Previous Page Next Page 
మారిన విలువలు పేజి 40

 

    "నానుండి మీ వదిన చుట్టమా? మీ వదిన నుండి నేను దగ్గరయేనా " అంటాడు.
    "ఈ చుట్టరికానికి అతీతంగా వదినలో ఉన్న ఏదో గుణం ఆమె పట్ల నా గౌరవాన్ని పెంచుతుంది. మన నుంచి ఏమీ ఆశించకుండా మనకి ఫల పుష్పాల్ని , తిండి గింజలని, ఖనిజ సంపదను అందిచ్చే భూమాతలా కనపిస్తుంది వదిన నాకు. ఒకరికి ఇవ్వడమే కాని, పుచ్చుకోడం ఎరుగని వదిన కి ఏమిచ్చి తృప్తి పడలేదు నేను. ఇక్కడే అన్నయ్యతో పేచీ వస్తుంది.
    "నాకన్నా హెచ్చు మీ వదినేమిచ్చింది? నేను మీ కోసం చేసినదానిలో ఆమె చేసింది ఏమాత్రం? నేను కాదంటే ఆమె మీకు గ్లాసుడు మంచి నీళ్ళు కూడా పోయగలిగేది కాదు. అసలు వ్యక్తిని నన్ను గుర్తించక ఆమెను పట్టుకు పాకులాడుతావెం?"అంటాడు అన్నయ్య.
    "శాంతని, జానకిని మా వదిన ఎంత ఆదుకోగలిగింది? వాళ్ళని సమర్ధిస్తూ ఒక్క మాట కూడా అనలేక పోయిందే? ఆమెకే మీ పట్ల అంత అభిమాన ముంటే నా మాటని ఎదిర్చి నాతొ ఎందుకు పోరాడలేదు? అని తన వాదనని సమర్ధించుకొంటాడు.
    "ఒకవిధంగా అన్నయ్య తన ప్రశ్నకి తనే జవాబు చెప్పుకొన్నాడనిపిస్తుంది నాకు. తన స్థానాన్ని గుర్తించి మసలుకొడం లోనే వదిన గొప్పతనం ఉంది. తను భర్తతో వాదించి మనకి చేయగలిగే దేమీ లేదని ఆమెకి తెలుసు. వదిన తన సంసారాన్ని రట్టు చేసుకొంటే మనం అందరం ఎంత బాధ పడతామో ఆమెకి తెలుసు.  ఆవిధమైన వేదనకి మనల్ని గురి చెయ్యకపోవడం లోనే తనకి మన పట్ల గల ప్రేమని వ్యక్తం చేసింది వదిన.
    "ఏనాడూ నేను మీ కోసం ఇది చేసెనని కాని, చేస్తున్నానని కాని ఆమె అనలేదు. వదిన తన మనసులో కూడా ప్రత్యేకంగా అనుకోని ఉండదు. అందుకే ఆమెకి అశాంతి లేదు. మన నుంచి ఏమీ ఆశించని ఆమెకి మన మేమాత్రం అందిచ్చినా అమితానందం పొందుతుంది.
    "అన్నయ్యా , తను మనకి చేసేననుకొంటున్న దానినంతా వడ్డీతో సహితం తీర్చబడాలని ఆశిస్తాడు. అందుకే అతనికి ఏమి ఇచ్చినా తృప్తి ఉండదు.
    "ఆ....ఏదో అడిగితె ఇంకేదో చెప్తున్నాను కదూ? మిగిలినదంతా మామూలే. 'ఇంటికి వెళ్ళేక పాపకి మందు పంపిస్తాను. ఇవి మాత్రం మీరు తప్పకుండా తీసుకోవాలి, వదినా" అనిచేప్పెను."
    "వదిన మరీ అంత నీరసంగా ఉందా, ప్రకాశం?"
    "అభిమానం గలవాళ్ళ కళ్ళకి ఎదుటివాళ్ళు అలాగే కనిపిస్తారు. ప్రకాశం -- అని వదిన జవాబు చెప్పింది" అన్నాడు ప్రకాశం.
    ఒకసారి వెళ్ళి వదినను చూసి రాగలిగితే బాగుండును-- అనుకొన్నది జానకి. కాని ఆనాటి అన్నగారి మాటలు మడుపుకి రాలేదు. తీరా గుమ్మంలోకి వెళ్ళేక అన్నయ్య ఏమైనా అంటే వదిన బాధపడుతుంది. అంతకన్న దూరంగా ఉండడమే మంచిదనుకొంది.
    సహజంగా పిల్లల మనసులో తల్లి ఇటువంటి స్థానంలో ఉంటుంది. ఈ కుటుంబంలో తల్లిని తప్పించి ఆ స్థానాన్ని వదినగారు ఎలా అందుకోందో ఎవరికి అర్ధం కాదు. తల్లి లేని పిల్లల్ని చిన్నతనం నుంచి పెంచి పెద్ద చేసిన వదిన గారంటే మరదులకు, మరదళ్ళకు అభిమానం ఉండడం సహజం. కాని, రమారమి తమ వయస్సు దే అయిన వదిన గారి పట్ల అంత గౌరవం, అభిమానం చూపడం అరుదుగా ఉంటుంది.
