?" అన్నది.
"సురేఖ వచ్చిందా?" ధనమ్మగారు అరుంధతమ్మ ఆందోళనను గమనించనేనాలేదు.
"వచ్చిందే! అదో..... సురేఖా...." అంటూ ఆమె భయాందోళనలతో లోపలికి కేకవేసింది. అరుంధతమ్మగారికి మొదటినించి ధనమ్మగారంటేను ఆమె దర్పమంటేను కాదు గాని ఆమె దబ్బూ చూసి గౌరవం, భయం!
ధనమ్మగారి గుండెల్లో ఆరాటం తగ్గిందిగాని తను అనుకున్నట్లు కాక సురేఖ సురక్షితంగా ఇక్కడ ఉండటంతో మళ్ళీ అహంకారం విజ్రుంభించింది. రక్తపుపోటు పెరిగిపోయింది.
"పింజారీదానా! నా ఇల్లూ ఒళ్ళు నన్నూ అంతా హూనంహూనం చేసి..... ఇలా అమ్మా నాన్నా అంటూ పారిపోయొస్తావా?" అంటూ ఆమె విజ్రుంభించింది.
సురేఖ ఆమెను ఎలాగ వారించిన లాభంలేదని గ్రహించి అక్కడే చతికిలబడి ఏడవడం ప్రారంభించింది.
"పైగా ఏడుపు ఎందుకే?" దగ్గరిగా వచ్చి గట్టిగా అరిచింది ధనమ్మగారు.
"నీ ఆరోగ్యం మంచిదికాదు.......కేకలు వెయ్యకు దొడ్డమ్మా" అని మరింత వెక్కిళ్ళు మింగింది సురేఖ.
ధనమ్మగారు చల్లబడిపోయింది. "సరిలే! నా కర్మ ఇదంతా! ఏడవకు నేను దుక్కలాగా ఉన్నాను" అన్నది సురేఖ కనీళ్ళు కొంగుతో తుడిచి.
అరుంధతమ్మకు ఈ దృశ్యం కనులు కుట్టుకున్నా చేసేదిలేక నిలబడి పోయింది.
"కాస్త మా ఇద్దరికీ కాఫీ తేగలవా ఇల్లు గలావిడా!" తోడికోడల్ని కాస్త అధికార పూర్వకంగాను కాస్త వేళాకోళంగాను అడిగింది ధనమ్మగారు.
అరుంధతమ్మగారు మాటాడకుండా మూతి అటు తిప్పుకుని వంట ఇంట్లోకి వెళ్ళిపోయింది.
"దొడ్డమ్మా! నన్ను చంపేయి దొడ్డమ్మా!" అంది సురేఖ.
"ఛీ! నోర్ముయ్! నిన్నెందుకూ చంపడం -ఆస్తినంతా మఠాలకి రాసిపారేసి నేనే కాశీపోయి గంగలో దూకుతానంది" ధనమ్మగారు.
నేను కూడా నీతోనే వచ్చి ఆ గంగలో దూకకపోతే నీమీద ఒట్టేనం"ది సురేఖ గట్టిగా ధనమ్మగారు ఆవేశంగా సురేఖనోరు నొక్కింది. "ఛీ! సిగ్గు మాలిందానా! నోటి కొచ్చిన మాటల్లా అనకు" మని నొచ్చుకుంది.
"అవును దొడ్డమ్మా! నేను నీకు సేవచేస్తూ కాశీలో ఉండిపోతా" నంది సురేఖ.
"అంతేగాని నా మాట వినవ్?"
సురేఖకు దుఃఖంతోపాటు బాధకూడా కలిగింది.
"నన్ను ప్రేమించనివాణ్ణి కట్టుకోమని చంపడంకన్నా విషం ఇస్తేనే మేలు" అన్నది- లేచి గదిలోకి గబగబా వెళ్ళి మంచంమీద బోర్లపడుకుంది.
ధనమమగారు హతాశయై అలా కుప్పలా కూచుండి పోయింది. సుర్కేహ ఏడుస్తున్నదని ఆమెకు తెలుసు కాని ఆమె మెల్లిగా అహంకారాన్ని పట్టుదలను అణచుకోవాలి కదా?
సురేఖకు ధనమ్మగారి పట్టుదల రంపపుకొత్త గానే అయింది. తాను ఒప్పుకొనేటంత బలహీనత ఇవ్వకుండా కాపాడమని దైవాన్ని ప్రార్ధిస్తూ కన్నీరు కారుస్తున్నది సురేఖ.
"నేను భాస్కరాన్ని ప్రేమిస్తున్నాను గనుకనే నన్ను భాస్కరానికి దూరంగా, భాస్కరాన్ని పద్మావతికీ దగ్గరగా చెయ్యి దేవుడా!" అని పదేపదే మనస్పూర్తిగా వేడుకున్నది సురేఖ.
ధనమ్మగారు ఎట్టకేలకు తనలో తానె సమాధానపడి వచ్చి సురేఖ మంచంమీద కూచున్నది. కన్నీరింకిపోగా అలాగే పడున్నది సురేఖ.
"సురేఖా!" అన్నదామె తలమీద చెయ్యివేసి.
మాటాడ లేదు సురేఖ.
"ఏమే! తల్లీ!" అని గాభారాపడి సురేఖను ఒత్తిగిలించి మెడక్రింద చెయ్యి వేసింది ధనమ్మగారు.
తీవ్రమైన జ్వరంతో మూలుగుతున్నది సురేఖ.
ధనమ్మగారు సురేఖను గట్టిగా కౌగలించకుంది. "నేను నీకు నా కంఠంలో ప్రాణాలుండగా పెళ్ళి చెయ్యను సరేనా! లే! నన్ను ఇలా ముక్కలు ముక్కలుగా చిత్రవధ చెయ్యకు" మన్నది సురేఖ మరుగుతున్న బుగ్గలను ముద్దుపెట్టుకుని. సురేఖ ఆ మాటలు విన్నదో లేదో తెలియదు గాని ధనమ్మగారి చేతులు మాత్రం తన గుండెలమీద నుంచి తీసుకోనివ్వలేదు. అంత జ్వరం తీవ్రత లోనూ ఆమె రెండు చేతులను రొమ్ము కదుముకుంది.
ధనమ్మ సాధ్యమైనంత నెమ్మదిగా గదిలో నించి బయటకు కేకేసింది.
"అరుంధతీ! ఎవరినేనా పంపించి వెంటనే డాక్టర్ ను పిలూ! పిల్ల ఒళ్ళు కాగిపోతోందీ!" -
53
భాస్కరం తన చాతకానితనానికి పదేపదే నిందించుకున్నాడు. రాఘవేంద్రంగారు మరోసారి హెచ్చరించి వెళ్ళిపోవడంతో భాస్కరానికి పూర్తిగా తెలివివచ్చింది. మూర్తి దగ్గరికి పరిగెత్తాడు. "మూర్తీ! ఇక నేను బ్రతకలేను...... ఏదో ఒకటి మనం వెంటనే చెయ్యాలి" అన్నాడు.
మిత్రులిద్దరూ కూలబడ్డారు. గంటల తరబడి ఆలోచించారు-సామాజికమూ అనుకున్న సమస్య అంతా సంసారికమైనదన్న విషయం తేలిపోయింది.
"ధనమ్మగారు సురేఖ శ్రేయస్సు కోరుతున్నది. జానికమ్మగారు భాస్కరం సుఖాన్నే ఆశిస్తున్నది. జయమ్మగారు ఏమనుకుంటున్నదో తెలియదు గాని పద్మావతి మాత్రం భాస్కరాన్ని దగాకోరు అనుకుంటున్నది. సురేఖ పద్మావతి కోసరం వసంత కాపురం కోసరం ధనమ్మగారికి కోపం తెప్పించ డానికి పూనుకున్నది" అన్న విషయాలు తేలాయి మిత్రులిద్దరి చర్చవల్లా.
"పిన్నిని నేను ఆ తర్వాత ఎలాగో ఒప్పించుకుంటాను. ముందు ఈ రాఘవేంద్రం "జాకాల్" సంగతి ఏం చెయ్యడం? పైగా వీడు నేను నా సవతి చెల్లెలి మీద ఈర్ష్య కొద్దీ ఇదంతా చేస్తున్నాననికూడా వాదిస్తున్నాడే?" అని భాస్కరం దిగులుపడ్డాడు. వసంత నా చెల్లెమ్మరా? ఆ రాస్కెల్ దాన్ని బాధపెడతాడెమోరా!" అని బాధపడ్డాడు.
మూర్తి అన్నాడు "మనుషుల పిరికి తనం మనసుల బలహీనహా రెండూ ఉపేక్షించడం లోనే పెరిగి పెద్ద వవుతాయి భాస్కరా?- అంచాత మనం ముకుందరావును పట్టుకుని వసంత నతగాడు ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసుకోవాలి....అతను కూడా నీవు పద్మావతి విషయంలో అవలంబించిన పంధానే వసంత విషయంలో అనుసరించ మన్నాడో....."
భాస్కరానికి మూర్తి మాటలు శూలాల్లాగ గుచ్చుకున్నాయి. విలవిలలాడుతూ "నన్ను చావనీ బ్రదర్! నీ సలహా వద్దూ ఏమీ వద్దు....." అంటూ అటు మొహం తిప్పేసుకున్నాడు.
మూర్తి కూడా నాలిక్కర్చుకుని "చూడు భాస్కరం! మనం పరిస్థితులను తూచి ఆలోచించి నిర్ణయిస్తున్నాం ఇక్కడ దెప్పి పొడుపు కోసరం కాదు నేను ఈ మాటలను అనడం.... కేవలం నొప్పించక తానొవ్వక పద్ధతిలో పద్మావతినీ వసంతనూ అందరినీ సుఖపెడదామనేగా....." అన్నాడు.
"సరే! ముకుందరావుతో అన్నీ చెప్పి నీ ఇల్లు వేలం అయినా నువ్వేం నొచ్చుకోవుకదా? అని అడుగుదామంటావు?" భాస్కరం ఆదుర్దాగా అడిగాడు.
మూర్తి జుట్టు పీక్కున్నాడు. నుదురు గోక్కున్నాడు. "మరి ఎలారా?" అన్నాడు.
చివరికి భాస్కరమే ఒక నిర్ణయానికి వచ్చాడు. "ముకుందరావుని వెళ్ళి అడిగివస్తాను......." అన్నాడు. అని మళ్ళీ మరో ఆలోచనగా.....
"మరి ఐదువేల రూపాయలు ఎవరు ఇస్తారు? ప్రస్తుతం..... పోనీ నాన్నగారికి చెప్పి మా ఇల్లు తాకట్టు పెట్టిస్తే - ఆ అయిదువేలో ఆరోవేలో ధనమ్మ మొహాన పారేయొచ్చును...." అన్నాడు.
"కాని...... కాని..." మూర్హి మరేమీ అనలేక పోయాడు. "సరే" నన్నాడు.
భాస్కరం నేరుగా ప్రొఫెసర్ గారింటికి వెళ్ళి శలవు చెప్పేస్తానన్నాడు. మూర్తి మాత్రం "వీల్లేదు పద్మావతికి ఈ కధంతా చెప్పు..... లేక పోతే ఆమె...." అంటూ భయం వ్యక్త పరిచాడు.
భాస్కరం గుండె ఝల్లు మంది. "కాని! మూర్తీ! పద్మావతి కిదంతా తెలుస్తే నన్ను మళ్ళీ మొహం చూపెట్టకు మంటుందిరా?" అన్నాడు.
మూర్తి స్తంభించి పోయాడు. రెండుక్షణాలాలోచించాడు- "అంతే నంటావా?" అన్నాడు.
"అంతే ననుకుంటాను..... తనను చేపట్టడంలో ఇన్ని చిక్కులున్నాయి అని తెలిస్తే నా పద్మ నాకు దక్కుతుందంటావా? నాకు మొదట్నించి లేనిదీ ఈ ధైర్యమే" నన్నాడు భాస్కరం.
"సరే! నువ్వు ముకుందరావుతో ప్రస్తావించు లేదా మీ నాన్నగారితోనే ఈ విషయం చెప్పు.... నేను శైలజకు విషయమంతా చెప్తాను పద్మావతికి తను చెబుతుంది" అన్నాడు మూర్తి.
"పద్మావతి నన్ను పూర్తిగా అపార్ధం చేసుకుంది మూర్తీ!" భాస్కరం బాధగా మూలిగాడు. "నేను దగాకోరు ననిపించుకొని బ్రతకడం నాతరం కాదురా! నేను దగాకోరునికాదురా?".....
"సరే! ఇప్పుడేమని ఏం లాభం! ....... నువ్వు ఒక ఆడపిల్లను మోసం చేసేవని నిన్ను తెలిసిన వాళ్ళం మేం అనుకోవడం లేదుగా" అంటూ మూర్తి వెళ్ళిపోయాడు.
భాస్కరానికి ఎంత కాదనుకున్నా బ్రతుకు మీద విరక్తి కలిగింది. "పద్మావతి ఈపాటికి ఏమేనా కానిపని తలపెట్టలేదుకదా?" అనే అనుమానం కూడా గుండెలు కెలికింది.
ఎటు వెళ్తున్నాడో తెలియనంత పరాకుగా రూమ్ కేసి వెళ్తున్న భాస్కరాన్ని పోస్టుమాన్ "సార్! సార్!" అని ఆదుర్దాగా పిలిచాడు.
భాస్కరం ఉలిక్కిపడ్డాడు.
"వైర్ సార్?" అన్నాడు సంతకానికి కాగితం పెన్సిలూ అందిస్తూ పోస్టుమాన్.
భాస్కరం చేతులు వణికాయి.
"తంతి" యివ్వగానే తనను తాను నమ్మలేకపోయాడు. కాళ్ళు నేలలోకి కృంగిపోతున్నట్లుంది. పిన్నికి "సీరియస్"గా ఉందన్న మాట చదవగల దైర్యం లేదతనికి.
ఎవరేనా పట్టుకోకపోతే "పడిపోతా ననిపించింది"-
"పిన్ని..... పిన్ని...." గుండెలు పీకింది.
రూమ్ కి పరిగెత్తాడు- "మా పిన్నికి బాగోలేదు నే వెళ్తున్నా"నన్నాడు కనిపించిన రెండు మూడు దుస్తులు అక్కడే పడి ఉన్న సంచీలో కుక్కుకుని బయటికి పరిగెత్తాడు.
"సారీ!" అంటూ అతని రూమ్మేటు కూడా ఇవతలికి వచ్చి "పద! నేను దిగబెడతాను స్టేషన్ కు మరేం కంగారవకు..... అంతా బాగుంటుంది..... ఎవ్వరి థింక్ విల్ బీ ఆల్ రైట్" అంటూ భాస్కరం చెయ్యి పట్టుకున్నాడు.
భాస్కరం మాట్లాడలేదు. రైలు ఎక్కాడో కూడా తెలియదు. మిత్రుడేమన్నాడో వినలేదు....మనసంతా పిన్ని దగ్గరికే వెళ్ళిపోయింది శరీరం మాత్రం రైల్లో ఆందోళన పడుతున్నది.
"పిన్ని లేకపోతే ఇక నా జీవితం ఎందుకూ? పిన్ని నన్ను పెంచింది నన్ను మనిషిని చేసింది. కాని ఇంకా నావల్ల తను నేను ప్రయోజకున్నయ్యా ననే సుఖం పొందలేదు. ఆమె....ఆమెను నానుంచి దూరం చేయడానికి ఎవరికీ హక్కులేదు." అంటూ ఆక్రోశిస్తూనే ఉందతని హృదయం.
రైలు ఎంత వేగంగా పరిగెడుతున్నా రెండు వందల మైళ్ళ దూర, కొన్ని యుగాల దూరంగా తోచింది భాస్కరానికి...... ఎందుకో ఆందోళన అధైర్యం వూరు దగ్గర పడుతున్నకొద్దీ ఎక్కువయ్యాయి.
రెండు మూడుసార్లు "వైరు"తీసి చూసుకున్నాడు. తనకు కాని చిత్త చాంచల్యం కలిగి ఇలా వెళ్తున్నాడా? లేక నిజంగా తన పిన్నికి అంత జబ్బుగా ఉందా?.... అనిపిస్తోంది.
"వీల్లేదు పిన్నీ వీల్లేదు పిన్నీ, నన్ను నన్ను అన్యాయం చెయ్యకు పిన్నీ....."
