"కారణమిదని చెప్పలేను. నా మనసులో ఇంకా ఆశ మిగిలుండవచ్చు. కానీ ప్రస్తుతం కొంతకాలం పాటు నేను పరమ పవిత్రంగా ఉండ దల్చుకున్నాను. అందుకింకో కారణముంది. ఇప్పుడు మనం తెచ్చిన మొక్కలతో చాలా ప్రయోగాలు చేయాలి. ఏమిటి వాటిలోని విశేషం? భూమ్మీడనే ఉన్న వీటి గొప్పతనం ఇంతకాలం ఎవరికీ ఎందుకు తెలియలేదు ? ఇలాంటి ప్రశ్నలకు నేను సమాధానం సంపాదించాలి. ఒక నెల రోజుల పాటు నేను మీ ఎవ్వరికీ కనపడను. కలుసుకొను. ఒక్కసారి విస్సీని, ఉదయనూపలుకరించి వెళ్ళిపోతాను" అన్నాడు కులభూషణ్.
***
ఆ రాత్రే కులభూషణ్ తన పరిశోధనల పేరు చెప్పి ఇల్లు వదిలి పెట్టాడు. కొంతకాలం పాటు తన ఉనికి గురించి అమ్మ సీతమ్మ కు కూడా తెలియకుండా ఉంచుతానన్నాడు.
"ప్రపంచానికి ప్రయోజనకరమైన పవిత్ర కార్యం తలపెట్టావు. నీకు జయమవుతుంది. కానీ మధ్య మధ్యలోవచ్చి నన్ను చూస్తుంటే ఇంకా బాగుండేది...." అంది సీతమ్మ అతణ్ణి సాగనంపుతూ.
ఇక ఆ ఇంట్లో ముగ్గురు మిగిలారు.
వేదాంతం ఒక వారం రోజుల పాటు విశ్వనాద్ ని పలకరించనైనా పకలరించలేదు. విశ్వనాద్ కూడా అతణ్ణి కలుసుకుని మాట్లాడే ప్రయత్నం చేయలేదు.
ఉదయ వేదాంతాన్ని పట్టించుకోలేదు.
వేదాంతం ఉదయకూ, కులభూష కీ జరిగిన పెళ్లి గురించి ఆలోచిస్తున్నాడు.
ఉదయకు విశ్వనాద్ పై అంతులేని ప్రేమ.
తనపై గౌరవభావం.
కులభూషణ్ పై అభిమానం....
తాము ముగ్గురూ ఆమెను ప్రేమిస్తూ స్వంతం చేసుకోవాలనుకుంటున్నారు. అంతిమ విజయమెమరిదో?
సాఫీగా రోజులు గడిచిపోతున్నాయి.
ఒకరోజున ఉదయ తనే స్వయంగా వేదాంతాన్ని పలకరించింది.
అప్పుడు విశ్వనాద్ తల్లి దగ్గరున్నాడు.
వేదాంతం ఉదయను చూశాడు.
అప్పుడే విరిసిన పువ్వులా సుకుమారంగా, మనోహరంగా ఘుమఘుమలాడుతున్నదామే.
"నిన్నభినందించడానికి వచ్చాను...." అంది ఉదయ.
"ఎందుకు?" అన్నాడు వేదాంతం.
మురహరి జైలు పాలవగానే సురుచికి స్వేచ్చ వచ్చింది కానీ అతడు ఆమె గురిచిన నేరాలు కూడా బయట పెట్టడం వల్ల ఆమె ప్రపంచానికి తన ముఖం చూపించ లేకపోయింది. ఉదయ కూడా ఆమె కనబడలేదు. ఇప్పుడామెకు మురహరి ఆదేశం మీద మూడు లక్షల రూపాయల పరిహారం వచ్చింది. డబ్బామెకు పోయిన పరువును తిరిగిచ్చింది. సురుచి ఉదయను కలుసుకుంది. సురుచి చెప్పిన పచ్చి నిజాలు ఉదయను నిలువెల్లా వణికింపజేశాయి.
'ఒక నరరూపరాక్షసుణ్ణి అంతం చేశావు. నిన్నభినందించాలి. సురుచి స్వయంగా చెప్పేవరకూ మురహరి కధ నాకు కధలాగే అనిపించింది." అంది ఉదయ.
ప్రపంచంలో ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి. మనిషి వాటిని కధగా విని నిట్టూర్చి ఊరుకున్తున్నాడు. అయిన వాళ్ళకా అనుభవమైతే మనిషి చలిస్తాడు.
మనిషి ఈ తత్వంకారణంగానే ప్రపంచంలో ఘోరాలు కొనసాగుతూనే ఉన్నాయి.
"నరరూప రాక్షసులింకా ఎందరో ?' అన్నాడు వేదాంతం.
"అందర్నీ నువ్వు మాత్రం ఏం చేయగలవు?"
"మనిషి తానేమీ సాదించ లేనను కుంటే అతడి కున్నది కేవలం అరవై డెబ్బై ఏళ్ళ జీవితం. సాధించాలను కుంటే సంవత్సరానికి మూడు వందల అరవై అయిదు రోజులు. రోజుకి ఇరవై నాలుగు గంటలు. గంటకు అరవై నిమిషాలు. నిమిషానికి అరవై సెకన్లు.....
"మనిషి పుట్టుకకు ధ్యేయం ఏదో సాధించడమేనా? అనుభవం లేదా?"
"అంటే?"
"ఆకలి వేస్తె అన్నం, దాహం వేస్తె నీరు -- మనకిచ్చే తృప్తి అంతా ఇంతా కాదు. రుచికరమైన వంటలు, లయబద్దమైన సంగీతం, మనోహర దృశ్యాలు-- జ్ఞానేంద్రియాలను కలిగించే తృప్తికి మరేది సాటిరాదు. మనిషి తన జీవితాన్ని తను కొనసాగించడంలో కూడా సాధన ఉన్నదని నా అభిప్రాయం...."
వేదాంతం మాట్లాడలేదు.
"దుర్మార్గులలో తలపడడం కంటే సంమార్మన్ననుసరంచడంలో సాధించగలిగింది ఎక్కువ --" అంది ఉదయ మళ్ళీ.
"నువ్వు చెప్పదలచుకున్నదేమిటి?" అన్నాడు వేదాంతం.
"నీ ధనుష్టంకారం కంటే భూషణ్ ధనుష్టంకారం నాకు నచ్చింది" వేదాంతం మ్రాన్పడిపోయాడు.
ఉదయ వెళ్ళిపోయింది.
వేదాంతం తీవ్రాలోచనలోకి వెళ్ళిపోయాడు.
"నీ ధనుష్టంకారం కంటే భూషణ్ ధనుష్టంకారం నాకు నచ్చింది" అన్న ఉదయ మాటలు అతడీ ఆలోచనల నయోమయంలోకి పంపుతున్నాయి.
మామూలు మనిషి కావడానికతడిక్కాసేపు పట్టింది.
ఉదయ తన వద్ద కెందుకు వచ్చింది?"
సురుచి విషయమై మెచ్చుకునేందుకా?"
కాదు....
ఆమెకు తెలుసు -- తను చాలా విషయాల్లో విస్సీ మీద ఆధారపడ్డాడని!'
"నా విస్సీ బావకు నాకు వదిలిపెట్టు ?" అంటోందామె.
కులభూషణ్ తన పరిశోధనలతో -- ఒక ప్రమాదకర వ్యాధిని సమూలంగా తుడుచి పెట్టబోతున్నాడు. అతడి పరిశోధనా ఫలితం వీరికీ వారికీ అనికాక మొత్తం మానవాళికి ఉపయోగిస్తుంది.
తను చేస్తున్న దేమిటి?"
ప్రపంచం నుండి దుర్మార్గాన్ని సమూలంగా తుడిచి పెట్టడం తన వల్లవుతుందా?
అయితే తను దుర్మార్గాన్ని తుడిచి పెట్టాలనుకోవడం లేదు.
కొందరు దుర్మార్గాన్ని బయట పెట్టాడు తాను.
రాజకీయాల్లో, విద్యాలయాల్లో, దేవాలయాల్లో , వైద్యశాలల్లో వారి హస్తముంది.
నిజం తెలుసుకున్న ప్రజల్లో చైతన్యం కలుగుతుంది.
చైతన్య వంతులైన ప్రజలకు అసాధ్యమైనదేదీ లేదు.
ప్రజలను చైతన్యవంతుల్ని చేయడానికి,దుర్మార్గుల్ని దుర్మార్గానికి వ్యతిరేకంగా హెచ్చరించడానికి తను ధానుష్టంకారం మాత్రం చేస్తున్నాడు.
ఇది గొప్ప కార్యక్రామం కాదా?
"నీ ధనుష్టంకారం కంటే భూషణ్ ధనుష్టంకారం నచ్చింది" అంటోంది ఉదయ.
అందుక్కారణం -- కులభూషణ్ విశ్వనాద్ జోలికి వెళ్ళడం లేదు.
విశ్వనాద్ ఉదయకు కావాలి.
ఉదయను తను విశ్వనాద్ కు వదిలి పెట్టగలడా?"
"ఇంపాజిబుల్!" అనుకున్నాడు వేదాంతం.
***
ఉదయ, విశ్వనాద్ -- ఒకే గదిలో కూర్చుని కిలకిల నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటున్నారు.
అప్పుడు రాత్రి పది గంటలు దాటింది.
సీతమ్మ తన గదిలో పడుకుంది.
వేదాంతానికి నిద్ర పట్టడం లేదు.
అతడు తన గదిలో చాలాసేపు అసహనంగా పచార్లు చేసి చివరకు విశ్వనాద్ గదికి వెళ్ళాడు.
అతడు వెళ్ళేసరికి -
"ఇన్నికబుర్లెప్పుడు నేర్చావు బావా?" అని విరగబడి నవ్వుతోంది ఉదయ.
ఆమె నవ్వు అద్భుతంగా ఉంది. నవ్వుకే అందాన్ని తెచ్చి పెట్టింది.
విశ్వనాద్ ఆ నవ్వునే చూస్తున్నాడు.
వేదాంతం కూడా ఆ నవ్వునే చూస్తున్నాడు.
ఆ నవ్వు వేదాంతాన్ని చూసి ఆగిపోయింది.
"విస్సీ -- నీతో మాట్లాడాలి!"అన్నాడు వేదాంతం.
విశ్వనాద్ లేచి నిలబడ్డాడు.
ఉదయ అక్కణ్ణించి వెళ్ళిపోతూ అదోలా చూసింది వేదాంతం వంక.
"నా గదికి వెడదాం " అన్నాడు వేదాంతం.
విశ్వనాద్ అతడి ననుసరించాడు.
వేదాంతం తన గది తలుపులు మూసి "నేను తిరిగి వచ్చేక ఒక్కసారి కూడా నువ్వు నన్ను కలుసుకుని మాట్లాడలేదు " అన్నాడు.
"నువ్వు నన్ను పిలవలేదు...."
"నీవు ఉదయతో ఎందుకు మాట్లాడుతున్నావు ?"
"ఆమె నన్ను పిలుస్తోంది...."
ఊరికి వెళ్ళేముందు నేను నీకు పనులప్పగించాను గుర్తుందా ?"
"ఊ"
