'ఆత్మ జ్ఞానం కోసం యెన్నో ప్రదేశాలలో తిరిగాను. యెందరో సాధు పుంగవులను చూసాను. నీ యెదురు గానే జ్ఞానోదయ మైంది. నీకు జన్మాంతం ఋణపడి వుంటాను -- వస్తాను.'
అని కదలగానే ఆమె అతని చెయ్యి పట్టుకుంది. గట్టిగా కౌగలించుకుని 'మిమ్మల్ని వదల్లెను బాబూ' అంటూ యేడుస్తూ కూర్చుంది. ఒకసారి ఆమె తల నిమిరి
'నీకూ నాకూ యీ జన్మలో యిదే కలయిక. ఇక మనం యెప్పుడూ కలుసుకోం. కానీ యెల్లప్పుడూ నువ్వు నా మనసులో వుంటావ్. నువ్వన్న మాట యెప్పుడూ మరిచి పొలెను వస్తాను.'
ఆమెను విడిచి పెట్టాడు . ఆమె అతనిని గట్టిగా ముద్దు లాడుతూ 'ఈ సుఖం చచ్చినా మరచి పోను బాబూ' ఈ బజారు దాని యింట్లో అడుగు పెట్టి యింత గౌరవం చేస్తారు. అంతే చాలు.'
సూర్యం సముద్ర పోడ్డుకు పరుగెత్తాడు. అంతా ఖాళీగా వుంది. అటూ ఇటూ ఆతృతగా కదిలాడు. అతని ఎదరగా మనుషులను మ్రింగటానికి నోట అవలించిన కొండ చిలవ లా కెరటాలు కదులుతున్నాయ్. ఫణి రాజు కెరటాలతో కట్టలా చుట్టి విశాలను లాక్కు పోతున్నాడన్న వూహ రాగానే ఒక్కసారి నేలపై కూల బడిపోయాడు. చీకటి లో శరీరం బాధతో చిల్లులు దేరింది. రక్తం చిమ్మినట్లు కళ్ళల్లో నీరు చిమ్మాయ్. ఆమెను తాకాలన్న బలీయమైన కోర్కెకు అది తీర్చు కోలేనన్న నిస్పృహ కు యుద్ధం జరగ్గానే తన మనసు రణ రంగమై పోయింది. విశాల అన్న మాటలూ, అక్షరాలా నిజం అనుకున్నాడు. 'నేను పాత చింత కాయ పచ్చడ్నే కాదు. బూజు పట్టిన పాత చింతకాయ పచ్చడి ని. దానికి అనుభవించే తీరు లేదు- పెంట కుప్ప పై పార వేయవలసిందే! ఆత్మ జ్ఞానం పేరు పెట్టి లోకం కళ్ళు కప్పడానికి చూసాను. పాత లో రోతనే. పట్టుకున్నాను గానీ, పాతలోని క్రొత్తను చూడలేక పోయాను. ఒక విరిగిన చక్రమై గోడకు చారబడ్డాను గానీ తిరిగే చక్రాన్ని కాలేక పోయాను. మనిషై సాధించినది యేమీ లేదు. తెలుసుకున్నది అంతకంటే లేదు. వెన్న ముద్దలా కరిగి పోయాను. వేడి నీరుగా మరిగి పోయాను. భూమీ మీద నిల్చోలేక పోయాను. ఆకాశం లో ఎగరనూ లేకపోయాను. నాకంటే గ్రుడ్డి వాడు నయం , కుంటి వాడు మేలు. బ్రతకాలనే పట్టుదల వుంటుంది. సంఘానికి సోమరి పోతుని చేసింది నేను-- జీవశ్చవం చేసింది నేనే-- కాదు నేను సంఘానికి సరియైన భాష్యం చెప్పలేక పోయాను -- అర్ధం చేసుకో లేకపోయాను. సంఘం వ్యక్తులను బట్టి వుంటుంది. విలువలు వ్యక్తులను బట్టే వస్తాయ్. వెన్నె ముక గల వ్యక్తులే సంఘానికి వెన్నె మూకలు సృష్టిస్తారు. మార్పు వలన మనిషి ముందుకు పోతాడు. మార్పు వలన సంఘం ముందుకు పోతుంది. మనిషి జీవశ్చవం . అలాంటి వాడే నక్కిపోడానికి ,మూలాలను వేడుకుతాడు. అలా వెతకడానికే ఆత్మ జ్ఞానం నేను పట్టుకున్నాను. నా యీ జీవితం యింతకంటే సరిగా రాదు. ఈ మనసును మార్చలేను. విశాల లేనిది బ్రతక లేను. నా కర్కశ హృదయం ఒక అమాయకు రాలీని బలిగోన్నప్పుడు యీ కెరటాలు నన్ను బలి గొంటే నే నాకు శాంతి లభిస్తుంది. లేకపోతె యిప్పుడు బ్రతికి ఏం చెయ్యటం? యినా యెలాగా బ్రతక గలను? నా వుదాసీనతతో గోవిందరావు ను చంపుకున్నాను-- నా చెల్లెలు గౌరీ బ్రతుకు కాల్చాను. నా స్వలాభంతో విశాల గొంతుకు కోసాను. ఈ గతంలోని ముళ్ళ పాన్పు పై పడుకుని సుఖ పడే ధైర్యం నా కింకా లేదు.
లేచాడు. ఎక్కడా తానొక్కడే జీవి హోరుమనే సముద్రపు ఘోష తో తన హృదయ ఘోష కలిసింది. నురగలు గక్కి అలసి సోమ్మ సిల్లి పోతూ వడ్డుకు చేరిన సముద్రం లానే తనూ కూలి పోతున్నాడు. నాలుగడుగులు ముందుకు వేశాడు. నల్లని సముద్రం -- చావు గుర్తు నలుపు -- తన మనసు నల్ల నై పోయింది , నలుపు నలుపు లో కలసి పోతుంది-- నల్లని మేఘాల్లో ఒక మెరుపులా --'
'అక్కరమ్మంటుంది -- వేగంగా !' విన్నాడు. తిరుగ చూసాడు . రామం.
'అక్క వుందా?'
'ఇంట్లో వుంది. మిమ్మల్ని వేగిరం రమ్మంటోంది.'
'నిజం.'
'నిజం గానే!'
చనిపోతున్న మనిషికి అమర జీవిని చేసే అమృతం దొరికి నట్లయింది. జరా మరణాలు లేక సుఖ పడ్తానానుకుని పరుగెత్తాడు.
ఇంట్లోకి వెళ్లేసరికి విశాల లేదు.
'ఏదీ ?'
'నేను వచ్చేసరికి వుంది.'
'విశాలా- విశాలా' అని పిల్చాడు. పెరటి వంట యింట్లోకి వెళ్ళాడు. నూతి లోనికి చూసాడు. ఏమీ అగిపడలేదు.
'విశాలా' అని మనసులో ప్రతి ధ్వనిస్తోంది.
'ఏదీ....విశాల..ఏదీ!'
'ఉండేది....'
'ఎక్కడ వుంది? ఎక్కడ?'
ఆ వెతకడం లో టేబిలు మీద వుత్తరం అగపడింది.
'మీరు మళ్లీ తప్పక అచోటికే వస్తారని రామం ని పంపిస్తున్నాను. మీ మీద అభిప్రాయం మొగమాటం లేకుండా అన్నందుకు మీకు కష్టం అనిపించింది. మీరు ఆత్మజ్ఞానం గురించి మాట్లాడారు. నిజంగా మీకు ఆత్మా జ్ఞానమే అబ్బితే మీరు అంత వడిగా పౌరుషంగా వెళ్ళిపోయే వారు కాదు. నా మాటల్లో నిజం వుంటే ఒప్పు కునేవారు. ఎదుటి వాళ్ళకు అహం వదలి పెట్టమని మీరెంత వదిలేసారు? మీకింకా నాలో ఏదో కళంకం వుందని వూహ! లేదని చెప్పిన నమ్మరు. పోనీ అత్మజ్ఞానులు కదా -- నా ఆత్మ కళంకం లేనిదంటే ఒప్పుకుంటారా? నా ఆత్మను మీ ఆత్మతో కలపాలనే నా ఆరాటం అంతాను. అయితే మనుషులు స్వరూపాలతో వుండి ఒకరి నొకరు ముట్టుకోకుండా ఆత్మల నెలా కలుపుతామో నా కర్ధం కావటం లేదు. ప్రేమ వలెనే ఆత్మలు కలుస్తాయని నా నమ్మకం. యేవో చేష్టలు చేస్తే గానీ ప్రేమ జనించదు. ఆ చేష్టలే ప్రేమను సృష్టించి మీ ఆత్మతో యేకమౌదామని తాపత్రయం పడ్డాను. మీరు సహజంగా గుట్టు మనిషని నేనే సిగ్గు విడిచాను. విప్పి చెప్పాను. ఏమిటీ యిలా సిగ్గు లేక బయట పడిందని మీరు తృణీకరించారు. పోనీయండి. మీరు తృణీ కరించినా మిమ్మల్ని నేను తృణీకరించ లేను.
ఎంచేత అంటారేమో? మీ మీద నాకున్న విశ్వాసం వలన. తొలిసారి మిమ్మల్ని చిన్న పిల్లాడి లా చూసాను. అప్పుడు నాకు జన్మ జన్మాల సంబంధమేదో జ్ఞప్తికి వచ్చింది. యౌవ్వనం లో మీ పాదాల మీద కన్నీటి తో పడినప్పుడు మీరు మరచి పోమన్నా మరచి పోలేక పోయాను. మీ కోసమే బ్రతికి సంఘం లో ఒక మచ్చ తెచ్చుకున్నా మళ్లీ మీ దయకు పాత్రురాలయ్యాను. ఇంత వరకు మీరు పెళ్లి చేసుకోకుండా వుండి నా బాధ్యత తీసుకున్నారంటే నా మీద ప్రేమతో చేస్తున్నారు. మీలో ప్రేమాను రాగాలు కొల్లలుగా వున్నాయ్, అవి భయం వలన బయటకు చూపించ లేక పోతున్నారు. మీలాంటి మగవాడ్ని మరి ఒకరిని కలుసుకోలేను. అంచేత మరి ఒకర్ని ప్రేమించ లేను. మీరు తప్పింఛి యింకో మగాడ్ని మనోవాక్కాయ కర్మలతో తల్చు కోలేను. ఒకటి మాత్రం మీకు హామీ యిస్తున్నాను. నేను ఆత్మహత్య మాత్రం చేసుకోను-- అవినీతికి మాత్రం పాల్పడలేను. మిమ్మల్ని తల్చుకుని ఆనందించడానికి బ్రతికి వుంటాను. నాకు ఆత్మ జ్ఞానం కలిగిందని తృప్తి పడతాను.
నేను వెళ్ళిపోయే ముందు మీ కాళ్ళను తాకి వెళ్ళే అదృష్టం నాకు లేక పోయింది. మీ వక్షం పై పడి కన్నీరు కార్చి మరీ తృప్తి తో కదలలేక పోయాను. కానీ యేడ్చానండి-- ఈ వుత్తరం పై కన్నీటి మరకలే మీకు సాక్ష్యం. మిమ్మల్ని యీ జన్మ లోనే కాదు -- జన్మజన్మాల కు -- నా వానిగా -- నన్ను వెలుగు చూపించిన వానిగా -- నా ఆత్మను వెలిగించిన దేవునిగా ...కోరుకుంటాను.....'
మీ చరణదాసీ
విశాల'
ఆత్మ ఆరాటపడ్తే గానీ అసలైన కన్నీటి బిందువులు రాలవు, ఆమె వుత్తరం పై రాల్చిన అసలైన కన్నీటి బిందువుల పై అతని కన్నీటి బొట్లు రాలి వారి ఆత్మలు కలిసాయ్. ఆమె తన కంటే మనిషిగా యెన్నో మైళ్ళు ముందుకు పోయింది. ఆమెను వెతకడానికి పరుగెత్తి నా చేరుకోలేక పోయాడు. ఆ రాత్రి మరుసటి రోజు సాయంత్రం వరకు తిరగలేని చోట్లన్నీ తిరిగాడు. విలపించాడు. యేడ్చాడు. ఈ మానవ మాత్రుడ్ని వుద్ద్రించడానికి వచ్చిన దేవకన్య మళ్ళీ స్వర్గానికి వెళ్ళిపోయి నట్టుంది, మేఘ సందేశాలు తప్పించి యింకేమీ చెయ్యలేడు. ఆ ఆరాటంతో ఒక్కరోజుకే సగం అయ్యాడు. పిచ్చి వాడిలా తిరిగాడు. పిచ్చితో సన్యాసం వచ్చింది. తనకు మిగిలిందేమీ లేదు-- తల్చుకోడానికే భయం వేస్తోంది. మనసు మండిపోయింది. ఆత్మే మిగిలిందని సమాధాన పర్చుకొబోయాడు. 'శరీరం లేని ఆత్మ లో శరీరం గల తను ఏం సుఖం పొందగలడు? నిమునిమిషానికి నిస్పృహ వేదాంతాన్ని బోధిస్తోంది.
'నేను నేను కాదు. నాకు స్వరూపం లేదు. అసలే మనిషే మాయ. వాడికి రూపం యేమిటి? పేరేమిటి? వూరేమిటి? అంతా మిధ్య. తెలివిత క్కువ వాడేవడంటే -- మనిషే! వాడే తెలివైన వాడైతే యీ జైల్లో ఎందు కుంటాడు? వీడి కెందుకీ తాపత్రయం? మిధ్య ను సుఖం అనుకొని ఎందు కిన్ని అన్యాయాలు చేస్తాడు. అబద్దాన్ని సృష్టిస్తాడు. మనిషి జీవితం అంతా అతుకుల బొంత. తుపాకీ దెబ్బలు తిన్న పులి మనిషి, ఆకారంతో వున్నవాడు నిరాకారం గురించి ఏం చెప్పగలడు? అతని కున్న కళ్ళు, చెవులు, ముక్కూ, అతని దొంగ తనాన్నీ, ఖూనీ కోరు తత్వాన్నీ పట్టుకోవాలని వెతికే జాగిలాలు. అతనిదేది కాదు-- ఒక్కటే! అది ఆత్మ. దానితోనే మనిషి బ్రతికితే -- దానినే సంతృప్తి పరిస్తే , దాన్నే కొలిస్తే -- అంతా దానితోనే మెసల గలిగితే మనిషికి మోక్షం వస్తుంది --'
ఈ ఆత్మ జ్ఞానం అదివరకు తను వుండిన ఆసుపత్రి గేటు ముందు కలిగింది. సాయంత్రము నాలుగు గంటలైంది. రోగులను చూడటానికి యెందరో వచ్చి పోతున్నారు. విశాలలా కనిపిస్తూ విశాల కాని వారిని యిద్దర్నీ చూసాడు. ఆసుపత్రి లో 'సి' క్లాసు వార్డు అందులో నాల్గు మంచాలు , నాల్గు మంచాల పై వ్యక్తులు జ్ఞప్తి కి వచ్చారు. ఆ నలుగుర్లో బ్రతికి వున్నది తనే. తను వుండిన మంచం చూస్తె తనకు ఆత్మ జ్ఞానం కలిగే సంఘటన లేవైనా జరుగుతాయేమో?.... మెల్లగా కదిలాడు. వార్డు లో నాల్గు మంచాలు నిండే వున్నాయ్. రోగులను చూడటానికి ఆత్మీయులు వచ్చే యున్నారు. సూర్యం తను వుండిన మంచం దగ్గర నిల్చొని పరీక్షగా చూడగానే దానిపై యిప్పుడున్న వ్యక్తీ.
'ఎవరి కోసం ?' అని ప్రశ్నించాడు.
ఆ ప్రశ్న యెన్నెన్నో జవాబులను మనసులో సృష్టించింది. అతను వయసు మళ్ళీన వ్యక్తీ. పొడుగ్గా సన్నంగా తెల్లగా వున్నాడు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా పని చేస్తాడట. జుత్తు బాగా రాలి పట్టబుర్ర అద్దంలా మెరుస్తోంది.
'ఒకప్పుడు యీ మంచం మీద వుండే వాడ్ని.'
'రండి-- రండి-- కూర్చోండి' అంటూ స్టూలు చూపించాడు. ఆ స్టూలు మీదే తరచూ శ్రీనివాస్ కూర్చునేవాడు. ఆ గదిలో యేవీ మారలేదు. మంచాల పై మనుషులే మారారు.
'ఇప్పుడు కులాసాగా వున్నారా?'
'హా'
'కానీ మీరు చాలా నీరసంగా కనిపిస్తున్నారు.'
'అవును.'
'మనసు సరిగ్గా లేదా?'
'ఈ నాల్గు మంచాల పై వుండిన నలుగురి లో ముగ్గురు పోయారు. మిగిలింది నేనే -- నేను మిగిలి కష్టాలకు లోనయ్యాను. అంతా మిధ్యా-- ఆత్మే నిజం. ఆ అత్మజ్ఞానం తెలుసుకోడానికే యిలా వచ్చాను.'
అతను చిరునగవు నవ్వాడు. బాగా చదివిన మనిషే కాకుండా జీవితం చూసిన వాడని అతని నడతే చెప్తోంది. ఇంకా చదువుతున్నాడు. యింకా అనుభవిస్తున్నాడు.
'మనిషికి యింకేం అక్కర్కేదంటారు. ఆత్మను తెలుసుకుంటే చాలంటారు. అంతేనా?'
'అవును.'
'చూసారా! ఈ వార్డు కు ఒక రూపం ఉందా?'
'ఉంది.'
'అలాగే మనిషికి ఒక రూపం వుంది. ఈ వార్డు లో నాల్గు మంచాలు వుండ బట్టే అందంగా వుంది. మూడే మంచాలుంటే ఒక ప్రక్క ఖాళీగా వుండి అసహ్యంగా వుండదూ?'
'అవును.'
'అలాగే మనిషికి యే ఒక్కటీ వుంటే అందం లేదు. నాలుగూ ఉంటేనే పరిపూర్ణుడౌతాడు.
'ఆ నాల్గు యేమిటి?'
'ఎవరో అన్నట్లు శారీరకం, మానసికం, వైజ్ఞానికం, ఆత్మ పరమైన సుఖాలు -- ఈ నాల్గూ నాల్గు రకాలైన ఆనందాలను మనిషి కి యిస్తాయి. ఈ నాల్గు సుఖాలు అనుభవిస్తేనే మనిషి పరి పూర్ణుడౌతాడు. శరీర సుఖం లేనిది మానసిక సుఖం రాదు. మానసికంగా తృప్తి పడనిది విజ్ఞానం కలగదు. విజ్ఞానం లేనిది ఆత్మను అర్ధం చేసుకోలేడు. కప్పకు దశలులా మనిషికి ఈ నాల్గు దశలు వుండాలి. మీకు ఆత్మ జ్ఞానం సంపాదించా లంటే ముందుసంసార సుఖాలు పొందండి. మన పూర్వీకులు నాల్గు ఆశ్రమాలకు ప్రాతిపదికగా యీ నాల్గు సుఖాలు పెట్టారు. ఈ యౌవనంలో సన్యాసాశ్రమం స్వీకరించి ఆత్మ జ్ఞానం కోసం పాటు పడకండి. మీరు అలా పొందింది ఆత్మ జ్ఞానం కాదు. ఎంచేతంటే యీ వయసు లో మీకున్న కోరికలను పూర్తిగా చంపలేరు. వెళ్ళండి -- పెళ్లి చేసుకో పొతే- చేసుకోండి.'
సూర్యం నాల్గు మంచాల వేపు ఒకసారి చూసాడు. ఒక్కొక్క మంచం మీద యిది వరకు వుండిన వ్యక్తీ- శెట్టి గారు, గోవిందరావు, శ్రీనివాస్, తనూ -- నాల్గు రకాలైన ఆనందాలలో ఏదో ఒక్కటే పొందాలని తాపత్రయపడి అందరూ విఫలు లైనవారిగా తోచారు. బ్రతికి వున్న తను యీ నాల్గు ఆనందాలను అనుభవించి మనిషి ననిపించు కుంటే యెంత బావున్ను?
అయితే విశాల యెక్కడ? ఆమె కోసం మళ్లీ ముందుకు సాగిపోయాడు. ఎన్నో స్థలాలు తిరిగాడు. ఎన్నెన్నో విధాలుగా వెతికాడు. చివరకు తన హృదయంలోనే వెతుకున్నాడు. విశాల ఆ రూపుతో కనపడలేదు. ఆమె సముద్రపు కెరటాల్లో అగుపించింది. ఆ హోరుతో మాటాడింది. చందమామ చుట్టూ వున్నా చక్రం లో తిరుగుతోంది. చుక్కల వెలుగుతో, పచ్చని ప్రకృతిలో, ఆడవాళ్ళ అందం లో వారి చిరు నగవు లో , పెదిమ ల్లో , ప్రేమ లో ఆమె కనిపించింది. ఆమె విడివడుతున్న పూలలో, చిగురించిన చెట్లలో, మంచు కప్పిన పర్వత శిఖరాల పైన , కొండల్లోని జలాశయాలలోని కలువల్లో , నింగి లో , నీటిలో , మంచు లో మబ్బుల్లో....ప్రతి చోట అగపడుతోంది. ఎల్లప్పుడూ ప్రేమిస్తూ , యెల్లవేళల మారుతూ , నిత్యం పచ్చగా , దయతో ధర్మం తో , సానుభూతి తో , సహకారం తో , ఆదరణ తో, అనురాగం తో, ఆత్మతో ప్రత్యక్ష మౌతోంది.
విశాల యిక్కడ అక్కడని కాదు-- ఈ విశాల విశ్వం లో విశాల హృదయం తో విశాల ప్రతి చోట అగుపిస్తోంది. లేకపోతె తన లాంటి వెన్నె ముకలేని మనిషిని క్షమిస్తూ యింకా ప్రేమించ లేకపోయేది.
అతను కన్నీటి బొట్లను తుడుచుకున్నాడు. ఆ కన్నీటి బిందువులతో చిరునగవు నవ్వే విశాలను చూసి తన దగ్గరే వుందని నవ్వుకున్నాడు.
(అయిపొయింది.)
