Previous Page Next Page 
వసుంధర కథలు-7 పేజి 39


    "ఒకవేళ నేను నిన్ను పట్టిస్తే!"
    "ఏం చేస్తానో తెలియదు కానీ నిన్ను ద్వేషించను."
    చంప అతడివంక ఆశ్చర్యంగా చూసింది-"నేనంటే నీకెందుకూ-అంతిష్టం!" అనడిగిందామె.
    "నువ్వడిగావు కాబట్టి నీ ప్రశ్నకు-జవాబు తెలుసుకుందుకు ప్రయత్నిస్తాను-" అన్నాడు ప్రవీణ్.
    "ఒక్క నిముషం-నేను బయటకు వెళ్ళొస్తాను-" అంది చంప.
    "ఏం చేస్తాను? నువ్వొచ్చే దాకా సినిమా చూస్తూంటాను-" అన్నాడు ప్రవీణ్ నిరుత్సాహంగా.
    చంప బయటకు వెళ్ళి-థియేటర్ మేనేజర్నో సారి ఫోన్ కావాలనడిగింది. అందమైన అమ్మాయికి ఫోన్ ఏమిటి? ఏమైనా యిచ్చి సహకరిస్తారెవరైనా?
    మేనేజరామె ప్రయివేటుగా మాట్లాడకునేందుకు వీలుగా గదిలోంచి బయటక్కూడా వెళ్ళిపోయాడు.
    చంప విజయ్ కి ఫోన్ చేసింది. విజయ్ వెంటనే లైనులోకి వచ్చాడు. స్వరం తగ్గించి ఆమె ప్రవీణ్ చెప్పిందంతా చెప్పింది.
    "చాలా థాంక్స్.....చంపా!" అన్నాడు విజయ్.
    "ఇప్పుడు నువ్వేం చేస్తావు?"
    "అటు శివరాజు, ఇటు ప్రవీణ్-ఇద్దరి అడ్డూ తొలగిస్తాను....."
    "ప్రవీణ్ ని పోలీసులు పట్టుకోరుకదూ!"
    సమాధానంగా విజయ్ నవ్వాడు.
    "నువ్వు నాకు సమాధానంకాదు...."
    "ఒకే ఒరలో రెండు కత్తులిమడవని నువ్వు గుర్తుంచుకోవాలి-మైడియర్ చంపా!" అని ఫోన్ పెట్టేశాడు విజయ్.
    చంపకు వళ్ళు జలదరించింది.
    ఆమె గది బయటకు వచ్చి మేనేజరుకు థాంక్స్ చెప్పుకుంది. తర్వాత హాల్లోకి వెళ్ళింది.
    "క్షణం యుగంలా గడిచింది నాకు ఇంతాలస్యం చేశావేం చంపా?" అన్నాడు ప్రవీణ్ దీనంగా.
    "ఇప్పుడే యింత బాధపడుతున్నావు....హత్య చేయడంవల్ల నాకు దూరమైతే ఏం చేస్తావు?" అంది చంపనవ్వుతూ.
    "నీకు దగ్గర కావాలని హత్య చేస్తున్నవాణ్ణి.....హత్యచేసి నేకు దూరమవుతానని ఎలాగనుకున్నావు?" అన్నాడు ప్రవీణ్.
    "నేరస్థుడు తప్పించుకోలేడు...."
    "శివరాజును చంపడం నేరంకాదు....."
    "శివరాజును చంపడం సులభంకాదు...."
    "చంపా-ముందే చెప్పాను. నీ కోసం ఏమైనా చేయగలను...."
    అతడి మాటలు చంప కేదోలాగనిపించాయి. ఒక అమాయకుణ్ణి తానుగానీ అన్యాయం చేయడంలేదుగదా అనిపిస్తోందామెకు.

                                    6

    అర్ధరాత్రి ఒంటిగంటయింది.
    శివరాజు నెహ్రూపార్కులో అడుగుపెట్టాడు.
    అతడి భుజాన ఓ సంచీ వ్రేలాడుతోంది. ఆ సంచీ ఉబ్బెత్తుగా ఉంది.
    శివరాజు తిన్నగా నల్లగులాబుల పొదవద్దకు చేరాడు.
    ఆ సమయంలో పార్కు నిర్మానుష్యంగా ఉండడంలో ఆశ్చర్యంలేదు. అయినా శివరాజోసారి చుట్టూ చూశాడు.
    అతడికి ప్రాణభయంలేదు.
    అతడు చనిపోయిన మరుక్షణం-ఎందరో పెద్ద మనుషుల గుట్టు బయటపడుతుంది. అందుకుతగ్గ ఏర్పాటతడు ముందే చేసుకున్నాడు. అతడి స్నేహితుడొకడి వద్ద లాకర్ కీ ఉంది. శివరాజు బ్లాక్ మెయిలింగ్ వ్యవహారాల ఒరిజినల్సన్నీ ఆ లాకర్లో ఉన్నాయి. ఆ లాకర్ కీ శివరాజు స్నేహితుడివద్ద ఉంది. లాకర్ శివరాజు పేరుంది.
    శివరాజు చావగానే ఆ స్నేహితుడా లాకర్ కీ పోలీసుల కందజేస్తాడు. పోలీసులు పెద్ద మనుషుల గుట్టు తెలుసుకుంటారు. అందుకే ఎందరో పెద్ద మనుషులు శివరాజువల్ల నష్టపోతూ అతడి ప్రాణాలు కాపాడాలని కూడా అనుకుంటూంటారు.
    శివరాజు స్నేహితుడెవరో తెలుసుకోవాలని చాలా మంది ప్రయత్నించారు. సాధ్యపడలేదు. శివరాజుకు లాకరెక్కడుందో తెలుసుకోవాలన్న వారి ప్రయత్నాలూ విఫలమయ్యాయి. శివరాజుకు నాలుగైదు బ్యాంకుల్లో నాలుగైదు పేర్లతో అకౌంట్సున్నాయి. లాకర్సు న్నాయి. ఆ విషయం చాలామందికి తెలియదు.
    శివరాజు కనుక మరణిస్తే అందుకు సరైన కారణం నిరూపించబడాలి. అతడు హత్యచేయబడితే-హంతకుణ్ణి పట్టడానికి పెద్ద మనషులందరూ కృషి చేయాలి. తను బ్లాక్ మెయిల్ చేస్తున్న వారి జాబితా శివరాజు స్నేహితుడి దగ్గరుంది. హంతకుడా జాబితాలో ఎవరికీ సంబంధించినవాడు కాకపోతే-హత్యకు సరైన ప్రత్యేకమైన కారణమేదైనా ఉంటే శివరాజు స్నేహితుడు లాకరు తాళాన్ని పోలీసుల కందించకుండా-తనే శివరాజుకు వారసుడై ఆలాకర్లోని వస్తువులు తీసుకోగలడు. అతడు మంచివాడు శివరాజు బ్లాక్ మెయిలరని కూడా అతడికి తెలియదు. తనవద్దనున్న లాకరు కీ, పేర్ల జాబితా చరిత్ర అతడికి తెలియదు.
    తన భుజాన సంచీ తీసి గులాబుల పొదలో వేశాడు శివరాజు. ఆ వెనువెంటనే అతడికి బుస్సుమన్న శబ్దం వినపడింది. శివరాజు కంగారుపడ్డాడు కానీ సమయం మించిపోయింది.
    కాళ్ళమీద ఏదో గీరుకున్న అనుభూతి, ఆ వెనువెంటనే వళ్ళంతా భరించలేని బాధ.
    శివరాజు నేలమీద చర చరా పాకిపోతున్న విషనాగును చూశాడు. ఎందరినో గడగడలాడించిన అతడు తన్ను కాటేసిన విష నాగును ఏమీ చేయలేని అసహాయుడయ్యాడు.
    పాము చర చర పాకిపోతూంటే అతడు విరుచుకుని వెనక్కు పడిపోయాడు.
    
                                      7

    ప్రవీణ్ మంచి నిద్రలో ఉన్నాడు.
    ఆ సమయంలో ఎవరో తలుపులు దబదబ బాదుతున్నారు.
    విసుగ్గా లేచాడతడు. అదే విసురుతో తలుపు తీశాడు.
    గుమ్మంబయట అతడెరుగని ఓ మనిషి అతడి చేతిలో చిన్నసైజు తెల్లటి కవరు.
    "చంపమ్మగారు-అర్జంటుగా మీకీ కవరిమ్మన్నారు" అంటూ ఆ కవరిచ్చి వెంటనే వెళ్ళిపోయాడతడు. కవరు చింపి ఉత్తరం తీశాడు ప్రవీణ్.
    "ప్రవీణ్! నెహ్రూ పార్కులో శివరాజు పాముకాటువల్ల మరణించాడు. పోలీసులు నీకోసం బయల్దేరుతున్నారు. ఇంకేమీ అలోచించకు. వెంటనే పారిపో! ఎక్కడికో అక్కడికి పారిపో బ్రతికుంటే బలుసాకు తినొచ్చు. అదృష్టముంటే మళ్ళీ కలుసుకోవచ్చు. ముందు నీ ప్రాణాలు దక్కించుకో
                            -నీ చంప."
    ఇది చదివి తెల్లబోయాడు ప్రవీణ్ కానీ అతడు జాప్యం చేయలేదు. వెంటనే తన గదికి తాళంవేసి చంపయింటికి బయల్దేరాడు.
    అతడామె యిల్లు చేరుకెందుకెంతోసేపు పట్టలేదు. కాలింగ్ బెల్ విని మధుసూదన్ తలుపుతీసి-"నువ్వా? ఈ సమయంలో వచ్చావేమిటి?" అన్నాడు.
    "అర్జంటుగా చంపను కలుసుకోవాలి-" అన్నాడు ప్రవీణ్.
    "ఇంత రాత్రిపూట వచ్చి పెళ్ళికాని ఆడపిల్లను కలుసుకుంటానంటున్నావు. దానికి సమాధానమేమిటో తెలుసా? గెటౌట్...."
    "అయ్యా! నన్నపార్దం చేసుకోకండి ఇది నాకు జీవస్మరణ సమస్య...." అన్నాడు ప్రవీణ్.
    "లోపలకురా!" అన్నాడు మధుసూదన్ ప్రవీణ్ లోపలకు రాగానే అతడు తలుపువేసి ఆసనం చూసించాడు.
    ఇద్దరూ ఒకరికొక రెదురుగా కూర్చున్నాక-"ఒక ఆడపిల్లను పెళ్ళికాకుండా నీ బోటివాడిలా కలుసుకుందుకు వస్తే అదామెకు జీవస్మరణ సమస్య-నీక్కాదు-"అన్నాడు మధుసూదన్.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS