"అయితే ముందీ వుత్తరం చూడండి-" అన్నాడు ప్రవీణ్ తన జేబులోని కాగితాన్నతడి కందిస్తూ.
మధుసూదన్ ఉత్తరం చదివి-"శివరాజు చచ్చిపోయాడా-నిజంగానా?" అన్నాడు.
"ఏమో-నాకు తెలియదు......ఈ ఉత్తరం ఓ అరగంట క్రితం చంప నాకు పంపింది-" అన్నాడు ప్రవీణ్.
మధుసూదన్ రిస్టువాచీ చూసుకున్నాడు, టైము రెండు దాటింది.
"చంప తొమ్మిదింటికల్లా నిద్రపోయింది. ఇంతవరకూ లేవలేదు. నువ్వేదో దాస్తున్నావు. మొత్తం జరిగినదంతా చెప్పు....."
"చెప్పడానికేంలేదు. నేనర్జంటుగా చంపను కలుసుకోవాలి...."
మధుసూదన్ విసుగ్గా "శివరాజు నెహ్రూపార్కులో పాము కాటువల్ల చనిపోతే-పోలీసులు నీకోసమెందుకు వెతకాలి?" అన్నాడు.
"ఒక్కసారి చంపను పిలవండి....."
"పిలవను విషయమంతా నువ్వు నాకు చెప్పాలి...."
ప్రవీణ్ తప్పించుకోవాలని చూశాడు కానీ సాధ్యపడలేదు. చివరికతడు చంప తనను శివరాజును హత్య చేయడానికి ప్రోత్సహించినట్లు చెప్పాడు.
మధుసూదన్ చలించకుండా-"మగాడివి దానికంటే విచక్షణ వున్నవాడివి అది చెప్పినట్టల్లా చేస్తే నీ గతే కాదు......దాని గతేం కాను......రేపొద్దున్న అది ప్రధాన మంత్రిని హత్య చేయమంటుంది. చేసేస్తావా?" అన్నాడు.
"నేనామె చెప్పినట్లల్లా చేయడంవల్ల నాకు నష్టం. ఆమెకేం నష్టం?" అన్నాడు ప్రవీణ్ ఆశ్చర్యంగా.
"బాగుంది. నేను మీ యిద్దరికీ పెళ్ళి చేయాలనుకుంటున్నాను...."
ప్రవీణ్ ఆశ్చర్యంగా-"కానీ-మీకు లేనివాళ్ళంటే అపనమ్మకం. అసహ్యం. నేను లేనివాడినని మీకు తెలుసు...." అంది.
"ఇలాగని ఎవరు చెప్పారు?"
"చంప..."
మధుసూదన్ క్షణకాలం ఆశ్చర్యపోయాడు-"చంప నీకు అబద్ధం చెప్పింది-"
"అబద్దమెందుకు చెబుతుంది?"
"ఆమె విజయ్ ని ప్రేమిస్తుందిలే!"
"విజయ్ ఎవరు?"
"డబ్బున్న ఓ జులాయి వెధవ....చంపకు వాడంటే ప్రాణం నాకు వాడంటే అసహ్యం. అందుకే త్వరగా మీ యిద్దరికీ పెళ్ళిచేయాలని నేననుకుంటున్నాను. నువ్వేమో వాడికంటే జులాయిగా తయారై హత్యలకు పాల్పడుతున్నావు. ఇప్పుడు నీకంటే వాడే నయమని పిస్తోంది."
ప్రవీణ్ చటుక్కున-"మీరు నన్ను తప్పుగా అర్ధం చేసుకున్నారు. నేను హత్యచేస్తానని చంపకు చెప్పాను కానీ శివరాజును హత్యచేయాలనుకోలేదు..." అన్నాడు.
"మరేం చేద్దామనుకున్నావు....?"
"అతడి నుంచి ఎలాగో బెదిరించి ఓ లక్షరూపాయలు సంపాదించి ఆ డబ్బుమీద వచ్చే వడ్డీతో మీ బ్లాక్ మెయిలింగు ఖర్చు సరిపెట్టాలనుకున్నాను."
"శివరాజంత తెలివితక్కువవాడా?"
"కాడు కానీ నా తెలివి ఉపయోగించాలనుకున్నాను."
"ఏం చేశావు?"
చెప్పాడు ప్రవీణ్.
"అయితే శివరాజు లక్షరూపాయలూ తెచ్చి ఉంటాడంటావా?"
"తెస్తాడని నాకు నమ్మకంలేదు. తెల్లవారుఝామున వెళ్ళి చూడాలనుకున్నాను ఆ తర్వాత శివరాజును నమ్మించడానికీ బెదిరించదానికీ- ఇంకా పెద్ద నాటకం తయారుచేసుకున్నాను కానీ యీలోగానే యీ కబురందింది."
"అయితే శివరాజు అనుకోకుండా పాముకాటుకు గురై వుంటాడు కానీ పోలీసులు నీకోసమెందుకు వెతుకుతారు? శివరాజు ముందుగా పోలీసులకు చెప్పాడంటావా?" అన్నాడు మధుసూదన్.
"కాదు ఎక్కడో ఏదో మోసం జరిగింది-"
"అంటే?"
"నేను నల్లగులాబి పొదలో పామునుంచుతానని చంపతో చెప్పాను. కానీ నాకలాంటి ఉద్దేశ్యమేంలేదు. అసలు శివరాజలా అక్కడికి వస్తున్నట్లూ అతణ్ణి నేను పాము కాటుద్వారా చంపబోతున్నట్లూ నాకూ చంపకూ తప్పక ఎవరికీ తెలియదు నా పథకం మరొకళ్ళకి ఎలా తెలిసింది?" అన్నాడు ప్రవీణ్-"అందుకే అర్జంటుగా చంపను కలుసుకుని మాట్లాడాలనుకుంటున్నాను...."
"శివరాజు మరణం విజయ్ కు లాభిస్తుంది. చంప విజయ్ ని ప్రేమిస్తోంది. ఇంతే నేను చెప్పగలను...." అన్నాడు మధుసూదన్.
ప్రవీణ్ తెల్లబోయి-"అయితే-చంప నన్ను పోలీసులకప్పగిస్తుందంటారా-నేను నమ్మను..." అన్నాడు.
"ఈ ఉత్తరం నీకు చంప పంపలేదు. బహుశా విజయ్ పంపి ఉండవచ్చు. నీ పథకాన్నతడుపయోగించుకుని శివరాజు ప్రాణాలు తీసివుండవచ్చు. పోలీసులకు నీ పేరు చెప్పొచ్చు. నువ్విప్పుడు పరారీ అయ్యావంటే నీమీద అనుమానం పెరుగుతుంది. నా మాట విని పోలీసులకు లొంగిపో-" అన్నాడు మధుసూదన్.
ప్రవీణ్ చటుక్కున వంగి మధుసూదన్ పాదాలకు నమస్కరించి-"నాకు మీ ఆశీర్వాదం కావాలి. మీరు చెప్పినట్లే చేస్తాను...." అన్నాడు.
"కల్యాణమస్తు-" అన్నాడు మధుసూదన్.
8
ఇంకా తెల్లవారకుండానే తనింటికి వచ్చిన విజయ్ ను చూసి తెల్లబోయింది చంప.
అప్పటికి మధుసూదన్ గాఢనిద్రలో వున్నాడు. చంప ముఖం కడుక్కుని కాఫీ తాగుతోంది. వంటాయన విజయ్ కి కూడా కాఫీ తెచ్చిచ్చాడు.
"అనుకోని ప్రమాదం జరిగింది. ప్రవీణ్ నా ప్రాణం మీదకు తీసుకొచ్చాడు...." అన్నాడు విజయ్.
"ఏం జరిగింది?"
"ప్రవీణ్ పథకాన్ని నేనుపయోగించుకున్నాను. శివరాజు పాము కాటువల్ల మరణించాడు. నేను పోలీసులకు ఫోన్ చేసి ప్రవీణ్ ఒక పాములవాడి దగ్గర పాము కొని-శివరాజును హత్య చేసినట్లు- అజ్ఞాత వ్యక్తిగా చెప్పాను. పాములవాడిచేత తప్పుడు సాక్ష్యం కూడా సిద్దం చేశాను. ఆ తర్వాత ప్రవీణ్ ని పారిపొమ్మని హెచ్చరిస్తూ ఉత్తరం రాశాను. ప్రవీణ్ పారిపోకుండా పోలీసుల్ని కలుసుకున్నాడు. జరిగింది తనకు తెలిసినంత వరకూ యథాతధంగా చెప్పేశాడు...."
"శివరాజు పాము కాటువల్ల చనిపోగానే తృప్తిపడి ఊరుకోక అందులో మళ్ళీ ప్రవీణ్ నెందుకిరికించావు?" అంది చంప కోపంగా.
విజయ్ ఆమెకు శివరాజు స్నేహితుడి గురించి చెప్పి "హత్య ప్రవీణ్ వల్ల జరిగితే మాకెవ్వరికీ ప్రమాద ముండదు. లేకుంటే నేనతన్నెప్పుడో చంపించి వుండేవాణ్ణి...." అన్నాడు.
"కానీ ప్రవీణ్ నిందులో ఇరికించడం అన్యాయం..."
"అన్యాయమేకానీ-స్వార్ధం కోసం కొన్ని అన్యాయాలు తప్పదు. ఒక ఒరలో రెండు కత్తులిమడవని నీకెప్పుడో చెప్పాను. నువ్వు లేకుండా ప్రవీణ్ ఎలాగూ జీవించలేడు. నీ ప్రియుణ్ణి రక్షించడంవల్ల అతడికెంతో తృప్తిగా వుంటుంది."
చంప నిట్టూర్చి-"ఇప్పుడీ సమయంలో ఇలా ఎందుకొచ్చావ్?" అంది.
"నిన్న రోజంతా నేను నీతో ఉన్నట్లు నువ్వు పోలీసులకు చెప్పాలి. మనం కాబోయే దంపతులమని నేను పోలీసులక్కూడా చెబుతాను. నీ సాక్ష్యమొక్కటే నాకు ఎలిబీ ఇవ్వగలదు."
"నీకు ఎలిబీ అంటే-అది ప్రవీణ్ కి ప్రాణాంతకం అవునా?" అంది చంప తీవ్రంగా.
"అవును....."
"హంతకుడికి రక్షణ ఇచ్చి-అమాయకుణ్ణి శిక్షించడానికి నీకు నా సాక్ష్యం కావాలి.....అవునా?"
