"నేను మీతో కాస్త మాట్లాడాలి..... ఇలాంటి విషయాలు మరీ ఇలా రోడ్డుమీద నిలబడి మాట్లాడుకోసం అంత భావ్యంకాదు గదా!" అంటూన్న రాఘవేంద్రాన్ని ఆమె లోపలికి రానిచ్చి కుర్చీ చూపించింది. ఆమె మొహంలోని ఆందోళన రాఘవేంద్రంగారిని కలవరపరచకపోగా మరింత ఉత్సాహాన్ని పుంజుకోనిచ్చింది.
"చూడండీ! మీరు మీ వారూ....."
"వారూ నేనూ అన్నీ నేనే..... మీపనేమిటో చెప్పండి" కటువుగా అన్నది జయమ్మగారు. "లేదుకదూ! నలుగుర్ని పిలిచి......మీ...."
"అమ్మమ్మ! మర్యాదస్తున్నీ పిల్లల వాణ్ణి తల్లీ! అంతంత మాటలనవద్దు" నొచ్చుకున్నాడు రాఘవేంద్రం.
రాఘవేంద్రం తనను పూర్తిగా పరిచయం చేసుకున్నాడు. సురేఖ "మా మేన కోడలవుతుంది" అన్నాడు.
"సురేఖ మామయ్యా మీరూ?" కాస్త తేరుకున్నది జయమ్మగారు.
రాఘవేంద్రం అంతా చెప్పాడు. వసంతకి పెళ్లైంది. వసంత అన్నయ్యకూ సురేఖకూ పెళ్ళి కావల్సి ఉన్నది అని బోధపరిచాడు.
చివరికి అన్నాడు "మీ అమ్మాయి పద్మావతికి సాధ్యమైనంత తొందరలో పెళ్ళి చేయండి ఇది నా సలహా" అన్నాడు.
"ఎవరి సలహాలు సహాయాలు మాకు అక్కరలేదు. అలాగే చేస్తాం" జయమ్మగారు మండిపడ్డది.
"మరే, మరే! కాని...... మీ అమ్మాయి, ఈ భాస్కరం అనే అబ్బాయిని వలలో వేసుకోజూడటం....." నసిగాడు రాఘవేంద్రం.
"నోర్ముయ్యవయ్యా! మర్యాదా మప్పితం తెలియకుండా మాట్లాడుతావ్?" - దెబ్బతిన్న పాములా కస్సుమన్నదామె.
"నా నోరు మూయొచ్చుగాని..... లోకం నోరు మూయడం మనతరం కాదుకదా?.....అందుకనే నేను ఇంత దూరం వచ్చాను. ధనమ్మగారు అనే ఆవిడ చాలా తెలివైనది డబ్బున్నది. పద్మావతి కావాలంటే వెయ్యో..... రెండూవేలో...."
"ఛీ! ఫో అవతలికి...." అందామనుకున్నది జయమ్మగారు కాని బయటకు అహంకారం దుఃఖం రాకుండా నిలదోక్కుకుని "బాబూ? మీరు మీ ధనమ్మగారూ ధనం అన్ని కలిసి కృష్ణలో దూకండి? మీమాత్రం మాన మర్యాదలు, డబ్బూ, ఇల్లూ నాకూ ఉన్నాయి. నీలాంటి దుర్మార్గుడు మర్యాద తెలీని వాడు నా ఇంటికి వచ్చి అడిగినా నా కూతుర్ని నేను ఆ భాస్కరం ఎవడో అతగాడికి ఇవ్వను ఇక నువ్వు నడూ....."
"ఖాయమేనా?....." రాఘవేంద్రం గారు ఇక నా పని అయింది అన్నట్లు నిలబడ్డాడు.
"ఆహాఁ!"
"సరే చెల్లమ్మగారూ?" మెత్తబడిపోయి సంతోషంతో మొహం వికసించగా అన్నాడు రాఘవెండ్రం. "నన్ను మన్నించండి. అమ్మాయికి చెప్పండి. అ భాస్కరం అనేవాడు నా కోడలికి అన్నయ్యకదా అని చెప్పకపోడమే గాని చెబితే అతని గ్రంథం చాలా ఉంది...... చూడగా మీ అమ్మాయి చాలా అమాయకురాలల్లే ఉంది ..... అందుకే దీపం ఉండగానే ఇల్లూ అన్నట్లు .... కొంపలు మునిగి పోకుండానే......"
"చూడండీ! మీరు మనుషులే అయితే అవతలికి నడిచిపోండి! దయచేసి.....నీకూ నీ పెద్దలకూ పదివేల దండాలు......"
ఆమె దుఃఖం ఆపుకుని ఆవేశంగా చేతులెత్తి మొక్కింది, అటు మొహం తిప్పేసుకుంది.
రాఘవేంద్రంగారు.......
"క్షమించుతల్లీ! క్షమించుతల్లీ? నీ కూతురొకటీ నా కూతురొకటీ కదూ...... మచ్చ పడ్డదో మాయదు...." అంటూ నిష్క్రమించాడు.
దభేలున తలుపు వేసుకున్నది. ఆయమ్మగారు. ఆవేశం పట్టలేక గోడకేసి తల బాదుకున్నది. అక్కడే కూలబడి వెక్కివెక్కి ఏడ్చింది. కుంకుమలేని ఆమె నుదుట ఎర్రని నెత్తురు చిమ్మింది!
"పద్మావతిని పీకె పిసికేసి పారేసి తాను కూడా సముద్రంలో పడిపోతే తీరిపోతుంది." అనుకుంది పదేపది.
"చివరికి ఇలా ఐంది నా బ్రతుకు..... నాదే తప్పు ఈడొచ్చిన ఆడపిల్లని విచ్చలవిడిగా పోనివ్వడం ఇకచాలు" నని బాధ పడ్డది.
* * *
రాఘవేంద్రరావుకి తన పన్నాగం పారింది తన ఇల్లు దక్కింది అన్న సంతోషం కలిగిన రెండో వేపు గుండెల్లో దేవినట్లయింది. జయమ్మను చూసిన తర్వాత ఆమెలో మాట్లాడిన తర్వాత తనొక సంస్కార హీనుణ్ణి అన్నబాధ ప్రవేశించింది అతనిలో.
"ఛీ! ఛీ! ఇంత నీచమైన పని చేశాను పిల్లలవాణ్ణి" అనుకున్నాడు.
"ఈ పీడ వదిలింది. దీనికి ఒక వెయ్యి యిందని ధనమ్మగారికి చెబుదునా" అనుకున్న రాఘవేంద్రరావు.
జయమ్మ మొహంలోకి ఆమె కళ్ళల్లోకి చూసిన తర్వాత తప్పు చేసినట్లు బాధ పడిపోయాడు.
"కాని తప్పదు" అనుకున్నాడు.
తిన్నగా భాస్కరం దగ్గరికి వెళ్ళి "నాకు ఈ వూళ్ళో పని అయిపోయింది వెళ్ళిపోతాను" అని చెప్పేసి వెళ్లిపోవాలి. ఇక ఇక్కడ ఉండడం శ్రేయస్కరంకాదు....." అనుకున్నాడు.
దొంగతనమో, మరోటో అలాంటిదే నేరం చేసిన వాడిలా గబగబా వెళ్ళిపోయాడు.
51
పద్మావతి పెళ్ళి సవ్యంగా జరిపించడంకన్నా వేరే ఆశా ఆత్రంలేని జయమ్మకు రాఘవేంద్రం రాక జీవితం మీదే విరక్తి పుట్టించింది. "దాని కింత విషమిచ్చి నేను కూడా అదే తినేస్తే పోతుంది" అని పదేపదే దుఃఖ పడ్డది. రాఘవేంద్రరావు తఃనకేసి చూసిన చూపులలోని న్యూనత ఆమెను మరీ నొప్పించింది. పద్మావతి యింట అడుగుపెట్టేసరికి కుప్పలా కూచున్న జయమ్మ మాట నువ్వు వాల్తేరు ఈడ్చుకొచ్చావ్?" అని నిలదీసింది.
తల్లి వాలకం నుదుట నెత్తురు, వాచిన కళ్ళూ చూస్తూనే విస్తుపోయిన పద్మావతి, ఆమె ప్రశ్నతో భయమూ ఆందోళనా కూడా పడ్డది.
"ఏం జరిగిందమ్మా?" అన్నది తల్లిదగ్గరగా వచ్చి కూచుని-
"ఛీ! సిగ్గు మాలిందానా? ఇంకా నన్ను అమ్మా అని పిలవకు....." అటు మొహం తిప్పేసుకుందామె.
పద్మావతికి గుండె గుభేలుమంది. ఏదో విపరీతమే జరిగిందనుకున్నది- అంతలోనే ఆడపిల్ల కనుక అధైర్య పడి కన్నీళ్ళతో "ఏమయిందమ్మా!" అన్నది భయం భయంగా.
"ఎవడా భాస్కరం? ఎన్నాళ్ళైంది వాడితో నీ పరిచయం?"
పద్మావతికి దుఃఖం పొర్లుకొచ్చింది. తల్లి రొమ్ములో తలదూర్చి వెక్కివెక్కి యేడ్చింది.
"ఆయన ఎవరైతే నేమమ్మా! నేనే పాపమూ ఎరుగనమ్మా!" నన్నది.
మగదిక్కూ ఆడదిక్కూ అన్నీ తానై కూతుర్ని సాకుతున్న జయమ్మగారు తనను తానే సమభాళించుకున్నది.
"ఆ దుర్మార్గుడెవడో వాడు వచ్చి నన్ను ఎంత లేసి శూలల్లాంటి మాటలు అన్నాడో నీకు తెలియదమ్మా?" అన్నది కూతుర్ని గుండెల కత్తుకుని.
"ఎవరమ్మా?"- ఒకవేళ భాస్కరమేమోనని విస్తుబోయింది పద్మావతి.
"ఎవడో సురేఖ మేనమామట-ఏది ఏమైనా నువ్వు ఇలా నా కొంప ముంచుతా ననుకోలేదు."
"ఛీ! మనం ఇంతకన్నా ఉరిపెట్టుకు చచ్చినా ఫర్వాలేదు" బాధపడ్డది జయమ్మగారు.
పద్మావతి "నేనేపాపం ఎరుగనమ్మా" అంటూ ఆమె ఒళ్ళో తలపెట్టుకుంది.
ఆమె ఆవేశంతో కూతుర్ని ప్రక్కకి తోసి వంట ఇంట్లోకి వెళ్ళిపోయింది.
పద్మావతికి భాస్కరం మీద ఆశలు పూర్తిగా పోయాయి. ఇంత నాటకమూ ఆడుతున్నది. ఆ భాస్కరమే అయ్యుండాలి. "ఛీ! ఇంకా యీ రంపపుకోత-" తనను తానే అసహ్యించుకున్నది.
జయమ్మగారికి రాఘవేంద్రరావు అన్నమాట లన్నీ కాదన్న కొద్దీ జ్ఞప్తికి వచ్చి ములుకులై పొడుస్తున్నాయి.
ఇక నువ్వా బడి చదువూ చాలించు" మని గట్టిగా కేకవేసింది కూతురువేపు తిరిగి.
పద్మావతి ధైర్యం తెచ్చుకుని లేచి తల్లి దగ్గరికి వెళ్ళింది. "నేను ఆ భాస్కరం అనే ఆయనను ఎరుగుదునే గాని ఇంకే నేరమూ చెయ్యలేదమ్మా?" అన్నది.
"నా బంగారం మంచిదేనన్న మాట నేను నమ్ముతాను కాని, ఎవర్ని నమ్మించమంటావు?"
జయమ్మగారి ప్రశ్నకి పద్మావతి కన్నీరు కొంగుతో పూర్తిగా తుడుచుకుని "ఇంకెవరి నమ్మకంతోను మనకి ప్రమేయం లేదమ్మా" అన్నది.
"పిచ్చిదానా!" ఆమె లేచివచ్చి కూతురు తల నిమిరింది. "లోకంలో ఉంటూ దాని కతీతంగా బ్రతకడం- నీళ్ళల్లో ఉంటూ ఈత ఈదను అనడంలాంటిదమ్మా" అని బుజ్జగించింది.
ఆమె తిరిగి నిట్టూర్చి కూతురి తల అక్కున అదుముకుని రెండు క్షణాలాగి చెప్పింది.
"రాజు లేని సమయంలో ఈ రగడ అంతా జరిగింది గనుక సరిపోయింది లేకపోతే అతగాడు దీన్ని గోరంతలు కొండంతలు చేసును. పైగా నీనించి పార్వతికి సమ్మంధాలు రానంటాడమ్మా!..
పద్మావతికి ఈ మాట తల్లి నోటి వెంటవచ్చినప్పటికీ శూలంలా గుచ్చుకున్నది.
"అబ్బ! వెధవ ప్రతిష్ఠ వెధవ్ బ్రతుకులు......ఒక మగాడితో మాట్లాడినంత మాత్రాన పోయే పరువు ప్రతిష్టలు ఎవడిక్కావాలి?" అని తల్లికి పెడమొఖం పెట్టుకున్నది పద్మావతి.
"మనకే....." నన్నది జయమ్మగారు స్పష్టంగా వెంటనే తన ఉద్దేశం కూడా ఆమె చెప్పింది.
"చూడమ్మాయ్! ఇక గడిచిన దానికి వగచి లాభంలేదు....... నువ్వు ఈ పాడు ప్రపంచం ధోరణి తెలియక ఆ కుర్రవాడెవడో చెప్పిన దగాకోరు తియ్యని పలుకులకు ఇంకా విలువకూడా ఇస్తున్నావు..కాని లోకజ్ఞానం ఏ మాత్రం యెరిగిన వాళ్ళైనా, ఈ స్నేహాలు ప్రేమలూ నమ్మరు.....ఆదికాలంలో శకుంతలకు కూడా దుష్యంతుని చేతిలో పరాభవం తప్పలేదు.....యిక యిప్పుడా? మగాడి మాటలకు విలువ?" నిట్టూర్చిందామె.
"సరే నమ్మా నీ ఇష్టమే! బడికి వెళ్ళను" -దుఃఖపడుతూ మంచాన బోర్లా పడుకుంది పద్మావతి.
"పిచ్చిపిల్ల! ఆ రాజు నిజంగా దేవుడిలా వచ్చి సమ్మంధం చూశాడు...... అయితే అవనీ రెండో పెళ్ళి అయినా ఫర్వాలేదు. అపవాదూ, అప్రతిష్టా రాకమునుపే ఆ మూడు ముళ్ళూ వేయించేస్తాను" అని నిర్ణయంగా తలపోసింది జయమ్మగారు.
జయమ్మగారన్న మాటలలో అసత్యమున్న దనడానికి పద్మావతికి మనసు కూడా ఒప్పుకోలేదు. తను ఇంతవరకూ అనుభవ పూర్వకంగా తెలుసుకున్న సత్యాన్నే ఆమె చెప్పింది. పద్మావతికి భాస్కరం తనను దగా చేయడం అవమానంగా తోచింది. "ఛీ!" అనుకుంది. భాస్కరం తానే వచ్చి తన అశక్తతను బలహీనతను చెప్పి "పద్మా!! నన్ను క్షమించు నేను నిన్ను పెళ్ళిచేసుకోలేను" అంటే అది వేరే మాట.... కాని ఇలా తన తల్లిని కూడా చివరికి "రంపపుకొత్త"లకు గురిచేసి సాధించడం ఆ పిల్లకు భాస్కరం మీదేగాదు మొత్తం పురుష ప్రపంచం మీదనే క్రోధం కలిగించింది.
"నేను...... నేను...... ఇలాగే ఉండిపోతాను" అనుకుంది కాని ఎలా ఉండిపోవాలన్నాయిక తనచేతుల్లో ఏముంది? అంతా జయమ్మగారి ఇష్టా నిష్టాల్లో ఉన్నది. "ఇవాళ చావు యిలా బ్రతకడం కన్నా సుఖంగా వుంటుంది నాకు" అనుకున్నది పదేపదే.
* * *
పద్మావతి నా రాత్రి పదిగంటల వరకూ జయమ్మ గారు బుజ్జగిస్తూనే ఉంది బ్రతిమాలుతూనే ఉంది. మధ్యమధ్యలో ఆమె భాస్కరం గురించి కూడా కొన్ని ప్రశ్నలు వేసింది!

"మన అంతస్తు మన స్థాయికి తగినవాడు మనకి కావాలి తప్ప ధనవ్యామోహమూ సంప్రదాయాల మక్కువా గలవాడు కాదమ్మా" అని పదేపదే ఆమె బోధ పరిచింది.
పద్మావతికి ఒక్కసారి జీవితంమీద భరించలేనంత విరక్తి కలిగింది. చచ్చిపోవడంకన్నా గత్యంతరం తోచలేదు. కాని తల్లి మాటలకు సమాధానంగా పెదవి విప్పనేలేదు. జయమ్మగారికి పద్మావతిని బడికి పంపడం ఇంత పిసరు మనస్కరించలేదు.
"ఆ భాస్కరం అనే మనిషి ఎవడవనీ ఇక నా పిల్లను వాడి కంటపడనివ్వకూడదు." అనుకున్నదామె.
"నీకు మీ రాజు అన్నయ్య తెచ్చిన సమ్మంధం స్తిర పరుస్తాను...... నీ బి.ఏ. చాలు...... ఇల్లాలికి ఇల్లేనమ్మా స్వర్గం." అంటూ ఆమె రకరకాలుగా బ్రతిమాలి చెప్పింది.
