Previous Page Next Page 
వసుంధర కథలు-1 పేజి 40


    ముస్లిం కాలనీలో అక్బర్ ఆలీకి చాలా గౌరవముందని షేక్ మహమ్మద్ హుస్సేన్ కు తెలుసును. అందుకే అతను తార్చ్గా ఆలీని తన దగ్గరకు రప్పించుకుంటూండేవాడు. ఆలీ వచ్చినప్పుడల్లా అతనికి హిందువులపట్ల ద్వేషభావాన్ని కలిగించడానికి ప్రయత్నించేవాడు. హుస్సేన్ మాటలు విని అలీ నవ్వేసేవాడు.
    "హిందువుల గొడవ మనకెందుకు? అల్లాను నమ్మక పోతే వాళ్ళే నరకానికి పోతారు" అనేవాడు అక్బర్ ఆలీ.
    "అలాకాదు. వాళ్ళు అల్లాని అవమానించటానికి ప్రయత్నిస్తున్నారు......"
    "అల్లాకి అవమాన మేమిటి? ఆయన అన్నింటికీ అతీతుడు....."
    "నిజమే-కానీ మనం అవమానానికి అతీతులం కాదు కదా! మన అల్లాను వాళ్ళవమానిస్తూంటే మనమేంకాని దద్దమ్మలమా-చూస్తూ ఊరుకోడానికి. మన రక్తం మరగదా?"
    అక్బర్ అలీ నవ్వి "ఇన్నాళ్ళకు అల్లాను రక్షించడానికి మనుషుల అవసరం వచ్చిందా? అంటే అల్లా తక్కువ వాడని మనమే ఒప్పుకుంటున్నట్టవుతుంది-" అన్నాడు.
    హుస్సేన్ కు ఆలీనెలా లొంగదీసుకోవాలో తెలియలేదు. అతను ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆలీ తర్కం ముందు నిలబడడం కష్టమే అయ్యేది. కానీ తరచుగా కలుసుకున్న మీదట ఆలీ గురించిన కొన్ని బలహీనతలు హుస్సేన్ గ్రహించాడు. ఆలీకి ఏ మతమైనా ఫరవాలేదు, ఏ దేవుడైనా ఫరవాలేదు. తను నమ్మే సిద్దాంతాలను ఎవరు ఖండించినా పట్టించుకోడు. కానీ ఆచరణలో ఎవరైనా ఇస్లాంకు ద్రోహం తలపెడితే అతను క్షమించలేడు. ఆలీకి ఆగ్రహం వచ్చినప్పుడు మామూలుమనిషికాడు.
    ఆలీ బలహీనతలను సమయంచూసి వినియోగించుకోవాలని హుస్సేన్ అనుకుంటున్నాడు.
    
                                         4

    అవధాని బియ్యేప్యాసయి కొన్ని సంవత్సరాలుగా ఏదో మామూలు ఉద్యోగం చేసుకుంటున్నాడు. పెద్దలు సంపాదించినదింతో అంతో వుంది కాబట్టి సంసారం పెద్దదైనా, జీతం కాస్త తక్కువే అయినా నాలుగువేళ్ళూ బాగానే నోట్లోకిపోతున్నాయి.
    సహజంగా అవధాని మంచివాడు. కానీ అతనికి సంప్రదాయాల పట్టింపువుంది. రోజూ సంధ్యవారుస్తాడతను. వారానికొక్కసారైనా జనంలోవుంటాడు. వ్రతాలు నోములు, మడి, ఆచారాలు వగైరాలు అన్నింట్లోనూ అతనికి బాగా పట్టింపులున్నాయి.
    అవధాని ఆ తరానికీ, ఈ తరానికీ మధ్య వ్రేలాడుతున్న వాడు. అటు పాత ఆచారాలను వదులుకోలేడు. ఇటు కొత్త ఆచారాలను నిరసించలేడు. బయట ఆఫీసుకు వేసుకువెళ్ళిన బట్టలనతను వేరే వుంచి స్నానంచేసి ఇంట్లో వేరేబట్టలు ధరిస్తాడు. ఇంటికివచ్చిన వాళ్ళందరికీ మర్యాద చేయడానికి వీధిగది వుంది, బంధువులకూ, సాటి కులస్థులకూ తప్పించి వీధి గదిదాటి ఇంట్లోకెళ్ళి ఆతిథ్యం పొందడం సాధ్యంకాదు.
    చదువుకున్న కారణంగా అవధానికి కొంత సంస్కారం అబ్బింది. ఆ సంస్కారం అతని మనసులోని భావాలన్నీ బయటకు రాకుండా చేస్తూంటుంది. అదీకాక అతను చాలా మంచివాడు. ఎవరినీ మాటలతోకానీ, చేతలతోకానీ నొప్పించలేడు. ఈ కారణంగా ఉద్యోగధర్మంగానై తేనేం, సాంఘిక ధర్మంగానైతేనేం - ఏర్పడిన చాలామంది మిత్రుల నతను తిరస్కరించలేకపోయేవాడు. అలా ఏర్పడిన మిత్రవర్గంలో మనస్ఫూర్తిగా అవధాని అభిమానించేది అక్బర్ ఆలీ ఒక్కడిని మాత్రమే!
    అవధానికి ముస్లిములంటే సదభిప్రాయం లేదు చరిత్ర లోని కొన్ని ఘట్టాలు తల్చుకుని వారిపట్ల అతను మనసులో ద్వేషభావం కూడా ఏర్పరచుకున్నాడు. అయితే అక్బర్ ఆలీతో అతని స్నేహానికి ఈ ద్వేషభావం అడ్డురాలేదు. ఆలీ సంభాషణా చాతురి, మంచితనం నైతికవర్తన విశాల దృష్టి-ఆవధాని ఆలోచనల్లోనే మార్పు తీసుకువచ్చేశాయి.
    ఒక పర్యాయం అవధాని బజార్లో పళ్ళు కొన్నాడు కొడుకు ఆకలి అని చంపేస్తూంటే, అవధాని కొనీ కొనగానే అతని సుపుత్రుడు అందులోని రెండింటిని అమాంతం లాగించేశాడు. ఈలోగా అవధాని పర్సుకోసం జేబులు తడుముకుంటున్నాడు. ఎక్కడా దొరకడంలేదది. అతని గుండె గుభేలుమంది. ఎవరో పర్సుకొట్టేశారు.
    పళ్ళ దుకాణంవాడు హడావుడి చేస్తున్నాడు, అవధాని వాలకం అతని కనుమానాన్ని కలిగించింది. పర్సుపోయిందని అతననగానే దుకాణం వాడు నోరుపారేసుకోడం మొదలు పెట్టాడు. అప్పుడే అక్బర్ ఆలీ అవధాని నాదుకున్నాడు. ముక్కు, ముఖం తెలియని అవధానికి పదిరూపాయలప్పిచ్చి పరువు కాపాడేడు.
    ఆ తర్వాత అవధాని గ్రహించినది-తన పర్సుజేబులో వేసుకోకుండా ఇంట్లోనే వదిలి వచ్చేనని. అందుక్కారణం అతని ఆచారాల పిచ్చి. బయటకు వెళ్ళడానికి బట్టలు వేరు. ఇంట్లో బట్టలు వేరు. ఈ కారణంగా జేబులో పర్సులేకుండా బజారుకి వెళ్ళడం తరచుగా అనుభవమవుతూంటుందతనికి.
    అవసరానికి తన నాదుకున్న అక్బర్ ఆలీ పై అవధానికి కృతజ్ఞతాభావం కలిగింది. అతను ముస్లిం అని తెలియగానే కొంత విచారమూ, జుగుప్సాభావమూ కలిగినా కృతజ్ఞతాభావం ముందవన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. ఆ తర్వాత పరిచయంలో అక్బర్ ఆలీపై అతనికి గౌరవం కూడా కలిగింది. అన్నిమతాలూ ఒకేరకం బోధనలు చేస్తున్నాయనీ-అన్నిమతాల్లోనూ మంచివారుంటారనీ-ఆలశ్యంగానైనా అతను గ్రహించగలిగేడు.
    అవధానిలో ఈ గ్రహింపు వచ్చినాకనే జగన్మోహనరావు పరిచయం జరిగింది. అవధాని ఈ రోజుల్లో తప్ప బుట్టాడనీ-అతను పరమ విష్టాగరిష్టుడనీ విని జగన్మోహనరావు అతన్ని తనవశం చేసుకుని-అతనిద్వారా హుస్సేన్ సైతన్ పగదీర్చుకోవాలనీ అనుకుంటున్నాడు. అయితే అవధాని జగన్మోహనరావును అనవసరంగా మతోన్మాదాన్ని రెచ్చగొట్టరాదనీ-మతసహనమే మనిషికి మంచిదనీ చెబుతూ వచ్చాడు.
    ఎటొచ్చీ ఈ సంభాషణల్లో జగన్మోహనరావు అవధాని బలహీనతలు తెలుసుకుంటూనే ఉన్నాడు. వాటి ఆధారంగా ఎప్పుడో ఒకరోజున సమయంచూసి అస్త్రం ప్రయోగించాలనుకుంటున్నాడతను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS