కారు ముందుకు పెను వేగంతో వెళ్ళిపోయింది. తను కారులో వున్న విషయం కూడా విమల్ కి తెలీని స్థితిలో వున్నాడు.
విశాలమైన రోడ్ మీద కారు ఎనభై మైళ్ళ స్పీడుతో పరుగెడుతోంది.
కళ్ళు చిట్లించుకుని డ్రైవ్ చేస్తున్నాడు విమల్. స్టీరింగ్ మీద అతని చేతులు నిలవడం లేదు.
రెండుసార్లు ఎదురుగా వచ్చిన లారీల బారినుంచి అతి ప్రయత్నం మీద తప్పించుకున్నాడు.
మూడో సారి తప్పించుకోలేకపోయాడు.
ఓ మలుపుతో ఓ వ్యాన్ ని గుద్దేశాడు విమల్.
వ్యాన్ రోడ్డు పక్కన వున్న పెద్ద బండరాళ్ళను డీ కొని, బోల్తా పడింది.
కారు, చెట్టుకి డీ కొని ఆగిపోయింది.
వ్యాను లోని జనం హాహాకారాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోయింది.
ఎవరికీ ప్రమాదం జరగలేదు కానీ -----
వ్యాన్ లో వున్న అమ్మాయిల్లో వున్న ఓ అమ్మాయి చెట్టుకు డీ కొన్న కారుని వెంటనే గుర్తుపట్టింది.
ఆ అమ్మాయి 'జ్వలన'
అప్పటికి సమయం అర్ధరాత్రి మూడుగంటలైంది. అక్కడికి మద్రాసు అయిదు కిలోమీటర్ల దూరంలో ఉంది.
* * * *
మద్రాసులోని ఓ ప్రవైట్ నర్సింగ్ హొమ్ .
మధ్యాహ్నం మూడు గంటలైంది.
అకస్మాత్తుగా మెలుకువొచ్చింది విమల్ కి. కళ్లిప్పి చూసాడు. ఏసీ రూమ్ నిశ్శబ్దంగా ప్రశాంతంగా వుంది. కొన్ని యుగాల దీర్ఘ నిద్ర తర్వాత మెలుకువ వచ్చింట్టుగా వుంది అతనికి.
లేచి కూర్చున్నాడు.
నిన్న రాత్రి జరిగిన సంఘటనల్ని గుర్తుకు తెచ్చుకోడానికి ప్రయత్నిస్తున్నాడు.
సుజన్ మిత్రతో కల్సి, బార్లోంచి బయటకు వెళ్ళడం గుర్తుంది. అంతే తర్వాతేం జరిగింది .....ఎంత జ్ఞాపకం తెచ్చుకుందామన్నా గుర్తుకు రావడం లేదు.
బెడ్ మీంచి లేవబోయాడు. అప్పుడు చూసాడు కాలికి వున్న కట్టుని. ఇక్కడకు ఎలా వచ్చాడు? ఎవరు తీసుకొచ్చారు? తన కారు?! నెమ్మదిగా నడుచుకుంటూ , ఆ రూమ్ లోంచి బయటికొచ్చాడు.
మందుల వాసన తప్ప, ఎక్కడా మనుషులు కన్పించడం లేదు.
విశాలమైన వరండా- వరండా చివర మెట్లు- మెట్లు దిగి , పార్కింగ్ ప్లేస్ లో చూసాడు.
తన కారు కన్పించలేదు.
ఫర్వాలేదు, నర్సింగ్ హొంలో వుండి ట్రీట్ మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి లేదు.
బయటికొచ్చాడు. టాక్సీ ఎక్కాడు. టాక్సీ ఆ రోడ్డు మలుపు తిరిగింది.
అప్పుడే ఆ నర్సింగ్ హోం ముందు ఓ కారాగింది. ఆ కార్లోంచి మాధురి దిగింది - మాధురి పక్కన జ్వలన.
* * * *
హీరో విమల్ కి యాక్సిడెంట్.
నర్సింగ్ హోం నుంచి మాయం.
మద్రాసు :
ప్రఖ్యాత సినిమా హీరో విమల్ కోసం గత రెండు రోజులుగా ఆయనతో సినిమా తీస్తున్న నిర్మాత, దర్శకుడు ఎడురుచుస్తోన్న విషయం పాఠకులకు తెలుసు. కాగా కెనడా నుంచి వచ్చిన ఒక పారిశ్రామిక వేత్త సుజన్ మిత్ర పార్టీకి వచ్చి వేల్లిపోయినట్టుగా చెప్పబడుతున్న విమల్, ఆ రోజు రాత్రి జరగాల్సిన సినిమా షూటింగ్ కి హాజరు కాలేదు విమల్ కోసం వెతికి వెతికి వేసారి దర్శకుడు ఆ సినిమా షూటింగ్ ని వాయిదా వేసారు. ఇవిలా ఉండగా నిన్నరాత్రి మహాబలిపురం రోడ్ లో జరిగిన యాక్సిడెంట్ లో స్వయంగా నడుపుకొస్తున్న విమల్ కారు, పిక్నిక్ నుంచి వస్తున్నా యునివర్సిటీ అమ్మాయిల వ్యాన్ కి డీ కొనడం , ఆ తర్వాత ఆ వ్యాన్ లోని అమ్మాయిలే విమల్ ని ప్రేవేట్ నర్సింగ్ హోం లో చేర్పించటం జరిగింది.
ఫ్రైవేట్ నర్సింగ్ హోంలోంచి హీరో విమల్ అకస్మాత్తుగా ఇవాళ మధ్యాహ్నం మాయమైపోయాడు. ఆస్పత్రి వర్గాలు విమల్ పోకడ విషయమై పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇందుమీదట పోలీసు కంప్లయింట్ నమోదైంది. ప్రఖ్యాత సినిమా నటి కుమారి మాధురిని ఈ విషయమై ప్రశ్నించగా సుజన్ మిత్ర పార్టీలోనే తను ఆఖరిసారిగా విమల్ ని చూశానని చెప్పింది కాగా విమల్ ను నర్సింగ్ హోం లో చేర్పించిన కాలేజీ అమ్మాయిల కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు.
-----ఆరోజు ఈవినింగ్ డైలీ లో వచ్చిన వార్తను చూసి మాధురి ఆలోచనలో పడింది.
జ్వలన ఫోన్ చేసి, తన దగ్గరకు రావడంతో, ఇద్దరూ కలిసి నర్సింగ్ హోం కి వెళ్ళారు. అక్కడ లేకపోవడంతో విమల్ రెసిడెన్స్ కి ఫోన్ చేసారు. ఫోన్ ఎవరూ లిప్ట్ చెయ్యలేదు. బీచ్లో తను విమల్ ని కల్సిన సంగతి జ్వలన చెప్పింది. తను నర్సింగ్ హోం లో చేర్పించినట్టుగా తెలిస్తే, పోలీసులు తన ఇంటిచుట్టూ తిరుగుతారని, ఆ విషయం ఎవరితో చెప్పొద్దని నర్సింగ్ హోం లో రిక్వస్ట్ చేసింది కూడా జ్వలనే! ఆ నర్సింగ్ హోం కి జ్వలన ఇల్లు చాలా దగ్గర. నర్సింగ్ హోం సూపరేండెండ్ జ్వాలన తండ్రికి మంచి ప్రెండు కూడా!
జ్వాలనని వాళ్ళింటి దగ్గర డ్రాప్ చేసి , మాధురి స్వయంగా కే.కే. నగర్ లోని గెస్ట్ హౌస్ కెళ్ళింది.
అక్కడక్కుడా విమల్ రాలేదు.
ఎక్కడ కెళ్ళి వుంటాడు విమల్. విమల్ మానసిక పరిస్థితి పెద్ద ప్రశ్నార్ధకంగా తయారైంది మాధురికి!
