ఆమె నా దగ్గరకు వచ్చినట్లు భావించుకొని ఒళ్ళు ఝల్లుమని, ఆమెను ఆ భావంలోనే బిగియార కౌగిలించుకొని, మోమును నా మోముకు చేర్చి, ఎఱుపు వెన్నెల పూవులైన తీయ పెదవులను గాఢంగా ముద్దు పెట్టుకొనేవాణ్ని. ఆమె చీరలు, రవికలు, బాడీలు, లోపరికిణీలు, వల్లెలు నగలు బీరువానుండి తీసి పెట్టెలలో సర్ది వెంట తీసుకువచ్చాను. ఆ చీరలు నా హృదయానికి అడుముకొనేవాణ్ని. అవే గాఢంగా కౌగిలించుకొని పడుకొనేవాణ్ని! ఆ రవికలపై ముద్దులు కురిపించేవాణ్ణి. ఆ నగలు తలపై ధరించేవాణ్ణి. ఈ కర్మకాండ ఇంటిదగ్గర ఉన్నంత సేపూ జరిగేది.
ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోయేవాణ్ని. నా ఏడ్పుకు నేను అడ్డురాలేదు. నన్ను నేను సమాధానం పెట్టుకోదలచుకోలేదు. ఏడ్చి ఏడ్చి ఏడ్చి ప్రాణం పోవాలనే ఆశించాను. పోతుందనుకునే ముహూర్తాలూ ఉన్నాయి. అప్పుడు వికాటానందం పడి! ''మృత్యుదేవీ! రా '' అని అరచాను.
శకుంతలా ! ఇవి నీ నగలు, ఇవి నీ చీరలు, ఇవి నీ రవికలు. ఏమి చెయ్యను వీనిని! నీతో నన్ను ఎందుకు సహగమనం చెయ్యనియ్యలేదు? ఈ చీరలతో, నగలతో సహగమనం చేయకూడదూ! ఇవన్నీ పోగుచేసి కిరసనాయిలతో తడిపి వానిని నా గొంతువరకు పేర్చుకొని, ఒక్క అగ్గిపుల్ల వెలిగించుకోకూడదా, అని ఆ ప్రయత్నం ప్రారంభించాను. ఛా, ఆమె చీరలు నా అపవిత్ర దేహంతో ఎందుకు దహించుకుపోవాలి? అని ప్రశ్నించుకొన్నాను. ఒక చీర చాలు. అంతా సిద్దం చేసుకున్నాను.
19
పాతగుడ్డలూ, కొన్ని దుప్పట్లు పోగుచేశాను.వాని నన్నిటినీ కిరసనాయిలలో తడిపినాను. నా చొక్కా, నా పంచె కిరసనాయిలలో తడిపినాను. అన్నీ సిద్దపరచి, గదిలో వస్తువులన్నీ అంటుకునే ఏర్పాటు చేశాను. ఉత్తరాలు అందరికీ వ్రాశాను. మా శకుంతల ఫోటో ఒకటి తీసి గంటలకొలదీ హృదయాని కద్దుకొని నా చదువుగదిలో కూర్చున్నాను.
శకుంతలా!నా ప్రేమ నీచమైంది కనుక నీతో రాలేకపోయాను! ఒకరో ఇద్దరో తప్ప మనుష్యులలో ప్రాణప్రియవెంట ప్రాణము వదలినవారెవరు? మగవాళ్ళకు ప్రేమ తక్కువ. మగవాళ్ళు కర్కశ హృదయులు. మగవాళ్ళు రాక్షసులు. నా శకుంతలను వదలి ఇన్నాళ్ళు బ్రతికి ఉండగలిగిన నేను పరమ పాపిని.
నా పళ్ళు బిగించుకొన్నాను. కళ్ళు జేవురించాయి. మనస్సు నిశ్చలం చేసుకున్నాను. ఆ ఫోటోతో జేబులో అగ్గిపెట్టెతో మేడమీద నా సహగమన మందిరానికి వెళ్ళడానికి హాలులో మెట్లదగ్గరకు పోయాను.
ఇంతలో వంటింటిలోంచి మా అమ్మగారు వచ్చి ''నాయనా, ఈ రోజుకు కూరలేమీ తెప్పించలేదేమి బాబూ! ఏమి చెయ్యమన్నావు తండ్రీ!'' అన్నది.
'' నాకు ఆకలి లేదమ్మా! సాయంకాలం తెస్తాను. అప్పుడు కూర వండ వచ్చునులే!'' అని మెట్లెక్కిపోయాను. నా సహగమనపు గదిలోకి వెళ్లాను.
ఇంతలో నా వెంటనే మా అమ్మగారు కూడా వచ్చి, గదిలో ప్రవేశించింది. అంతా కలయచూచింది,'' నా తండ్రీ, ఇదేమిరా బాబూ!'' అని మూర్ఛలో విరిగి పడిపోయింది.
నేను తెల్లపోయినాను. వెంటనే ఆమె కడకు ఉరికి ఆమెను లేవనెత్తి గబగబ మేడహాలులోనికి తీసుకువచ్చి పనిమనిషిని పెరేట్టిపిలిచాను. '' నీళ్ళు, నీళ్ళు!'' అని కేకవేశాను. మాతో కొల్లిపరనుంచి వచ్చిన పనిమనిషి నీళ్ళు పట్టుకొని పరుగెత్తుకొని వచ్చింది.
కాశీలో చాలాకాలంనుంచి ఉన్న ఒక తెలుగు బ్రహ్మణ యువకుని, సహాయంగా ముప్పది రూపాయలు జీతం యిచ్చి ఏర్పాటు చేశాను. ఆ అబ్బాయి మేడమీదికి పరుగిడి వచ్చాడు. అతన్ని '' డాక్టరు'' అని కేకేసి చెప్పాను. అతడు వెంటనే పరుగెత్తిపోయినాడు. ఈలోగా నీళ్ళు పెట్టి నుదురూ, తలా తడుపుతూంటే మా అమ్మకు మెలకువ వచ్చింది. ఆమె మాటలాడలేక పెదవులు వణికిపోగా నా చేయి గట్టిగా పట్టుకొని, మళ్ళీ మూర్ఛపోయింది. గురక, నోట నురుగు, చేతులు కొంకర్లు, పళ్ళు బిగిసి పోయాయి.
అయ్యో! మా తల్లి ప్రాణం విడుస్తుందా? అమ్మా! ఎంతటి ఛండాలపు కొడుకును కన్నావు? గుండె దడదడమంటూ, కళ్ళనీళ్ళు కారిపోగా డాక్టరు గారి కోసం ఎదురుచూస్తున్నాను. నీళ్ళతో మా పనిపిల్ల అమ్మ తల తడుపుతూనే ఉంది.
ఇంతట్లో కారు చప్పుడైంది.డాక్టర్ను వెంటబెట్టుకొని గంగాధరుడు వచ్చాడు. నేను వణికిపోతూ అమ్మ విషయం చెప్పాను. నా కిరసనాయిలు గతి సంగతి చెప్పలేదు. ఆయన పరీక్ష చేశాడు. ఏదో మందుగొట్టం తీసి ఇంజక్షన్ ఇచ్చాడు. ఒక చిన్న గొట్టం బద్దలుకొట్టి ముక్కుకడ వాసన చూపించాడు. అమ్మ మళ్ళీ కళ్ళు తెరచింది.
'' అమ్మా డాక్టరుగారు వచ్చారు. నీకు ఇంజక్షన్ ఇచ్చారు. నేను నీకు నా శకుంతల సాక్షిగా, నువ్వనుకున్న పని చేయనని ఒట్టు పెట్టు కుంటున్నా అమ్మా!'' అన్నాను.
డాక్టరుగారు నన్ను చూచి, ఇంగ్లీషులో '' ఏమయ్యా మీ అమ్మ గారికి హృదయం చాలా నీరసంగా ఉంది. అది తాత్కాలికమే. నాలుగు రోజులు జాగ్రత్తగా ఉండాలి. రెండు మూడు ఇంజక్షనులు ఇస్తాను. మందుకు సీసా పంపించండి'' అన్నాడు. మందుకోసం ఆయన వెంటే మా గంగాధరుడు వెళ్ళినాడు.
మా అమ్మ ఎదుటే నీళ్ళబాల్చీ తెప్పించి కిరసనాయిలు గుడ్డలన్నీ నీళ్ళల్లో వేశాను. మా అమ్మకు బాగా కులాసా చిక్కేవరకూ నేను కొంచెం ఎచ్చు తగ్గుగా, సర్వకాలాలూ, ఆమె దగ్గరే ఉన్నాను. కిరసనాయిలు బట్టలన్నీ పదిసార్లు సబ్బు నీళ్ళల్లో ఉతికించి బాగుచేయించి చాకలివానికి వేశాను.
మా అమ్మ పదిరోజులైన వెనుక నన్ను పిలిచి, '' నాయనా,నిన్ను చూసుకునే ఇన్నాళ్ళు బ్రతికి ఉన్నాను. లేకపోతే మీ నాన్నగారు పోయిన వెంటనే నా ప్రాణాలు పోయివుండేవి. శకుంతలకు నువ్వు ఈలాంటి దుర్మరణం పాలవడం ఇష్టమౌతుందనా? ఇక నేను నిన్నెలా నమ్మను తండ్రీ!'' అని కళ్ళనీళ్ళతో అన్నది.
