Previous Page Next Page 
వసుంధర కధలు -11 పేజి 40


                               విలువైన క్షణాలు

    ఆనందరావు చిరుద్యోగి అతడింకా పెళ్ళి చేసుకోలేదు.
    సంబంధాలు చాలా వస్తున్నాయి కానీ అతడే అంగీకరించడంలేదు. అలాగని అతడు పెళ్ళికి విముఖుడూ కాదు వైవాహిక జీవితం గురించి అతడికెన్నో కలలున్నాయి. ఆ కలలన్నీ తీరాలంటే డబ్బు కావాలి. ఆ డబ్బు సంపాదించడం కోసం ఏమైనా చేయాలని అతడనుకుంటున్న సందర్భంలో శ్రీహరి పరిచయం జరిగింది.
    శ్రీహరికో అందమైన చెల్లెలుంది. ఆమె పేరు దీప్తి. ఆమె శ్రీహరికి ప్రాణం.
    శీహరికీ ఆనందరావుజీ బస్ స్టాపులో పరిచయమైంది. శ్రీహరి కూడా తనవంటి చిరుద్యోగేనని తెలిసేక ఆనందరావు కతడంటే మరింత ఆకర్షణ పెరిగింది.
    శ్రీహరికి చెల్లెలు తప్ప యెవ్వరూ లేరు. ఆమెకు పెళ్ళి చేశాక తను చేసుకోవాలనుకుంటున్నాడు. సహృదయుడు, సంస్కారి అయిన యువకుడి కోసం శ్రీహరి వెతుకుతున్నాడు. అతడికి ఆనందరావు నచ్చాడు.
    "నా చెల్లెల్ని పెళ్ళి చేసుకోకూడదూ?" అన్నాడోరోజున శ్రీహరి.
    అప్ప్దుడానందరావు పెళ్ళి గురించిన తన ఆశలూ, ఆశయాలూ చెప్పాడు.
    శ్రీహరి నవ్వి-"షాపులో అద్దాల వెనుకనున్న మిఠాయిలను చూసి అవి తినని జన్మ వ్యర్ధమని భావించి ఇంట్లోపచ్చడి మెతుకులు తినలేకపోవడం దురదృష్టం రోజూ మిఠాయిలు తినేవాడికి ఎప్పుడైనా తింటే పచ్చడిమెతుకులు అమృతంగా వుంటాయి. తినడానికి రుచికి మించి ప్రధాన మైనది ఆకలి. అలాగే బ్రతకడానికీ సుఖపడ్డానికీ డబ్బొక్కటే ప్రధానం కాదు అవకాశం, అదృష్టం ఉండాలి" అన్నాడు.
    ఆనందరావుకి అర్ధంకాలేదు. శ్రీహరి వివరించాడు.
    ప్రతి మనిషికీ కనీసావసరాలు తిండి, బట్ట, నీడ, ఆకలి నుంచి రక్షించేటంత తిండి, మానాన్ని కాపాడ్డానికి సరిపడబట్ట, ఎండవానల్నించి కాపాడగల యిల్లు వుంటే చాలు- మిగతా జీవితం సుఖంగా బ్రతికేయొచ్చు. జీవితంలో కనీసావసరాలను మించి అవసరమైనది ప్రేమ. ఇచ్చి పుచ్చుకోవడంలో ప్రేమను మించి యేదీ తృప్తినివ్వలేదు. డబ్బు యితర సుఖాలనెన్నిటినో యిస్తుంది కానీ అందుకు ప్రేమ గురించి వెచ్చించాల్సిన ముఖ్యమైన కాలం వెచ్చించాలి డబ్బు సంపాదించేవాడికి ప్రేమించే సమయముండదు. ఉన్నదానితో సరిపెట్టుకునేవాడికే ఆ అవకాశం.
    "అటుపైన మంచి యిల్లాలు దొరకడం అదృష్టం. భర్తతో కలిసి తిరగడం లోనూ, అతడితో ఏకాంతంలోనూ ఆనందం పొందగల ఇల్లాలు భర్తకు వరం. చాలామంది చీరలనో, నగలనో భర్తను వేధించడం తప్ప-సమక్షమాధురి ననుభవించలేరు. నా చెల్లెలు నన్ను నగలడగదు. బట్టలడగదు. అటువంటి వాటికి డబ్బు వృధా చెయ్యనివ్వదు. మనిషిని మనిషిగా అర్ధంచేసుకుని ప్రేమించడంలో మా యిరువురికీ సంతృప్తి వుంది. నీ వంటి అవకాశం వున్న యువకుడికి నా చెల్లెలు అరుదైన అదృష్టం కాగలదు....." అని చెప్పాడు శ్రీహరి.
    ఆనందరావుకు నిజమే ననిపించింది. అతడు దీప్తిని వివాహం చేసుకోవాలనే అనుకున్నాడు. మనసులు కలిసిన జంట కాలినడకన పోతున్నా అది విమానయానంలాగుంటుంది. పూరిగుడిసెలో వున్నా అది విమానయానంలా గుంటుంది. పూరిగుడిసెలో వున్నా అది రమ్య హర్మ్య మవుతుంది. గంజితిన్నా పాయసమవుతుంది.
    ఈ విధంగా అతడాలోచిస్తున్న సమయంలో శోధన్ పరిచయమయ్యాడు. శోధన్ దృష్టి శ్రీహరి దృష్టికి పూర్తిగా భిన్నం.
    శోధన్ కూడా కావడానికి చిరుద్యోగి, కానీ బంగళాలో వుంటున్నాడు. స్కూటర్ కొన్నాడు ఇంకా పెళ్ళి చేసుకోలేదు. ఎందుకంటే పెళ్ళి అంటే యువకుడి జీవితాన్ని ఒకే యువతికి పరిమితం చేసేది. స్కూటరున్న బ్రహ్మచారులు కొన్నాళ్ళపాటైనా రోజుకో అమ్మాయిని స్కూటరువెనుక షికారుకు తీసుకెళ్ళ గలగాలి అందుకు కొంత ఖర్చవుతుంది. రోజంతా అందుకు శ్రమపడితే-ఆ తర్వాత లైఫ్ ఎంజాయి చేయొచ్చు.
    "అన్నం రుచి తెలియాలంటే రోజంతా కష్టపడి పని చేయాలి. అప్పుడాకలి పుడుతుంది. పని చేయడంవల్ల నాలుగు డబ్బులూ దొరుకుతాయి. దాంతో సుఖంగా కావలసింది కొనుక్కొని తినొచ్చు. అలాగే డబ్బు విషయమూను, ఉన్న తీరుబడినంతా ప్రేమకోసం ఖర్చుపెట్టేవాడికి కొన్నాళ్ళకు ప్రేమంటే వెగటుపుడుతుంది. ఆ తీరుబడిలో కొంత సమయాన్ని ధన సంపాదనకు వినియోగిస్తే ప్రేమంటే ఆకర్షణ పెరుగుతుంది. ఆ డబ్బుతో ప్రేమక్కూడా విలువ పెరుగుతుంది...." అన్నాడు శోధన్.
    "అంటే ఏమంటావ్?" అన్నాడు ఆనందరావు.
    "ఈ ప్రపంచంలో డబ్బును మించింది లేదు. డబ్బుతో ఏమైనా సాధించవచ్చు. అందువల్ల డబ్బుకోసం ఏమైనా చేయాలి..." అన్నాడు శోధన్.
    "డబ్బుకోసం ఏమైనా చేయాలి!" ఇదే ఆనందరావు మనసులో చాలా కాలంగా వున్న అభిప్రాయం కూడా. అతడిలో యిప్పుడు కొత్త ఉత్సాహం పుట్టింది.
    "ఏమైనా చేయాలనే నేనూ అనుకున్నాను. కానీ యేం చేయాలో నాకు తెలియడం లేదు....." అన్నాడు ఆనందరావు.
    "నేనడిగిన సమాచారమిస్తే చాలు...." అన్నాడు శోధన్.
    "ఏమిటది?"
    శ్రీహరి ఇన్ కంటాక్సు డిపార్టుమెంట్లో పని చేస్తున్నాడు. దేశంలో డబ్బు సంపాదిస్తున్నవాళ్ళ జాతకాలు చాలావరకూ అతడి చేతిలో వున్నాయి. బ్లాక్ మనీని పట్టి పన్ను లెగేసేవాళ్ళ ప్రాణాలు తీయడానికి ఇన్ కంటాక్సు డిపార్టు మెంటు మెరుపుదాడులు జరుపుతూంటుంది. ఆ దాడులెప్పుడు జరుగుతాయో డిపార్ట్ మెంట్లో తెలిసినవాడు శ్రీహరి ఒక్కడే కోడ్ భాషలో అతడినుంచి సమాచార మందగానే స్క్వాడ్ బయలుదేరుతాయి.
    "దాడి జరుగబోవడానికి గంటముందు తెలుస్తే చాలు. వాళ్ళ వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళుంటారు. అందుకు ప్రతి ఫలం యాభై వేలనుంచి లక్ష రూపాయలదాకా ఉంటుంది" అన్నాడు శోధన్.
    "లక్షరూపాయలే..." అన్నాడు ఆనంద రావాశ్చర్యంగా.
    "అవును...." అన్నాడు శోధన్.
    "అయితే నేను ప్రయత్నిస్తాను...." అన్నాడు ఆనందరావు.
    "అదంత సులభం కాదు. శ్రీహరి బాగా నిజాయితీ పరుడు. అతడు డబ్బుకి లొంగడంలేదు. లొంగితే నీవల్లనే లొంగాలి. నీకు తన చెల్లెల్నిచ్చి పెళ్ళి చేయాలనుకుంటున్నాడు కదా...." అన్నాడు శోధన్.
    "ఇదంతా నీకెలా తెలుసు?"
    "డబ్బు సంపాదించేవాడికి లక్ష మార్గాలుంటాయి. శ్రీహరిమీద బోలెడు నిఘా వుంది...."
    "లక్షరూపాయలంటే కూడా శ్రీహరి లొంగలేదా?" ఆశ్చర్యంగా అడిగాడు ఆనందరావు.
    "లక్షరూపాయలంటే అదే జీవితమనుకుంటున్నావా? మేమిస్తామన్నది కేసుకు లక్షరూపాయలు....శ్రీహరి చాలా కేసులు వదులుకున్నాడు.
    ఆనందరావుకు గుండె ఆగినంత పనయింది.
    "శ్రీహరి ప్రమాదకరమైన మనిషి కూడా తనవద్దకు రాయబారాలు పంపినవాడి గురించి పోలీసు రిపోర్టులు కూడా యిచ్చేవాడు. అందుకే అతడినెవ్వరం డైరెక్టుగా కలుసుకోలేకపోతున్నాం...." అన్నాడు శోధన్.
    ఆనందరావు అనుమానంగా-"అయినా యిందులో నీ ఆసక్తి ఏమిటి? నీకు మరీ ఇన్ కంటాక్సు డిపార్టుమెంటుకి భయపడేటంత డబ్బేం లేదుకదా...." అన్నాడు.
    "చూడు......దేశంలో నీతికీ, అవినీతికీ కూడా యెన్నో సంస్థలున్నాయి. ఓ పెద్ద సంస్థలో నేనూ వున్నాను. మా సంస్థ కార్యక్రమాల్లో-ఇన్ కంటాక్సు రెయిడ్స్ గురించి డబ్బున్నవాళ్ళని ముందుగా హెచ్చరించడం ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. అందుకు మేము కమీషన్ తీసుకుంటాం. అందులో కొంత మీ కిస్తాం...." అన్నాడు శోధన్.
    ఆనందరావు ఆశ్చర్యపడి-"ఇలాంటి సంస్థలో స్థానం సంపాదించాలంటే ఏం చేయాలి?" అన్నాడు.
    "లైఫ్ ఇన్సూరెన్స్ లాగే ముందు కొంత బిజినెస్ చేసి చూపించాలి సంస్థకు నీ కారణంగా పదిలక్షల రూపాయలు ఆదాయం వచ్చిందంటే నువ్వు నెల జీతంమీద సంస్థలో శాశ్వత సభ్యుడివి కావచ్చు...." అన్నాడు శోధన్.
    శ్రీహరి బంగారుగుడ్లు పెట్టే బాతు-అని అప్పటి కర్ధమైంది ఆనందరావుకి. అంతకాలం అతడి పరిచయాన్ని మామూలుగా తీసుకుంటూ వచ్చాడతడు.
    "నేను శ్రీహరిని లొంగదీస్తాను...." అన్నాడు ఆనందరావు.
    "నీ నిర్ణయానికి చాలా సంతోషం. కానీ అది నువ్వనుకున్నంత సులభం కాదు. శ్రీహరి మొండిమనిషి. అతడిని లొంగదీయాలంటే మోసగించాలి...."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS