"ఎమిటాలోచిస్తున్నావ్ ?" అన్నాడు సత్యం.
"నేను నీకు సాయపదతాను " అంది రమణమ్మ.
2
సరిగ్గా రాత్రి పన్నెండు గంటలకు సత్యం కొట్టు గది లోంచి బయటకు వచ్చాడు. ఒక్క కొట్టు గదిలో తప్ప మిగతా యిల్లంతా అస్పష్టమైన సన్నని వెలుతురుంది. ఇల్లంతా బెడ్ దీపాలున్నాయి.
మొత్తం ఎనిమిది గదుల బంగళా అది!
ఇల్లంతా సత్యానికి బాగా పరిచయమే! అయిదేళ్ళతడా యింట్లో వంట చేశాడు. ఏ గదిలో ఎవరు పడుకుంటారో అతడికి బాగా తెలుసు.
ఇంట్లో వాసుదేవరావు , అతడి భార్య , ఇద్దరు కొడుకులూ, కోడళ్ళు , వారి ముగ్గురు పిల్లలు, రమణమ్మ.
అందరికీ నిర్నీతమైన గదులున్నాయి.
ఇనప్పెట్టె వాసుదేవరావున్న గదిలోనే వుంటుంది. తాళం చెవులు వాసుదేవరావు తలగడ క్రింద వుంటాయి.
సత్యం జేబులు తడుముకుని బటన్ నైఫ్ తీశాడు. ఓసారి బటన్ నొక్కాడు. సన్నని వెలుతుర్లో బాకు తళతళ మెరిసింది.
'అవసరమైతే ప్రాణాలు తీయడాని క్కూడా జంకకూడదు" అనుకున్నాడతడు. తిరిగి బటన్ నైఫ్ మడిచి జేబులోకి తోసేసి వాసుదేవరావు పడుకున్న గదిలోకి వెళ్ళాడు.
గది తలుపులు తీసే వున్నాయి.
ఆ యింట్లో ఎవరి గది తలుపులూ వేసి ఉండవు. గుమ్మానికి తెర వ్రేలాడుతుంటుంది. రెండేళ్ళ పిల్లలు కూడా గదిలోకి వెళ్ళే ముందు తెర కివ,,,,,తలే నిలబడి అనుమతి తీసుకుంటారు. ఆ యిల్లోదిలి ఏడాది దాటిపోయినా జైలు జీవితం అలవాట్లను మార్చినా గదిలో అడుగు పెట్టేముందు సత్యం అప్రయత్నంగా తెర కివతల ఒక్క క్షణం ఆగిపోయాడు.
ఇల్లంతా నిశ్శబ్దం. చీమ చిటుక్కుమన్నా వినిపించేటంత నిశ్శబ్దం.
సత్యం వాసుదేవరావు గదిలో ప్రవేశించాడు.
గదిలో పెద్ద మంచం. మంచాని కటు వైపు వాసుదేవరావు భార్య, ఇటు వాసుదేవరావు. ఇద్దరూ పెద్ద దుప్పటి కప్పుకున్నారు. మనుషుల్లో కదలిక లేదు. మత్తు మందు ప్రభావం కాబోలు -- గాడనిద్రలో వున్నారు.
సత్యం మంచాన్ని సమీపించాడు. జేబులోంచి బటన్ నైఫ్ తీసి బటన్ నొక్కాడు. గదిలో నైట్ బల్బు కాంతిలో చాకు తళతళ మెరిసింది.
భార్యాభర్తల్లో ఎవరికీ మెలకువ రాకూడదు. వస్తే చాకు చూసి బెదిరించి అరవకుండా ఆపాలి. అయినప్పటికీ అరిచారా పొడిచేయక తప్పదు.
చేతిలో చాకు - ఎదురుగా మనుషులు -- అరిస్తే పొడవడం -- ఈ మూడు తలచుకోగానే సత్యంలో సన్నని వణుకు ప్రారంభమైంది. ఇంతవరకూ అతడెన్నడూ యిలాంటి ఘోరం తలపెట్టలేదు. ఆ మాట కొస్తే నేరమే చేయలేదు.
వాళ్ళిద్దరికి మెలకువ రాకూడదని దేవుడిని ప్రార్ధించుకుంటూ రెండో చేత్తో దిండు నేత్తాడు సత్యం.
మంచం మీద మొత్తం మూడు దిండ్లున్నాయి. అవతల దిండు పై తల ఆన్చి వాసుదేవరావు భార్య నిద్రపోతోంది. ఇవతల దిండు పై తల ఆన్చి వాసుదేవరావు నిద్రపోతున్నాడు. మధ్య దిండు ఖాళీగా వుంది. సత్యం వాసుదేవరావు తల అన్చిన దిండు ఎత్తాడు.
వాసుదేవరావు తల కదిలింది -- కానీ మెలకువ రాలేదు.
తలగడ కింద సత్యానికి తాళం చెవులు దొరికాయి. అప్పుడు చేతిలోని చాకుని మించి కళ్ళు మెరిసాయి.
సత్యం తాళం చెవులు తీసుకుని ఇనప్పెట్టె వద్దకు నడిచాడు. ఇనప్పెట్టె తలుపు తెరిచాడు. అన్నిటి కంటే పెద్ద తాళం ఉపయోగించేసరికి సులభంగానే ఇనప్పెట్టె తెరచుకుంది.
తలుపు తెరవగానే సత్యం కళ్ళు జిగేల్ మన్నాయి.
నోట్ల కట్టలు....సరికొత్త పరిరూపాయల నోట్ల కట్టలు....
సత్యం జాగ్రత్తగా డబ్బు లెక్కపెట్టాడు. ఆరువేల ఎనిమిది వందలు.
ఇనప్పెట్టె కు చాలా లాకర్లున్నాయి. వాటిలో నగలుంటాయని సత్యానికి తెలుసు. సత్యం ముందు డబ్బు తీసుకుని జేబులో పెట్టుకున్నాడు. లాకరు తలుపులు తెరవటానికి మిగతా తాళాలతో ప్రయత్నించాడు. ఏ తాళంతో ప్రయత్నించినా లాకర్లు తెరచుకోలేదు.
చేతిలో తాళాలున్నాయి. ఎదురుగా లాకర్లున్నాయి. వాటిలో నగలున్నాయి.
తను వాటికేంతో దగ్గరగా వున్నాడు. అయినా ఏంతో దూరం ....
తర్వాత అతడు ఇనప్పెట్టె మూసి తాళం వేసి మిగతా గదుల్లోకి వెళ్ళాడు. ఎక్కడ చూసినా అందరూ గాడ నిద్రల్లో వున్నారు. అతడి పనికి సానుకూలంగా వుంది. కానీ ఆ డబ్బుకు మించి యింకేక్కడా విలువైనా వేమీ అతడికి దొరకలేదు.
"వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు!" అనుకున్నాడు సత్యం. తనవంటి సామాన్యమైన దొంగలకు వీళ్ళను నిలువునా దోచడం వీలుపడదు.
ఇల్లంతా కలయదిరిగి తన దగ్గరున్న తాళాలతో ఎక్కడా పని జరక్క వాటిని తిరిగి వాసుదేవరావు తలగడ కిందే వుంచి యింట్లోంచి బయటపడ్డాడు సత్యం.
3
అర్ధరాత్రి పూట ఆ యింట్లోంచి బయటపడ్డాక సత్యం తిన్నగా ఓ యింటికి వెళ్ళాడు.
అదొక బంగళా! దాని ముందో పెద్ద గేటు. గేటు పక్కగా గోడకు నేమ్ ప్లేటు.
ఎన్. చంచల్రావు!
చంచల్రావు పేరా ఊళ్ళో చాలా మందికి తెలుసు. అయన ప్రముఖ వ్యాపారస్థుడు. కానీ అయన పేరు తెలియడాని కదొక్కటే కారణం కాదు.
ఎక్కడ యెవరి కెలాంటి కష్టం వచ్చినా చంచల్రావు దగ్గర కేడితే తీరిపోతాయని అంతా చెప్పుకుంటారు. అయన యెందరో పేద విద్యార్ధులకు ఫీజులు కట్టాడు. పుస్తకాలు కొనిపెట్టాడు. కూటికి లేనివాళ్ళకు దానాలు యిస్తాడు. అప్పులూ ఇస్తాడు.
ఆ కారణంగా అయన చేతిలో పదివేలకు తక్కువ కాకుండా ఓట్లున్నాయి. ఆ వూళ్ళో చంచల్రావు ఎన్నికల్లో నిలబడితే తిరుగుండదు. కానీ అయన ఎన్నికల్లో నిలబడడు" ఆయనకు పదవీ వ్యామోహం లేదు. అందుకని పదవీ వ్యామోహం వున్న వాళ్ళాయన చుట్టూ తిరుగుతారు.
దేశంలో ఇందిరా వేవ్, రామారావ్ వేవ్ , రాజీవ్ వేవ్ -- ఏ వేవ్స్ వచ్చినా ఆ ఊళ్ళో మాత్రం ఎన్నికల ఫలితాలు చంచల్రావు వేవ్ ని బట్టే వుంటాయి.
ఆ కారణంగా చంచల్రావు పై వర్గాల్లో చాలా పలుకుబడి వుంది. తన పలుకుబడిని కూడా మంచి పనులకే వినియోగిస్తాడాయన . మధ్యతరగతి వాళ్ళ కుద్యోగా లోప్పించడం , చిన్న చిన్న ఊళ్ళ లో చెరువులు తవ్వించడం, రోడ్లు వేయించడం , బడుగు వర్గాల వాళ్ళ కిళ్ళ స్థలాలు కేటాయించడం ....ఇలాంటి వెన్నో అయన కారణంగా జరిగాయి.
ఇప్పుడు సత్యం చంచాల్రావు యింట్లో అడుగుపెట్టాడు. పేరు చెప్పగానే వాచ్ మాన్ అతణ్ణి లోపలకు పోనిచ్చాడు.
లోపల....
అప్పటికే అక్కడ చంచల్రావు -- నలుగురు మనుషులితో మాట్లాడుతున్నాడు. సత్యం కాస్త ఆలస్యం చేశాడు. సత్యం లోనికి రాగానే అయన నవ్వుతూ -- "వచ్చావా?" నీకోసమే ఎదురు చూస్తున్నాను ...." అన్నాడు.
అయన ఎత్తైన కుర్చీల్లో కూర్చున్నాడు. నలుగురూ కింద కూర్చున్నారు. సత్యం తనూ వాళ్లతో పాటు కూర్చున్నాడు. జైల్నించి పారిపోయి వచ్చేక అతడు చంచల్రావునీ, ఆ నలుగుర్నీ కలుసుకోవడం యిది రెండవసారి!
"నేనిచ్చిన మత్తుమందు బాగా పనిచేసిందా-- నీ పగ తీరిందా?" అన్నాడు చంచల్రావు నవ్వుతూ.
సత్యం తలాడించాడు.
"రేపట్నించి మీ అయిదుగురినీ కలిపి బ్యాంకు దోపిడీ యెలా చేయాలో శిక్షణ ప్రారంభమవుతుంది. మిమ్మల్నో గ్రామం తీసుకు వెడతాను. అక్కడ ఓ డమ్మీ బ్యాంకు పై రిహార్సల్స్ జరుగుతాయి. రోజుకో రిహార్సల్స్ వేయచ్చు కానీ మీరు రెండో రిహార్సల్ కల్లా పర్ పెక్టు అయిపోవాలి" అన్నాడు చంచల్రావు.
సత్యం మిగతా నలుగురితో పాటు తలాడించాడు.
"ఈ బ్యాంకు దోపిడీ ఎందుకూ అని మీలో ఒక్కరు కూడా అడగలేదు" అన్నాడు చంచల్రావు.
ఎవ్వరూ మాట్లాడలేదు.
"దోపీడీలు, దుర్మార్గాలు నా తత్వానికి సరిపడినవి కాదు. అయితే మన సమాజంలో అంతులేని దోపిడీ జరిగిపోతోంది. ఆ దోపిడీని అరికట్టడం కోసమే ఈ దోపిడీ !" అన్నాడు చంచాలరావు.
ఆయన ఆవేశంగా వాళ్ళ కింకా చాలా చెప్పాడు.
ఏ దేశమైనా ఆ దేశంలోని ప్రజలందరికీ చెందుతుంది . అయినప్పటికీ కొందరి వద్ద ఎక్కువగానూ, కొందరి వద్ద తక్కువగానూ డబ్బుండవచ్చు. అందరికీ తిండి, గుడ్డ నీడ మాత్రం వుండాలి. మన దేశంలో అది జరగడం లేదు.
దేశం నిండా బ్యాంకులున్నాయి. అందులోని డబ్బు మొత్తం ప్రజలందరిదీ! కానీ ఆ డబ్బు కొందరి చేతుల్లోనే వుండి పోతోంది. అన్నార్తులకు, అనాధలకు, అసహాయలకు బ్యాంకులు సాయపడ్డం లేదు. పోనీ వారికి సాయపడాలనుకున్న వారికీ సాయపడ్డం లేదు.
"నేను వ్యాపరాలపై యెంతో సంపాదిస్తున్నాను. నా కుటుంబానికి సుఖ జీవితం ప్రసాదించడానికి ఆ సంపాదనంతా అవసరం లేదు. నాకున్న దాంట్లో పదిమందికీ సాయపదలన్నది నా కోరిక. కానీ పదిమందికి సాయం చేస్రే వంద మంది నా చుట్టూ మూగుతారు. ఎవర్నీ కాదనలేను. కానీ యింతమంది కోసం ఎక్కణ్ణించి తేగలను?" అన్నాడు చంచల్రావు.
