Previous Page Next Page 
మల్లమ్మదేవి ఉసురు పేజి 40


    ఆమె వెంట హీరాదేవి, తారాదేవి వున్నారు. వాళ్ళు యిద్దరూ గుడిచేటులు. నాట్యంలో అందెవేసిన చేతులు సాము గరిడీలతో పాటు సరసమయిన సంభాషణ చెయ్యటం నేర్చినవాళ్ళు. కత్తి పట్టటంతో పాటు కనుసైగలతో మగవాళ్ళ గుండెల్ని పిండి ఒళ్ళంతా జల్లుమనిపించ గలిగినవాళ్ళు. యీటె విసరటంతోపాటు పోతూ మొనగాళ్ళయిన వెలమవీరుల్ని గుమ్మెత్తించగలిగినవాళ్ళు ఆటా పాటా వాళ్ళకి అలంకారాలు.
    రాజరికపు వ్యవస్థలో మనుషుల ఆలోచనా విధానం, వాళ్ళ కోరికలు యెలా వుండేవో అర్ధం చేసుకోవటానికి వాళ్ళు ఒక కోణంనించి వుదాహరణలు.
    మల్లమ్మకు చిరునవ్వుతోపాటు చేయికూడా అందించి రధంమీదినించి దిగేందుకు సాయం చేసింది కమలక్క. జగ్గమాంబ చర చరా రధం మీదినించి దూకి చుట్టూ చూచింది. ఆ చుట్టుప్రక్కల ఒక్క మగవాడు కూడా లేడు. యే ఒక్కడు వున్నా అతడే వెంగళరాయుడని అనుమానించేది జగ్గమాంబ. కాని యెవరూ లేరు. బొబ్బిలిలో అలా వుండరు.
    హీరాదేవి, తారాదేవి మల్లమ్మకు హారతి యిచ్చి ఆహ్వానించారు. కమలక్క చేయి పట్టుకుని మల్లమ్మను నడిపించింది. మల్లమ్మ తల దించుకుని ఆమె అడుగుల్ని అనుసరిస్తూ వెళ్ళింది, వెంకమాంబ వెనుకరాగా.
    చాల తంతు ముగిశాక గొడవ లోపల కాలుపెట్టనిచ్చారు తెల్లవారితే పెళ్ళి బొబ్బిలి నగరమంతా కదిలివచ్చింది మల్లమ్మను చూచేందుకు ఆమె వారికి యికనించీ మహారాణి. ఆమె పాలనలోనే తాము యిక నించి బ్రతకాలి. ఆమె నిర్ణయాలు వాళ్ళ బ్రతుకుల్ని శాసిస్తాయి.
    భర్తకు ఆమె యిచ్చే సలహాలు తమ భవితవ్యాన్ని నిర్ణయిస్తాయి. అందునించి వాళ్ళు తమ రాణిని చూచేందుకు ఎగబడ్డారు.
    చూడవచ్చేవారంతా సద్దుమణిగేవరకూ చూస్తూ కూర్చుంది కమలక్క అంతా వెళ్ళిపోయిన తరువాత మల్లమ్మతో మాట్లాడింది.
    నరసారాయుడు మల్లమ్మతో మాట్లాడిన సంగతులు యింతకు మునుపే నగరంలో ప్రచారం అయినాయి. మల్లమ్మ మాట్లాడిన మాటలు కమలక్కకీ తెలిసినాయి.
    సూర్యకిరణం తెగి నేలమీద పడిందా అన్నట్లున్న యీ అందాల రాశి ముఖంలోని ఆ ప్రసన్నత వెనుక అంత తీవ్రమయిన ఆలోచన లున్నాయా? అని ఆశ్చర్యపోయిందామె.
    "రాణీ, బొబ్బిలినగరం నీకు నచ్చిందా?" అని అడిగింది కమలక్క.
    "ఇంకా చూడందే...." అన్నది రాణి మల్లమ్మ మెల్లగా.
    "కొంత చూచావుగా! అంతవరకూ చెప్పు."
    "నన్ను రాణిగా నిర్ణయించుకున్న యీ నగరం అందంగా కన్పించదా?"
    "ఇక్కడ అందచందాలను మించింది మరొకటుంది" అన్నది కమలక్క.
    "అదేమిటో నాకు తెలుసు పౌరుషం" మల్లమ్మ నవ్వుతూ చెప్పింది.
    "అన్నీ తెలుసుకునే వచ్చారన్నమాట రాణిగారు."
    "ప్రపంచమంతా తెలిసిన సంగతి నాకు తెలియకుండా యెలా వుంటుంది? నిప్పులాంటి నిజాలు దాచినా దాగవు."
    "అబ్బో మాటకారివికూడా!" అంటూ ప్రశంసించింది కమలక్క.
    అంతవరకూ మౌనంగా వినటమే జగ్గమాంబలో బొబ్బిలి వచ్చాక కన్పించిన మార్పు. ఇహ తమాయించుకోలేకపోయింది. మాటల మూట విప్పింది.
    "మీ నగరంలో ఒక బావికూడా వుందిటగా! దాని నీళ్ళు తాగితే పౌరుషం పొడుచుకొస్తుందిటగా! ఆ నీళ్ళుకూడా తాగిందంటే మా అక్క మాటలు మీరు వినలేరిహ!" అంది. ఆ మాటలు వచ్చినవంక ఆశ్చర్యంగా చూచింది కమలక్క.
    "ఎందుకండీ అలా చూస్తారు? నేను జగ్గమాంబని మల్లమ్మ చెల్లిని" అంటూ తనిని తాను పరిచయం చేసుకుంది జగ్గమాంబ.
    "అలాగా!" అంది కమలక్క కళ్ళింతింత చేసుకుని చూస్తూ.
    "చూడండి, చూడండి! యెక్కడకు వెళ్ళినా నన్నొక వింత జంతువుని చూచ్నట్టు చూస్తారు. ఆ చూపులకి నేను అలవాటు పడిపోయినాను. రేపు అక్కను పెళ్ళాడాక బావగారుకూడా నన్నిలాగే చూస్తారు కాబోలు" అంటూ నిట్టూర్పు నటించింది జగ్గమ్మ.
    "రంగారావుగారంటే యేమిటనుకున్నావు. మరదళ్ల వంక ముఖం వాచినట్టు చూస్తారనుకున్నావా?" అంటూ యెత్తిపొడిచింది కమలక్క.
    "మరదళ్ళవంక యెందుకు చూస్తారులే! మా అక్కవంక చూస్తారు కాని" అంటూ నవ్వింది జగ్గమాంబ.
    వెంకమాంబా జగ్గమాంబను దగ్గరకు పీల్చుకుని ప్రక్కన కూర్చోపెట్టుకుంది. వెన్నుమీద చేయివేసి రాస్తూ అంది రహస్యంగా. "యిక్కడయినా కాస్త నోరు తగ్గించమ్మా! అంతా కొత్తవాళ్ళు. యేమయినా అనుకుంటారు" అంటూ హితబోధ చేసింది.
    "వీళ్ళంతా మంచివాళ్ళే అమ్మా! యేమీ అనుకోరు" అంది జగ్గమాంబ గొంతు పెంచి.
    ఆ మాట విన్న కమలక్క "యేమిటమ్మా అది?" అని అడిగింది.
    "మీరంతా యేమన్నా అనుకుంటారుట. కొత్తవాళ్ళుట. అందుకని యెక్కువగా మాట్లాడవద్దంటోంది అమ్మ" అంటూ దండోరా వేసింది జగ్గమాంబ.
    కమలక్క పక పకా నవ్వుతోంది. హీరాదేవి, తారాదేవి క్రొత్త రాణిముందు పెద్దగ నవ్వే ధైర్యంలేక నవ్వుని నాలుకతో అడ్డుకున్నారు.
    "ఎక్కడ నేర్చా విటువంటి మాటలు?" అన్నది కమలక్క నవ్వుతూ.
    "అక్క దగ్గర అక్కకు యింతకన్నా యెక్కువ మాటలేవచ్చు. కానీ మాట్లాడదు. దాచుకుంటోంది మా బావగారికోసం" అంది జగ్గమాంబ.
    అందరూ నవ్వుకున్నారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS