Previous Page Next Page 
వసుంధర కథలు-14 పేజి 40

 

    అయన చెబుతున్నాడు వాళ్ళు వింటున్నారు.
    న్యాయప్రకారం డబ్బు సంపాదించడాని కింకా చాలా మార్గాలున్నాయి. అవన్నీ చంచల్రావు కి తెలుసు. అలాగే డబ్బు సంపాదించి వేలాది మందికి సాయపడాలని చంచల్రావు భావిస్తున్నాడు , అయితే ....''    
    సాయం అయన ఒక్కడి చేతిలో లేదు. అయన సంపాదనలో నాలుగింట మూడు వంతులు ఆదాయపు పన్నుకే పోతోంది. అటుపైన రాజకీయ పక్షాలకు విరాళాలివ్వాలి. అధికారులకు లంచాలివ్వాలి. ఈ ఖర్చులు న్యాయంగా చూపడానికి లేదు. అందుకే అయన దృష్టి నేరాల మీదకు మళ్ళింది.
    "గొప్పవాళ్ళను కొల్లగోడితే -- వాళ్ళంతా ఒక్కటై నా సంస్థనే అణిచి వేస్తారు. ఇందుకు బ్యాంకు లొక్కటే అనువైనవిగా నాకు తోచాయి. వీటిని దోచడం వల్ల ఎవరికీ నష్టం లేదు. నా సమాజ సంక్షేమ కార్యక్రమాలూ, ఇతర ఖర్చులూ, వీటివల్ల తీరిపోతాయి. బ్యాంకులు సంపాదించే లాభాల్లో ఈ దోపీడీల నష్టం ఓ లెక్క లోది కాదు..."
     చంచల్రావు ఆ అయిదుగురి బ్యాంకు దోపిడీల కారణంగా తను దేశాన్నేంతలా సేవించగలుగుతున్నాడో వివరించి చెప్పాడు. బ్యాంకు దోపిడీ చేసి తనకు సహకరించడం ద్వారా వాళ్ళూ దేశా సేవకులేలా కాగాలుగుతున్నారో చెప్పాడు.
    "శత్రుసైన్యాలు మనను డీ కొంటాయి. అప్పుడు సిపాయిలెంచేస్తారు? తుపాకీతో ఎదురొచ్చిన ప్రతి సైనికుణ్ణికాల్చి చంపేస్తారు. వారు చేసిది నేరం కాదు. హత్యా కాదు. దేశం వారికి నివాళులర్పిస్తుంది. బిరుదులిస్తుంది. దేశభక్తులని వారిని కొనియాడుతుంది. మనదేశంలో పేదరికం మన శత్రువు. దానిపై యుద్ధం ప్రకటించాను నేను. ఆ యుద్దంలో పాల్గొంటున్న సైనికులు మీరు. మీరేం చేసినా అది నేరం కాదు. మీరు దేశభక్తులు . బ్రతికుండగా పుణ్యం చనిపోతే స్వర్గం . ఈ రెండూ మీకు తప్పవు."
    "నాకిప్పుడేంతో సంతోషంగా వుంది." అన్నాడు సత్యం చటుక్కున.
    అంతసేపూ తనేదైనా తప్పు చేస్తున్నానన్న భావన వుంటే సత్యంలో అదిప్పుడు తొలగిపోయింది. అతడిప్పుడు చంచల్రావేది చెబితే అది చేసే స్థితికి వచ్చాడు. అతడితో పాటు మిగతా నలుగురూ కూడా అదే మాట అన్నారు.
    చంచల్రావు వాళ్ళను మెచ్చుకుని -- "చాలా త్వరగా నా ఆశయాల నర్దం చేసుకున్నారు. మీరు తెలివైనవాళ్ళు. ఇదే విధంగా నాకు కొంతకాలం సహకరిస్తే మీకు సమాజంలో గౌరవమైన హోదా కల్పిస్తాను" అన్నాడు.
    ఒకరి తర్వాత ఒకరు కొద్ది వ్యవధిలో ఆ యింట్లోంచి బయటపడ్డారు.

                                     4
    సత్యం కనకదుర్గా లాడ్జికి వెళ్ళాడు. అందులో ఏడో నంబరు గదిలో అతడుంటున్నాడు.
    కనకదుర్గా లాడ్జి పెద్ద విశేషమైనది కాదు. అక్కడ శుభ్రత కూడా తక్కువే. జైల్నించి పారిపోయొచ్చిన సత్యానికి మాత్రం అక్కడి గది స్వర్గం లాగే అనిపించింది. అతడు గది తలుపులు వేసుకుని మంచం మీద పడుకున్నాడు. పరుపు కాస్త గట్టిగా వుంది. అయినా అతడికి ఫోం బెడ్ మీద పడుకున్నట్లే వుంది. ఫాన్ గాలి అతడికా గది ఎయిర్ కండిషన్డ్ అనిపింపజేస్తోంది.
    సత్యం కళ్ళు మూసుకున్నాడు. కాసేపు సుఖంగా నిద్ర పోవాలన్నదతడి తాపత్రయం. కానీ కళ్ళు మూసుకోగానే అతడికి రమణమ్మ గుర్తుకొచ్చింది. రమణమ్మ అంటే అతడికి చాలా యిష్టం. తనమీద అన్యాయంగా నేరం మోపబడి వుండకపోతే తామిద్దరూ హాయిగా భార్య భార్తల్లా కాపురం చేస్తోండి వుండేవారు. ఇప్పుడు తనామే కూతురికి సాయపడతానని మాటిచ్చాడు. కానీ సాయపడ్డానికి తన దగ్గరే ముంది?
    ఆమె తనకు సాయపడతానని మాటిచ్చింది. సాయపడింది. తనూ ఆమె కిచ్చిన మాట నిలబెట్టుకోవాలి-- ఎలా?
    సత్యానికి ఆలోచన తెగలేదు కానీ ఎవరో తలుపు తట్టిన చప్పుడైంది. విసుక్కుంటూ వెళ్ళి అతడు తలుపు తీశాడు.
    ఎవరో అపరిచితుడు?    సత్యం అతడి వంక ప్రశ్నార్ధకంగా చూశాడు.
    "నీ గురించి నాకు చాలా తెలుసు. నీతో అర్జంటుగా మాట్లాడాలి?" అన్నాడా అపరిచితుడు.
    "నా గురించి నీకేం తెలుసు?" అన్నాడు సత్యం కంగారుగా.
    "నువ్వు పారిపోయిన ఖైదివి ...."
    సత్యం కంగారుగా అతణ్ణి లోపలకు రానిచ్చాడు. అపరిచితుడు తనే గది తలుపులు వేశాడు.
    "ఇంకా నా గురించి ఏం తెలుసు నీకు?" అన్నాడు సత్యం.
    అపరిచితుడు మాట్లాడకుండా తన జేబులోంచి పాకెట్ రికార్డర్ తీసి బటన్ నొక్కాడు.
    "నేనిచ్చిన మత్తు మందు బాగా పనిచేసిందా-- నీ పగ తీరిందా?" అన్న చంచల్రావు గొంతు రికార్దర్లోంచి వినబడింది. అందులో మొత్తం చంచల్రావు కీ అతడి అనుచరులకీ జరిగిన సంభాషణ అంతా రికార్డాయి వుంది.
    సత్యం భయంగా- "ఇదంతా ఎలా రికార్డు చేశావు?" అన్నాడు.
    'అదంతా తర్వాత చెబుతాను. నువ్వీ బ్యాంకు దోపిడీ లో పాల్గొన్నాక ఏం జరుగుతుందో ఆలోచించావా?" అన్నాడా అపరిచితుడు.
    "ఏం జరుగుతుంది?"
    "మీరు పట్టుబడడం ఖాయం...."
    సత్యం భయపడ్డాడు --" అయితే నేనేం చేయాలి?"
    "నువ్వేమీ చేయొద్దు. ఈ టేపు సాయంతో చంచల్రావు ని నేనే లొంగదీసి ఈ దోపిడీ ఆపిస్తాను. నిన్నెవ్వరూ ఇక బాధించరు. మామూలు జీవితం గడుపుతానని నాకు మాటిస్తే పోలీసులు నీ జోలికి రాకుండా చూస్తాను ...."
    "నేను మామూలు జీవితం గడపకపోతే ?"
    "పోలీసుల కప్పగిస్తాను...."
    అప్పుడు సత్యం నవ్వాడు - "నేను నీ మాటలు నమ్మను. నన్ను పరీక్షించడానికి చంచల్రావు నిన్ను పంపాడు. నేను నమ్మకద్రోహం చేస్తానేమోనని అయన నన్ననుమానించి వుంటాడు. ఎందుకంటె మా మాటలు రికార్డు చేయడం ఆయనకు తప్ప సాధ్యం కాదు...."
    అపరిచుతుడి ముఖం గంబీరంగా అయిపొయింది -- "నువ్వు బాత్రూం లోకి వెళ్ళు. తలుపులు వేసుకో. ఏం మాట్లాడతావో నెమ్మదిగా పైకి మాట్లాడు. బయటకు రా , నీ మాటలు నా రికార్డర్లో విందువు గాని--"
    సత్యం బ్రాత్రూం లోకి వెళ్ళి అపరిచితుడు చెప్పినట్లే చేసి వచ్చాడు. అతడు రాగానే అపరిచితుడు తన టేపు రీవైండు చేసి బటన్ నొక్కాడు. సత్యం గొంతులో "పగలే వెన్నెలా?" అన్న పాట వచ్చింది.
    "అద్భుతం !" అన్నాడు సత్యం అప్రయత్నంగా-- "కానీ ఇదెలా సాద్యం?"
    అపరిచితుడు తన జేబులోంచి చిన్న పిస్టల్ వంటి సాదనం తీశాడు -- "దీనితో ఎవరి వీపుకైనా గురి పెట్టి షూట్ చేస్తే చిన్న బొట్టంత ఎలక్ట్రానిక్ చిప్ చొక్కాకు అటుక్కుంటుంది. ఆ చిప్ ద్వారా నీ చుట్టూ పక్కల ఏ సంభాషణ జరిగినా నాకు అందుతుంది. ఈ రికార్డరు కీ దానికీ వైర్ లెస్ కనెక్షన్ వుంది. ఇది నేనే స్వయంగా తయారు చేసుకున్న పరికరం...."
    "అయితే ఆ చిప్ నాకెప్పుడు తగిలించావు?"
    "నువ్వు వాసుదేవరావు గదిలో తలగడ కింద నుంచి తాళాలు తీస్తున్నప్పుడు ?" అన్నాడా అపరిచితుడు.
    సత్యం తెల్లబోయి -- "అప్పుడు నువ్వక్కడే వున్నావా ?" అన్నాడు.
    'ఆశ్చర్యం తర్వాత! సైన్నెంతగా అభివృద్ధి చెందిందో చూశావా -- ఈ బ్యాంకు దోపిడీని ఆపడానికి నేను కంకణం కట్టుకున్నాను. నువ్వు విజయం పొందగలననుకుంటూన్నావా?" అన్నాడా అపరిచితుడు.
    సత్యం ముఖంలో భయం కనబడింది -- "చంచల్రావు నన్ననుమానించి వేటాడతాడు. ఈ దోపిడీ లో పట్టుబడినా సరే -- ఒప్పుకోక తప్పదు..."
    అపరిచితుడు నవ్వి -- "కంసుడికి శ్రీకృష్ణుడికిలా - చంచల్రావుకీ ఓ మేనల్లుడున్నాడు. అతడి పేరు శివానంద్. అతడు మేనమామను సరైన దార్లో నడిపించాలని చూస్తున్నాడు. ఈ టేపు రికార్డరు అతడే నా కందజేశాడని చంచల్రావుకు చెబుతాను. అంతే -- చంచల్రావు శివానందూ కొట్టుకుంటారు. మధ్య నీకే యిబ్బంది వుండదు. నా రక్షణ లభిస్తే నీకే యిబ్బంది వుండదు. నువ్వు బుద్దిగా ఉంటానంటే వాసుదేవరావింట్లోనే నీకు మళ్ళీ వంటవాడి ఉద్యోగం ఇప్పించగలను...." అన్నాడు.
    "అది అసాధ్యం ...."
    "ఎందుకని?"
    "నేను మంచివాడుగా వున్నప్పుడే అయన నాకు దొంగ తనం అంటగట్టాడు. ఇప్పుడు నేను నిజంగా దొంగతనం చేశాను...."
    అపరిచితుడు నవ్వి -- "వాసుదేవరావు వెండి కంచాల దొంగను నేను పట్టాను. వాళ్ళ వెండి కంచాలు నువ్వు జైలు పాలైన నెలరోజులకే దొరికాయి. అప్పట్నించీ వాళ్ళు పశ్చాత్తాపంతో కృంగి పోతున్నారు. ఈరోజు వాళ్ళు మిగతా సొమ్మంతా జాగ్రత్త చేసుకుని నీకి కొంత డబ్బు మాత్రమే దొరికేలా ఎండుకుంచారనుకున్నావ్ ? అన్యాయంగా జైలుశిక్ష అనుభవించినందుకు ప్రతిఫలమిది!" అన్నాడు.
    "అంటే వాళ్ళకు నేనే వస్తానని తెలుసా?"
    "నువ్వు రమణమ్మను కలుసుకున్నావు. రమణమ్మ నీ గురించి వాళ్ళకు చెప్పేసింది. వాళ్ళు నన్ను పిలిచారు. దీంతో ఏకంగా బ్యాంకు దోపిడీ గురించి కూడా తెలుసుకొవచ్చు గదా అని నేను కాస్త పధకం వేశాను. నిన్ను వాళ్ళు తిరిగి పనిలో పెట్టుకునే షరతు కూడా నేను పెట్టాను...." అన్నాడా అపరిచితుడు.
    'అయ్యా'! తమరెవరో తను ఋణ మెలా తీర్చుకోగలనో " అన్నాడు సత్యం.
    "నన్ను డిటెక్టివ్ వెంకన్న అంటారు. నీకు చేరిన డబ్బు లోంచి ఒక్క వెయ్యి ఫీజు గా యిస్తే నా ఋణం తీరుతుంది...." అన్నాడు వెంకన్న.
    సత్యం అతడికి వెంటనే వెయ్యి రూపాయలూ ఇచ్చి -- "నన్ను నిజంగా వాసుదేవరావుగారు మళ్ళీ పనిలోకి తీసుకుంటారంటారా ?" అన్నాడు.
    "నీకేమైనా సందేహ ముంటే ఈ విషయం విను నువ్వు చేసిన పులుసు ఘుమఘుమలకు మురిసిపోయి -- అందులో మత్తు మందుందని తెలిసి కూడా ఇంటిల్లిపాదీ అది వేసుకుని భోం చేశారు ---" అన్నాడు వెంకన్న.
    సత్యం తెలల్బోయాడు."నేను నీకు సాయపడతాను " అన్న రమణమ్మ మాటలతడి చెవుల్లో గింగురుమనసాగాయి.

                                       ***


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS