` వాళ్ళు ముగ్గురు....
జొన్నలగడ్డ రామలక్ష్మీ
సినిమా చూస్తోంది శిరీష.
సినిమా చాలా ఆసక్తికరంగా వుంది. హీరోయిన్ కి హీరో మీద అనుమానం వచ్చి రహస్యంగా అతడి గదిలో ప్రవేశించింది. గదిలో ఎవ్వరూ లేరు. ఆమె అడుగులో అడుగు వేసుకుంటూ నెమ్మదిగా నడుస్తోంది. ఉన్నట్లుండి వెనుక నుంచి యెవరిదో చెయ్యి భుజం మీద పడింది. హీరోయిన్ ఉలిక్కిపడింది.
శిరీష నిజంగానే ఉలిక్కిపడింది. తన భుజం మీద ఎవరిదో చేయి పడింది. ఆమె పక్కకు తిరిగింది. పక్కన యెవరో యువకుడున్నాడు. అతనామే భుజం మీద చేయి అలాగే వుంచి తన్మయత్వంతో సినిమా చూస్తున్నాడు.
శిరీషకు సినిమా ఎక్కలేదు. ఆమె విసురుగా అతడి చేయి విసిరికొట్టింది. అతను చటుక్కున ఆమె వైపు వంగి "ఏయ్ రాదా -- ఏమిటిది ?" అన్నాడు.
"నాపేరు రాధ కాదు . శిరీష " అందామె.
"అరె! మరి రాధ ఏమయింది?"
"ఏమో, నాకు తెలియదు ...."
"ప్లీజ్ - ఒక్కసారి బయటకు వస్తారా?"
"ఎవరు మీరు? యూస్ లెస్ బగ్గర్ !" జోరుగా అంది శిరీష.
"ఇష్! వెనుక నుంచి ఎవరో విసుక్కున్నారు.
అతను ఓ జేబురుమాల్ను చటుక్కున ఆమె ముక్కుకు గట్టిగా అడిమాడు. ఏం జరిగిందో తెలిసేలోగానే శిరీష స్పృహ తప్పింది. ఆమె కుర్చీలో తల పక్కకు వాల్చేసింది. అతను లేచాడు. ఆమెను కుర్చీలోంచి లేపి నిలబెట్టి, ఎలాగో హాలు బయటకు వచ్చాడు. అక్కడ దియేటరు కాపలా వాడితో "ఈమె నా మరదలు. ఉన్నట్లుండి కళ్ళు తిరిగి పడిపోయింది. టాక్సీని పిలుస్తావా?" అని అడిగాడు.
వాడు పరుగున వెళ్ళి టాక్సీని పీల్చుకుని వచ్చాడు.
అతను టాక్సీలో శిరీషను ఎక్కించి తనూ యెక్కి -- "లతా సదనం" అన్నాడు. టాక్సీ లతా సదనం చేరుకొనే సరికి పదినిమిషాలు పట్టింది. టాక్సీ దిగి అతను యింటి తలుపు తాళం తనే తీశాడు. టాక్సీ వాడికి డబ్బిచ్చి శిరీషను ఇంట్లోకి తీసుకొని పోయాడు. టాక్సీ వాడు వెళ్ళిపోతూ, "డాక్టరు గారి కెవరికయినా చెప్పాలండీ?" అన్నాడు.
"అక్కరలేదు నువ్వెళ్ళు?" అన్నాడతను. వాడు వెళ్ళిపోయాడు.
అతను లోపలకు వెళ్ళి తలుపులు వేసి శిరీషను పడుకోపెట్టిన చోటికి వెళ్ళాడు. ఆమెకు శీతలోపచారాలు చేశాడు. కొద్ది సేపట్లో ఆమెకు స్పృహ వచ్చి కళ్ళు విప్పి, "నేనెక్కడున్నాను?" అనడిగింది.
"ఇది సినిమా హాలు మాత్రం కాదు" అన్నాడతను.
అప్పటి కామే మెదడు పనిచేయడం మొదలు పెట్టింది. అతడి వంక కంగారుగా చూసి "ఎవర్నువ్వు" అంది.
"నా పేరు కుమార్!" అన్నాడతను.
"ఎవర్నువ్వు?" అందామె మళ్ళీ.
"సినిమా హాలు నించి నిన్నేత్తుకోచ్చాను" అన్నాడతను.
"ఎందుకు?"
"ఎందుకేమిటి? నువ్వు అందంగా వున్నావు. వయసులో ఉన్నావు. నిన్నెందుకు తీసుకొస్తాను?"
"అందుకా ?" అందామె అప్రయత్నంగా.
"అందుకే!" అన్నాడతను.
"ప్లీజ్ నన్నొదిలి పెట్టు" అందామె.
"వదులుతాను , రేపుదయం " అన్నాడతను.
ఆమె భయంగా అతడి వంక చూసింది. అతడు తనున్న చోటు నుంచి లేచి బట్టలు మార్చుకుంటున్నాడు.
"ప్లీజ్! నన్నొదిలి పెట్టు " అందామె మళ్ళీ.
"వెళ్ళి స్నానం చేసిరా!" అన్నాడతను అజ్నాపిస్తున్నట్లు.
"ప్లీజ్ ! నన్ను వదిలిపెట్టు" ఆమె మళ్ళీ అంది.
"చెప్పినమాట వినకపోతే కత్తి తీయాల్సుంటుంది" అంటూనే అతడామెకు కత్తిని చూపించాడు.
"స్నానాల గది ఎక్కడ?" అందామె.
గది నానుకునే వుంది స్నానాల గది . ఆమె గదిలోకి గడియ పెట్టుకుని తేలికగా నిట్టూర్చింది.
బయట్నించి అతను అరిచాడు. "నీకోసం వేరే బట్టలుంచాను. స్నానం చేసి బట్టలు మార్చుకోవా ?"
ఆమె బదులివ్వలేదు. స్నానాల గదిలోంచి యెలా తప్పించుకోవడమా అని చూస్తోంది. వెంటి లెటరు వుంది. కానీ చాలా ఎత్తులో వుంది. అక్కడికి వెళ్ళడానికి వేరే సాధనమూ లేదు. ఇప్పుడెం చేయాలి?"
పది నిముషాల తర్వాత అతను బయట నుంచి అరిచాడు. "ఇంకా ఎంతసేపు స్నానం" అంటూ.
ఆమె మాట్లాడలేదు. ఇక్కడ తనకు తాత్కాలికంగా నయినా రక్షణ లభించగలదని ఆమె ఆశ.
అయితే ఆమె చూస్తుండగా స్నానాల గది గడియ విడిపోయి తలుపు తెరచుకుంది. అతనామే వంక కోపంగా చూసి , "నువ్వింకా స్నానం ప్రారంభించనే లేదు -- ' ఆయుధం ప్రయోగించాలా?" అన్నాడు.
"తలుపెలా తీశావు?" అందామె ఆశ్చర్యంగా.
"ఎలాగయినా తీయగలను. లోపల గడియ వేసినా వేయకపోయినా బయట నుంచి తలుపు తీయవచ్చు. లేకపోతె నిన్నెల లోపలకు పంపాననుకుంటున్నావు?"
ఆమె అసహాయంగా అతడి వంక చూసింది.
అతనొక లుంగీ, బుష్ షర్ట్ అక్కడ పెట్టి , "స్నానం చేసి ఇవి కట్టుకుని, రా. పదినిముషాల కంటే పట్టకూడదు. వళ్ళు ఘుమఘుమ లాడి పోవాలి. ఏమాత్రం తెదాలోచ్చినా నే నూరుకోను" అన్నాడు.
"ఏం చేస్తావ్ -- చంపేస్తావా ?" నిర్లక్ష్యంగా అడిగింది శిరీష.
"లేదు , దగ్గరుండి స్నానం చేయిస్తాను ."
శిరీష తలుపు వేసుకుంది. అక్కడున్న ఖరీదైన సబ్బు ఉపయోగించుకుని స్నానం చేసింది. అతనక్కడ పెట్టిన లుంగీ , షర్టు వేసుకుంది. తలుపు తీసుకుని గదిలోకి వచ్చింది. ఇవన్నీ తొందరగా చేయకపోతే మధ్యలో అతను వచ్చేస్తాడేమో నని ఆమె భయం.
ఆమె గదిలోకి రాగానే అతనామెను చూశాడు. భుజం దగ్గరకు వంగి -- "గుడ్- ఘుమఘుమ లాడి పోతున్నావు . కాదూ ఇది చాలదు. వెళ్ళి పౌడరు , సెంటూ రాసుకురా" అంటూ డ్రెస్సింగ్ టేబుల్ చూపించాడు.
శిరీషకు తప్పదని తెలిసిపోయింది. ఆమె అతడు చెప్పినట్లే చేసింది.
"వెరీ గుడ్ !" అని మెచ్చుకున్నాడతడు.
ఆమెను మంచం మీద కూర్చోమన్నాడు. తను ఎదురుగా కుర్చీలో కూర్చుని "ఇలా నువ్వెంత బాగున్నావు?' అన్నాడు.
శిరీష ముడుచుకుపోయింది.
"అలా సిగ్గుపడకు -- మనం కాసేపు మాట్లాడుకోవాలి...."
"ఎంతసేపు ?" అందామె.
"అతను వచ్చేదాకా ?" అన్నాడు కుమార్.
"అతనెవరు ?"
"మేము ఇద్దరం " అన్నాడు కుమార్.
శిరీష మళ్ళీ భయపడింది. మానసికంగా ఆమె కొంతకు సిద్దపడ్డట్లే వుంది. అప్రయత్నంగా "ఇద్దరా?" అంది.
కుమార్ నవ్వి "ఒక్కరైతే ఫరవాలేదనుకున్నావా?" అన్నాడు.
ఏం జవాబివ్వాలో తెలియలేదామెకు. తనే మనుకుంటుందో కూడా ఆలోచించదల్చుకొలేదామే. ఆలోచించాలంటేనే ఎబ్బెట్టుగా వుంది.
"ఎవర్నువ్వు ? నన్నెందుకు బాధించా లనుకుంటున్నావు?"
"నా పగ నీమీద కాదు. నీ తండ్రి మీద?" అన్నాడు కుమార్.
"నా తండ్రి మీదా?"
"అవును - అని అగడతను - "నీ తండ్రికి డబ్బుంది. ఆ డబ్బుతో తన భార్యని సుఖ పెట్టుకుంటే నాకు బాధ లేదు. తన పిల్లల్ని సుఖ పెడితే నాకు బాధ లేదు. కానీ అయన సుఖాన్ని ఎదుటి వాళ్ళ దగ్గర వెతుక్కుంటున్నాడు. అదీ నా బాధ!"
'అందులో తప్పేముంది?" అమాయకంగా అడిగింది శిరీష.
"నేను నా సుఖాన్ని నీ దగ్గర వెతుక్కుంటున్నాను . తప్పిలేదు కదూ?"
"అంటే?" అని ఆగిందామె. తన తండ్రి ఇలా ప్రవర్తిస్తున్నాడంటే ఆమెకు ఏదోలాగుంది.
"నేనున్నస్థానంలో తనుండి - నువ్వున్న స్థానంలోకి చాలా మందిని పంపాడు నీ తండ్రి మాణిక్యాలరావు " అన్నాడు కుమార్.
మాణిక్యాలరావు అదే తన తండ్రి పేరు ....అంటే అతను పోరబడలేదు. సరిగ్గానే చెప్పాడనుకోవాలి!
"నీకేదైనా అన్యాయం జరిగిందా?' అన్నాడు కుమార్. "నా చెల్లెలు నీకంటే ఏడాది చిన్నది. ఆమెను నీ తండ్రి ఇలాగే రప్పించుకున్నాడు."
"నేను నమ్మను" అరిచింది శిరీష.
"నీ నమ్మకంతో నాకు పనిలేదు " అన్నాడు కుమార్.
శిరీష క్షణం అలోచించి "తండ్రి చేసిన తప్పుకు కూతుర్ని శిక్షిస్తావా? నీకు జరిగిన అన్యాయానికి నేనేం చేయగలనో చెప్పు ...." అంది.
"నాతొ కాసేపు మధురక్షణాలు పంచు కోవడమే " అన్నాడు కుమార్.
శిరీష కుమార్ వంక చూసింది. మనిషి సినిమా హీరోలా వున్నాడు. చూడగానే మంచివాడని పిస్తుంది. అలాంటి వాడి లాంటి వాడని వాడని నమ్మడం కష్టం - అనుభవం అయితే తప్ప....
"వేరే దారి లేదా నాకు?" అంది శిరీష.
కుమార్ టైం చూసుకుని "అతను రావదానికింకా గంటన్నర టైముంది...." అని "ఈలోగా మనం కాసేపు కబుర్లు చెప్పుకుందాం" అన్నాడు.
ఆమె భయంగా, బెంగగా అతడి వంక చూసింది.
"నా చెల్లెలు నీ తండ్రి చేతిలో పడిందని తెలియగానే పరుగు పరుగున వెళ్ళాను. అప్పటి కది గదిలో వుంది. నా కేకలు విని అయన బయట కు వచ్చాడు. ఎందుకలా అరుస్తానని తిట్టాడు. నా చెల్లెలు డబ్బు కోసం తన దగ్గరకు వచ్చిందని చెప్పాడు. సాక్ష్యం కావాలంటే ప గంట పోయాక రమ్మన్నాడు. ఆమె వంటి మీద ప్రతిఘటించిన లక్షణాలుండవుట. నేనింకా అరుస్తుంటే నన్నక్కన్నించి గెంటించి వేశాడు. తర్వాత నా చెల్లెలు ఇల్లు చేరింది. ఏం జరిగిందో నాకు చెప్పుకుంది" ఆగాడు కుమార్.
