ఒకరాత్రి సుశీలాదేవి తమి పట్టేకపోయింది. నామీద వాలిపోయింది. నా మొగమంతా ముద్దులు కురిపించింది. బంగారు తీగలాంటి తన శరీరం నా శరానికి అతిగాఢంగా, గాఢంగా అదిమివేసి అలుముకుపొయింది. నాలోని కాంక్షలు వక్కసారిగా విజృంభించినాయి.
'' మూర్తీ! మూర్తీ! నాకోర్కె తీర్చు. నీకోసం బ్రతుకుతున్నా!'' అన్నది ఆమె. నాకు వళ్ళు తెలియలేదు. ఇంతలో మెలకువ వచ్చింది! ఏది నాకు మెలకువ తెచ్చిందో తెలియదు. అంతే!
నాకు బొటబొట కళ్ళనీళ్ళు కారిపోయినవి. మంచంనుండి. జీవచ్చవంలా లేచాను. నా చొక్కా తొడుక్కొన్నాను. సుశీలాదేవి లేచి జాకెట్టు తొడుక్కొని చీర కట్టుకుంది.
'' మూర్తీ! కోర్కెతీర్చకుండా వెళ్ళిపోతావా? నేనేం చేశాను? నేను స్వచ్ఛమైన దానిని కాననా నీ ఉద్దేశం? అవును; మాబోటి నిర్భాగ్య జీవితాలలో నిర్మలత్వం ఎక్కడ వస్తుంది!''
'' సుశీలా! నీతో సహవాసం చేసి, నీమతి విరిచిన తప్పునాది. అంతే! నేను ఇప్పుడు స్త్రీ పురుషధర్మం నిర్వహించకుండా వెళ్ళిపోవడానికి నువ్వు కారణం కాదు. నేనే కారణం. నాలో భయం దాగి వుంది. పూర్వవాసనల నీరసత్వం నన్ను కుంగదీస్తున్నది.''
'' నువ్వు నా స్నేహం చేసినప్పటినుంచీ ప్రేమనేది ఏమిటో తెలుసుకున్నా, ప్రేమకు ఫలం యివ్వవా నాకు? నేను ప్రేమించగలిగినవాడు దొరికితే చక్కని కొడుకుని, అందంమైన బాలికను కందామని యెదురు చూస్తున్నా, ఈరోజు నాప్రేమ తృప్తి, నా ప్రేమ ఫలం వాంఛించి సిద్దమయ్యాను. మూర్తీ! నువ్వలా వెళ్ళిపోతావా? నా జన్మలో ఇక రాజపుత్ర సానపు ఎడారులేనా?''
'' సుశీలా, నన్ను ఆలోచించుకోనీ, నీకు భర్త వునాడు! యిద్దరు విద్యార్ధి స్నేహితులున్నారు....''
'' నోరుముయ్ మూర్తీ! నీ నిర్ధయవల్ల నన్ను చంపేయడమే కాకుండా, నన్ను దెప్పుతున్నావా? మీ మగవాళ్ళంత తుచ్ఛులు ఎక్కడన్నా ఉన్నారా? పట్టుకుపో నీ డబ్బూ, నీ విచ్చిన బట్టలూ. ఆడడానికి అభిమానం లేదనుకున్నావా?''
'' సుశీలా! నా చరిత్రంతా నీకు చెప్పలేదు. రేపు సాయంకాలం వచ్చి, నా జీవితం యావత్తూ నీకు నివేదిస్తా. నువ్వే నాకు న్యాయాదిపతివి అవు! ఇంతకన్న ప్రస్తుతం మాట్లాడలేను.
అని విసవిస వాళ్ళింటిలోనుంచి వచ్చేశాను. ఆ గల్లీలలో తిరిగి తిరిగి ఇంటికి చేరుకొన్నాను. అప్పటికి పదిగంట లవుతుంది. రోజూ పదకొండు గంటలలోపుగానే ఇంటికి చేరుకొనేవాణ్ణి. ఏవో రెండు మెతుకులు నోట్లో వేసుకొని పడకగదిలోకిపోయి, మంచంమీద కూలిపోయాను. పాపం సుశీల కామవాంఛతీర్చలేకపోయాను. నా పిరికితనానికి నన్నే తిట్టుకున్నాను. ఎందుకు వచ్చిందో ఈ పిరికితనం? ఎందుకామె వాంఛ తీర్చకూడదు? దేవుళ్ళకే ఎదురు తిరిగిన నేను పుణ్యపాపాలూ, నైతిక ధర్మాలు గణించడం ఏమిటో? నాకా భావాలు నా శకుంతలతోనే వెళ్ళిపోయాయి. కాని పిరికితనం పోలేదు. పిరికితనం యుద్దంలో పరాజయం తెస్తుంది. దేవుళ్ళతో యుద్దం చేయడంలో పిరికితనం తిరిగి ఎదురువచ్చిన నారాయణాస్త్రం వంటింది.
దేవుళ్ళతో యుద్ధం మన హృదయరంగంలో పూర్వ నమ్మకానికీ అందుకు వ్యతిరేకం అయిన విప్లవభావాలకూ యుద్థమేకదా! నా ముందు వేలకొలది పూర్వీకుల నమ్మకాల కోటలు బురుజులతో ఆకాశం అంటే అతి మందపు గోడలతోటున్నాయి. నాకు బలం నాబోటివాళ్ళే, పాశ్చ్యాత్యులలో కొందరూ, అంతే!
ఆ గోడలు నాకు సుశీల గదిలో కనుపించాయి. నా దగ్గర యంత్రాయుధాలు తక్కువగా ఉన్నాయి. సుశీల అందం బలం యివ్వలేదు. ఆ గోడల మీద నా శకుంతలను భావించుకొన్నాను కాబోలు.
తెల్లవార్లూ నిద్రపోలేదు. పక్కమీద దొర్లుతూ ఉన్నాను. తల వేడెక్కి ఉంది. ఉడుకెత్తిన నా రక్తం చల్లారలేదు. సుశీల వాక్యాలు నా గుండెను అదరించివేసాయి. లేచి రెండు మూడుసార్లు వీధి తలుపు దగ్గరకు వెళ్లాను, సుశీల దగ్గరకు వెడదామనే! మళ్ళీ సిగ్గుపడి వెనక్కు చక్కా వచ్చాను.
21
సుశీలాదేవి ఇంటికి వెళ్ళడమే మానివేశాను. మానివేసిన మూడురోజుల్లో సుశీల భర్త మా యింటికి వచ్చాడు. అతణ్ణి చూడగానే నేను సిగ్గుచేత నేలలోనికి కుంగిపోయాను. ఏ తగాదా వస్తుందో అని భయపడిపోయాను.
సుశీల భర్త పేరు జగత్ రాం పండా. జగత్ రాం పండాకు సుశీల రెండవ భార్య. భార్య కోరిన కోర్కెనెరవేర్చడం అతని తపస్సు. ఆమె సంతోషంగా ఉంటే విశ్వేశ్వరుడు ప్రత్యక్షమైనట్లే అతడు సంతోషించేవాడు.
'' పండిట్ జీ! నా భార్య భయంకరమైన జ్వరంతో పడిపోయింది.జ్వరం సంధితో ప్రారంభించింది. సర్వకాలం నీపేరే గొణుక్కుంటుంది. '' వచ్చాడా శ్రీనాథమూర్తి? '' అనే ప్రశ్న బాబూజీ! నువ్వు వెంటనే ఒక్క సారి మా యింటికి రావాలి. నా సుశీల నన్ను విడిచి వెళ్ళిపోతే ఒక్క నిమిషం బ్రతకలేను. నువ్వు వెంటనే రావాలి. నన్నూ, నా భార్యనూ బ్రతికించు, నా బగ్గీమీద పోదాం రా బాబూజీ!''
ఆ మాటలు వింటోంటే నా ప్రాణాలే పోయాయి. నా శకుంతలతో పాటు దేశంలో ఉన్న ఆడవాళ్లందర్నీ చంపడానికే పుట్టానా అని వణికిపోయాను. వెంటనే బయలుదేరాను జగత్ రాం పండా ఇంటికి. ఇల్లంతా చుట్టాలతో కిటకిటలాడుతూ ఉంది. ఆపట్నంలో ప్రసిద్దికెక్కిన ఆయుర్వేద వైద్యుడు వైద్యరాజ్ పండిత్ బోలానాథ్ రిగి మంచం దగ్గర ఉన్నాడు సుశీల మంచంపై ఇటూ అటూ కొట్టుకొంటూ ఉన్నది. ఆమె కళ్ళు అరమూతలుగా ఉన్నాయి. ఆమె మాడుపై ఏవో మందుపట్టీ వేశారు. వైద్యుడు రోగి నాడి పరీక్ష చేస్తున్నాడు.