    ప్రకాశానికి, జానకికి వదిన గారి పట్ల గల అభిమానానికి ప్రత్యేకం చెప్పుకోదగిన కారణం లేదు. పెద్ద వాళ్ళు" ముఖాలు చూసుకొన్న వేళావిశేషం అంటారే....." అటువంటిదేదో అయి ఉండాలి.
    తిరిగి వెళ్ళిపోతూ ఇంకొక వార్త చెవిని వేసేడు ప్రకాశం.
    "రాజారావు గారి భార్య పోయిందిట." అన్నాడు.
    "ఏ రాజారావు భార్య?" అర్ధం కాక ప్రశ్నించింది జానకి.
    ఆనాడు పసుపు బట్టలతో, బుగ్గచుక్క కళ్ళకు కాటుక, నుదుట తిలకం ధరించి, రైల్వే స్టేషను లో వెలుగు నీడల మధ్య నిలబడి మాట్లాడిన రాజారావు ఆమె మనసులోకి రాలేదు. తానెరిగిన వారిలో రాజారావు నామధేయులు ఎవరు ఉన్నారా! అని ఆలోచించసాగింది.
    'అతడేనే! నీ మెళ్ళో పూస్తే కట్టిన మొగుడి పెళ్ళాం." మాట పూర్తీ చేస్తూనే ఆ మాటకు ఉన్న అర్ధాన్ని గ్రహించి తను ఎంత అవకతవకగా చెప్పాడని మీసాల చాటు నుంచి మెల్లగా నవ్వుకొన్నాడు.
    అన్నగారితో సరదాకు అన్ననాటి నుంచి ప్రకాశం మీసాలు పెంచడం మొదలు పెట్టేడు. అయిదడుగుల పొడుగు, తొక్కతీసిన కంద దుంపలా ఎర్రగా ఉండే ముఖం, ఒత్తుగా ముఖాన్ని సాగదీస్తూ పెరిగిన జుట్టు, దుబ్బుగా మీసాలు--- ప్రకాశం చూసేందుకు తమాషాగా కనిపిస్తాడు.
    "బాబ్బాబు! అక్కనడిగి పాతిక పైస లిచ్చుకుంటాను కాని, ఆ మీసాలు తీయించేరా! చూడలేకుండా ఉన్నాం" అనేది శాంత.
    "ఇంత చక్కని మీసాల్ని పావలా డబ్బుల కాశపడి తీయించేస్తానా? కక్కుర్తి పడినా, కడుపు నిండాలి అన్నారు పెద్దలు. ఒక వెయ్యి రూపాయలిస్తే సిద్దం" అనేవాడు.
    "నాకేం? ఆ మీసాలు పీకేసేదాకా ఏ అమ్మాయి నీ ముఖం చూడదు!" శాంత అన్నను భయపెట్టేది.
    "ఓ సోదరీ మణీ! మన బాధంతా అటువంటి ఆపదలో చిక్కుకోకుండా తప్పించుకొందికే" అనేవాడు ప్రకాశం నవ్వుతూ.
    "ఎంతకాలం ఇలా ఒంటరిగా తిరుగుతావు , ప్రకాశం? నచ్చిన పిల్లని చూసుకొని పెళ్ళి చేసుకోరాదూ" అనేది జానకి.
    "నా కొట్లో ఒక బీరువా నిండా ఫామిలీ ప్లానింగ్ పుస్తకాలే ఉన్నాయి, అక్కా! నే పెళ్ళి చేసుకొంటే, ఆ భార్యామణి పదిమంది పిల్లల్ని కానీ, నా కొట్టు మీదికి దండయాత్రకి పంపిందంటే , నా వ్యాపారం అంతా గోల్ మాల్ అయిపోతుంది. "ఏమయ్యా! ఆ పుస్తకాలు నీ కొట్లో ఉండి నీ కెంత ఉపకరించేయో మా ఇళ్ళకి వచ్చి మాకూ అంతే ఉపకరిస్తాయి" అంటారు కొనేవాళ్ళు" అనేవాడు ప్రకాశం.
    "పెళ్ళి చేసుకోన్నంత మాత్రాన పది మంది పిల్లలు పుట్టుకొస్తారేమిటి, ప్రకాశం? పరిమితమైన సంతానం ఉంచుకోందాం అన్న ఆలోచన లేనివారికి, దాని విలువ తెలియని వారికి పుట్టుకొస్తారు కానీ!" అనేది జానకి.
    "అయితే అక్కయ్యా! తెలిసిన ప్రతి విషయాన్ని మనిషి ఆచరణలో పెడుతున్నాడంటావా? కూలిపోనున్న కుల తత్వానికి, మాసి పోవలసిన మతోన్మాదానికి ఎందుకు ప్రాణం పోస్తున్నాడు మానవుడు? ఈనాటి జీవన గతిలో సహజమనీ, న్యాయమనీ నమ్ముతున్న వర్ణాంతర వివాహాలని, విధవా వివాహాలని ఎందుకు వ్యతిరేకిస్తున్నాడు? కష్టించి, బ్రతికిందికి రాజమార్గం ఉండగా, ప్రక్కదారుల్లో పొట్టలు నింపుకోవాలని ఎందుకు తాపత్రయ పడుతున్నాడు? వీటిలోని తప్పొప్పులు తెలియకనా?
    "తెలిసిన విషయాన్ని తెలిసినట్లు ఒప్పుకోడానికి ధైర్యం కావాలి, అక్కా! తెలిసిన విషయాన్ని, తను న్యాయమని నమ్మిన విషయాన్ని ఆచరణలో పెట్టడానికి ఆత్మస్థైర్యం కావాలి. మనలో చాలామంది ఆ స్థాయికి చేరుకోనేసరికి ఇంకా చాలాకాలం పడుతుంది. ఆ కాలం కలిసి వచ్చేదాకా నే నేవరినీ నమ్మను. అయ్యబాబోయ్! ఆడవాళ్ళని అసలు నమ్మకూడదు. వాళ్ళు ప్రేమ అనే మత్తు మందు జల్లి మనం కాదనుకొనే ఎన్ని పనులు చేయించింది కైనా సమర్ధులు" అనేవాడు ప్రకాశం నవ్వుతూ.
    ప్రకాశం మీసాలు సరిచేసుకొంటూ వెనక్కు తిరిగి చూసేడు, తను చెప్పిన మాట అక్కలో ఏమైనా మార్పులు  కలిగించిందేమో చూడాలని.
    "ఎవరి కాలం తీరిపోతే వాళ్ళు వెళ్ళి పోతారు . దీనిలో ప్రత్యేకం చెప్పుకోడాని కేముంది?' అనుకోంది జానకి.
    ఆ మాట చెవిని పడనట్లే , "మళ్ళా ఎప్పుడు వస్తావు?' అన్నది.
    "ఎప్పుడు తెరిపిగా ఉంటె అప్పుడు వస్తాను. ఫలానా రోజని చెప్పలేను. కాని ఈ మాట నీతో అన్నయ్య, అమ్మ చెప్పలేను. కాని ఈ మాట నీతో అన్నయ్య, అమ్మ చెప్పమన్నారు" అని వెళ్లిపోయేడు ప్రకాశం.
    ప్రకాశం గుమ్మం దిగుతుంటే పోస్టు బంట్రోతు జానకి చేతిలో ఒక కవరు పెట్టేడు. దాని వైపు క్షణ కాలం రెప్పవేయకుండా చూసింది జానకి. నాలుగడుగులు నడిచి ఏదో చెప్పాలని వెనుదిరిగిన ప్రకాశం ఆమె కళ్ళలోని కాంతిని, ముఖంలోని శాంతిని చూసి ఆ అనుభూతిని పాడు చెయ్య ఇష్టం లేక వెళ్లిపోయేడు.
    పైకి తీసి చదివిన ఉత్తరాన్ని అలాగే చేతిలో పట్టుకొని నిలబడి పోయింది జానకి. శాంత వచ్చి, "ఎక్కడి నుండి , అక్కా , ఉత్తరం?" అని ప్రశ్నించే వరకు ఆమె ఆలోచనల నుండి తేరుకొనే లేదు.
    "రేపు రాత్రి రైలు లో గోవిందబాబు వస్తున్నారు" అన్నది.
    అక్క ముఖంలోని ఆనందం చూసి, అంతకన్నమంచి వార్త అనుకొన్న శాంత, ఏమీ అనకుండా ఇంట్లోకి వెళ్ళిపోయింది.
    "రేపు రాత్రి గోవిందబాబు వస్తున్నారు." జానకి అన్న మాటలోని సంతృప్తి ఆమె చెవిలోనే ప్రతిధ్వనించింది.
    ప్రకాశం , రాజారావు భార్య చనిపోయిందంటే తనకేమీ పట్టనట్లు, కాలం మూడిన వాళ్ళు, రోజూ ఎందరో చచ్చి పోతుంటారు; అందులో ప్రత్యేకంగా చెప్పుకోడాని కేముంది అనుకొంది జానకి. ఇప్పుడు గోవిందబాబు వస్తున్నారంటే , రోజూ రైలులో ఎంతో మంది వస్తుంటారు; పోతుంటారు. ఇందులో చెప్పుకోడాని కేముందీ? అనుకోలేక పోయింది. ఆ వార్త తెల్లవార్లూ ఆమె కళ్ళ ముందు కలల్లో తిరుగుతూనే ఉంది. 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS