Previous Page Next Page 
ఆచరణ లో అభ్యుదయం పేజి 40

   
    గది లోంచి పాప ఏడుపు ఆగకుండా వినిపిస్తోనే వుంది. ' 'ఇంకా నీ పని కాలేదా ఏం చేస్తున్నావు.' అంటూ వంట గదిలో వున్న కళ్యాణి కి వినిపించేలా అన్నాడు.
    అక్కడ నుంచీ సమాధానం రాలేదు. కళ్యాణి వచ్చి పాపని ఎత్తుకున్న జాడ గాని మరే అలికిడి గాని లేవు.    
    'కళ్యాణి.' ఈసారి ఇంకాస్ట గట్టిగా పిలుస్తూనే పేపరు కుర్చీలో పడేసి లేచి లోపలికి వెళ్లాడు.
    అప్పటికి పాప ఏడుపు తారాస్థాయి కి అందుకుంది. గబగబ గదిలోకి వెళ్లి వుయ్యాలలో పాపని చేతుల్లోకి తీసుకుని--
    'ఎంత పండగ అయితే మాత్రం పాప ఏడుపు వినిపించ నంతగా పనిలో మునిగి పోవాలా-- అంతగా చేతిలో పని కాస్సేపు  వదిలి పెట్టి రావచ్చుగా.' అంతకు ముందే నిద్ర లేచిన పాప తండ్రి ఎత్తుకోగానే అతని బట్టలు కాస్తా తడిపేయటం తో చిరచిర లాడుతూ పాపని అలా చేతుల్లో పట్టుకునే వంట గదిలో కి వెళ్లాడు.
    కళ్యాణి అక్కడ లేదు-- 'అరె, ప్రొద్దుటే ఎక్కడికి వెళ్ళింది? ఇంకా భోజనాలయినా కాలేదు.' అనుకున్నాడు--
    స్టౌ ప్రక్కన గట్టు మీద గిన్నెలలో నూ పళ్ళాలలోనూ వంటకాలన్నీ మూటలు పెట్టి వున్నాయి. సన్నటి సెగ మీద స్టౌ మీద వుడుకుతున్న మామిడికాయ పప్పు ఘుమఘుమ లాడి పోతూ అతని నోరు వూరించేస్తోంది--
    తిండి మీద ధ్యాస పడి తన సంగతి మరిచి పోతాడేమో నని కాబోలు పాప గొంతు ఇంకా హెచ్చింది ఇల్లు ఎగిరిపోయేలా ఎడ్చేస్తోంది.
    'అబ్బ ఈ గదిలో మరీ వేడిగా వుంది' అనుకుంటూ వరండాలోకి వచ్చాడు-- 'ఊరుకో అమ్మా-- ఊరుకో -- ఇదుగో ఈ గిలక చూడు-- ఫాన్ వేస్తా నుండు , గాలి వస్తుంది.' అని గబగబా మాట్లాడేస్తూ గలగల ఆడిస్తూ ఊ హైరాన పడిపోతున్నాడు-- అప్పుడు వచ్చింది కళ్యాణి-- పరుగు లాంటి నడకతో పెరటి గుమ్మం లోంచి ఒక్క వుదుటున వచ్చి అతని చేతిలోంచి పాపని తీసుకుంది.
    'ఇంతసేపూ ఎక్కడికి వెళ్లావు?' నుదురు చిట్లిస్తూ విసుగ్గా అడిగాడు.
    ఏడుస్తున్న పాపని అలాగే వో చేత్తో ఎత్తుకుని మరో చేత్తో గ్లాసులోకి పాలు కలుపుతున్న కళ్యాణి ఆ ప్రశ్న వినిపించు కొనట్లే వుండి పోయింది.
    'నిన్నే? అడుగుతుంటే సమాధానం చెప్పవేం?' ఈసారి అతని గొంతులోకి కాస్త కఠినత్వం వచ్చింది.
    కలిపిన పాలు సీసా లో పోసి, పాపని ఒడిలో పడుకో బెట్టుకుని కూర్చుని, సీసా పాప నోటికి అందిస్తూ అంది, 'ఆ, ఎక్కడికీ లేదు ....మణికి వాళ్ళకి ఏవో కూరలూ అవీ ఇచ్చి వద్దామని వెళ్లాను.'
    'ఏం? ఇవాళ వాళ్ళింట్లో వంట చేసుకోలేదా?' మురళీ గొంతు మరింత కటువుగా, వెటకారంగా పలికింది.
    'బాగానే అడిగారు....పసిపిల్ల తంటాలు పడుతోంది కదా, పోనీ కాస్త గుత్తి వంకాయ కూర, అవి ఇచ్చిరావాలని పించింది. -- ఏదో ఇవాళ పండగ కనక...' భర్త ధోరణికి కాస్త తెలతెల్ల బోతూ నసిగేసింది.
    'ఇంకా బాలెంత రాలివి....అయినా ఇంట్లో పని చేసుకోక తప్పదు అని ఏదో నాకు చేతనయినా సహాయం కూడా చేస్తూ, ఎలాగో మరి కొద్ది రోజులు నీకు కాస్త ఒళ్ళు అరెదాకా జాగ్రత్తగా ఉండమ్మా అని లక్ష విధాల చెప్తుంటే నువ్వు పండుగ పండగ అంటూ ఇంట్లో వాళ్ళ కోసం చెయ్యటమే కాకుండా వూరందరికీ కూడ సంతర్పణ చేస్తుండు....హైరాన పడి ఆరోగ్యం చెడగొట్టు కుని, ఆ తరువాత మంచం ఎక్కు.'
    కళ్యాణి మొహం చిన్న బోయింది. 'సంతర్పణ చెయ్యటం ఏమిటండి-- మనకోసం చేసిన వాటిలోనే, కాస్త పాయసం, బజ్జీలు, గుత్తి వంకాయి కూర ఇచ్చాను-- నేనయినా బరువు పనులు పెద్ద పిండి వంటలు ఏం చెయ్యలేదు.' తలవంచుకుని మెల్లిగా అంది.
    'మాటకి మాట బాగా సమాధానం చెప్తావు -- ఎంత తేలిక పనయినా మాత్రం, ఇద్దరికీ చెయ్యటం పదిమందికి చెయ్యటం ఒక్కటే అవుతుందా?....పోనీ చేసిన దానివి ఏ మధ్యాహ్నమో వెళ్లి ఇవ్వకూడదా ఏమిటి.....'
    'ఇచ్చేదేదో వాళ్ళు భోజనాలు చెయ్యక ముందే ఇస్తే బాగుంటుందని ...రెండు నిముషాలలో వెళ్లి రావచ్చు ను కున్నాను-- తీరా వెళ్లేసరికి మణి ఏడుస్తూ కూర్చుంది. -- చారు గిన్నె దింప బోతుంటే పట్టకారు జారిపోయిందిట. ఆ మరుగుతున్న చారంతా ఆ పిల్ల చేతి నిండా పడిపోయింది-- చెయ్యి మండుతూ అక్కగారు ఏడుస్తుంటే మిగిలిన పిల్లలు బిక్క మొహాలు వేసుకుని నిలబడిపోయారు. పాపం వాళ్ళని చూస్తుంటే జాలేసింది-- అయినా ఏం చెయ్యగలను..... స్టౌ మీద కూర వేగుతోంది. 'దాంట్లో కాస్త ఉప్పూ కారం జల్లి వోసారి కలియ బెట్టి ఆ మూకుడు దింపి కింద పెట్టి వచ్చాను. దాంతో కాస్త ఆలశ్యం అయింది.'
    'ఏం వాడేమయాడు ఆ గోపాలరావు-- శలవు పూట ఇంట్లో గోళ్ళు గిల్లుకుంటూ కూర్చోక పొతే ఆ పిల్లలకి కాస్త సాయం చెయ్యకూడదూ......'
    'ఆయన మణి చేతికి మందు వ్రాస్తున్నారు.....కూర మాడి పోతోందని నేనే కల్పించుకుని కాస్త చూసి వచ్చాను.' పాప నుదుటి మీద పట్టిన చెమటని కొంగుతో తుడుస్తూ అంది....ఈ కాస్త డానికి భర్త  అంత చిరాకు పడి పోతున్నాడు ఏమిటి ఆని అనిపించినా, ఒకసారి మొదలు పెట్టింది అంటే పాప ఎంతలా ఏడుస్తుందో ఆ ఏడుపూ వింటూ అతను ఎంత హడావిడి పడిపోతాడో తెలుసు కనక మళ్లీ అంతలో సరిపెట్టే సుకుంది.
    మురళీ మాత్రం వూరుకోలేదు.
    'అంతేలే-- మన యింట్లో ఏ పని చేస్తే అలసి పోతావో అన్నట్లు ఎంతో అపురూపంగా నేను చూసుకుంటాను-- నువ్వెళ్ళి వూరు వాళ్ళందరి పనులు చేసి వస్తావు-- ఇంట్లో కట్టుకున్న మొగుడి కి పండగ పూట పిండి వంటలతో వెల్టికి భోజనం పెడదాము అన్న ధోరణి లేదు, కడుపు పుట్టిన బిడ్డ ఆకలికి ఆగలేక గొంతు తడారిపోయేలా ఏడుస్తుంది అన్న జ్ఞానం లేదు. వూళ్ళో వాళ్ళకి వాళ్ళ పిల్లలకి వేళ దాటి పోకుండా అన్నీ అందించి అమర్చి వస్తావు....' పాప తడిపేసిన షర్టు బనీను ఒంటికి చల్లగా తగులుతూ యింకా చిరెత్తి పోయేలా చేస్తున్నాయి అతనికి. 'అయినా పాప ఏడిస్తే ఎత్తుకుని ఆడించటానికి ఇంట్లో నౌకర్ని నేను వున్నానుగా-- నువ్వు గంటల తరబడి పెత్తనాలు  చేసి వస్తావు.
    కళ్యాణి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి .
    'ఇప్పుడెం జరిగిందని ఇంతంత మాటలనటం? పండగ పూట తన చేత కంట తడి పెట్టించటం? ఈ ఉగాది రోజు ఎలా గడిస్తే ఆ సంవత్సరం అంతా అలాగే గడుస్తుందంటారు-- తను ఈరోజు ఎంత  సంతోషంగా గడపాలను కుంది . తను అడగకుండానే పట్టుచీర కొని తెచ్చి, ఉదయం ఎంతో వుత్సాహంగా నిద్రలేచి, ఆ తరువాత ఆ సరదాగా తన పనిలో సాయం చేసిన భర్త తీరా భోజనానికి కూర్చో బోయే ముందు తగూ పెట్టుకున్నాడు-- ఇది ఎంత పెద్ద విషయమా? పాపా లేచే వేళ అయిందని తనూ అనుకుంటూనే వుంది-- ఒక్కొక్కసారి గాడంగా నిద్ర పోయిందంటే అలాగే పడుకుంటుంది చాలాసేపు-- అందుకని పాపా లేచిం దాకా వుండి ఆ తరువాత దానికి పాలు పట్టి అంతా అయాక వెడితే ఈలోగా వాళ్ళ భోజనాలు అయిపోతాయేమో , అయినా ఎంత ఒక నిముషంలో వెళ్లి రాలేనా అనుకుంటూ హడావిడి పడి వెళ్ళిన మాట నిజమే. తీరా వెళ్ళాక అక్కడ మరో అయిదు నిమిషాలు ఆలశ్యం అయింది. అదే పెద్ద నేరమై పోయిందా?' తలవంచుకుని పాపకి పాలు పడుతూనే ఆలోచిస్తోంది కళ్యాణి.
    మురళీ ఆ షర్టూ, బనీనూ విడిచి లుంగీ చుట్టి కళ్యాణి మొహం మీదకి విసిరి నట్లే గిరవాటు వేసి ఆ తరువాత బాత్ రూమ్ లోకి వెళ్లి ఒళ్ళు కడుక్కుని వచ్చి గదిలో బట్టలు వేసుకుంటూ చిరాగ్గా తనలో తను అనుకుంటున్నట్లు అతను అనే మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. 'ఒళ్లు పొగరెక్కి బుద్ది లేకుండా ప్రవర్తించి పెళ్ళాన్ని పొట్టన పెట్టుకున్నాడు-- చేసుకున్నవాడు మరి అనుభవించవద్దా-- పండగలూ, పిండి వంటలూ, అచ్చట లూ, ముచ్చటలూ తీరమంటే ఎలా తీరుతాయి. ఇరుగు పొరుగు ఎన్నాళ్ళ ని ఆ సంసారాన్ని కనిపెట్టి వుండగలరు -- వెల్టి కి అన్ని రుచులతో నూ భోజనం అమరాలంటే ఏ వంట మనిషినో పెట్టుకుంటే తీరిపోతుంది. అంతే కాని ఆ పిల్ల ముండ మణి ఏం చేయగలదు? లేకపోతె హాయిగా మళ్లీ పెళ్లి చేసుకుంటే అన్నీ సౌకర్యాలూ అమరుతాయి.....'
    వింటున్న కళ్యాణి మనస్సు చివుక్కు మంది. బాధతో ముడుచుకు పోయింది. 'ఏమిటీ ఈయన ధోరణి.' అనుకుంది.
    'మీరేమీ దిగులు పడకండి వదిన గారు. మీ పిల్లలకి ఏ లోటు జరగకుండా మేమంతా చూస్తాము. ' అంటూ ఆవాళ అంత అభిమానంగా అక్కయ్యతో మాట్లాడిన మనిషికి ఇవాళ వాళ్ళ పట్ల రవంత సానుభూతి అయినా లేకుండా పోయిందా? నిజమే నిత్యం వుండే ఇబ్బందికి ఎవరు మాత్రం ఏం చేయగలరు  అని అడగొచ్చు-- రోజూ ఎలాగూ  వీలు కాదు. కాస్త ఇలాంటి సమయాలలో నయినా ఏదో ఇరుగు పొరుగూ చేదోడూ వాదోడూ అన్నమాట లేకపోతె ఎలా...' ఆలోచిస్తూనే పాపకి పక్క వేసి పడుకోబెట్టి , తమ ఇద్దరికీ కంచాలు పెట్టి వడ్డించి మురళీని పిలిచింది.
    అతను మరేమీ అనకుండా వచ్చి కూర్చున్నాడు. ఇద్దరూ మౌనంగానే భోజనం అయిందని పించి చేతులు కడుక్కున్నారు.
    ఆ తరువాత పాప ప్రక్కలో వెళ్లి పడుకుంది కళ్యాణి, ఆమె ప్రాణం వుసూరు మంటోంది-- కొత్త చీర కట్టుకోవాలి అనే వుత్సాహం ఎప్పుడో చచ్చిపోయింది. ఉదయం పసుపు పెట్టి స్టాండ్ మీద పడేసిన చీర వంక చూస్తూ అనుకుంది.
    'నిన్న కట్టుకోమంటే ఒక్కరోజు ఆగలేరా అన్నాను. ఇవాళ ఇలా అవుతుందని నాకు చిన్న వూహ మాత్రంగా కూడా తెలియదు కదా -- ముందురోజు జరిగేదే అన్న మాటేమిటి ముందు రాబోయే క్షణం లో ఏం జరుగుతుందో వాళ్ళకేం సంభావిస్తుందో మానవ మాత్రులకు తెలుసుకోలేరు-- ఈరోజు ఇలా గడవాల్సి వుంది అంతే ' అనుకుంది.
    'కొత్త చీర కట్టుకోలేదెం' అని మురళీ కూడ అడగలేదు, తన మానాన తను పేపర్లూ పుస్తకాలు చదువు కుంటూ కూర్చున్నాడు.
    ఆ తరువాత నాలుగైదు రోజుల దాకా ఆ భార్యా భర్తలు అలా ఎడ మొహం  పేడ మొహంగానే గడిపారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS