"ప్రతి చిన్న పనికి బాధ్యతను అధికారుల మీద తోసేసి, తాము చేతులు ముడుచుకు కూర్చునే వారంటే నా కిష్టం ఉండదు, జానకీ! తమంతట తాము చెయ్యగలిగింది చేస్తూ, మిగిలింది పైవారికి వదిలితే పనులు తేలిగ్గా, కాలహరణం లేకుండా జరిగిపోతాయి. ఆఫీసు లో జరుగుతున్నదేమిటో అందరికీ తెలిసి వస్తుంది" అనేవాడు గోవిందబాబు.
ఈ కొత్తాయన అందుకు పూర్తిగా విరుద్దం. నిజానికి ఈయన వచ్చిన తరువాత అనసూయమ్మ కూడా తన అలవాట్లను మార్చుకుందేమో అనిపించేది జానకికి. బాలవిహార్ లో ఇతను చేస్తున్న అవకతవకలు , క్రమశిక్షణ పేరుతొ పిల్లల పట్ల , క్రింది ఉద్యోగుల పట్ల అతను ప్రవర్తిస్తున్న తీరు అనసూయమ్మ దృష్టి లో పడలేదనుకోడానికి ఆస్కారం లేదు. అన్నీ చూస్తూ ఆమె నోరు విప్పలేదంటే, ఆమెకు ఇతని పట్ల మంచి గురి ఏర్పడి ఉండాలనుకుంది జానకి.
ఒకటి, రెండు సార్లు తనకు తానుగా ఆఫీసులో జరుగుతున్న తతంగం తెలియజేసింది. బాలవిహార్ అధిపతుల మంచితనానికి, మర్యాదకు అలవాటు పడిన నౌకర్లు, ఆయాలు ఇతని దగ్గర అట్టే కాలం పనిచేసే మార్గం కనిపించడం లేదని సూచించింది.
జానకి చెప్పిన సంఘటనన్నీ మౌనంగా విన్నది అనసూయమ్మ. "అతడు వృద్దుడు. అనుభవశాలి. 'ఈ సంస్థ ని సరియైన మార్గంలో నడిపిందికి నా శాయశక్తు లా పని చేస్తానమ్మా" అన్నాడు. మనం ఎదుటి వారి గురించి ఏదైనా నిర్ణయం చేసే ముందు కాస్త నిదానం, అవసరం జానకీ!' అన్నది ఆవిడ.
అటు తరువాత అనసూయమ్మ తో ఏ విషయం ప్రస్తావించలేదు జానకి. కాని అక్కడ జరుగుతున్న మార్పులు, తన పట్ల ఆ ముసలాయన పెంచుకొన్న అభిప్రాయాలు చూస్తుంటే, తనింకా అట్టే కాలం బాలవిహార్ లో పని చేయలేననుకొంది. ఇంకో ఉద్యోగం చూసుకోవాలంటే అంత సులువుగా జరిగే పని కాదు. పెద్ద చదువులు ఉన్నవారికే పని దొరకడం కష్టంగా ఉంటున్న ఈరోజుల్లో తన చదువుకు ఉద్యోగం దొరకడం మాటలా?
అధమం శాంతకైనా ఏదో ఒక నౌకరీ దొరికితే దానితో ఇద్దరూ బ్రతకవచ్చనే ఆశ ఓ మూల ఉంది. ఆ కారణం గానే శాంత చదువు ఈ సంవత్సరంతో పూర్తీ కావాలనే బలీయమైన కోర్కె జానకిలో ఏర్పడింది.
ఈ ఉద్యోగం పొతే చెట్టు విడిచిన పక్షుల్లా గాలిలో తిరగవలసి వస్తుంది తమకు. అన్నగారింటి తలుపులు ఏనాడో మూసుకు పోయాయి. మిగిలిన వాడు ప్రకాశం. ఈ కొత్త షాపు పెట్టడంతో అప్పులో పడి, అతడికి సొమ్ముకు కొంచెం కటకట గానే ఉన్నట్లుంది. పైగా ప్రతి నెల అన్న సూర్యారావు అవసరాలకు అంతో, ఇంతో పంపే అలవాటు ఒకటి ఉన్నది.
ఒకరోజు నవ్వుతూ ప్రకాశం ఆ మాటే అన్నాడు.
"అన్నయ్య కోపంతో వ్యంగ్యంగా అన్నా ఆ మాట నిజమైంది అక్కా! నువ్వు వీధుల వెంట తిరిగి పేపర్లమ్ముకొంటూ సొమ్ము గడించి నాకు పెడుదువు గాని. నేను మా తమ్ముడు సొమ్ము పంపేడని రెండు చేతులతో అందుకుంటాను-- అన్నాడు. ఈమధ్య ప్రతి నేలా పేపర్ల సొమ్ము ఎంతో కొంత అన్నయ్య అందుకోకుండా అవటం లేదు" అన్నాడు.
ఇంక అటువంటప్పుడు తామిద్దరూ కూడా అతని మీది ఎలా స్వారీ చెయ్యగలరు? అయోమయంగా కనిపిస్తున్న భవిష్యత్తు లో ఆశాదీపంగా కనిపిస్తూ ఒక మాట మాటిమాటికి జానకి మనసులో మెదల సాగింది.
గోవిందబాబు బాలవిహార్ వదిలి వెళ్ళిపోయే ముందు ఒక సాయంకాలం ఇద్దరూ మొక్కల మధ్య తిరుగుతున్నారు. ఒక సూర్యకాంతం పువ్వుల మొక్క వేరు పురుగు కొరికిన కారణంగా నిలువునా వాడిపోయింది. వికసించిన పువ్వులు, విడివిడని మొగ్గలు , రక్షక దళాల మధ్య అప్పుడే మెల్లమెల్లగా తొంగి చూస్తున్న కను మొగ్గలు అన్నీ చెట్టుతో పాటు వాడిపోయేయి.
అది చూసి చాలాబాధపడ్డాడు గోవిందబాబు. "నిన్నటికి పచ్చగా చెట్టు నిండా పువ్వులతో కలకల్లాదుతుండేది ఒక్క రోజులో ఎలా అయిపోయిందో!" అన్నాడు.
గోవిందబాబు! అప్పుడప్పుడు మీరు చూసి పోతుండె ఈ మొక్క వాడిపోతే ఇంత బాధ పడుతున్నారు కదా? మీ చుట్టూ అల్లుకొన్న ఇంత మంది పిల్లల్ని విడదీసుకొని ఎలా వెళ్ళి పొగలుగుతున్నారు? మీ సాన్నిధ్యంలో వాళ్ళెంత ఆనందంగా ఉంటున్నారో మీకు తెలియంది కాదు. మీరు వెళ్ళిపోయేరంటే వాళ్ళెంత బాధపడ్రారో ఆలోచించారా" అన్నది జానకి.
"పసిపిల్లలు తమ బాధని త్వరగా మర్చిపోగలరు, జానకీ! నేను వెళ్ళిపోతే వాళ్ళకి ఇంకో అన్నయ్య వస్తాడు. అతనితో కూడా ఇంత సంతోషంగా ఉంటారు వాళ్ళు."
"అలా జరిగితే , అదృష్టమే. అనసూయమ్మగారి ఆరోగ్యం ఆవిడా పూర్వంలా తిరిగి పనిపాట్లు చేసుకొందికి వీలుగా లేదు. వచ్చిన అతను మంచి వాడయితే బాలవిహార్ అభివృద్ధి ఆగకుండా సాగిపోతుంది. లేకపోతే ఏమౌందో మరి?
'అంతా మీలాటి సహృదయులే ఉండరు, గోవిందబాబూ! డబ్బు కోసం ఉద్యోగం చేసేవారికి ఈ సంస్థ పట్ల. ఈ పిల్లల పట్ల మీ కున్నటువంటి అనుబంధం ఉండదు. మీతో పరిచయం కాకపూర్వం నా అభిప్రాయాలూ అలాగే ఉండేది. ఈనాడు ఇదొక విడిపించుకొని అనుబంధంగా, అభివృద్ధి పొందాలని ఇక్కడి పిల్లలు ఆనందంగా పెరగాలని నా కోర్కె."
"మీకు నా మీదున్న అభిమానం చేత అలా అంటున్నారు. అంతకన్న మరేం లేదు. నేను వెళ్ళిపోతే ఇక్కడి కార్యక్రమం నిలిచి పోతుందన్న భయం నాకు లేదు. కాని, ఈ పిల్లల్ని విడిచి పెట్టి పోవడం నాకూ కష్టంగానే ఉంది. మళ్ళా తిరిగి వచ్చింది కే ప్రయత్నిస్తాను. వీలైతే ఈసారి పూర్తిగా ఇక్కడ ఉండిపోయే ఏర్పాటు తోనే వస్తాను. ఈలోగా నా అవసరం ఇక్కడ ఉన్నదని మీకు తోస్తే ఉత్తరం రాయండి. తప్పకుండా వస్తాను.' అన్నాడు అతడు.
జానకి ఈ మాట తలపుకి రాగానే కలం, కాగితం తీసుకొంది.
"గోవిందబాబూ! బాలవిహార్ కి మీ అవసరం ఈనాడు ఉన్నంతగా ముందెన్నడూ ఉండదు. మీ అక్కగారు నాటిన మొన్నను మీరు నీరు పోసి పెంచేరు. అది పుష్పించి , ఫలింపనున్న సమయంలో మీరిద్దరూ దాని పట్ల నిర్లిప్తత పెంచుకొన్నారు. కళ్ళముందు రోజురోజుకు పాలిపోతున్న ఈ మొక్కను చూసి బాధపడడం మినహా ఏ పనీ చెయ్యలేని స్థితిలో నేను ఉన్నాను.
"ఈ మానేజరు చర్యలన్నీ గమనిస్తూ అనసూయమ్మ గారూ ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో నా కర్ధం కావటం లేదు. ఓపిక లేకపోయినా అంతా తిరుగుతున్నారు. అన్నీ చూస్తున్నారు. పెదవి కదిపి 'ఇదేమిటి ఇలా?' అని ప్రశ్నించడం లేదు. నాకు తెలిసిన అనసూయమ్మ గారూ ఇటువంటి పరిస్థితిని ఎంతమాత్రం సహించరు. మీ అక్కగారు పూర్తిగా మారిపోయేరు. సరియైన తరుణంలో వచ్చి, ఈ బాధ్యత స్వీకరించడం మీ కేంతైనా అవసరం" అని ఉత్తరం వ్రాసి పోస్టు చేసింది జానకి.
జానకి ముందు మానేజరు ను చులకన చేయడం మంచిపని కాదనుకోంది అనసూయమ్మ. అందుకే ఆమె మాటల్ని లక్ష్యం చేయనట్లు విన్నది. తన చర్యలను ఆలోచనలను సరిదిద్దుకొందుకు మానేజరుకు తగినంత సమయం ఇవ్వాలనే ఉద్దేశ్యంతోనే సలహాగా మాత్రం తన అభిప్రాయాలు చెపుతున్నా విధి నిర్వహణ బాధ్యత అతనికే వదిలి కొంతకాలం చూసింది అనసూయమ్మ.
అతను తను చేసిన తప్పుల్ని సరిదిద్దుకొనడం పోయి, వాటిని రెట్టించుకుంటూ పిల్లల పట్ల, నౌకర్ల పట్ల నిరంకుశంగా ప్రవర్తించడం మొదలుపెట్టేడు. అనసూయమ్మ తన చెప్పు చేతల్లో ఉంటుందనీ, తన మాటకు ఎదురుచేప్పే తత్వం కాదనీ అతడు భావించేడు. అవకాశం దొరికినప్పుడే అధికారం పెంచుకొని, తన స్థానాన్ని పటిష్టం చేసుకోవాలనుకొన్నాడు.
పైకి ఏమీ కదలకపోయినా అనసూయమ్మ ఈ విషయాలన్నీ గ్రహించింది. ఇతని వల్ల బాలవిహార్ బాగుపడదని నిశ్చయించుకొంది. మళ్ళా ప్రకటన చేసి ఇంకొకర్ని తీసుకొనే ముందు ఈ విషయం గోవిందబాబు కు వ్రాస్తే మంచిదని భావించింది.
"నీ మానవసేవ ఇక్కడికి వచ్చి చెయ్యకూడదుటయ్యా ! ఈ పిల్లలు మాత్రం మానవులు కారా?" అని వ్రాసింది. "గోవిందూ, నువ్వు వెళ్ళినప్పటి నుండి ఇక్కడ పని తిన్నగా సాగటం లేదు. నీకు అంతగా వెళ్ళి పోవాలనుంటే ఇక్కడ ఎవర్నో ఒకర్ని తర్ఫీదు చేసి పెట్టి. తగిన విధంగా ఏర్పాట్లు చేసి మరీ వెళ్ళు. నేనీ భారం మోసే స్థితిని దాటిపోతున్నాను. ఇంక నువ్వే చూడాలి" అని ఉత్తరం రాసింది.
గోవిందబాబు కు ఉత్తరం వ్రాసిన మరునాటి నుండి అతని జవాబు కోసం ఎదురు చూస్తున్నది జానకి. గోవిందబాబు తిరిగి వస్తాడు . "అన్నా.... అన్నా " అంటూ పరుగులు తీసే చిన్నారి పాపల ముఖాల్లో నవ్వులు కురుస్తాయి. కొత్త సంవత్సరం కొత్త మార్పులతో బాల విహార్ ను పలకరిస్తుంది. అంతా చక్కగా, వేసవి లో వడ తగిలిన బాటసారికి చల్లని మాని నీడలోని హయిలా గడిచి పోతుంది-- అనుకొంది జానకి.
"గోవిందబాబు రాకతో బాగుపడేది బాలవిహార్ ఒక్కటేనా? వ్యక్తిగతంగా నీకు లభ్యమయ్యే ఆనందం ఏం లేదా?" మనసు ప్రశ్నించింది.
"ఎందుకు ఉండదు? బాలవిహార్ బాగుపడితే నా పరిస్థితి బాగుపడుతుంది. నేను బాలవిహార్ లో ఒక భాగం లాంటి దాన్ని." జానకి నమ్మకంగా సమాధానం చెప్పింది.
"అంతేనా? అంతకు మించి ఇంకేం ఆలోచనా లేదా?' మనసు రెట్టించింది.
ఆప్రశ్నకు ఎదుటపడి ఏ సమాధానం చెప్పలేక పోయింది జానకి. గోవిందబాబు వెళ్ళిపోయిన దగ్గరి నుండి సంతతం మనసు దాని సమాధానం కోసం వేదిస్తున్నది. తనకు సంబంధించిన ఒక ప్రశ్నకు తిన్నగా జవాబు చెప్పలేనంత పిరికితనం తనలో ఎప్పుడు చోటు చేసుకొందో జానకి తెలుసుకోలేక పోయింది. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పగలిగే టంత పరిపక్వత తన ఆలోచనలకు ఇంకా రాలేదనుకొన్నది. కాలంతో కలిసి పరిణతి చెంది పండందే , పండుకు తియ్యదనం రాదుట. సమయం వచ్చేవరకు వేచి ఉండడమే తనకు శ్రేయస్కరం అని నిర్ణయించుకొంది జానకి.
జానకి గతంలో చిందులు తొక్కుతుండగానే ప్రకాశం వచ్చేడు.
"చాలారోజులై కనిపించలేదేం?" అని ప్రశ్నించింది జానకి.
"అక్కడ పని పూర్తయ్యేక అన్నయ్య దగ్గరికి వెళ్ళేడు."
"ఏమిటి సంగతులు?"
"ఏమున్నాయి! ఉత్తరాల్లో రాస్తున్ననాటి మాతృకలే. ఈసారి వదిన మరీ నీరసంగా ఉంది. డాక్టరు నడిగి యేవో రెండు టానిక్కు లు కొని ఇచ్చెను. వాటిని జాగ్రత్తగా తీసుకోమని చెప్పి వచ్చెను.
వదిన నా వైపు అదోలా చూసి నవ్వుతూ "ప్రకాశం, ఇవి చిన్నపిల్లలకి కూడా పనికొస్తాయా?" అంది .
"అప్పటికి నా తప్పు తెలిసి వచ్చింది. పాప వదిన కంటే నీరసంగా ఉంది. నా మనసులో ముఖ్య స్థానంలో వదిన ఉంటుంది. అన్నయ్య , పాప అంతా ఆవిడకి అనుబంధాలుగా కనిపిస్తారు. అందుకే పాప గురించిన ఆలోచన నాకు రాలేదు. ఈ మాటంటే అన్నయ్యాకి కోపం వస్తుంది.
