Previous Page Next Page 
ఆచరణ లో అభ్యుదయం పేజి 39


    'ఊరికే అనటమే కాదు. మా మణి తలుచుకుంటే నిజంగా కూడా చేస్తుంది. ఎటొచ్చి వాటిలో రుచీ అదీ ఎలా వుంటుందో మాత్రం చెప్పలేం.' గోపాలరావు కూడ నవ్వుతూ సమాధానం చెప్పాడు లోపలికి వస్తూ.
    "ఇంకా నయం -- చిన్నపిల్ల చేసి పెట్టిందే చాలు అనుకోకుండా ఇంకా వంకలు కూడా పెడతామా?' అంది కళ్యాణి.
    'ఏం? బాగా అయిందా.' అంది మణి తండ్రితో గారంగా.
    అంతా సరదాగా నవ్వుకున్నారు.
    'రండి మా పాపని చూద్దురు గాని.' అని మురళీ గోపాలరావు ని పాప ఉయ్యాల తొట్టి దగ్గరగా తీసుకు వెళ్లాడు.
    కొద్దిగా ముందుకి వంగి తదేకంగా పాపనే చూస్తున్న గోపాలరావు తో, 'రావు గారూ మీరు చెప్పండి పాప ఎవరి పోలికో ' అన్నాడు వాసు.
    'ఇంత పసిగుడ్డు కి అప్పుడే పోలికలు ఏం చెప్పగలం?' అంటున్న గోపాలరావు గొంతు కొద్దిగా వణికి నట్లు కావటం అతని మొహంలో ఏవో నీడలు పరుచుకున్నట్లు కావటం అటు వేపు మంచం మీద పడుకున్న కళ్యాణి ఒక్కటే గుర్తించ గలిగింది.
    అతను అలా ఎందు కయ్యాడో కారణం గ్రహించ గలిగిన కళ్యాణి బరువుగా నిట్టురుస్తూ జాలిగా అతని వేపు చూడ బోయింది. కాని అప్పటికే గోపాలరావు మామూలుగా అయిపోయాడు. అరక్షణం క్రితం తనలోంచి బయటపడిన బలహీనత ని ఎవ్వరూ గుర్తించకూడదన్నట్లు లేని వుత్సాహం నవ్వూ తెచ్చుకుని ' సరే నా మట్టుకి నాకు ఎలా అనిపిస్తుందో చెప్తాను. ముక్కూ, నుదురూ మీవి, కళ్ళూ పెదవులూ మా మరదలివి కదూ' అన్నాడు  మురళీ తో, చనువుగా అభిమానంగా నవ్వుతూ ఇద్దరి వంకా చూస్తూ.
    'అతను చెప్తున్నా తీరు, ఆ నవ్వూ మురళీ కి నచ్చలేదు. అయినా యెలాంటి అయిష్టత ని మొహంలో భావాలలో కాని, మాటలలో కాని వ్యక్తం చేయకుండా -----
    'ఏమో చూడాలి మరి' అన్నాడు.
    'ఇప్పుడే బాగా చూసీ చెప్పరాదూ?' శారద వేళాకోళం చేసింది మురళీని.
    అందరూ పక్కుమని నవ్వుతుంటే కళ్యాణి సిగ్గుగా కళ్ళు వాల్చేసు కుంది.
    అంతా అలా సరదాగా నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటుండగా కమల వచ్చింది.
    ప్రొద్దుటి నుంచి ఎప్పుడెప్పుడు వస్తానా నీ కూతుర్ని చూస్తానా అని ఒక్కటే ఇదయి పోతున్నా అనుకో....' కమల మాటలు పూర్తి కాకుండానే అందుకుంది కళ్యాణి.
    'అయితే నన్ను చూడటానికి రాలేదన్న మాట.'
    'ఇదిగో! ఒక్క మాటకి అన్ని అర్ధాలు తీస్తే ఎలా -- ఊ, ఊ చూపించు మీ అమ్మాయిని...' నవ్వుతూ అంటూ దగ్గరగా వెళ్ళింది.
    'ఎవరి పోలిక అంటావు?'
    'నువ్వే చెప్పు--' అంది కళ్యాణి గర్వంగా పాప వంక చూసుకొంటూ.
    'సరిపోయింది ...ఎక్కడో  చూసిన మొహంలా వుందీ అనుకుంటానే, కానీ చటుక్కున పోలికలు పట్టడం నా కసలు చేతకాదు. కొంతమంది అదేమిటో కళ్ళూ ముక్కూ నోరూ చివరికి చేతి వెళ్ళు కాలి వేళ్ళు కూడా ఎవరి పోలికో యిట్టె చెప్పేయగలుగుతారు.'
    'ఎవరో దాకానో ఎందుకు? ఇప్పుడే గోపాలరావు గారు చెప్పారు.' అంటూ వివరాలు అందించింది శారద.
    "నిజంగానా?' అంటూ మరోసారి పాప వంక చూసి-- 'అవునవును. ఇప్పుడు చూస్తుంటే నాకూ అలాగే అనిపిస్తోంది.' అంది కమల.
    కాస్సేపు కూర్చుని వాళ్ళంతా వెళ్ళిపోయారు. మురళీ మంచం ప్రక్కగా వున్న కుర్చీలో కూర్చుని కళ్యాణి వంకే చూస్తూన్నాడు.
    'ఏమిటలా చూస్తున్నారు?' అంది కళ్యాణి.
    "ఏం లేదు.' అనేశాడు ముక్తసరిగా.
    తరువాత మరి కాస్సేపు కూర్చుని ఏదో మాట్లాడి వెళ్ళిపోయాడు మురళీ.
    మర్నాడు ఏడు గంటల ప్రాంతంలో కాఫీ తీసుకొచ్చాడు మురళీ.
    'మీరు త్రాగారా?' ఫ్లాస్కు లో కాఫీ గ్లాసులో పోసి తనకి ఇస్తుంటే అడిగింది కళ్యాణి.
    'ఆహా-- నేను తాగ్గా మిగిలిందే నీకు' హాస్యంగా అంటూ ఫ్లాస్కు బల్ల మీద పెట్టాడు.
    'ఏడు గంటలు కొడితేనే నిద్ర లేచేవారు కాదు. ఇప్పుడు నాకోసం త్వరగా లేచి కాఫీ చేసి తీసుకొస్తున్నారు--' ఒక్కో గుక్క మెల్లగా తాగుతూ అంది కళ్యాణి--అ తనకి శ్రమ అవుతోంది అన్న ధోరణిలో.
    'కనిపెట్టేశావులే-- ఎలాగయితే నేం ...' సరదాగా విసుక్కున్నాడు మురళీ.
    'పాపకి మంచి పేరు సెలెక్టు చెయ్యాలి కళ్యాణి,' హటాత్తుగా గుర్తు వచ్చినట్లే అన్నాడు మురళీ.
    'మీరే చెప్పండి.'
    'ప్రతిదీ నామీదకి తోసేస్తావు -- ఆ మాత్రం ఆలోచించటాని క్కూడా బద్ధకం అయితే ఎలా?' మురళీ వేళాకోళం చేస్తుంటే 'అయితే నేను చెప్పింది పెడతారా?' అంది కళ్యాణి ఊరుకోకుండా.
    'ఏమిటది చెప్పు.'
    'రమ.'
    "రమ' ఆ పేరు పైకే ఒకసారి అనుకోని' ఒకే.' అన్నాడు మురళీ. కళ్యాణి చిన్నగా నవ్వింది.
    
                              *    *    *    *
    రమకి నెల నిండి రెండవ నెల జరుగుతోంది....
    మురళీ ఆఫీసులో ఉన్నంత సేపూ ఎలా కూర్చుంటాడో గాని ఇంట్లో వున్న సమయంలో ఒక్క నిమిషం అయినా పాపని ఉయ్యాలలో పడుకో బెట్టాలంటే అతని మనస్సు ఒప్పదు.
    'ఇదుగో-- మీరు అస్తమానూ దాన్ని అలా ఒడిలో పడుకో బెట్టుకుని ఎత్తు మాప్పెశారంటే అనక నేను అవస్థ పడాలి. మీకేం ప్రొద్దుట కాస్సేపు సాయంకాలం కాస్సేపు ఇంట్లో వుంటారు. ఇంక మధ్యాహ్నం అంతా ఏ పనీ లేకుండా దాన్ని ఎత్తుకు కూర్చో వాలంటే యెలా కుదురుతుంది నాకు.' అంటుంది కళ్యాణి.
    ఇంక పాపకి ఆకలి వేసినప్పుడు చూడాలి...కళ్ళు మూసుకుని పడుకున్నంత సేపూ పడుకుని ఆ తరువాత ఆకలి వేసి ఏడుపు మొదలు పెట్టిందంటే , పాలు కలుపుకుని వచ్చే లోపునే ఇల్లు యెగర గొట్టేస్తుంది. ఎవ్వరు ఎత్తుకున్నా ఊరుకోదు.
    'పాల వేళ కాగానే కలిపి వుంచవద్దా--' అది ఏడుపు మొదలు పెట్టాక అప్పుడు కలపటం మొదలు పెడతావు నువ్వు.' అంటాడు మురళీ.
    'బాగుందండీ. ఇంకా నిద్దర పోతోంది కదా, ఇప్పట్నుంచి కలిపి వుంచటం ఎందుకని వూరుకున్నాను. వో నిమిషం ఏడిస్తే ఏమీ అరిగి పోదులెండి -- దాన్ని సముదాయించటం మాట ఎలా వున్నా మిమ్మల్ని సముదాయించ లేకపోతున్నాను నేను....' అంటూ నవ్వుతూనే విసుక్కుంటుంది కళ్యాణి.
    తను పలకరించగానే పాప నవ్వేసరికి పసివాడి లాగే సంబరపడి పోతాడు మురళీ. 'అప్పుడే నన్ను గుర్తు పట్టేస్తోంది-- నేను ప్రక్క నుంచి వెళ్తూ తనని పలకరించక పోయినా సరే నన్ను చూసి తనే నవ్వేస్తోంది.' అంటాడు మురిసి పోతూ.
    తను కోరుకున్నట్లు పెళ్లి చేసుకో వటం , తల్లి కావటం-- అంతా తలుచుకుంటుంటే వెయ్యి జన్మలలోని ఆశలు ఫలించినంత సంతృప్తి, గర్వం కలుగుతాయి కళ్యాణి కి. ఆ చిన్నారి నవ్వులో కల్యాణి కి కోటి అందాలు కనిపిస్తాయి.

                   

                                    16
    తెల్లవారితే ఉగాది పండుగ. ఆవాళ సాయంకాలం ఆఫీసు నుండి వస్తూ బజారు వెళ్లి పాపకి ఓ పల్చటి వాయిలు గౌను, కళ్యాణి కి వో సిల్కు చీరా తెచ్చాడు మురళీ.
    'ఇప్పుడు నువ్వు బజారు కి ఎలాగూ రాలేనంటావు -- అందుకని నేనే ఏవో తెచ్చేశాను. ఎలా వున్నాయో చూడు. ' అంటూ రెండు పెకట్లు కళ్యాణి చేతిలో పెట్టాడు.
    కళ్యాణి ఆత్రంగా వాటిని విప్పి చూసి, 'బాగున్నా యనుకోండి-- అయినా నాకిప్పుడింత ఖరీదయినా చీర ఎందుకు? నాకు సాదా చీర తెచ్చి పాపకే మంచి గౌను తెవలసింది.' అంది.
    'పాప పెంపకం విషయం లో నాకు అన్ని ఖబుర్లు చెప్తావు ఆ తెలివి ఇప్పుడేమయి పోయిందీ,' అని వేళాకోళం చేస్తూ, పసివాళ్ళ కి మన సరదా కొద్దీ సిల్కు బట్టలు తోడిగేస్తాం కాని అవి వాళ్ళకి ఎంతో చిరాగ్గా వుంటాయి. చెమట పట్టి, గాలి రాక, ఈ సిల్కు గుడ్డలు ఒంటికి గరగర గుచ్చుకుంటూ పాపం వుడుకుష్టంగా వున్నా నోరు తెరిచి ఏమీ చెప్పలేరు. అందులోనూ వస్తున్నది వేసవి కాలం , 'నూలువి, ఎంత మెత్తటివి వేస్తె అంత మంచిది. తెలిసిందా?' అన్నాడు.
    'మనకయినా ఇప్పుడు అలాంటి బట్టలే  బాగుంటాయి-- నాకు మాత్రం -- ఈ చీర ఎందుకు తెచ్చారు? అందులోనూ ఇంత ఖరీదు పెట్టి--'
    'చీర నచ్చిందో లేదో చెప్పమంటే ఈ గొడవంత ఏమిటి? ఖరీదు సంగతి నీకనవసరం. మా పాప వాళ్ళ అమ్మకి మంచి బహుమతి ఇవ్వాలను కున్నాను. ఇచ్చాను. అసలిప్పటికే ఆలశ్యం అయి పోయింది.' మురళీ గాంబీర్యం నటిస్తూ అంటుంటే కళ్యాణి నవ్వేస్తూ ---
    'వో. థాంక్స్.' అంది.
    'నొ మేన్షన్ మేడం .' హాస్యంగా అని 'మరి త్వరగా కట్టుకో. అదెవరో అన్నట్లు ఈ చీరలో నువ్వు ఇంకా అందంగా వుంటావో లేకపోతె నువ్వు కట్టుకోటం వల్ల ఈ చీర అందమే పెరిగి పోతుందో స్వయంగా చూసి తెల్సు కుంటాను.' అన్నాడు.
    'అదెవరు బాబూ ఆ అన్నది?' కనుబొమలు చిట్లించి అడిగింది కళ్యాణి.
    'నీ మాట కాదు లేవోయ్. ఇంకెవరి సంగతో....కాని-- మరి' తొందర పెట్టాడు మురళీ.
    'రేపేగా పండగ. ఒక్క ఇరవై నాలుగ్గంటలు ఓపిక పట్టండి! పూర్తిగా ఇరవై నాలుగ్గంటలు కూడా అక్కర్లేదు. రేపు ఉదయం భోజనం అయిపోగానే కట్టుకుంటాను. నాకెందుకో ఈ పండుగ అంటే ఇష్టం, మిగిలిన పండగల మాట ఎలా వున్నా ఈ ఉగాది రోజున తప్పకుండా కొత్త బట్టలు కట్టుకోవాలనీ, పెద్దల కాళ్ళకి నమస్కరించి ఆశీర్వచనం పొందాలనీ అనిపిస్తుంది.' అంది కళ్యాణి.
    ఒక్క క్షణం చిత్రంగా ఆమె మొహంలోకి చూసి ఆ తరువాత పెద్దగా నవ్వేస్తూ, 'వోహో , అయితే రేపు నువ్వు ఈ చీర కట్టుకుని నా పాదాలకి నమస్కారం చేస్త్రావన్నమాట-- వో-- కే-- ఈ లోగా నేను కూడా మంచి దీవెన ఒకటి అలోచించి అట్టే పెట్టుకుంటాను' అన్నాడు.

                                       
    మర్నాడు --
    ఇంకా పూర్తిగా వెలుగు రాకుండానే నిద్ర లేచింది కళ్యాణి-- పనిమనిషి ని కూడా ఆవాళ కాస్త త్వరగా రమ్మని చెప్పింది. అది పై పనులు చేస్తుంటే కళ్యాణి మొహం కడుక్కుని, తలంటుకుని మ్ వంట పనిలో జొరబడి పోయింది-- మురళీ లేచాక అతనికి కాఫీ కలిపి ఇచ్చింది. ఆ తరువాత అతను స్నానం చేసి వచ్చాక అతనికి వేప పువ్వు పచ్చడి ఇచ్చి తనూ తీసుకుంది.
    పనిమనిషి సాయంతో పాపకి నీళ్లు పోసి నిన్నటి కొత్త గౌను కి కాస్త పసుపు పెట్టి అది తొడిగి పడుకో బెట్టింది. పనులన్నీ పూర్తీ చేసి పనిమనిషి వెళ్లి పోయింది-- కళ్యాణి వంట పని తెమిలే సరికి పది గంటలు దాటింది.
    ఈలోగా కళ్యాణి కి వంటలో ఏదో కాస్త సాయం చేసి ఆ తరువాత వీధి గదిలోకి వెళ్ళిపోయి పేపరు చదువుకుంటూ కూర్చున్న మురళీ భోజనానికి పిలుపు కోసం ఎదురు చూస్తున్నాడు అప్పటికీ అరగంట నుంచి.
    ఇంతలో పడక గదిలో నుంచి పాప ఏడుపు వినిపించింది-- మురళీ ముచ్చటగా చిన్నగా నవ్వుకున్నాడు.
    'ఈ పాపకి టేలీపతీ వుందేమో-- ఉదయం స్నానం చేయించి పడుకో బెడితే మళ్లీ సరిగ్గా మా భోజనాల వేళ దాకా గాడంగా హాయిగా నిద్రపోయి, అప్పుడు లేచి ఏడుపు మొదలు పెడుతుంది. మేము తొమ్మిది గంటలకి అన్నానికి కూర్చుంటే తొమ్మిదింటికి లేస్తుంది. శలవ రోజున సావకాశంగా వంట చేసుకుని పది గంటలకి కూర్చుంటే అప్పుడు లేస్తుంది-- ఏడుస్తున్న పాపని వొ ప్రక్క నుంచి సముదాయిస్తూ హడావిడిగా భోజనం చెయ్యటం ఏరోజూ కళ్యాణి కి తప్పదు.' అనుకున్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS