"అవన్నీ యిప్పుడెందుకు బాబాయ్! నేను చెబుతున్న దల్లా ప్రవీణ్ హత్యకు సిద్దపడ్డారని!" అంది చంప.
"శివరాజు చావడం నా కిష్టమే! కానీ ప్రవీణ్ హంతకుడు కావడం నాకిష్టం లేదు. నేనతన్ని వెంటనే కలుసుకుంటాను...."
"బాబాయ్-ఎవరి వ్యక్తిత్వంలోనూ జోక్యం చేసుకోకు. నువ్వు నేను చెప్పేదాకా ప్రవీణ్ తో మాట్లాడితే నామీదొట్టే!" అంది చంప.
4
డ్రాయింగ్ రూంలో ఒక్కడూ కూర్చుని వీడియోలో బ్లూ ఫిల్ము చూస్తున్నాడు శివరాజు. అతడి ముఖంలో ఉద్రేకం లేదు. ఆవేశంలేదు. చాలా తాపీగా చూస్తున్నాడతడు.
"సర్!" అన్న పిలుపు విని గుమ్మంవైపు చూశాడతడు.
శివరాజు గుమ్మానికెదురుగా కనబడుతున్నాడు. గుమ్మం దగ్గిరున్న వాళ్ళకి వీడియో కనబడదు.
వీడియో చూస్తూనే-"ఏమిటి?" అన్నాడు శివరాజు.
గుమ్మందగ్గరున్న పనివాడు-"మీకోసం ఎవరో వచ్చారండి లోపలకు పంపమంటారా?" అన్నాడు.
"పేరు?"
"ప్రవీణ్....."
"ఇదివరకెప్పుడైనా మనింటికొచ్చేడా?"
"లేదండి...."
"సరే - పంపించు-" అని రిమోట్ కంట్రోల్ తో వీసీఆర్ టీవీ-ఆఫ్ చేశాడు శివరాజు.
కొద్ది క్షణాల్లో ప్రవీణ్ లోపలకు ప్రవేశించి శివ రాజుకు నమస్కరించాడు. శివరాజతడికి ఆసనం చూపించాడు.
ఇద్దరూ ఒకరికొకరు - ఎదురెదురుగా కూర్చున్నారు.
"మీ రెవరో నాకు తెలియదు-" అన్నాడు శివరాజు.
"మీరు నాకు తెలుసు-" అన్నాడు ప్రవీణ్.
"ఎలా తెలుసు?" కుతూహలంగా అడిగాడు శివరాజు.
"మీరు చాలామందిని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు."
శివరాజు ముఖం గంభీరంగా మారిపోయింది - "ఎవర్నువ్వు?" అన్నాడు తీవ్రంగా.
"చాలా సామాన్యున్ని నా జీతం నెలకారొందలు"
"ఎందుకొచ్చావ్?"
"నిన్ను హెచ్చెరించడానికి-" అన్నాడు ప్రవీణ్ తనూ సంభాషణమార్చి.
శివరాజు నవ్వి-"నీ కంటే పెద్దవాళ్ళు నన్ను హెచ్చరించారు"-అన్నాడు.
"వాళ్ళకూ నాకూ తేడా ఉంది....
"ఏమిటది...."
"నేను నీ శ్రేయోభిలాషిని....."
శివరాజు తెల్లబోయి - "శ్రేయోభిలాషివా?" అన్నాడు.
"అవును....."
"అయితే నువ్వు నాకు చెప్పదల్చుకున్నదేమిటి?"
"నీ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి...."
శివరాజు నవ్వి-"ప్రమాదాలకు నేనీ భయపడను. వాటితో ఆడుకుంటాను-" అన్నాడు.
"ప్రమాదాలతో ఆడుకోవడానికి బ్రతికుండాలి కదా!" అన్నాడు ప్రవీణ్.
"నన్ను చంపడం అంత సులభంకాదు...."
"ఉంగరపురాయికి విషమంటించి షేక్ హ్యాండిస్తే- ఎవరు చంపారో ఎలా చంపారో తెలియకుండా ప్రాణాలు పోతాయి. అర్ధరాత్రి పూట నీ గదిలోకి విషసర్పాన్ని వదిలిపెడితే పాము కరచిందనుకుంటారు తప్ప - హత్య అనుకోరు....మనిషిని చంపాలంటే యిలా ఎన్నో ఉపాయాలున్నాయి...."
"అయితే ఏం చేయమంటావ్?"
"నీ పద్ధతి మార్చుకో ఇంతవరకూ సంపాదించిన దాంతో తృప్తిపడు. ఇకమీదట ఎవరినీ బ్లాక్ మెయిల్ చేయకు.....సుఖంగా నువ్వు జీవించి పదిమందిని సుఖపడనీ-" అన్నాడు ప్రవీణ్.
"నువ్వు నన్ను బెదిరిస్తున్నావా?"
"లేదు-హితవు చెబుతున్నాను...."
"నీ హితవు పాటించకపోతే?"
"చచ్చిపోతావు"
"ఇప్పుడే ఈ క్షణంలో నేను నిన్ను చంపేస్తే...."
"అప్పుడు నిన్ను నా స్నేహితుడు బ్లాక్ మెయిల్ చేస్తాడు. నువ్వు సంపాదించిన దానికి రెట్టింపు గుంజడం మొదలు పెడతాడు...."
"ఎక్కడున్నాడు నీ స్నేహితుడు?"
"నేను చెప్పను....."
"చెప్పకపోతే ఇప్పుడే చస్తావ్! బ్లాక్ మెయిలింగు సంగతి తర్వాత చూస్తాను"
"నన్ను చంపడం ద్వారా నీ చావును తప్పించుకోలేవు...."
"ఏం-నీ స్నేహితుడు పగతీర్చుకుంటాడా?"
"నా స్నేహితుడు హత్యలు చేయడు. నువ్వు చచ్చే లోగా నిన్ను బ్లాక్ మెయిల్ చేసి నీ దగ్గర డబ్బు గుంజుతాడు!"
"మరి నేనెలా చస్తాను?"
"ఎలా చస్తారో యిప్పుడు చెప్పును...."
"ఎప్పుడు చెబుతావు?"
"నీ దగ్గర లక్షరూపాయలు తీసుకుని...." అన్నాడు ప్రవీణ్.
"నువ్వడిగితే నేనిస్తాననుకున్నావా?"
"నిన్ను చంపడానికి ముగ్గురు ప్రయత్నిస్తున్నారు. ముగ్గురూ మూడు రకాలుగా ప్రయత్నిస్తున్నారు. వాళ్ళెవరో-ఏ విధంగా ప్రయత్నిస్తున్నారో నాకు తెలుసు. నా ద్వారా నువ్వూ తెలుసుకోవచ్చు. అందుకు లక్షరూపాయల ఫీజు ఇవ్వదల్చుకుంటే యివ్వవచ్చు. లేదా మూడే మూడు రోజుల్లో నీకు చావు రాసిపెట్టి ఉంది."
"నేను నీకు పైసా కూడా యివ్వను."
"అయితే బ్లాక్ మెయిలింగ్ మానేసేయ్ నీ చేత బ్లాక్ మెయిలింగ్ కాబడుతున్న వారందరికీ ఆ విషయం చెప్పేసేయ్ నీ ప్రాణాలు రక్షించబడతాయి. నిన్ను చంపాలనుకుంటున్న వారు ముగ్గురూ కూడా నీ బ్లాక్ మెయిల్ కు గురైనవారే! అయితే వాళ్ళు నియమించిన మనుషులెవ్వరో నీ ఊహక్కూడా అందదు...."
"నీ కెలా తెలిసింది?"
"అనుకోకుండా తెలిసింది. సొమ్ము చేసుకోవాలను కుంటున్నాను...."
శివరాజు క్షణం ఆలోచించి-"నీకు నేను డబ్బిస్తాను. నీకు తెలిసిన ఆ రహస్యం నాకు చెప్పు...." అన్నాడు.
"ఇప్పుడు చెప్పను...." అన్నాడు ప్రవీణ్.
"ఎప్పుడు చెబుతావు? నా కింక మూడేరోజులు వ్యవధి ఉందన్నావు...."
"అర్ధరాత్రి ఒంటిగంటకు-నీ యింటికి దగ్గర్లోని-నెహ్రూపార్కులో-నల్లగులాబి పొదలో లక్ష రూపాయలనూ-ఓ సంచీలోపెట్టి-ఉంచేయ్ ఆ తర్వాత ఆ ప్రాంతాల నువ్వు కానీ నీ మనుషులుకానీ ఉండకూడదు. ఇంటికి చేరసరికి నీక్కావలసిన సమాచారం అందుతుంది-"
"అందకపోతే?"
"నా చిరునామా నీకు తెలుసు. నేను సామాన్యున్ని నా పని పట్టడం నీ కసాధ్యం కాదు...."
"నీ చిరునామా నాకు తెలియదు...."
"తెలుసంటే-నేను చెబుతానని అర్ధం...."
ప్రవీణ్ శివరాజుకు తన చిరునామా యిచ్చాడు. శివరాజు నోట్ చేసుకుని జేబులో ఉంచుకున్నాడు.
"మరి-నాకు సెలవా?" అంటూ లేచాడు ప్రవీణ్.
శివరాజు తలాడించాడు.
5
థెయేటర్లో జనం పల్చగా ఉన్నారు.
బాగా వెనుకగా కూర్చుని ఉన్నారు ప్రవీణ్. చంప.
"శివరాజు మనుషులు నిన్ననుసరించి కనిపెడుతూంటా రేమో-నీకు భయంగా లేదా?" అంది చంప.
"శివరాజు బ్లాక్ మెయిలర్ అలాంటివారికి అనుచరులుండరు. ఒక్కడే పనిచేస్తాడు....."
"అయితే నీకు లక్షరూపాయలూ ఇస్తాడంటావా?"
"ఇస్తాడు...."
"ఇవ్వకపోతే?"
"ఇచ్చినా యివ్వకపోయినా-చస్తాడు-"
"ఎలా?"
"గులాబిపొదలో అతడికోసం విషనాగు-సిద్దంగా ఉంటుంది. డబ్బు సంచీ పెట్టగానే కాటేస్తుందది...."
"పాము బుద్ధిగా ఆ పొదలోనే కూర్చుంటుందనుకున్నావా?"
"అందుకు పద్ధతులున్నాయి. ఎవరైనా కదిపితే తప్ప చలనముండదు దానిలో-"
చంప అతడివంక ఆశ్చర్యంగా చూసి-"నేరస్థుడిగా నువ్వు బాగా రాణిస్తావు. నీ గురించి ఏమో అనుకున్నాను-" అంది.
"నేనేం చేసినా-అది నీ కోసమే...." అన్నాడు ప్రవీణ్.
"నేను నిన్ను మోసం చేస్తున్నాననుకో-అప్పుడు?" అడిగింది చంప.
"నేను నీ గురించాలోచించను. నా కోసమే నా ఆలోచనంతా నాకు నువ్వు కావాలి....ఎలాంటి దానినైనా సరే!"
"హత్యచేసి పట్టుబడితే నేను నీక్కాకుండాపోతాను. అందుకూ సిద్దపడే ఉన్నావా?"
"నేను హత్యచేస్తే పట్టుబడను....."
