49
భాస్కరం కాలేజీకి వెళ్ళనేలేదు. కోర్సులన్ని ఒకసారి చదివేయాలనుకున్నాడు. పద్మావతికి ఉత్తరం రాద్దామనుకున్నాడు. "పద్మావతీ! నువ్వు నన్ను అనవసరంగా అనుమానించావు, నేను నిన్ను డగా చేద్దామనుకోలేదని"-కాని రాయలేదు. ఆమె చిరునామా తెలియదనడం ఒక నెపం మాత్రమే!
మూర్తి వచ్చాడు. నోట్సులు ఇచ్చాడు. ఇద్దరూ పాఠాలు తిరగేశారు-మూర్తి చెప్పాడు. "పద్మావతిగారిని శైలజ నిన్న 'సురేఖ' గురించి అడిగిందట."
"సురేఖకు ఒంట్లో బాగులేదురా!" అన్నాడు భాస్కరం.
"కాని పద్మావతి అలా చెప్పలేదు. బహుశా ఆమెకు ఆ సంగతి తెలియదేమో....." నన్నాడు మూర్తి భాస్కరాన్ని నేరస్తుణ్ణి చూస్తున్నట్లు చూసి,
"ఏ మందిటా?" కుతూహలంగా అడిగాడు భాస్కరం.
"ఏదో అన్నదిగాని..... చూడు భాస్కరం ఇఫ్యూ కైండ్లీ ఎక్స్ క్యూజ్ మీ....నువ్వు క్షమిస్తే నేనో మాట చెప్పనా?"
"చెప్పు మూర్తీ! నీకూ నాకూ దాపరికం లేదు గదా" బాధగా మూలిగాడు భాస్కరం.
"నీ పిరికిత్నం వల్ల ఎందరం ఇబ్బంది పడుతున్నామో తెలుసా? తలదించుకునే మాట్లాడుతున్నాడు స్నేహితుని కళ్ళల్లోకి చూడకుండా మూర్తి.
భాస్కరం నొచ్చుకున్నాడు. ఏమీ అనలేదు.
"నన్ను నీ ఆత్మీయుడిగా భావించు భాస్కరా? నీవు మాకు చెప్పేవాడివే కాని చెప్పించుకునే వాడివి కాదు నాకు తెల్సు" నన్నాడు మూర్తి.
మూర్తి భాధకు ఆత్మీయతకు కూడా చలించి భాస్కరం "పిన్నికి చెప్పేశాను మూర్తీ" అన్నాడు.
మూర్తికి ఆదుర్దా పెరిగింది. ఆందోళన తరిగింది. ఏమయింది?" అన్నాడు.
"తనకు ఇన్నాళ్ళు సురేఖ అంటే నాకు ఇష్టం లేదు అని చెప్పలేదుగా......అందుకని తను తిట్టింది తిట్టుకుంది.....అంతే"
నిరుత్సాహంగా మూర్తి నిట్టూర్చాడు.
"పిరికివాన్ని అనికదూ అంటావునువ్వు?" భాస్కరమే అన్నాడు మళ్ళీ...... "కాదు మూర్తీ...... వసంత పెళ్ళి ధనమ్మ చేతిలో ఉంది. ధనమ్మ పద్మావతి సంప్రదాయానికి, వంకలెట్టి, మా పిన్ని మనసూ, వసంత పెళ్ళి రెండూ పాడు చేస్తుందనే భయం తోనే మానేశాను.' అన్నాడు భాస్కరం.
మూర్తి తలఎత్తి "నన్ను క్షమించు భాస్కరా! నీకు గల బాధ్యతను నీ అంత బాగా మేం వూహించలేంగా?" అన్నాడు.
"కాని మూర్తీ జ్ఞాపకం ఉందా? ఒక నాడు బీచ్ లో నువ్వే సురేఖనూ, పద్మావతినీ కూడా శంకించావు! అందుకే నేను ఎవ్వరికీ ఏ విషయమూ చెప్పలేదు. ఆఖరికి సురేఖకు కూడా......హలాహల మంతా మింగి, అందరి దృష్టిలో నీచుణ్ణయ్యాను..... సరే..... గత జలసేతు బంధనమెందు కులే నా కర్మకి నన్ను వదిలేయ్!"
భాస్కరం కనుకొలకుల నీటి బిందువులను చూసి మూర్తి విచలితుడైపోయాడు.
"ఛా! ఏమాటల్రా అవి.....నిన్ను మేం ప్రేమిస్తున్నాం గనుకనేగా ఇంత సాధిస్తున్నాం .....ఇంతకీ ఇప్పుడు సురేఖకు అంతా చెప్పవా?" మూర్తి భాస్కరం చెయ్యి తన చేతిలోకి తీసుకుని విశ్వాసంగా నొక్కాడు.
"ఒక్క పద్మావతికే తెలియదు" భాస్కరం నిట్టూర్చాడు.
"శైలజతో కబురు పెడతానుకాని....." మూర్తి మధ్యలోనే తటపటాయిస్తూ ఆగిపోడంతో భాస్కరం అనుమానంగా "ఇంకా అనుమానం ఎందుకురా? పిన్నిని ఎలాగైనా ఒప్పించి తీరుతానూ" అన్నాడు.
"అదికాదు...... అహఁ ఏం లేదులే..... ఇంకేం లేదు. నువ్వూ పద్మావతి కలిసి నాకూ శైలజకూ దంపతులుగా ఆశీర్వచనం ఇవ్వండి ఇస్తారుగా" అంటూ మాట మార్చాడు.
మాట మార్చినట్లు గ్రహించిన భాస్కరం "మూర్తీ! నా దగ్గర ఏం దాచకురా?" అన్నాడు. అంతలో అవతలినించి, "బాబూ! భాస్కరం అనే అబ్బాయి..... ఇక్కడ ఎమ్మెస్సీ చదువు తున్నాడు..... తెలుసా? కాస్త చెప్తారా....." అంటూ రాఘవేంద్రంగారు వచ్చి...... భాస్కరాన్ని చూస్తూనే.... నేను భాస్కరం గారూ కులాసానా?" అంటూ పలకరించాడు.
భాస్కరం స్తంభించిపోయా డొక్కక్షణం. తేరుకుని "రండి! రండి" అంటూ లేచి రాఘవేంద్రాన్ని లోపలికి తీసుకునివచ్చి....." "ఎక్కణ్ణించి బెజవాడనించేనా? ఎలా వచ్చారూ? ఏం కధా?" అన్నాడు. కూచోమని మంచం చూపుతూ.
"కాస్త పని ఉండే వచ్చాను..... చెల్లాయ్ వసంతనడిగి నీ దగ్గరికే వెళ్ళమంటేనూ నేరుగా వచ్చాను"- మూర్తి ననుమానంగా పరికిస్తూ అన్నాడు రాఘవేంద్రరావు.
"అతను ఆ స్నేహితుడు మూర్తి, ఈయన మా చెల్లాయ్ మామగారు" అంటూ భాస్కరం పరిచయం చేశాడు.
"రాఘవేంద్రం మూర్తి నమస్క్రారానికి చిరునవ్వు అందించి "మీ ఇద్దరూనా? ఇందులో?" అన్నాడు గది నాలుగు వేపులా కలియ జూస్తూ, మంచంమీద కూచోడానికి సంకోచించాడు.
"కాదండీ! మూర్తి సద్ధర్మ వదనమని మరోచోట ఉంటున్నాడు" అని చెబుతూనే "మీరు బాగా అలిసి పోయినట్లున్నారు...... కూచోండి కాఫీ తెప్పిస్తాను..... స్నానం చేద్ధురుగాని....." అన్నాడు భాస్కరం లేచి అతనికి కుర్చీవేసి, అవతలికి వెళ్ళాడు.
మూర్తి కూడా భాస్కరాన్ని అనుసరించి ఇవతలికి వచ్చి "ఏమిరా? ఇతగాడు వచ్చాడు" అన్నాడు.
"ఏమోరా నా కర్మ....." భాస్కరం విసుక్కున్నాడు. "మళ్ళీ కలుస్తాను...... నే పోతాను నీ తంటాలు నువ్వు పడు నీ గోస్టుతోను" అని వెళ్ళిపోయాడు మూర్తి. బరువుగా రెండుమూడుసార్లు వెనుతిరిగి చూస్తో.......
* * *
రాఘవేంద్రం గారికి అన్ని సౌకర్యాలు అమర్చాడు భాస్కరం. అతను వేసే అవసరమైన చచ్చు ప్రశ్నలన్నింటికీ సమాధానాలు బుద్దిగా ఇచ్చాడు.

"ధనమ్మగారి సంగతి నీకు తెలుసు కదా?" అడిగాడు రాత్రి ఆరుబయట మంచంమీద పడుక్కుని......రాఘవేంద్రం.
తతిమ్మా తన మిత్ర బృందానికి రాఘవేంద్రం వల్ల ఇబ్బందీ రాఘవేంద్రానికి వాళ్ళవల్ల సంకోచమూ రాకుండా ఏర్పాటు చేయడంలో భాస్కరానికి ఆ రోజు తలప్రాణం తోకకి వచ్చింది!
నీర్సంగా తలకాయ మాత్రం వూపాడు.
రాఘవేంద్రంగారు చెప్పాడు.
"ఆమెది భల్లూకం పట్టు- నీకు తెలుసునో లేదో...... నా కొడుక్కి అప్పుడో పదీ అప్పుడో పరకాఇచ్చి,- అప్పుగా జమచేసి, చివరికి నా ఇంటి మీద అప్పు ఇచ్చినట్లు పత్రం రాసుకుంది" బాధగా, ధనమ్మమీద భాస్కరానికి దురభిప్రాయం కలిగించడానికా? అన్నట్లు నిట్టూర్చాడు అతగాడు.
"మీరు చింతించకండి ముకుందరావు బావ మీ ఇంటిమీద అప్పు తీర్చే రోజు రాకపోదు" భాస్కరం ధైర్యం పలికేడు.
"అంతవరకూ ఆగదుకదా? ఆ ధనమ్మ.....!" నిట్టూర్చాడు రాఘవేంద్రంగారు.
"నువ్వు నా మాట విను....." అన్నాడు చుట్టముట్టించుకుంటూ.
భాస్కరానికి గుండెల్లో రాయిపడింది. మరో "ఐదువేలు ఇమ్మనడుకదా ఈ దుర్మార్గుడు!" అనుకున్నాడు లోపల లోపలే.
"నువ్వు సురేఖను కాదనకూడదయ్యా?" రాఘవేంద్రంగారు ఆపేక్ష ఒలకపోస్తూ చెప్పాడు.
భాస్కరానికి ఒళ్ళు మండిపోయింది!
మనసులో రకరకాలు తిట్టుకున్నాడు.
కాని చెల్లెలి మామగారవడంతో కెమిస్ట్రీ ప్రొఫెసర్ గారికన్నా ఎక్కువ భయపడాలి అనుకుని బయటికి ఏమీ అనకుండా వూరుకున్నాడు.
"సురేఖకు ఏం తక్కువ?" రాఘవేంద్రం గారు అడిగాడు.
తక్కువ అని ఎవ్వరనగలరు?"
భాస్కరం మొహం చిట్లించాడు.
"మరి?"
"..........."
"అదీగాక చూడు బాబూ! పెద్దవాణ్ణి ఐన వాణ్ణి..... నువ్వేమీ అనుకోకపోతే నేను నాలుగు మాటలు చెప్పనా?" రాఘవేంద్రంగా రడిగాడు.
"చెప్పండి" పొడిగా అన్నాడు భాస్కరం.
"సురేఖను నువ్వు ఇవాళ కాదనడానికి కారణం ఏదైనా అది మన కుటుంబ గౌరవాలకు సంబంధించిన విషయం...... మీ పిన్ని ఎంత సవత్తల్లి అయినా నిన్ను పెంచి పెద్ద చేసింది. ఇప్పుడీ మాట ఆమెకు తలవంపులు తెస్తుంది......"
భాస్కరం రాఘవేంద్రం పీకె పిసికి సముద్రంలో పారేద్దామనుకున్నాడు. లేచి నిగ్రహించుకుని నిలబడి "మా పిన్నికి అన్నీ తెలుసులెండి" అన్నాడు. వెనక్కి తిరిగాడు. "ఇక నోరు మూసుకోను"న్నట్లు-
"కాని ఆ నాడు మాట ఇవ్వడం....." రాఘవేంద్రం తెగేవరకూ లాగడం తప్పదనుకున్నాడు.
"నేను మాట గట్రా ఏమీ ఇవ్వలేదు. ఆ సంగతి ఆ సురేఖగారికీ దేవుడికీ ఇద్దరికీ తెలుసు" కసిగా అన్నాడు భాస్కరం.
రాఘవేంద్రంగారు లేచి జాలిగా దీనంగా మొహంపెట్టి భాస్కరం భుజంమీద చెయ్యివేసి "మరొక్కసారి ఆలోచించు, నా కొంప వేలం వేయించకు, నీ చెల్లెలి కాపురం నడివీధి పాలు జేసుకోకు..... ఎంతైనా సవతి చెల్లెలు కూడా చెల్లెలే....." అన్నాడు.
భాస్కరాన్ని ఎవరో ఇనప మరలలో పెట్టి నలిపేసినట్లైంది.
కాని రాఘవేంద్రంగారినేం చేయడం 'సవత్తల్లి', 'సవతి చెల్లెలు' అనే మాటలు జీవితంలో తొలిసారి వినపడుతున్నాయి భాస్కరానికి. అవి చెవుల్లో మరిగించి పోసిన సీసంలాగ పడుతున్నాయి.
"ఇంతకీ మీరు.... మీరు నన్ను బెదిరిస్తున్నారా?" తోక తొక్కిన తాచులా కస్సుమని అడిగాడు.
నవ్వాడు రాఘవేంద్రంగారు. ఆ నవ్వుకి వేదాంతి పోలికలు, విలన్ లక్షణాలు ఉన్నాయి.
"నిన్ను మన కుటుంబ ప్రతిపత్తి కాపాడమని కోరుతున్నాను....." రాఘవేంద్రంగారు మరి మాటాడను అన్నట్లు గోడ దగ్గరకి వెళ్ళి చుట్ట "హాయిగా" కాల్చుకో సాగాడు.
భాస్కరం ఇవతలికి వచ్చాడు. తనమీదకే గురిపెట్టి దూసిన వెండికత్తి "మొనల్లా"గ నీలాకాశంలో మెరుస్తున్నాయి నక్షత్రాలు.
"సవతి కొడుకువు నువ్వు...... చెల్లెలి కాపురం యెలా ఐతే నీకేం"? అన్నట్లు విరగబడి వికటాట్టహాసం చేస్తోంది సముద్రం దూరంగా.
"కాదు......కాదు.....పిన్నికి తెలుసు...... వసంతకు తెలుసు....... నేను నేను పిన్ని కొడుకునే..... పిన్నీ.....పిన్నీ...." మని ఆక్రోశించింది భాస్కరం హృదయం.
మనిషి వ్యక్తిత్వాన్ని కాదనే సమాజంచేసే గోలలా భాస్కరం ఒంటరితనాన్ని చీలుస్తూ సముద్రం హోరు హోరు మంటోంది.
"నేను పద్మావతికి మాట ఇచ్చాను గాని సురేఖకు గాదు..... నేను పద్మావతికి మాట ఇచ్చాను గాని సురేఖకుగాదు." ఒంటరిగా చీకటిలో ఇసికెలో కూచుని తల కాళ్ళలో దూర్చికుని కన్నీళ్ళు పెట్టుకున్నాడు భాస్కరం.
భాస్కరానికి రాఘవేంద్రం మాటలు పూర్తిగా అర్ధమయ్యాయి వసంతను పుట్టినింటికి పంపేస్తానన్నదే అతని బెదిరింపు.
"హే! భగవాన్"......
కాని మొట్టమొదటిసారి దేవుడున్నాడా?" అన్న సందేహం కలిగింది.
"లేడు లేడు" అనుకున్నాడు.
"సరే! దేవుడు మనుషులు ఇవన్నీ మిధ్య......నేనే నేనే అన్నింటికీ కారణం. నేనే నిజం......అందుకే..... చూస్తాను నా చెల్లెలి కాపురం ఎలా నడివీధి పాలవుతుందో" - ననుకుంటూ బరువుగా అడుగులు వేసుకుంటూ హాస్టలుకు చేరుకున్నాడు.
గడియారం పదకొండున్నర గంటల దగ్గర "టిక్కు టిక్కు" మంటోంది! భాస్కరం అటూ యిటూ పచార్లు చేస్తూన్నాడు అంచేత.
రాఘవేంద్రంగారి గుర్రు భాస్కరం గుండెల్లో ఆ తెల్లవార్లూ దేవినట్టు మెదులుతూనే ఉంది. ఎట్టకేలకు తెల్లవారింది.
50
రాఘవేంద్రం గారు స్నానం, ధ్యానం అన్నీ నిస్సంకోచంగా ముగించుకున్నాడు. భాస్కరం కాఫీ హోటలుకు తీసుకువెళ్ళి టిఫినూ కాఫీ ఇప్పించాడు. చుట్టలు కూడా కొని ఇచ్చాడు.
"మీరు ఈ వూరికి కొత్తేమో...... మీకు ఇక్కడగల పనులేమేనా నాతో చెప్పండి నేను చేయగల సాయం చేస్తాను" అన్నాడు.
"ఏమీ వద్దు బాబూ! నాకు ఈ వూరు మరీ అంత కొత్తగాదు...... నా పని చూసుకుని నేను స్వయంగా సాయంకాలం వేళకి వచ్చేయగలను" అన్నాడు ముసిముసి నవ్వులు నవ్వుతూ రాఘవేంద్రంగారు.
"సరే?" నన్నాడు భాస్కరం.
* * *
రాఘవేంద్రరావుగారు ఆవలిస్తే పేగులు లెక్క పెట్టగల వ్యక్తి! అతనికి వూరు కొత్త చేసి దారి తెలియకపోవడం, నీరు కొత్తచేసి ముక్కు పైత్యం చేయడం జరగవు.
నేరుగా అప్ లాండ్స్ వాల్తేరు వెళ్ళాడు. జయమ్మగారి యిల్లు కనుక్కున్నాడు.
ధైర్యంగా తలుపు కొట్టాడు.
కండువా రెండుమూడుసార్లు మెడలో అటూ ఇటూ తిప్పి వేసుకుంటూ మరోసారి "తలుపు తడుదునా?" అనుకుంటూ ఉండగానే జయమ్మ గారు తలుపుతీసి కొత్త వ్యక్తిని చూస్తూనే నివ్వెరపోయింది.
"ఎవరు కావాలి?" అన్నది జంకుగా సంకోచంగా - బహుశా తప్పు తలుపు కొట్టి ఉంటాడనుకున్నది.
"నన్ను రాఘవేంద్రరావు అంటాడు భాస్కరంవాళ్ళూ" - భాస్కరం అన్న మాటలు జయమ్మ మొహంలో ఏమాత్రం రంగులను మార్చగలవూ అన్నట్లు చూశాడు.
కాని ఆమె బిడియపడుతూ
"మీ రెవరికోసం వచ్చారో...... ఇది మీకు కావల్సిన ఇల్లుకాదు"-అన్నది.
"మీ పేరు జయమ్మగారేనా? మీ అమ్మాయి పద్మావతి కదూ?" రాఘవేంద్రంగారు లోపలికి రానిస్తావా? లేదా? అన్నట్లు ధీమాగా చూశాడు.
"అవును!" అన్నదామె సంభ్రమాశ్చర్యాలతో ఏం చెయ్యాలో తోచక రెండడుగులు వెనక్కివేసింది.
