Previous Page Next Page 
మల్లమ్మదేవి ఉసురు పేజి 39


    "నిజమే నాయనా! ఆమె అద్భుతమయిన సౌందర్యరాసి వీరపత్ని కాదగిన వుత్తమ లక్షణాలు అన్నీ ఆమెలో రూపుకట్టి నిలిచాయి. అభికార్యానికి ఆమె యెత్తవచ్చిన అవతారమే! ఆమె నీకు మహాదేవి కావటం మీ అదృష్టం మాకు రాణి కావటం మా అదృష్టం. బొబ్బిలిలోనే కాక కళింగదేశ చరిత్రలోనే ఆమె ధృవతారలా నిలుస్తుంది" అంటూ తన అభిప్రాయాన్నికూడా అందించాడు ధర్మారాయుడు.
    ఇద్దరు మేధావులు ముక్తకంఠంతో చెప్పిన అభిప్రాయాలు కావటం నించి ఆ మాటలు గోపాలకృష్ణ రంగారావు గుండెల్లో నాటినాయి.
    
                                               10
    
    బొబ్బిలిలో పెళ్ళిసందడి మొదలయింది. ఘనమయిన యేర్పాట్లు చేస్తున్నారు, వెలమవారి వనితలు కోటలోకి వచ్చి పనులు చూచుకుంటున్నారు జొన్నలు దంచటం, మట్టిగోడలు అలికి ముగ్గులు తీర్చటం, తోరణాలు కట్టటం, యింకా యిలాంటివే యితరపనులు చేస్తున్నారు.
    రాజాంనించి తాండ్ర పాపయ్య మూడు రోజులు ముందుగానే వచ్చాడు. సవరలు, కోయలు, కోదులు కావలసినంత యిప్పపువ్వు తెచ్చి పోశారు. తేనెసీసాలలో నింపారు. యిప్పపూతను కొంత యెండబెట్టారు. కొంత యిప్పసారాయి తయారుచేశారు.
    ముహూర్తం ప్రభాత సమయాన కావటం గొప్ప ఆకర్షణ అయింది.
    కశింకోట ప్రభువు రామరాయుడు తరలివచ్చాడు. రధంమీద ఒడిలో పెంటి పావురాయిని పెట్టుకుని దాని తల నిమురుతూ వూహల జలతారు అల్లుతోంది మల్లమ్మ. జగ్గమాంబ ఆమెను మారి మాటికి అల్లరి పట్టిస్తోంది. తల్లి అదలించితే కాస్సేపు నోరుమూస్తోంది.
    ఆడవాళ్ళని రధం యెక్కించి రామరాయుడు యేనుగుమీద అంబారీ యెక్కాడు. అడవులగుండా సాగిన ప్రయాణం బొబ్బిలివచ్చి ఆగింది. కోటలో విడిది యిచ్చారు. మల్లమ్మకు యెర్రనీళ్ళు దిష్టి తీశారు.
    కోటను చూచి మల్లమ్మ ఆశ్చర్యపడిపోయింది. చుట్టూ మట్టి అడుసుతో యేడువరుసలుగా కోటగోడ తయారయి వుంది. యేడు వరుస లంటే- ముందు మట్టిసుద్దలు ఒక వరుస వేసి అది బాగా యెండిన తరువాత పగుళ్ళని పూడుస్తూ దానిమీద మరొక వరుస వేస్తారు. అలా ఎండింతరువాత మళ్ళీ వేస్తారు. ఆ వరుసలు యేడు వరుసలన్నమాట. యేడు ప్రాకారాలు కావు. యేడు వరుసల్లో అతికిన కోటగోడ యెత్తు యిరవై నాలుగు అడుగులు. దానిమీద యేడు అడుగుల సన్నని గోడ వుంది. దానిమీద అటునించి యిటునించీ మనుషులు తిరగవచ్చు.
    ఇరవైనాలుగు అడుగుల గోడమీద నిలబడి యేడు అడుగుల గోడ చాటున మనిషి దాక్కోవచ్చు. అవతలవాళ్ళు యేమీ చెయ్యలేరు యిది చాల పురాతనమైన యుద్దపద్దతికోసం కట్టిన కోట. ఫిరంగులకూ, రైఫిల్స్ కూ అనువయిన పద్దతికాదు. అయినా బొబ్బిలి ప్రభువులు ఆ కోటనే నమ్ముకుని కూర్చున్నారు.
    ఆ కోట ప్రాకారం లోపల మట్టి అడుసుతో కట్టిన ఇళ్ళు. పై కప్పులు అడవిలో దొరికే భారీకలపతో తయారుచేసి వున్నాయి. చాలా యిళ్ళమీద తాటాకులు కప్పివున్నాయి. కొన్ని యిళ్ళగోడలుకూడా తాటాకు తోనే వున్నాయి. యింకా మట్టిఅడుసు వెయ్యలేదు.
    రక్షణ విషయంలో యింత నిర్లిప్తత ఏమిటి వీళ్ళకి, కేవలం పరాక్రమాన్ని నమ్ముకుంటే సరిపోతుందా? పౌరుషం ఒక్కటే ప్రాణాన్ని, ప్రజల్ని కాపాడగలుగుతుందా అని ఆలోచిస్తోంది మల్లమ్మ.
    జగ్గమాంబ వెంగళరాయుడుకోసం వెతుకుతోంది.
    వెంగళరాయుడు కన్పిస్తే ఆటలు పట్టించాలని ఆమె తాపత్రయం. రధం ప్రాకారం దాటుతూ వుండగా కమలక్క యెదురొచ్చింది. ఆమె వెంట హీరాదేవి, తారాదేవి వున్నారు, కమలక్క వైశ్యుల యింటి ఆడపడుచు. యీటె విసరటం అంటూ జరిగితే యిహ అది రామబాణమే గురి తప్పటం వృధా కావటం అంటూ వుండదు. ఆమె రెండు చేతులతో కత్తులు ధరించి చాలనం చెయ్యగలదు. యుద్దరంగంలోకి వస్తే రెండు గొంతులు ఒకేసారి కొయ్యగల సమర్దురాలు. పెళ్ళికాని యువతి మల్లమ్మకన్నా వయసులో కొంచెం పెద్దది. ఆమె అందంముందు వెలమ వనితలు వెల వెలపోతూ వుంటారు. ఆమె ఆలోచనా పరిధి చాల రహస్యమయమైంది.
    ఆర్ధికంగా స్వతంత్రురాలు? పెళ్ళి చేసుకోకపోవటం యెందుకో యెవరికీ తెలియదు. అడిగినా ఆమె నవ్వి వూరుకుంటుంది తప్ప ఆంతర్యం విప్పి చెప్పదు. వ్యాపారం అంతా తనే చూచుకుంటుంది.
    ఆమెకు అన్న ఒకడుండేవాడు. తాగుడుకి తోడు యింకా యెన్నో వ్యసనాలుండేవి. అతడి పెత్తనంలో వుంటే ఆస్తికాస్తా హారతి కర్పూరం అయ్యేది. అతడు తన సహజ ప్రకృతితో కొంత ఆస్థిని హరించాక కమలక్క మేలుకుంది దాయిభాగం అడిగి పుచ్చుకుని అతనికి కొంత యిచ్చి బొబ్బిలినించి తరిమేసింది. కులగౌరవం నిలబెట్టలేని కొడుకు బ్రతికి వుండటంకన్నా చావటం నయమని అతడికి చివరిసారిగా తన సలహా చెప్పింది.
    అతడు ఆస్థి తీసుకుని వుడాయించాడు మళ్ళీ కన్పించలేదు కమలక్కకు అతడు యెప్పుడైనా గుర్తుకువస్తాడు. వాడు బాగుపడితే తప్పకుండా తిరిగి రావాలని కోరుకుంటుందామె.
    వెలమ వారింట ఆడపడుచులకూ, కోడళ్ళకూ కమలక్క అంటే బలే గౌరవం. ఆమె సలహాలేనిదే వాళ్ళు యేమీ చెయ్యరు. అన్ని పనుల్లోనూ ఆమె చేయి పెట్టాల్సిందే! సలహాలు యివ్వాల్సిందే!
    ఆమె పరాయిదేశాలనించి వచ్చిన వెలమకాంతలకు ధైర్య సాహసాలు నూరిపోస్తుంది. బొబ్బిలిలో ఆడవాళ్ళు కూడా బెబ్బులులుగా బ్రతకాలని హితబోధ చేస్తుంది తీరిక సమయాల్లో కత్తి పట్టటం. యీటె విసరటం వారికి నేర్పుతుంది. అందునించి ఆమె బొబ్బిలిలోని ఆడ ప్రపంచానికి గురువు. ఆప్తబంధువు. ఆమె వ్యక్తిత్వం ఎలాంటిదంటే- గోపాలకృష్ణ రంగారావుగారు సైతం అవుసర విషయాల్లో ఆమెను సంప్రదిస్తారు ఆమె సలహాలు పాటిస్తారు. ఒక్క యినుగంటి నరసారాయుడు తప్ప యేదో ఒక సందర్భంలో ఆమెని ఆశ్రయించనివాళ్ళు లేరు. ఆమె సలహా తీసుకోని వాళ్ళు లేరు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS