"నిన్ను నీవు మభ్యపరచుకుంటానంటే నా కెలాంటభ్యంతరమూ లేదు. కానీ జబర్ద్తస్తీగానైనా సరే నీ దగ్గిర్నుంచి ఆహారం తీసుకుని వెడతాను-" అన్నాడు మోహన్.
"ప్లీజ్-వద్దు-"అంది లీల.
"నన్నాపలేవు-" అన్నాడు మోహన్.
"నా సమస్య అదికాదు. నా ప్రాణదాత నెలా రక్షించుకోవాలో తెలియక సతమతమవుతున్నాను...." అంది లీల.
"నన్ను నేను రక్షించుకోగలను-" అన్నాడు మోహన్.
"పోనీ-ఒక పని చేయి. నేను హారాన్ని బల్లమీద వదిలి బాత్రూంకు వెడతాను. అరగంటదాకా బయటకు రాను. ఈ అరగంటసేపూ ఆలోచించుకో హారాన్ని తీసుకుపోవాలనుకుంటే నిన్నడ్డగించేవారుండరు. నే నింత ధైర్యంగా హారాన్ని వదిలివెడుతున్నానంటే నా మాటల మీహ, హెచ్చరికమీద నీకు నమ్మకం పుట్టాలి. పుట్టకపోతే నీ దురదృష్టం. అప్పటికీ ఓ ఉపాయం చెబుతున్నాను. హారాన్ని తీసుకునివెళ్ళి సునంధకు చూపించి కాసేపు వేసుకోనిచ్చి మళ్ళీ తెచ్చేసేయ్. ఒక పూట నీకు గడువిస్తున్నాను. ఆ పూటలో హారం వెనక్కు రాకపోతే నేను చేయగలిగినదేమీ లేదు-" అంది లీల.
మోహన్ ఆమె చెప్పింది మౌనంగా విని ఊరుకున్నాడు.
తన మెడలో హారం తీసి బల్లమీద పెట్టి-"అరగంట తర్వాత నేను బైటకు వచ్చేసైర్కి నువ్విక్కడే ఉంటావని ఆశిస్తున్నాను. లేదూ-రేపిదే సమయానికి నా కో పెద్ద పని ఉంది. అప్పుడు నా మెడలో యీ హారముంటుందని నమ్ముతున్నాను-...." అని చెప్పి బాత్రూంలోకి వెళ్ళింది.
ఆమె తిరిగివచ్చేసరికి మోహన్ అక్కడ లేడు.
3
సునంద హారాన్ని మెడలో వేసుకుని అద్దంలో పదే పదే తన్ను తాను చూసుకుంది. ఆమె సంతోషానికి అంతులేదు.
"బాగుందా?" అన్నాడు మోహన్.
సునంద అతడివైపుకు తిరిగి-ఊహించని విధంగా అతణ్ణి కౌగిలించుకుని కుదిపేసింది. అప్పుడామె పురుషుడి కంటే బలంగా వుంది.
"సునందా-ఏమిటిది?" అన్నాడు మోహన్ ఉక్కిరి బిక్కిరవుతూ.
"సంతోషం-కృతజ్ఞత-ఏమని చెప్పాలో తెలియడంలేదు. డియర్ మోహన్! నీకేం కావాలో చెప్పు. నేను నీ ప్రియురాలిని కాదు. దాసిని-...." అంది సునంద.
"థాంక్యూ సునందా! నీ మాటలే చాలు నాకు....వేరే ప్రతిఫలం అవసరంలేదు-" అన్నాడు మోహన్.
"వద్దన్నా ప్రతిఫల మిస్తాను-నేను నీ దాన్ని" అంది సునంద.
"వద్దు సునందా! నువ్వు ప్రేమలో నా దానివి కావాలి. ప్రతిఫలంగా కాదు. నేను నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాను-...." అన్నాడు మోహన్.
"నన్ను ప్రేనిస్తున్నావా-నా చరిత్ర తెలిసి కూడా!" అంది సునంద.
"నీ చరిత్ర కేం లోటొచ్చింది.....?" అన్నాడు మోహన్.
"ఒక బలవంతుడి చేతిలోని ఆటబొమ్మను నేనని నీకు తెలుసు-"
"కానీ ఆ బలవంతుడికి నీ వల్ల ప్రయోజనం అయి పోయింది. అతడు నీకు స్వేచ్చ నిచ్చాడు-...."
"కానీ ఆటబొమ్మగా ఉన్నప్పుడు నే నతడు చెప్పినట్లు ఆడాను-"
"ఆడితే ఆడావు. ఆ మాటకొస్తే నేనూ అలాగే ఆడాను. నే నేమీ పవిత్రున్ని కాదు. నిన్నో బలవంతుడాడిస్తే నన్ను పరిస్థితులాడించాయి. నేరాలు చేశాను. జైళ్ళకు వెళ్ళాను. ఇప్పుడు మామూలుగా జీవించాలని ఉంది..."
"అయితే నువ్వు నన్ను నిజంగా పెళ్ళి చేసుకుంటావా?"
"నా ప్రేమను నిరూపించుకునేందుకే యీ హారం తెచ్చాను నీ కోసం. నువ్విక నీ ప్రేమను నిరూపించుకోవాలి-...."
"ఎలా?"
"హారాన్ని తిరిగి నా కిచ్చేయడం ద్వారా-"
సునంద నిరుత్సాహపడింది. తమాయించుకుని- "ఇవ్వకపోతే?" అంది.
"బహుశా నేను మళ్ళీ నీకు కనిపించను-" అన్నాడతడు.
"నే నివ్వకపోతే బలవంతంగా తీసుకుంటావా....?" భయంగా అడిగింది సునంద.
"తీసుకోను-"
తేలిగ్గా నిట్టూర్చింది సునంద.
"సునందా! నీకోసం నా ప్రాణాలకు తెగించి యీ హారం తీసుకుని వచ్చాను. ఇది తిరిగివ్వకపోతే నా ప్రాణాలకే ప్రమాదం. అలాగని నేను నిన్ను బలవంతపెట్టను. నువ్వు మనస్ఫూర్తిగా హారాన్ని నాకు తిరిగిస్తేనే తీసుకుంటాను. అందుకే యిప్పుడు కళ్ళుమూసుకుని వెయ్యంకెలు లెక్కపెడతాను. లెక్క పూర్తయి నేను కళ్ళు తెరుస్తాను. నువ్వు హారం నాకు తిరిగివ్వాలి. అలా జరక్కపోతే వెంటనే వెనక్కు తిరిగి వెళ్ళిపోతాను. ఆ తర్వాత బహుశా మనం మళ్ళీ కలుసుకోము...."
"ఎందుకని?"
"నా ప్రాణాలు పోవచ్చు."
"పోకపోతే?"
"పోకపోతే తప్పక నిన్ను కలుసుకుంటాను...."
"అప్పుడు నన్ను పెళ్ళిచేసుకుంటావా?"
"ఊఁ"
"స్వార్ధపరురాలినని అసహ్యించుకోవా?"
"నిన్ను నే నసహ్యించుకోలేను...."
సునంద నిట్టూర్చి-"ప్రేమ విలువ నాకు తెలియదు. స్వార్ధ మొక్కటే నాకర్ధమవుతుంది. డియర్ మోహన్! నన్నపార్ధం చేసుకోకు. నువ్వు బలవంతంగా వెనక్కు తీసుకుంటే ఏమోగానీ-నాకై నేనీ హారాన్ని నీకివ్వలేను. నీకు నీపై ప్రేమ లేదనుకోకు. నన్నర్ధం చేసుకో-" అంది.
"నేను నిన్నర్ధం చేసుకున్నాను. నువ్వే నన్నర్ధం చేసుకోవాలి" అన్నాడు మోహన్ నీరసంగా.
"షరతులేమీ పెట్టకు. ఈ హారం ఎప్పటికీ నాదని చెప్పు" అంది సునంద.
"నా ఆశ నాది-" అంటూ మోహన్ కళ్ళు మూసుకుని అంకెలు లెక్కపెట్టడం ప్రారంభించాడు. అతడు వెయ్యంకెలు పూర్తిచేసి-కళ్ళు తెరిచేసరికి - సునంద లేదు. అతడు నిట్టూర్చి అక్కణ్ణించి వెళ్ళిపోయాడు.
4
మోహన్ నడిరోడ్డుమీద నిలబడి ఉంటే-పదిమంది మహాకాయులతన్ని చుట్టుముట్టారు. అందరిచేతుల్లోనూ పొడవాటి కత్తులున్నాయి,. చీకట్లోకూడా అవి మెరుస్తున్నాయి.
మోహన్ వారిని చేతులు జోడించి వేడుకుంటున్నాడు. సమాధానంగా ఆ పదిమందీ కత్తులు పైకెత్తారు.
కొద్దిక్షణాల్లో ఆ కత్తులతడి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చీల్చేస్తాయి.
కెవ్వుమని అరిచి లేచి కూర్చున్నాడతడు.
సమయానికి మెలకువ రాకపోతే అతడి శరీరం కలలో తునాతునకలై పోయుండేది.
జరిగింది కల అని తెలుసుకుందుకు మోహన్ కు కాసేపు పట్టింది. హమ్మయ్య-అని తేలికగా నిట్టూర్చి టైము చూసుకున్నాడతడు.
రాత్రి రెండు గంటలు.....
పన్నెండు గంటల వరకూ అతడు మెలకువగానే ఉన్నాడు.
మోహన్ అవసరాన్నిబట్టి ఎంతకైనా తెగించగలడు కానీ స్వతహాగా ధైర్యవంతుడు కాదు.
తల్లీ తండ్రీ లేదతడికి. బంధువులింట్లో అష్టకష్టాలూ పడలేక-ఇంట్లోంచి పారిపోయాడు. కడుపు నింపుకోవడం కోసం చిల్లర పనులూ చేశాడు. చిల్లర దొంగతనాలూ చేశాడు. క్రమంగా నేరాలతడి జీవితంలో ఒక భాగమై పోయాయి. సమాజాన్ని నడిపే కొన్ని దుష్టశక్తులతడికి స్వాగతం పలికాయి. పూర్తిగా వారి గుప్పిట్లోకి వెళ్ళిపోకుండా-వారికి దూరంగానే ఉండి వారికి సహకరించిన తన అవసరాలు గడుపుకుంటున్నాడతడు. ప్రస్తుతం అతడివద్ద కొంత డబ్బుచేరింది. పాత జీవితానికి స్వస్తిచెప్పి కొత్త జీవితం ప్రారంభించాలన్న ఆలోచన అతడికి సునంద పరిచయంతో ప్రారంభమయింది. సునందకోసం అతడు లీల హెచ్చరికను కాదన్నాడు. సునంద తనకోసం హారం తిరిగివ్వగలదనుకున్నాడు. ఆమె ఇవ్వలేదు. అడిగి ఆమెను బాధపెట్టడం అతడి కిష్టంలేదు.
