'' అమ్మా, నాలో మండిపోతున్న దుఃఖంకొద్దీ ఏ పిచ్చి పనులున్నా చేస్తానేమో కాని, నా ప్రాణం మాత్రం తీసుకోను. నీ పాదాలసాక్షి, నాన్న గారి స్ర్ముతి సాక్షి, శకుంతల మృతిసాక్షి!''
'' సరే నాన్నా! మనస్సు మాత్రం కుదుటపరచుకోవద్దూ? ఆడదాన్ని. నేను మీ నాన్నగారు వెళ్ళిపోయిన వెనుక నీ కోసం కదా బ్రతికి ఉంటిని. నాయనా, చచ్చినవాళ్ళతో చస్తామా? అయితే ప్రపంచం అంతా ఇదివరకే నాశనం అయిపోయి ఉండును కదా? ప్రేమలు లేకే ప్రజలు బ్రతికి ఉన్నారా? ఎంత ప్రేమైనా, బ్రతికి ఉన్నవారి విషయంలోనే మనధర్మం పాలించవద్దా నాన్నా! ఏదో వ్యావర్తులు పెట్టుకో! కాశీ వచ్చింది మరి కాస్త గుండె బద్దలు కొట్టుకోడానికనా?'' తల వాల్చికొని '' అమ్మా, నన్ను నమ్ము '' అన్నాను.
20
కాశీపట్నం విచిత్రంగానే ఉంటుంది. పట్నంలో ఒక్క వీధీ పెద్దది కాదు. అన్నీ వంకర టింకర గల్లీ లే. గంగానదీ తీరం పొడుగునా అన్నీ స్నానఘట్టాలే- దశాశ్వామేధం, కేదారం, మణికర్ణిక, హరిశ్చంద్ర_ అంతటా వేలకొలది మెట్లు. గంగానదికి వానకాలంలో వరదలు. వేసవికాలంలో వరదలు. శీతాకాలంలో మాత్రం నీరు నీలంగా ప్రవహిస్తుంది. ఇదివరకు నా నమ్మకాలన్నీ మరిచిపోయాను. ఈనాడు నేను నాకే వేరయ్యాను. నాకు గంగానది ఏమీ పవిత్రంగా కనబడలేదు. నాకది నదీ, మురుగు కాల్వల కలయిక లాగ తోచింది. నాకు విశ్వేశ్వరుడు భారతీయుల మూఢత్వ హిమాలయ పర్వతానికి శిఖరంలా కనిపించాడు. ఇక్కడ అన్నపూర్ణ అన్యాయాల ముద్ద. అన్యాయాలుచేసి, అబద్దాలాడి, మోసాలుసలిపి కాశీవాసులు అన్నం సంపాదిస్తారు. అదే కాబోలు అన్నపూర్ణ, విశాలాక్షి, డబ్బు, డబ్బు, డబ్బు,! విశ్వేశ్వరుడికి డబ్బు, పూజారులకు డబ్బు, పండారులకు డబ్బు, గంగాపుత్రులకు డబ్బు, చచ్చినవారు అగ్నికి ఆహుతి కావడానికి డబ్బు! ఏదో నెమలి పింఛం నెత్తిమీద పెట్టి ఆశీర్వదించి, డబ్బు అడుగుతాడు: ఇవ్వకపోతే నానా తిట్లు తిడతాడు. నీ మోక్షం కోసం, నేకు సర్వసంపదలు రావడం కోసం కుంకం ఇచ్చేవాడు: విభూతి ఇచ్చేవాడు, పువ్వులిచ్చేవాడు. అవి అక్కర్లేదంటే శాపనార్ధాలు! పండాలకు, గంగాపుత్రులకు నీటి నియమాలు లేవు. అబద్దాలకు వెరవరు. మోసం చేయడానికి వెనుదీయరు. వాళ్లకు భక్తిలేదు, భయంలేదు. ఎప్పుడూ కనబడే విశ్వేశ్వరుడు వాళ్ళనేం చేస్తాడు? ఆ విశ్వేశ్వరుడు ఒక పెద్ద మోసం అని వాళ్ళకు పూర్తిగా తెలుసు.
ఆ విషయం నేనూ తెలుసుకున్నాను. నేను బురదనీళ్ళు అభిషేకం చేసినా ఊరుకున్నాడు: కళ్ళు పూవులు నెత్తిమీద వేసినా ఊరుకున్నాడు. ఏ రాయి ఊరుకోదు?
భారతీయుల కిలాంటి మూఢనమ్మకాలు ఎందుకు వచ్చాయి? ఎవరో కెమల్ పాషావంటి మహానుభావుడు హిందూమతానికి కావాలి! యజ్ఞోపవీతాలు పోవాలి, కులం తేడాలు చావాలి, మొక్కుబళ్ళు నశించాలి, పూజలు మాయం కావాలి, యాత్రలు ఎగిరిపోవాలి, తీర్థాలు, కుంభామేళాలు, పుష్కరాలు, అర్దోదయాలు, వైకుంఠ ఏకాదశులు, కృత్తికా నక్షత్ర ప్రవేశాలు, పండుగులు,పబ్బాలు రూపుమాసి మండిపోవాలి.
ఓయి వెఱ్ఱిదేవుడా నీ పని అయింది. నేను కత్తి గట్టాను. నాబోటివాళ్ళు ఈదేశంలో అప్పుడప్పుడు ఉద్భవించకపోతే చెలరేగిపోదువు నువ్వు. నీకు సిగ్గులేదు, నీ భక్తులకు లజ్జలేదు. నువ్వు బానిసత్వానివి. నీ వల్ల ప్రపంచంలో కోటి యుద్దాలు వచ్చాయి. కోటి కక్షలు ఏర్పడ్డాయి.
ఏం చేయగలిగావు నువ్వు ? ఓయి విస్సయ్యా! నీ పెళ్ళాం విస్సంమ్మను ఎంత అవమానమైనా చేసావు. నేను శివపురాణం, స్కందపురాణం వ్రాసే గంజాయిదమ్ముగాణ్ణి కాదు. మద్దతు పీల్చేవాణ్ని కాదు. భంగు తాగేవాణ్నికాదు. నువ్వు లోకమోసానివిరా విస్సయ్యా! నీ తమాషా నేను కనుక్కుంటాను. నువ్వు ఉంటే నా శకుంతలను ఎందుకు తీసుకుపోయావు? నువ్వు లేవు, లేనేలేవు.
ఇదే నా పాట. ఇదే నా ఉద్యమం. నేను విశ్వేశ్వరునిపై సాగించిన యుద్ధం అన్ని రంగాలలో విజృంభించింది. నా చిన్నమాట సంభవించిన ప్రపంచ యుద్ధం ఈ యుద్దమంత సర్వతోముఖంగా నడవలేదు. అసలు నాతో యుద్ధం చేసేందుకు ఏడీ ఈ మగవాడు విశ్వేశ్వరుడు! దద్దమ్మ, హీనుడు, సిగ్గులేనివాడు, పాషండుడు, షండుడు! రమ్మనండి. త్రిపురాసుర సంహారం చేశాడట. రాత్రిళ్ళు నాలో కామం ప్రకోపింపసాగింది. నా శకుంతలా వియోగం నాకు తీరని బాధ. నాకు కలిగే కామవాంఛకు నేనే సిగ్గుపడ్డాను. కాని శకుంతలా స్మృతియే నా కామవాంఛా ప్రవాహానికి ఆనకట్ట అయింది.
ఏమిటి నీతి? ఎందుకు ? నా ప్రేమంతా వెళ్ళిపోయిన ఒక పరమ బాలికకు ధారపోశాను. ఇంక నా కామవాంఛా ప్రవాహానికి ఆ పవిత్ర బాలికా ప్రేమభావం ఎందుకు అడ్డం రావాలి? నా ప్రేమను హరించిన ఈ దేవుళ్ళను అవమానం చేయాలంటే స్త్రీ వాంఛయే ఉపాయమనే నిశ్చయానికి వచ్చాను. ప్రసిద్ది కెక్కిన ఉత్తరాది భోగంవాళ్ళ ఇళ్ళకు వెళ్లాను. చెమటలు పట్టాయి. పది రూపాయలు నర్పించుకొని పారిపోయి వచ్చాను. ఆ మహాపట్నంలో కొందరు సంసారిణిలు కూడా ధనంకోసం ఈ వృత్తి చేస్తూ ఉంటారు. యాత్రికులే వారికి విటులు. అట్లని అన్నిరకాల విటులను చేరనివ్వరట.
అలాంటి వారిలో ఒక పండా రెండవ భార్యతో నాకు స్నేహం కుదిరింది, ఆ అమ్మాయికి నా ఈడే ఉంటుంది. చాలా అందంగా ఉంది. ఉత్తరాది సంగీతం చక్కగా పాడేది. చీరెలని, రావికలని రెండు వందల రూపాయలు ఆమెకోసం ఖర్చుచేశాను. అయిదారుసారులు అప్పుక్రింద పాతిక, ముప్పై, పదిహేను సొమ్ము ఇచ్చాను. ఆ అప్పు తిరిగి వస్తుందని కాదు. ఆ వంకపెట్టిగాని ఆ అమ్మాయి డబ్బు పుచ్చుకోనేది కాదు. భర్తకు మా యిద్దరి స్నేహం తెలుసును. ఇద్దరం అల్లరి చేసేవాళ్ళం, పాడుకునే వాళ్ళం. ఆ అమ్మాయికి తెలుగు వచ్చును. ఎందుకంటే ఆవిడభర్త, తెలుగువాళ్ళ పండాలలో ఒకడు. ఆమె పేరు సుశీలాదేవీ! ఆమె నాతో చెప్పడం ఇంతవరకూ నా వంటి స్నేహితుడామెకు దొరకలేదట. కాశీ విశ్వవిద్యాలయంలో చదువుకునే ఇద్దరు తెలుగు విద్యార్థులు అప్పుడప్పు డామెకడకు వస్తారట. ఆమెకు కామసంబంధం ఉందట. వాళ్ళు డబ్బు బాగానే ఇచ్చేవారట. నే నామె జీవిత పథంలోకి రాగానే ఆమె వాళ్ళిద్దరినీ ఇకరావద్దందట! ఎంత స్నేహం అయినా సుశీలాదేవితో ఇంతవరకు కామసంబంధం కలిగించుకోలేకపోయాను. ఆట పాటలతో, కేరింతలతో సరిపోయేది.
