Previous Page Next Page 
వసుంధర కథలు-1 పేజి 39


                              చదరంగంలో పావులు!

    షేక్ మహమ్మద్ హుస్సేన్ కా ఊళ్ళో నాలుగు దుకాణాలున్నాయి. కోటికి పడగలెత్తినవాడని అందరూ చెప్పుకుంటారు. డబ్బు సంపాదించడానికవసరమైన మార్గాలన్నీ అతనవలంబిస్తాడు. ఆ కారణంగా అతనిది సత్ప్రవర్తన అని అనలేము. కానీ వ్యాపారానికీ సత్ప్రవర్తనకూ జోడు కుదరడం ఎక్కడో కానీ సాధ్యపడదు గదా!
    మంచితనం విషయమెలాగున్నా హుస్సేన్ చాలా తెలివైన వాడు. నగరంలో అతనికి చాలా పెద్ద పెద్ద పరిచయాలున్నాయి. ఊళ్ళో చెప్పుకోదగ్గ పలుకుబడివుంది.
    మిగతా విషయాలసంగతెలాగున్నా హుస్సేన్ లో ఒక ప్రమాదకరమైన గుణముంది. అతనికున్న మతోన్మాదమే అది. ఎప్పుడు ఎక్కడవున్నా తన మతానికి సంబంధించిన ఆచారాలను పాటించడం అతను మరిచిపోడు. అదలా గుంచితే అతనికున్న పరమతద్వేషం అవధులు దాటింది. ముఖ్యంగా హిందువులంటే అతనికి వల్లమాలినకోపం.
    ఆ నగరం జనాభా అయిదారు లక్షలవరకూ వుంటుంది. అందులో ముస్లిముల జనాభా అరవైడెబ్బైవేల వరకూ వుంటుంది. వారిలో పేరుపడిన వారు చాలా కొద్దిమంది మిగతా అందరూ అతిసామాన్యంగా జీవిస్తున్నారు. మసీదుకు వెళ్ళడం నమాజు చేయడం వగైరా సందర్భాల్లో తప్పితే-మిగతా సమయాల్లో తమ మతం గురించి ఆలోచించడానికి కూడా సమయం లేనివారు.
    ఈ అరవై డెబ్బైవేల జనాభాకూ సేక్ మహామ్మద్ హుస్సేన్ మకుటంలేని మహారాజు. తనకు తీరుబడి వున్నప్పుడల్లా హుస్సేన్ కొంతమందిని చేరదీసి-ఇతరమతాలను ద్వేషించడమే ఏ ముస్లింకైనా ప్రప్రథమ కర్తవ్యమని బోధిస్తూంటాడు.
    అతని బోధనలను కొంతమంది శ్రద్దగా వినేవారు. కొంతమంది వినేవారు కాదు. అతికొద్దిమంది మాత్రమే అతని మాటలను తలకెక్కించుకునే వారు. ఎందుకంటే నగరంలో తమ జనాభా హిందువులతో పోలిస్తే చాలా తక్కువ. సామరస్యం కుదరకపోతే నష్టం తమకే ఎక్కువగా కలుగుతుంది.
    షేక్ మహమ్మద్ హుస్సేన్ బోధనలను ఓపికగా చాలా మంది వినడానికి కొన్ని కారణాలున్నాయి. ఇస్లాంపట్ల గల అభిమానం కొద్దీ అతను చాలామంది సాటిముస్లిములకు ఆర్ధికసహాయాలు చేస్తూంటాడు. అతని మతోన్మాదం విధంగా ఎందరో పేదవారికి అండదండగా వుంటోంది.
    
                                       2

    జగన్మోహనరావు ఆ ఊళ్ళో పేరుమోసిన కాంట్రాక్టర్. బ్లాక్ మనీ బస్తాలతో నిలవేయగా-ఎలుకలు కొట్టేస్తున్నాయని-చాలామంది అతని సంపద గురించి చెప్పుకుంటారు.
    సంపదలున్న వారిలో చాలామందికి దైవభక్తి వుంటుంది. తాము పాపాత్ములమనీ తమ పాపాలకు క్షమ భగవంతుడివద్ద తప్ప మరెక్కడా లభించదనీ వారికి తెలియడమే అందుక్కారణం కావచ్చు. ఏది ఏమైనా జగన్మోహనరావుకూడా దైవభక్తుడే.
    అయితే అతనికి మొదట్లో మతాలపట్టింపు లేదు. కానీ అతని నివాసగృహం ముస్లిం కాలనీలో వుంది. ఆ నగరంలోని అరవై డెబ్బైవేల ముస్లిములలోనూ ముఫ్ఫై నలభైవేలదాకా అక్కడే వుంటున్నారు.
    జగన్మోహనరావు ఆ కాలనీలో ఇల్లు కట్టించుకుంటున్నప్పుడు ముస్లింకాలనీలో పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు కానీ అతని గృహప్రవేశ మహిత్సవం ఫక్తు హిందూ పద్దతిలో అతివైభవంగా ఆ కాలనీలో జరగడంతో -షేక్ మహమ్మద్ హుస్సేన్ లో కొంచెం చలనంవచ్చింది. అందులోనూ ఆ-ఊరేగింపు-మసీదుముందుగా వెళ్ళవలసి రావడంతో హుస్సేన్ తన చలనాన్ని తనవారికి కూడా కలిగించాడు. చిన్నతగవు కూడా అయింది.
    ఆ తగవు జగన్మోహనరావులో పట్టుదలను పెంచింది. ఆ పట్టుదల అతనికి ఇస్లాంపట్ల ద్వేషం కలిగించింది. ఆ ద్వేషం అతణ్ణి మతోన్మాదిని చేసింది.
    అతను రెట్టించిన ఉత్సాహంతో తనయింట్లో రకరకాల హిందువుల వేడుకలు జరిపించడం మొదలుపెట్టాడు. ఇది ముస్లిములకు కంటగింపుగానే వుంది. ఎందుకంటే అతను జరిపించే వేడుకలు అతని దైవభక్తి కాక-పరమత ద్వేషం కారణంగా జరిపించబడుతున్నాయని వారందరికీ తెలుసును.
    రెండు మతాలూ మానవత్వాన్నీ, సామరస్యాన్నీ బోధిస్తున్నాయి. కానీ ఆ రెండు మతాలవారికీ ఆ మతాల పేరు తప్పితే వాటి బోధనల పట్టింపు వున్నట్లులేదు.
    షేక్ మహమ్మద్ హుస్సేన్ కు జగన్మోహనరావు పైన చాలాకోపంగా వుంది. అతనిమీద పగ తీర్చుకోవాలని ఎదురుచూస్తున్నాడు. కానీ సమయం యింకా రాలేదని అనుకుంటున్నాడు.
    అతనికి సమయం యింకా రాకపోవటానికి ముఖ్య కారణం పరిస్థితులు కాదు. ఇద్దరు మనుషులు వారిపేర్లు అక్బర్ ఆలీ, అవధాని, ఆశ్చర్యమేమంటే వారిద్దరూ మంచి మిత్రులు.
    
                                        3

    అక్బర్ ఆలీకి ఇస్లాంపట్ల పూర్తి విశ్వాసముంది. మోక్ష సాధనకు ఇస్లాం ఒక్కటేదారి అని అతను నమ్ముతాడు. అయితే అతను తనమతబోధనలను చాలా చక్కగా అర్ధంచేసుకున్నాడు. అతనికి పరమతద్వేషంలేదు సరికదా-హృదయం కూడా ఎంతో విశాలమైనది.
    "మంచిపనులు చేయడమే అల్లాకు నీవు చూపించే భక్తి"-అని అతను తనకు తెలిసిన వారందరికీ చెబుతూంటాడు.
    అక్బర్ అలీ ఏదో గవర్నమెంటాఫీసులో గుమాస్తా ఉద్యోగం చేస్తున్నాడు. సిన్సియర్ గా ఉద్యోగ ధర్మాలు నిర్వర్తిస్తాడనీ, అవినీతికి పాల్పడడనీ అతనికి ఆఫీసులో మంచిపేరుంది. అతని మంచితనాన్ని అంతా అభిమానిస్తారు. అతనికి వివాహమైంది. నలుగురు పిల్లలున్నారు. తనకు వచ్చే జీతపురాళ్ళతో గుట్టుగా సంసారం వెళ్ళబుచ్చుతున్నాడు. ఉన్నంతలో ఒకరికి పెట్టడమే కానీ దేహీ అని ఎవరినీ యాచించి ఎరుగడతను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS