Previous Page Next Page 
వసుంధర కధలు -11 పేజి 3


    ఆనందరావు అభూతకల్పనను ఇన్స్ పెక్టర్ నమ్మి వుండవచ్చు. కానీ అది అసాధ్యమని రమాకాంతానికి తెలుసు. మొత్తం కధంతా ఆయనకు మిస్టరీగానే వుండిపోయింది.
    ఈ గొడవ జరిగిన పదిరోజులకు ఆ యింట్లో మాధవరావు సకుటుంబంగా అడుగుపెట్టాడు. మాధవరావు కొత్తగా పెళ్ళయినవాడు. అతడి భార్య అందమైనది. వాళ్ళు తప్ప అక్కడ యింకెవ్వరూ లేరు. అతడి ఉద్యోగం మంచిదేమో - మూడువందల రూపాయల అద్దెకు అతను మాట్లాడకుండా అంగీకరించాడు.
    మాధవరావు భార్య కుసుమ కలుపుగోలు మనిషి, ఆమె కళ్ళు ఎంతో అమాయకంగా వుంటాయి. మాటల్లో కల్మషం స్ఫురించదు. భర్త ఆఫీసుకు పోగానే ఆమె తన కాలంలో ఎక్కువ భాగం రమాకాంతం యింట్లోనే గడిపేది. ఆమె మంచి చిత్రకారిణి. మనిషిని చూసి బొమ్మ వేయగలిగేది. విజయకూ, లక్ష్మికీ కూడా చిత్ర లేఖనం మీద మంచి ఆసక్తి వుండడంవల్ల రోజూ ఆమెతో కలిసి చాలాసేపు గడిపేవారు.
    ఒక రోజు కుసుమ వారిద్దరితోనూ మాట్లాడుతూ-"మీ యింట్లో దెయ్యం వుంది-" అంది నెమ్మదిగా.
    "దెయ్యమా?" అంటూ విజయ, లక్ష్మి కూడా ఒకే పర్యాయం ఉలిక్కిపడ్డారు.
    "అవును నేను రాత్రి చూశాను..." అంది కుసుమ.
    "నువ్వబద్ధం చెబుతున్నావ్?!" అంది లక్ష్మి.
    "లేదు, నీమీదొట్టు-" అంది కుసుమ.
    "ఎలా వుంది దయ్యం?" అంది విజయ.
    "ముఖం స్పష్టంగా కనబడలేదు. జుట్టు విరబోసుకుని వుంది-" అంది కుసుమ.
    "నీకు భయం వేయలేదూ?" ఆశ్చర్యంగా అడిగింది లక్ష్మి.
    "ఏమో- చిన్నప్పట్నుంచీ నాకు భయమంటే తెలియదు. చిన్నతఃనంలో కూడా ఒకటి రెండుసార్లు దెయ్యాల్ని చూశాను. అయితే యింత దగ్గర్నుంచి ఎప్పుడూ చూడలేదు...."
    "అసలేం జరిగిందో చెప్పు..." అంది విజయ.
    "రాత్రి నిద్రపోతూంటే ఉన్నట్లుండి మెలకువ వచ్చింది. గదిలో ఏదో అలికిడి అవుతున్నట్లనిపించింది. కళ్ళు విప్పి చూస్తే జుట్టు విరబోసుకుని అటూ ఇటూ గదిలో తిరుగుతున్న ఓ యువతి కనబడింది. ఆమె పాదాలు నేలమీద అనడంలేదు. వెంటనే గ్రహించేశాను అది దెయ్యమని! కుతూహలంగా పరిశీలించి చూడబోయేంతలో అది మాయమయింది...."
    "మాధవరావుగారిని లేపావా?" విజయ అడిగింది.
    "లేదు. ఆయనకు దెయ్యాలంటే చచ్చేటంత భయం..." అంది కుసుమ.
    విజయ, లక్ష్మి ఫక్కున నవ్వి-"నువ్వు తమాషా చేస్తున్నావు. అంతా అబద్ధం. అవునా?" అన్నారు.
    కుసుమ అప్పటికేమీ మాట్లాడలేదు. కానీ తర్వాత నాలుగు రోజులకి ఆమె వాళ్ళతో - "మీ యింట్లో దెయ్యముంది. అందుకు సందేహంలేదు-" అని చెప్పింది.
    "ఏమయింది?" అనడిగారిద్దరూ.
    "దెయ్యం రోజూ రాత్రి పన్నెండింటికి వస్తోంది. గదిలో కాసేపు అటూ యిటూ పచార్లుచేసి వెళ్ళిపోతోంది-" అంది కుసుమ.
    విజయకూ, లక్ష్మికీ గుండెలదిరాయి. కుసుమ ఎంతో తాపీగా చెబుతోందంటే అది నిజమని వారికి నమ్మకం కుదరడంలేదు.
    ఆ మర్నాడు మాధవరావు ఆఫీసు పనిమీద టూర్ వెళ్ళాడు. కుసుమ తనకు సాయంగా పడుకోమని విజయనూ, లక్ష్మినీ కోరింది. వారిద్దరూ అంగీకరించారు. అప్పుడు వారికి దెయ్యం సంగతి గుర్తులేదు. కానీ రాత్రికి గుర్తుకొచ్చింది.
    "మాకు భయంగా వుంది-" అంది విజయ.
    "అది ఎవర్నీ ఏమీ చేయదు. కాసేపు అటూ యిటూ పచార్లుచేసి వెళ్ళిపోతుంది-" అంది కుసుమ-"అయినా మీరు నా మాటలు నమ్మడంలేదుకదా-నిజానిజాలు ఈ రోజు తెలుసుకుంటారు."
    ఎనిమిదికల్లా భోజనాలుచేసి ముగ్గురూ పక్కఎక్కారు. పదిదాకా కబుర్లు చెప్పుకొని అప్పుడు నిద్రలో పడ్డారు.
    ఓ రాత్రివేళ కుసుమ విజయనూ, లక్ష్మినీ ఇద్దర్నీ గిల్లి లేపింది. వాళ్ళు ఏదో అనబోతూంటే చప్పుడుచేయవద్దన్నట్లు వారించింది. ఇద్దర్నీ మంచానికటువైపు చూడమంది.
    ఒక ఆకారం గాలిలో తేలిపోతున్నట్లుగా గదిలో అటూ యిటూ తిరుగుతోంది. ఆమె జుట్టు విరబోసుకొని వుంది. ముఖం చూసే ధైర్యం కూడా చాలలేహ్డు ఆ అక్కాచెల్లెళ్ళకు. ఇద్దరూ చటుక్కున కళ్ళు మూసుకొన్నారు. కిక్కురు మనలేదు. అలా కొద్ది క్షణాలు గడిచేక-"ఇంక కళ్ళు తెరవండి-దెయ్యం మాయమయింది-" అంది కుసుమ.
    భయం భయంగానే ఇద్దరూ కళ్ళు తెరిచారు. గదిలో ఎవ్వరూ కనబడలేదు. అయినా ఇద్దరూ మాట్లాడలేదు.
    "నేను దాని ముఖం చూశాను. చాలా స్పష్టంగా కనబడింది-" అంది కుసుమ.
    విజయ, లక్ష్మి కూడా వణికిపోతూ "నీకు భయంగా లేదూ?" అన్నాడు.
    "భయపడ్డంవల్ల ప్రయోజనమేమిటి?" అంది కుసుమ.
    "అవునూ-దెయ్యం సంగతి నువ్వు మీ ఆయనక్కూడా చెప్పకుండా మాకు చెబుతున్నావు. మమ్మల్నే భయపెట్టాలనా నీ ఉద్దేశ్యం?" అంది విజయ.
    "అబ్బే-అది కాదు. ఆయనది మొద్దు నిద్దర. రాత్రి పడుకుంటే తెల్లారేదాకా నిద్రలేవరు. ఇంట్లో దెయ్యమున్నదన్నానంటే హడిలిపోయి కాళీచేసి వెళ్ళిపోదామంటారు. ఇంత మంచి కంపెనీని యింత మంచి ఇల్లునూ వదులుకొని వెళ్ళడం నాకే మాత్రమూ ఇష్టంలేదు. ఆయనకు తెలియనంత కాలం ఈ విషయం రహస్యంగానే వుంచుతాను-" అంది కుసుమ.
    "ఎలా వుంది దెయ్యం?" అంది లక్ష్మి.
    "దాని రూపం ఇంకా నా బుర్రలో స్పష్టంగా మెదుల్తోంది. తెల్లారి లేచేసరికి మర్చిపోతానో ఏమిటో బెంగగా వుంది. ఇప్పుడే దాని బొమ్మ గీస్తాను-" అంది కుసుమ.
    "వద్దు. ఆ భయంకర రూపం చూస్తే ఇప్పుడింక నిద్రపట్టదు-" అంటూ అక్కా చెల్లెళ్ళిద్దరూ ఆమెను వారించారు.
    "అదేమీ భయంకరంగా లేదు. ఇంతో అంతో అందంగా కూడా వుంది-" అంటూ కుసుమ సరంజామా తీసుకొని బొమ్మ గీయడం ప్రారంభించింది. ఆమెను వారించినప్పటికీ ఆ అక్క చెల్లెళ్ళిద్దరూ కుతూహలంగా ఆమెవంక చూస్తున్నారు.
    పదినిమిషాల్లో కుసుమ బొమ్మ గీయడం పూర్తయింది. ఆ బొమ్మను చూస్తూనే విజయ, లక్ష్మి ఉలిక్కిపడ్డారు. ఆ దెయ్యం..... ఆ యువతి.... కొద్ది వారాలక్రితం ఆ వాటాలో హత్య కావించబడిన అనామకురాలు!
    "ఏమిటలా ఉండిపోయారు? ఏం జరిగింది? ఈ మనిషి మీకు తెలుసా?" అనడిగింది కుసుమ ఆశ్చర్యంగా.
    ఆమెకు నిజం చెప్పాలో చెప్పకూడదో అర్ధంకాక అక్కచెల్లెళ్ళిద్దరూ ఇంకేమీ మాట్లాడలేదు. తర్వాత కాసేపటికి అంతా నిద్రకు పడ్డారు.

                                      4

    ఇంటిల్లపాదీ ఆ బొమ్మనే చూస్తున్నారు.
    ఆ వాటాలో చనిపోయిన ఆ అమ్మాయి దయ్యమై యింట్లో తిరుగుతోందా? రమాకాంతంగారు వెంటనే కుసుమను పిలిచి మాట్లాడేరు. విజయకూ, లక్ష్మికీ చెప్పినట్లే ఆయనకూ చెప్పి-"ఇంతకీ ఆమె ఎవరు?" అనడిగింది కుసుమ.
    "అవన్నీ నువ్వడక్కూడదు, చెప్పకూడదు..." అన్నాడు రమాకాంతం.
    "పోనీలెండి. దయుంచి ఈ విషయం ఆయనదాకా పోనివ్వకండి. ఆయనకు దెయ్యాలంటే చాలా భయం. ఇల్లొదిలి పోదామంటారు. ఈ యిల్లు నాకు బాగా నచ్చింది. మనుషులూ నచ్చారు-" అంది కుసుమ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS