దాచుకుంటోంది బావగారికోసం......దాచుకుంటోంది బావగారికోసం అని విన్పించింది ఒక మూలనించి. అందరూ అటు చూచారు. పంజరంలో చిలుక.
"అది నా చిలుకేనండీ" అని పరిచయం చేసింది జగ్గమ్మ.
"నీలాగే వాగుడుగాయి అనుకుంటాను" కమలక్క చెప్పింది.
"అక్కదగ్గరకూడా వుంది పెంటిపావురం" అంది జగ్గమ్మ సమాధానంగా. ఆ మాట విని కమలక్కకు ఒక ఆలోచన వచ్చింది.
"ఎక్కడా పావురం?" అని అడిగింది.
"ఇదుగో!" మల్లమ్మ థానే వచ్చి పావురాన్ని ఆమెకు యిచ్చింది.
"ఇది పెంటిపావురం కదూ!"
"అవును."
"జంటపావురం యేదీ?"
"లేదండీ! దీనికింకా మగపావుతంలో పెళ్ళికాలేదు" అంది జగ్గమాంబ.
"అయితే మనం చేసేద్దాం" కమలక్క.
"అలాగే చేద్దాం. కాని జంటపావురం యెక్కడా?" బుగ్గన వేలుంచుకుని కళ్ళు మరింత వెడల్పుచేసి అడిగింది జగ్గమాంబ.
"ఉంది- వుంది."
"ఎక్కడో చెప్పండి" ఆమె తొందరించింది.
"మీ బావగారు లేరూ! గోపాలకృష్ణ రంగారావుగారి దగ్గర వుంది జంట పావురం. యీ రెంటినీ కలిసేవంటే పుణ్యమే!" అని వివరించింది కమలక్క.
"ఇటువంటి పుణ్యకార్యాలు చెయ్యటంలో అరక్షణంకూడా ఆలస్యం చెయ్యకూడదండీ! ఇలా తెండి యిలా తెండి దాన్ని" అని తొందరించి పెంటిపావురాన్ని చేతులమధ్య యిరికించుకుని బావగార్ని వెతుక్కుంటూ బయలుదేరింది జగ్గమాంబ. ఆమె సాహసానికి ఆశ్చర్యపోయింది తల్లి.
"గడుసుపిల్ల చిలిపిమాటలు గోపాలకృష్ణ రంగారావుగారిని విసిగిస్తాయేమోనని భయపడిందామె. కూతుర్ని వారించబోయింది. ఆమె చెప్పే మాటలు చెప్పటం మొదలుపెట్టేసరికే జగ్గమాంబ చాలాదూరం దౌడుతీసింది.
"వారి సంగతి నాకు తెలుసులే! మీరేమీ భయపడకండి" అన్నది కమలక్క.
ఒక పున్నాగచెట్టుక్రింద నిలబడి వున్నాడు రంగారావు. ఆయన చేతిలో పావురం కువ కువలాడుతోంది పెంటికోసం దిగులు పెట్టుకుని.
ప్రకృతి విచిత్రాల గురించి ఆలోచిస్తున్నాడాయన మనుషుల్లోకూడా లేని యేకాగ్రనిష్ట గలిగిన దాంపత్యం పావురాలది. మగపావురాలు మళ్ళీ మర్చిపోవటం జరుగుతుంది గాని యిదే మగపవురం చనిపోవటం జరిగితే పెంటిపావురం కేవలం దిగులుతో చచ్చిపోతుంది.
పావురాలలో యిది గమనించదగిన గొప్ప విషయం. వాటిలో పెళ్ళి అంటే తాళికట్టటం వుంటుందా? కాలు తొక్కటం వుంటుందా? మంత్రాలు చదవటం వుంటుందా? రుతువులో ఒకసారి కలుస్తాయి యిహ అంతే. పెంటిపావురం పోతుపావురాన్ని విడిచివుండదు. అది చచ్చిపోతే దాని దిగులుతో పెంటిపావురంకూడా ప్రాణం విడుస్తుంది యెంత విచిత్రమయినది ప్రకృతిధర్మం, ప్రేమబంధం ప్రాణిని యిలా లొంగదీసుకుంటుంది యెందుకు?
ప్రేమకోసం పరితపించటం, ప్రేమకోసం ప్రాణత్యాగం చెయ్యటం ప్రేమించిన ప్రాణికోసం సర్వస్వాన్ని త్యాగం చెయ్యటం యిది ప్రకృతి ధర్మం.
మళ్ళీ కొన్ని పక్షులున్నాయి. తల్లితోనూ, చెల్లితోనూ శృంగారం జరుపుతాయి. తల్లి చెల్లి అనేవి మనుషులు సృష్టించిన పేర్లు. ప్రకృతితో ఆడ మగ రెండే బంధుత్వాలు.
ఆడప్రాణులకు మగప్రాణులతోటి, మగప్రాణులకు ఆడప్రాణులతోటి బంధం. యిదీ ప్రకృతి ధర్మమమయితే పెంటిపావురాలు యిలా యెందుకు ప్రియుడికోసం పరితపించి ప్రాణత్యాగం చేస్తున్నాయి. మనుషులెందుకు సహగమనం చేస్తారు?
ప్రకృతిలో అదీ వుంటుంది. యిదీ వుంటుంది, ద్వంద్వాలే ప్రకృతి ధర్మం. ఆ దారిన పోయేవారు ఆ దారిన పోతారు. యీ దారిన పోయేవారు యీ దారిన పోతారు. యెవరి యిష్టం వాళ్ళది. యెవరి ఆనందం వాళ్ళది. ఎవళ్ళ ప్రకృతి వాళ్ళది. ఒకళ్ళ నొకళ్ళు వ్రేలెత్తి చూపుకోవటం ఏమిటి?
ఏమిటిదంతా?
పోతు పావురాయి ఆరాటం చూచి గోపాలకృష్ణ రంగారావు మనసు ఆర్ద్రమయింది. వియోగం వల్ల ప్రాణి- నిప్పులో వేసి పుటం పెడితే ముత్యపుచిప్ప ముత్యాభస్మం అయిపోయి అనేక రోగాలకు చికిత్స అయినట్లు- శుద్ధి అవుతుంది. పవిత్రతా విలువా వస్తాయి.
ప్రేమ వైఫల్యం మనిషిని పవిత్రంచేసి మనసుని పదును యెక్కిస్తుంది. కాని ప్రేమవైఫల్యాన్ని కోరుకోడు మనిషి. కోరలేడు. అలా కోరితే అది ప్రేమ యెలా అవుతుంది? ముత్యపుచిప్ప అగ్నిగుండంలో పుటం పదాలని కోరుకుంటుందా? తాను నిష్ప్రయోజనంగా అయినా నిప్పుకు దూరంగా వుండాలనే కోరుకుంటుంది. అదీ ప్రకృతిలోని ద్వంద్వం.
అర్ధంకాని యీ ద్వంద్వాల మధ్య మనిషి బ్రతుకుతాడు. చస్తాడు. చస్తాడని తెలుసు. కాని బ్రతికినంతకాలమూ దేనికోసమో ప్రాకులాడుతాడు.పరితపిస్తాడు. దక్కని దానికోసం పట్టుకు వ్రేలాడుతాడు.
బుద్దీ, ప్రజ్ఞా వున్న మనుషులే అలా అయిపోగా లేంది యీ అల్పప్రాణి పోతుపావురం యెంత? దాని పరితాపం దానిది. ప్రాణి కనుక బాధ సహజం అని ఆలోచించుకుంటున్నాడు గోపాలకృష్ణ రంగారావు.
పున్నాగచెట్టుమీదినించి అప్పుడొకటీ అప్పుడొకటీ పూలు రాలుతున్నాయి ఆ సమయంలో యెవరూ పిలవకుండావచ్చే సముద్రతరంగంలా, యెవరూ పిలవకుండా వచ్చే సెలయేరులా, యెవరూ పిలవకుండా వచ్చే పిల్లగాలిలా, యెవరూ పిలవకుండా వచ్చే పొద్దుపొడుపులా వచ్చి పడింది జగ్గమాంబ.
అప్పుడాయన సాధారణ వేషంలో వున్నారు. చెట్టుక్రింద సామాన్యుడిలా కూర్చుని వున్నాడు. మరికొద్దిసేపటికి ఆయన అభ్యంగన స్నానం చెయ్యాలి. ఒళ్ళంతా నూనె పట్టించి సాధారణమయిన బట్టలు ధరించి ఎండకోసం అక్కడ కూర్చున్నాడాయన. జగ్గమాంబ పరుగెత్తుకు వచ్చి ఆయన ముందు ఆగింది.
