Previous Page Next Page 
వసుంధర కధలు -11 పేజి 39


    ప్రమాదం తన్ను తరుముతుందని అతడికి తెలుసు. కానీ లీల తనకు మర్నాడుదయం దాకా టైమిచ్చింది. ఈ లోగా తనకు ప్రమాదం లేదు. ఆ ధైర్యంతోనే యిల్లుచేరి పడుకోవాలనుకున్నాడు. ఓ పట్టాన నిద్రపట్టలేదు. పట్టక పట్టక నిద్రపడితే కలవచ్చి మెలకువొచ్చేసింది.
    "పాడుకల!" అనుకున్నాడతడు. మరుక్షణంలోనే అతడి కనిపించచింది-ఇప్పుడు కలగా జరిగింది-రేపు నిజమవుతుంది!
    సమయానికి కల తనను హెచ్చరించింది.
    ప్రమాదం రేపుదయం తనను తరుముతుంది. ఈ లోగానే తను ప్రమాదానికి దూరంగా పారిపోతే?
    ఈ ఆలోచన ముందే రానందుకతడు తన్ను తాను నిందించుకున్నాడు. వెంటనే మంచం దిగాడు. త్వరగా వేషం మార్చుకున్నాడు. జేబులో డబ్బు లెక్కపెట్టుకున్నాడు.
    రెండువేల రూపాయ లున్నాయి.
    "ప్రస్తుతానికి కిది చాలు" అనుకుని ఇల్లు వదిలాడు.
    తెల్లవారుఝామున నాలుగింటి కతడు రైల్వేస్టేషన్ లో ఓ ట్రయి నెక్కాడు. ఆ ట్రయినేమిటో ఎక్కడికి వెడుతుందో అతడు పట్టించుకోలేదు.
    టికెట్  లేకుండా ప్రయాణ మతడికి కొత్తకాదు. ట్రయినలా మూడు గంటలసేపు ప్రయాణం చేసింది. అంతవరకూ అతడికి టికెట్ కలెక్టరు సమస్య తలెత్తలేదు. ఖాళీగా ఉన్న బెర్తుమీద పడుకున్నాడు.
    టికెట్ కలెక్టర్ వచ్చాడు. మోహన్ నిద్ర పోయినట్లు నటించాడు. టికెట్ కలెక్టరతన్ని పలకరించకుండానే వెళ్ళిపోయాడు.
    ఏం జరిగిందో తెలియక మోహన్ ఆశ్చర్యపడ్డాడు.
    క్రింద బెర్తుమీద ఓ యువతి ఉంది. ఆమె మెలకువగా  కూర్చుని కితికీలోన్చ్ని బయటకు చూస్తోంది.
    మోహన్ తనూ క్రిందకు దిగి ఆమె పక్కనే కాస్త దూరంగా కూర్చున్నాడు.
    ఆమె చటుక్కున అతడి వంక చూసి - "మీరు టికెట్ కలెక్టర్ కోసం లేచారా? నా దగ్గిర రెండుంటే చూపించాను. ఆయనింక మిమ్మల్నడగలేదు...." అంది.
    ఆమె మోహన్ దగ్గిర టిక్కెట్టుందనే అనుకుంటోంది.
    "మీ దగ్గిర రెండు టికెట్లెందుకున్నాయి?" అన్నాడు మోహన్.
    "ట్రయిన్ లో ఎనిమిది గంటల క్రితం ఇద్దరెక్కాం. అతడు నన్ను మోసం చేసి సగం దారిలో దిగిపోయాడు" అందామె.
    మోహన్ ఆమె కథ విన్నాడు. ఆమె పేరు సీత. ఆమె గీత దాటింది.
    అప్పుడతడు గమనించాడామె అందగత్తె అని ఐనా మోసపోయిన స్త్రీలు చాలా అందంగా ఉంటారు.
    మోహన్ లో ఆమెపట్ల మళ్ళీ ఆకర్షణ బయలుదేరింది.
    జీవితంలో పురుషుడికి స్త్రీ తోడు అవసరం. అప్పుడే జీవితం పరిపూర్ణమవుతుంది. మోహన్ కా విషయం అర్ధమయింది.
    గీత దాటిన సీత - ఇప్పుడు తనే రావణుడి పాలబడతానో అని భయపడుతోంది. మోహన్ ఆమెకు ధైర్యం చెప్పాడు.
    లీలకు తనంటే కృతజ్ఞత. ఆ కృతజ్ఞతతో ఆమె తన శరీరాన్నర్పించగలదు. కానీ తన్ను ప్రమాదం నుంచి రక్షించలేదు.
    సునందకు తనంటే యిష్టమే! అయితే ఆమె స్వార్ధాన్ని జయించలేదు. తన ప్రాణాలకు మించి స్వార్ధమామెకు ప్రాణం. ఒక వజ్రాలహారం కోసం ఆమె తన్ను ప్రమాదంలో పారేసింది.
    సీత మధ్యతరగతి పిల్ల. ఇల్లు వదలకముందో బాబాయున్నాడు. ఇల్లు వదిలేక ఆమె కెవరూ లేనట్లే లెక్క. మాయలేడిలా మభ్యపెట్టిన ప్రియుడు మధ్యలో మాయం కావడంవల్ల- ఆమె ఆత్మహత్య గురించి కూడా ఆలోచిస్తూంది.
    మోహన్ ఆమెకు క్లుప్తంగా తన గురించి చెప్పుకుని అసాధారణ యువతులతో జీవించడంలో యిబ్బంది ఉంది. నేను సామాన్యున్ని. నువ్వు నాతో ఉంటానంటే మనం సామాన్య జీవితం గడపవచ్చు" అన్నాడు.
    అతడు తన్ను పెళ్ళి చేసుకుంటాననగానే సీత చాలా సంతోషించింది. అయితే తను మనసు చిక్కబెట్టుకునేందుకామె కొంత వ్యవధిని కోరింది.
    మోహన్ అంగీకరించాడు.
    సీత నిర్ణయించిన గమ్యంలో దిగాడు మోహన్. కొత్త జీవితం గురించి కలలుకందామంటే - లీల హెచ్చరిక అతణ్ణి కలవరపరుస్తూంది.
    రైల్వే ఫ్లాట్ ఫారం మీద అతఃడు, సీత.....
    ఎక్కడికి వెళ్ళాలా ఏం చేయాలా అని అతడాలోచిస్తూంటే-
    "మా యింటిపక్క నా స్నేహితురాలుండేది. ఆమెకు వివాహమై రెండేళ్ళయింది. ఆమె యిక్కడే వుంటోంది మేమిద్దరం ఉత్తరాలు రాసుకుంటూంటాం. ఆమె చిరునామా నాకు తెలుసు...." అంది సీత.
    మోహన్ ఆ చిరునామా తీసుకున్నాడు.
    ఇద్దరూ ఆటోలో ఆ యింటికి వెళ్ళారు.
    ఇల్లు డాబుగా ఉంది. భయపడుతూనే సీత. మోహన్ ఆ యింట్లో అడుగు పెట్టారు.
    కాలింగ్ బెల్ వింటూనే ఓ నడి వయస్కుడు తలుపు తెరిచాడు.
    "నా పేరు సీత" అంది సీత.
    "కమిన్" అన్నాడా నడి వయస్కుడు.
    సీత వెనుకనే మోహన్ కూడా లోపల ప్రవేశించాడు.
    నడి వయస్కుడు తలుపులు వేసి - "వెల్ డన్ సీతా! మోహన్ ని తెలివిగా యిక్కడకు తీసుకొచ్చావు" అని అన్నాడు.
    మోహన్ వులిక్కిపడ్డాడు-"ఎవర్నువ్వు?" అడిగాడా నడి వయస్కున్ని.
    "లీల నిన్ను ప్రమాదం గురించి హెచ్చరించింది కదా - ఆ ప్రమాదాన్ని నేనే!" అన్నాడతడు.
    "నాకేమీ అర్ధం కావడం లేదు."
    "నువ్వు లీల దగ్గిర్నుంచి ఏదో కాజేశావు. అందుకు నీకు శిక్ష పడాలి. నిన్ను సీత నా దగ్గిరకు చేర్చింది."
    మోహన్ సీత వంక చూశాడు. ఆమె నవ్వుతోంది.
    "మోసం....అంతా మోసం.....ఆడదాని అందం మోసం.....ప్రేమ మోసం.....నువ్వు మోసం...." అంది మోహన్ మనసు.
    "ప్రస్తుతానికి విశ్రాంతి తీసుకో - నీ శిక్ష కింకా టయిముంది."
    "ఏం చేస్తావ్ నన్ను?" అడిగాడు మోహన్.
    "నువ్వు చావటం ఖాయం. అందుకు హింసించాలా లేదా అన్న విషయం లీల చెబుతుంది" అన్నాడా నడివయస్కుడు.
    "ఎవర్నువ్వు?" అన్నాడు మోహన్.
    "లీలబాస్ కి సహచరున్ని...." అతడు నవ్వాడు.
    మోహన్ చుట్టూ చూశాడు. ఈ విధంగా తాను శత్రువ్యూహంలో చిక్కుకుంటానని అతడనుకోలేదు.
    "నాకు తప్పించుకునే మార్గం లేదా?"
    "తప్పించుకునేందుకీ యింటి తలుపు లెప్పుడూ నీ కోసం తెరిచే ఉంటాయి. తప్పించుకుందుకు ప్రయత్నిస్తే మాత్రం యమధర్మరాజుకు కూడా తెలియని చిత్రహింస లకు గురవుతావు. కాబట్టి బుద్ధిగా ఉండు" అని అక్కన్నించి వెళ్ళిపోయాడు నడివయస్కుడు.
    "నువ్వు మోసగత్తెవు" అన్నాడు మోహన్ సీతతో.
    "నేను నా డ్యూటీ చేశాను" అంది సీత.
    "నీ డ్యూటీలో మోసముంది" అన్నాడు మోహన్.
    "మోహన్! డ్యూటీ కోసం నిన్ను మోసగించినా ట్రయిన్ లో నీ కళ్ళలోని నిజాయితీ చూసి నిన్ను ప్రేమించాను. నేను నిన్ను మోసం చేయకపోయినా నువ్వు తప్పించుకోలేవు. నిను రక్షించగల శక్తి నా ప్రేమ బలానికే ఉంది. నా ప్రేమ బలమైనదయితే నువ్వు రక్షింపబడతావు. నా మనసు నీ క్షేమాన్ని కోరుతోంది. నా కోర్కెలోని బలం మృత్యువుకీ నీకూ మధ్య అడ్డు గోడలా నిలబడగలదు.... అంది సీత.
    "నేను రక్షించబడాలంటే అవకాశమేమిటి?" అడిగాడు మోహన్ ఆశగా.
    "నాకు తెలిసి ఏ అవకాశమూ లేదు...."
    మోహన్ నిట్టూర్చాడు. ఒకసారి సహ్త్రువు బలం తెలిసింది కాబట్టి అతడక్కన్నించి పారిపోయే ప్రయత్నం కూడా చేయలేదు.
    అలా అతడా యింట్లో నాలుగురోజు లున్నాడు.
    నాలుగు రోజుల తరవాతే అతడు మళ్ళీ నడి వయస్కున్ని చూశాడు.
    "నీ అంతటి అదృష్టవంతుడుండడు. నీ ప్రాణాలు దక్కాయి" అన్నాడతడు.
    "ఏం జరిగింది?"
    నడి వయస్కుడు చెప్పింది విని మోహన్ ఆశ్చర్య పోయాడు.
    బాస్ కు లీలమీద అనుమానం వచ్చింది. లీలకు చెప్పిన రహస్యాలు శత్రువులకు చేరుతున్నాయి. అదెలా జరుగుతుందో తెలియలేదు. మోహన్ కారణంగా ఆ రహస్యం బట్టబయలయింది.
    లీలకు బహుమతిగా లభించిన వజ్రాల హారంలో ట్రాన్స్మిటర్లున్నాయి. వాటి ద్వారా బాస్ మాఎతో మాట్లాడే మాటలన్నీ శత్రువులు వినగల్గుతున్నారు. ఇటీవల లీలకు అప్పగించబడిన ప్రతి విశేషమూ శత్రువులకు ముందుగా తెలిసింది. వజ్రాల హారం పోయాక - ఆ విశేషం తెలియలేదు. బాస్ అనుమానం ఆ వజ్రాల హారం మీదకు అంతవరకూ పోనేలేదు. ఇప్పుడు సునంద కప్పగించబడిన పనులు శత్రువుకు ముందుగా తెలిసిపోతున్నాయి. బాస్ సునంద నుంచి వజ్రాలహారం సంపాదించి ట్రాన్స్ మీటర్లు కనుగొన్నాడు.
    "అంటే సునంద, లీల-ఒకే బాస్ వద్ద పనిచేస్తున్నారా?" అన్నాడు మోహన్ ఆశ్చర్యంగా.
    "అవును కానీ ఆ విషయం వజ్రాలహారం గురించి బైటపడేదాకా వాళ్ళకే తెలియదు. ఇప్పుడు బాస్-ఆ వజ్రాలహారం బహుమతిగా యిచ్చినవాడి వేటలో పడ్డాడు. నిన్ను క్షమించి వదిలిపెట్టడమే కాకుండా నువ్వేం కోరినా యివ్వదల్చుకున్నాడు...." అన్నాడు నడివయస్కుడు.
    "అంటే?" అన్నాడు మోహన్.
    "నీ కారణంగా సునంద అనుమానం నించి తప్పించుకుంది. లీలకు బాస్ చేతిలో చావు తప్పింది. వాళ్ళు నిన్ను ప్రేమిస్తున్నారు. వాళ్ళలో ఎవరినైనా నువ్వు కోరుకోవచ్చు...." అన్నాడు నడివయస్కుడు.
    సునంద, లీల-భయంకర విషవలయంలో ఉన్నారు. వారిలో ఎవరిని కోరినా వారితో పాటు తానూ ఆ విషవలయంలో చిక్కుకుని పోతాడు. అందులోంచి తప్పించుకుని హాయిగా బ్రతకాలంటే....
    అప్పుడు మోహన్ సీతను చూశాడు.
    సీత కూడా భయంకర విషవలయంలోనే వుంది. కానీ ప్రేమ బలంపేరు చెప్పిందామె. ఆమె నమ్మకం నిజమయింది.
    "ఆలోచించుకోవాలా?" అన్నాడు నడివయస్కుడు.
    "అవసరంలేదు. నాకు సీత కావాలి"- అన్నాడు మోహన్.
    నడివయస్కుడు సీతవంక చూశాడు. ఆమె ముఖంలో ఆశ్చర్యంలేదు.

 

                             -:అయిపోయింది:-


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS