విమల్ ఎక్కడ నుంచైనా తనకు ఫోన్ చేస్తాడని రాత్రి పదిగంటల వరకూ ఎదురుచూసింది.
లేదు........విమల్ నుంచి ఫోన్ రాలేదు. విమల్ గురించి ఎంక్వయిరీ చేసేవాళ్ళ తప్ప.
విమల్ యాక్సిడెంటు వార్తని పేపర్లో చూసిన డైరెక్టర్ మాధురికి ఫోన్ చేసి----------
"గత కొన్ని నెలలుగా విమల్ విషయం మనకు తెల్సుకదమ్మా ఎక్కడి కెళ్ళి పోతాడు. ఎక్కడికి వెళ్ళడు లోన్లీ నెస్ డిప్రెషన్ లతో బాధ పడుతున్నాడు. ఒకసారి నువ్వు డిల్లీ లో వున్న వాళ్ళ డాడీతో మాట్లాడు. లేకపోతే ఈసారి విమల్ కన్పించగానే, ఎవరో సైకియాట్రిక్ దగ్గర జాయిన్ చేస్తే మంచిదని నా అభిప్రాయం. డిప్రెషన్ ముదిరితే చాలా ప్రమాదం, ఆలోచించు" అన్నాడాయన బాధగా.
విమల్ లోని ఒంటరితనానికి కారణం ఏమిటి?
డిప్రెషన్ కు కారణమేమిటి?
తనేం చేయాలి?
బెడ్ మీద అటూ ఇటూ దొర్లుతోంది మాధురి.
అప్పుడు సమయం --
రాత్రి పదకొండు గంటలు దాటింది.
* * * *
టైమ్ ----
పదకొండూ, పదిహేను నిమిషాలైంది.
కింద కాలింగ్ బెల్ మోగడం విన్పించింది.
అయిదు నిమిషాలు ----పదినిమిషాలు----
పనిమనిషి పడుకున్నట్లుగా వుంది.
ఈ సమయంలో ఎవరై వుంటారు? మాస్టర్ బెడ్ రూం లోంచి బయటకొచ్చింది మాధురి.
మెట్లు దిగి హల్లో కొచ్చి లైటు వేసింది.
"ఎవరూ?"
ఆ మాటతో కాలింగ్ బెల్ శబ్దం ఆగిపోయింది.
తలుపు తీసింది -----
ఎదురుగా గూర్ఖా ఆ పక్కన విమల్.
"మిమ్మల్ని ఇప్పుడే కలవాలని -----" భయంగా చెప్పాడు గూర్ఖా.
నువ్వెళ్ళు అన్నట్టుగా చేత్తో సంజ్ఞా చేసింది మాధురి.
గూర్ఖా వెనక్కి వెళ్లిపోవడంతో లోన కొచ్చాడు విమల్.
హల్లో సోఫాలో కూలబడ్డాడు.
"నాక్కొంచెం మంచినీళ్ళు కావాలి .........మాధురి........"
వెంటనే ఫ్రిజ్ లోంచి చల్లని నీళ్ళు తెచ్చిచ్చింది మాధురి.
రెండు గ్లాసులు నీళ్ళు తాగి ,
ఎదురుగా మాట్లాడకుండా కూర్చున్న మాధురి వేపు సూటిగా చూసి,
"నువ్వు సుజన్ మిత్ర ని ప్రేమిస్తున్నావా.....' అన్నాడు. సడన్ గా విమల్ అలాంటి ప్రశ్న వేస్తాడనుకోలేదు.
"ఇప్పుడవన్నీ ఎందుకు విమల్ ......యాక్సిడెంట్ అయిందట.........నర్సింగ్ హోం నుంచి ఎందుకెళ్ళిపోయారో చెప్పండి."
"నేనడిగిన ప్రశ్నకు జవాబు చెప్తావా.......లేదా ......." విమల్ గొంతు కోపంగా వుంది.
విమల్.......అసలు........... "ఏదో చెప్పబోయింది మాధురి.
"పోనీ......సుజన్ మిత్ర నిన్ను ప్రేమిస్తున్నాడా....."
'అతను .......నన్ను ప్రేమిస్తున్నాడో లేదో నేనెలా చెప్పగలను?"
"ఆరోజు పార్టీలో ఉడ్ బీ అని ఎనౌన్స్ చేసాడు. నువ్వు వినలేదా?"
"మిత్ర చాలా గమ్మత్తైన మనిషి విమల్........తను అనుకున్నదాన్ని వెంటనే ఎనౌన్స్ చేసెయ్యడం అతని అలవాటు .......ఆ అలవాటు చిన్నప్పటి నుంచీ అతనికుంది.......అవతలి వ్యక్తీ గురించి అసలు పట్టించుకోడు మేనకోడల్ని కదా.........ఆ చనువుతోనే అలా చేసుంటాడు."
"చిన్నప్పటి నుంచీ అతను నీకు తెలుసు.......కానీ చిన్నప్పటినుంచీ నువ్వతన్ని ప్రేమించడం లేదు......అవునా....."
"బాల్య వివాహాలులాగా, బాల్య ప్రేమలుండవ్....దేవదాసులా సినిమాల్లో బాల్యంలోనే ప్రేమలు చిగురించినట్టు చూపించినా, రియల్ లైఫ్ లో అలాంటి వేవీ జరగవు........జరిగినా పెద్దయ్యాక జ్ఞాపకం వుండవు అంది మాధురి నర్వేస్ గా ఫీలవుతూ.
"ఐ డోంట్ హేవ్ ఎనఫ్ టైమ్ టు డిస్ కస్ విత్ యూ నౌ.....ఇంకొక్క పాయింట్ కావాలి.....సో దట్ ఐ కేమ్ హియర్ ......డు యు లవింగ్ మీ ఆర్ నాట్ సుజన్ మిత్ర నీకు ఫ్రెండ్ కావచ్చు బంధువు కావచ్చు. నాకు కాడు.
నేను తలచుకుంటే ....ఒక అరగంటలో మిత్రా అనేటు వంటివాడు భూమ్మీద లేకుండా చెయ్యగలను......." ఇది కెనడా కాదు. కుప్పిగంతు లేయ్యటానికి మిత్రా విషయం ఎందుకు సీరియస్ గా తీసుకోలేదంటే - నువ్వే కారణమవుతావు. నీకు బావ - బంధువు - అందుకే స్పేర్ చేసాను. ఇది మా డాడీ కి తెలిస్తే ఈపాటికి అతను లాకప్ లో వుండేవాడు. నాకోసం ప్రాణమైనా ఇచ్చే మా డాడీకి ఈ విషయం తెలిస్తే అతను కెనడా వెళ్లడు. కాటికి వెళ్తాడు........" అప్రయత్నంగా సిగరెట్ వెలిగిస్తూ అన్నాడు విమల్.
"అసలేమైంది విమల్........."
"ఇప్పటికింకా ఏం కాలేదు ......ఇప్పుడే ప్రారంభమైంది......" సీరియస్ గా అన్నాడు విమల్.
"నిన్న జరిగిన యాక్సిడెంటుకి కారణం మిత్రా. ఆ విషయం నీకు తెలుసా........"
ఆ మాటకు ఆశ్చర్యపోయింది మాధురి. ఏదో అడగబోయింది.
"నన్ను బాగా తాగించాడు ..........వాగించాబోయాడు.........నీకూ, నాకు వున్న సంబంధం అతనికి కావాలి. మన మధ్య వున్నది ప్రేమ..........అంతకు మించి ఏం సంబంధం లేదు కదూ......."
విమల్ మూడ్ మాధురికి తెల్సు. ప్రతి ప్రతిభావంతుడి డిప్రెషన్ లోనూ చిన్నపిల్లల ప్రవర్తన దాగి వుంటుంది. సీజర్ లాంటి నియంత మనసు పొరల్లోకి తొంగిచూస్తే చిన్నపిల్లల మనస్తత్వమే కన్పిస్తుంది. తను ఎవర్ని నమ్మాడో, వాళ్ళే తనను నిలువునా హత్య చేస్తారని ఎవరికీ తెలీదు. సీజర్ చనిపోయింది అలాగే! సెనేట్ మీటింగ్ లో తను అందలం ఎక్కించిన సెనేట్ సభ్యుల చేతుల్లోనే ------ఆఖరికి సీజర్ అక్రమ సంతానం బ్రూటన్ కూడా ఒక బాకుతో తన తండ్రి గుండెల్లో పోటు పొడిచాడు. సెనెట్ సభ్యుల మీటింగ్ కి చిన్నపిల్లాడి మనస్తత్వంతోనే వెళ్ళాడు సీజర్ లాంటి నియంత!
