జగత్ రాం పండా, నేనూ గదిలోనికి రాగానే వైద్యుడు మావైపు నావైపు తీక్షణంగా చూచి, '' నువ్వేనా శ్రీనాథమూర్తివి?'' అని అడిగినాడు. '' చిత్తం పండిట్ జీ '' అన్నాను.
'' ఈమె బ్రతకాలంటే నీలో ఉంది, ఈవిడకు జ్వరం మెదడుకు పట్టింది, గుండె చాలా నీరసంగా ఉంది. నువ్వు ఈగది అత్యంతావసరాలకుగాని వదలకుండా రాత్రింబగళ్ళు మందు లివ్వడం, మంచినీళ్ళివ్వడం, వగైరా అన్ని పనులు చేయాలి. అప్పుడు ఈ అమ్మాయి బ్రతకడానికి సావకాశాలు ఉన్నాయి. లేకపోతే రెండు రోజులకన్న ఎక్కువ పూచీ పడలేను.''
నేను, గుండె రణభేరీ వాయిస్తూవుండగా సరేనని తల ఊపాను.
'' శ్రీనాథ్! నువ్వు నాకు బిడ్డనీయకుండా....వెళ్ళిపోతావా?....ఇన్నాళ్ళనుంచీ....నామీద ప్రేమ....దొంగ....ప్రేమా'' అని గొణుగుతున్నది సుశీల.
నాకు చెమటలు పట్టాయి. ఆ వైద్యుడి ముఖం చూడలేకపోయాను సుశీల మంచం మీద ముఖం వాల్చుకుని కూచున్నాను. ఆమె చేయి నా రెండు చేతులతో పట్టుకున్నాను. కళకళ కాగిపోతోంది ఆమె వళ్ళు.
'' ఆమె నుదుటి మీద చేయివేసి, ఆమె చెవిలో 'సుశీలా' అని పిలుస్తూ ఉండు. తల్లిలా, కుమారునిలా నువ్వు సంచరించాలి. జ్వరం తగ్గి తెలివి వచ్చిన తరువాత మందులు మారుస్తాను'' అన్నాడు వైద్యుడు.
ఆమె నుదుటిమీద చెయివేశాను. అబ్బా! నాకెన్ని పరీక్షలు? '' ఇలాగే నా శకుంతలను నా కోసం బ్రతుకు '' అని ప్రార్థించాను. అయ్యో శకుంతలాదేవీ! నా కెలాంటి పరీక్షలు పెట్టావు ప్ర్రాణేశ్వరీ!
సుశీల చెవిలో '' సుశీలా! నేను శ్రీనాథమూర్తిని, నీ కోసం వచ్చాను. నెమ్మదించు సుశీలా!'' అని కళ్ళనీళ్ళు కారిపోతూ వుండగా పిలిచాను.
సుశీల కొంచెం శాంతించింది. కదలకుండా పడుకుంది. నేను నా చెయ్యి ఆమె నుదుటిమీద అలానే ఉంచాను. ఆ గదిలోకి ఎవ్వరినీ రాకుండా భర్త గుమ్మందగ్గర కాపలా! నేనూ, వైద్యుడు లోపల. వైద్యుడు '' పాశుపతాస్త్రము అనే మందు ఇస్తున్నాను. ఇది ఇచ్చిందగ్గర నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి నాయనా!'' అన్నాడు. ఏమిటా జాగ్రత్త అని భయపడి పోయాను. తేనెలో రంగరించి, ఆయన ఆ మందు సుశీల నోరుతెరచి నాలుకకు రాచినాడు, ' నేను మళ్ళీ వస్తా'అని చెప్పి వైద్యుడు వెళ్ళిపొయినాడు. పండా గుమ్మం దగ్గరే రాయిలా కళ్ళనీళ్ళతో సుశీలవైపు చూస్తూ, చేతులు నలుపుకుంటూ నిలుచున్నాడు. సుశీల చెవిదగ్గర నా నోరుంచి '' సుశీలా! నేను శ్రీనాథమూర్తిని, నువ్వు మా అందరికోసం బ్రతకాలి. సుశీలా! నేను ఇదివరకే ఎంతోకష్టం అనుభవించాను. సుశీలా! నా నెత్తిపై ఇంకో చావు కూడా పెట్టకు సుశీలా!''అన్నాను. నా కంటినీరు ప్రవాహాలై కారిపోయినాయి.
సుశీల నా వైపు తిరిగి '' వచ్చావా? మూర్తీ, నా పెదవులు ముద్దు పెట్టుకో '' అన్నది.
భర్త నాకు నమస్కరిస్తూ, ''పెట్టుకోండి బాబూజీ!'' అన్నాడు పాపం!
నేను కాగిపోయే సుశీల పెదవులను ముద్దెట్టుకున్నాను. సుశీల జ్వరంలోనే చిరునవ్వు నవ్వుతూ నావైపు తిరిగి నా చుట్టూ చేయిచుట్టి వళ్ళో తలపెట్టి చంటిబిడ్డలా నిద్రపోయింది. నేను కదలలేదు, నడుం నొప్పి పెట్టింది. ప్రాణాలు క్రుంగిపోతున్నవి. అలాగే కదలకుండా కూర్చున్నాను. ఒక గంటకే కొన్ని వేల గంటలు కూర్చున్నట్టు తోచింది.కాళ్ళు గుది కట్టినవి. రక్తం స్రవించడం మానింది, వీపున సూదిపోటులు సుశీలకు చెమటపట్టుట ప్రారంభించింది.
ఇంతట్లో వైద్యరాజు వచ్చాడు. నెమ్మదిగా నన్ను చుట్టిన చేయి సడలించి, నాడి పరీక్ష చేసాడు.'' రోగి బ్రతికే ఆశలున్నాయి. బాబూజీ, మీరు నెమ్మదిగా తలతీసి ఆ దిండు పైన పెట్టండి.'' అన్నాడు, నే నామె తలను దిండుపైన పెట్టాను. సుశీల కళ్ళుతెరచి ' ఆకలి ' అన్నది. వైద్యుడామెకు పళ్ళరసం ఇప్పించాడు, నేను మంచంమీదనే కూర్చొని వున్నాను. సుశీల నన్ను చేరి, గట్టిగా అదుముకొని మరల నిద్రపోయింది.
22
సుశీలాదేవికి జ్వరం నిమ్మళించింది. కాని ఆ నీరస స్థితినుంచి కోలుకొనేటప్పటికి ఆమెకు మూడు నెలలు పట్టింది. ఆమెకు బలం పట్టి ఊడిపోయిన జుట్టు మళ్ళీ గిరజాలులా వచ్చేటంతవరకూ అంట భయపడలేదు నేను. ఆడుతూ పాడుతూ కాలం బుచ్చాను. ఆ కొద్దిరోజులూ శకుంతలా స్మృతి కొంత వెనక్కు పడింది.
అలసటపడి ఇంటికివచ్చి నిద్దురపోయేవాణ్ని. సుశీలచేత వేళకు మందులు తినిపించడం, సుశీలకు ఒళ్ళు మసాజ్ చేయించుకునేటట్లు చూడటం, పళ్ళరసాలు, పాలు మొదలైనవి తినేటట్లు చూడడం, ఇది నా నిత్య కృత్యం. ఆ రోజుల్లో నాకామె స్నేహితురాలు. ఆమెను నేను వాంఛించలేదు. ఆమె నన్ను వాంఛించలేదు. నాకా గొడవే మనస్సుకు తట్టలేదు. కాని దేశంలో సంచరిస్తున్న అనేక భావాలు ఆనాళ్ళలో నా ఎదుటపడ్డాయి. నేను బి. ఏ. సెకండు క్లాసులో విజయం పొందినా ఇంకా బాలుణ్ణే ఒక్క భార్య విషయంలోనే పురుషుణ్ని.
నేడు కొంత కాశీ విశ్వవిద్యాలయ విద్యార్థుల స్నేహం లభించింది. సుశీల ఇంటికి వచ్చిన ఆంధ్ర విద్యార్థులతో నాకు స్నేహం లభించింది. వాళ్ళిద్దరూ సామ్యవాదులు, వాళ్లకు కారల్ మార్క్సు జగద్గురువు. అల్లా అని అంటే మీద విరుచుకుపడతారు. అతడు విజ్ఞానవేత్త అని, 'గతితార్కిక ' శాస్త్ర పరిశోధనలచేత, ఇలా ఉంటె నిజమైన శాంతి ప్రపంచంలో ఏర్పడుతుందని కాని పెట్టినాడని వాళ్ళ వాదన.
నేను: అవి శాస్త్ర రీతిగా ఉన్నాయని ఎల్లా చెప్పగలవు రామకృష్ణా?
రామ: మనకు ఆలోచనా శక్తి ఒక రీతిగా వుంటుందా?
నేను: అందరి ఆలోచనా శక్తి ఒక రీతిగా వుంటుందా?
విశ్వమూర్తి : (ఇంకో స్నేహితుడు) అందరికీ సమానమైన రాజకీయాధికారం, సమమైన అర్థస్వామ్యం, ఉత్తరోత్తరా ప్రపంచ రాజకీయాందోళన సమసిపోతుంది గదా?
