"నువ్వెళ్ళి పడుకో, నేను కూడా అరగంట లో వచ్చి పడుకుంటాన్లె. అర్ధరాత్రి మెలకువగా వుండడం నీ ఆరోగ్యానికి మంచిది కాదు" అన్నాడు బాపిరాజు భార్య నుద్దేశించి.
"అమ్మయ్య" అని నిట్టూర్చి "నేను పొద్దున్న నిన్ను వెటకారం చేశానా? ఏ లాటరీ లోనైనా డబ్బోస్తే , నిన్ను పిలిచి మరీ డబ్బిస్తానని, మధ్యాహ్నానికి నాకు లాటరీ లో లక్ష రూపాయల బహుమతి వచ్చినట్లు తెలిసింది. ఈ వార్త నాకు సంతోషాన్ని కలిగించినప్పటికీ, తీయవలసిన చోటనే దెబ్బ తీసింది కూడా. ఎంత ఐశ్వర్యమున్నా, నీబోటి మంఛి వాళ్ళ సాటి వస్తార్రా నాబోటి వాళ్ళు. నీ మంచితనం, దేవుడి చేత నాకు లక్షరూపాయలు ఇప్పించింది. అందులో కేవలం పాతికవేలు నేను నీ కివ్వబోతున్నాను. నువ్వు కాదనకూడదు" అన్నాడు బాపిరాజు.
ఊహించని ఈ ఔదార్యానికి తెల్లబోయాడు మురళీధర్. అతనికి నోట మాట రాలేదు.
'ఆలోచించకురా, నేను మాములుగా పిలిస్తే నువ్వు రావనే అనుమానంతో ఫోన్లో అలా చెప్పాను. ఆఖరికి మూలిగాను. నువ్వీ డబ్బు తీసుకొని పక్షంలో నేను మానసికంగా చచ్చిపోయినట్లే లెక్క!"
మురళీధర్ చటుక్కున 'అంతమాటనకు మామయ్యా" అన్నాడు.
"నీ గురించి లెక్క సిద్దంగా వుంచాను. సరిగ్గా పాతిక వేలు . దీంతో నీ అవసరం గడుపుకో, మళ్ళీ తిరిగి ఇవ్వాల్సిన పని లేదు" అన్నాడు బాపిరాజు.
"నీమాట కాదనలేను, కానీ అప్పుగా అయితేనే తీసుకుంటాను."
బాపిరాజు కూడా ఒక్క క్షణం అలోచించి- "సరే-- నీ యిష్టం-" అన్నాడు.
తర్వాత బాపిరాజు మురళీధర్ ని ఇనప్పెట్టె వున్న గది లోకి తీసుకు వెళ్ళాడు. ఇనప్పెట్టె తలుపులు తీసి యెంచి సరిగ్గా పాతికవేల రూపాయలు ఇచ్చాడు. మొత్తం రెండు వందల ఏభై వంద రూపాయల నోట్లు. చిన్న పోలిధీన్ బ్యాగులో పెట్టి, "జాగ్రత్త గా వెళ్ళు" అన్నాడు.
మురళీధర్ చటుక్కున వంగి బాపిరాజు కాళ్ళకి దణ్ణం పెట్టాడు. "నీది మంచి మనసు మామయ్యా, ఒక బలహీన క్షణంలో నిన్ను చంపాలన్న ఆలోచన కూడా నాకు వచ్చింది' అన్నాడు.
బాపిరాజు అతన్ని లేవనెత్తి "నీచేత దణ్ణం పెట్టించుకునే అర్హత కూడా నాకు లేదు. మనిషి జీవితానికి డబ్బు ఒక్కటే ప్రధానం కాదు. బ్రతికితే మీ నాన్నలా బ్రతకాలి. చాలా ఆలశ్యంగా ఒక జీవిత సత్యం తెలుసుకున్నాను. ఇన్నాళ్ళ బాపిరాజు ఈ రాత్రి చచ్చిపోయాడు. కొత్త జన్మ ఎత్తుతాడు మరి' అన్నాడు.
12
హటాత్తుగా హల్లో ఏదో చప్పుడైంది.
బాపిరాజు, మురళీధర్ కంగారుగా హాల్లోకి వచ్చాడు. తలుపులు తీసి వున్న కారణంగా హాల్లోకి విపరీతంగా గాలి వస్తోంది. గోడ మూలగా వున్న ఒక చిన్న బల్ల మీద నుంచి దొర్లుకుంటూ చిన్న ఇనుప గొట్టం క్రింద పడింది. ఆ చప్పుడే ఇద్దరూ విన్నారు. కానీ, ఆ బల్ల చాటున నక్కిన రామలింగం వారి కంట పడలేదు.
"ఈ గొట్టాం మేమిటి మావయ్యా" అంటూ తీశాడు దాన్ని మురళీధర్. "అబ్బా చాలా బరువుగా వుందే" అన్నాడతను.
"అది గొట్టం కాదు. ఏదో పురాతన వస్తువంటే కొన్నాను. దాని మీద మంచి బొమ్మ వుంది చూడు"అన్నాడు బాపిరాజు.
నిజమే, కానీ పెద్ద విశేషంగా తోచలేదు మురళీధర్ కి. అతను నెమ్మదిగా ఆ గొట్టాన్ని బల్లమీదుంచాడు.
బాపిరాజు మురళీధర్ ని సాగనంపడానికి రోడ్డు దాకా వచ్చాడు. మురళీధర్ కనుచూపు మరుగయ్యేవరకూ చేయి ఊపుతూనే వున్నాడు.
మురళీధర్ ఉత్సాహంగా ఈలవేసుకుంటూ నడుస్తున్నాడు. అతనికి కనుచూపు మేరలో ఎక్కడా రిక్షా కనబడలేదు. పది నిమిషాలు నడిచేసరికి వాన తుంపర ప్రారంభమయింది. మరో అయిదు నిమిషాల్లోనే అది బ్రహండమైన వానగా మారిపోయింది.
మురళీధర్ దారుణంగా తడిసిపోతున్నాడు. ఏం చేయాలో అతనికి తోచలేదు. ఒక సందు మొగలో పెద్ద అరుగుల ఇల్లు కనబడిందటానికి. చటుక్కున అక్కడికి పరుగెత్తాడు.
అప్పటికే అతను పూర్తిగా తడిసిపోయాడు. అరుగు మీద అతని శరీరం నుంచి బట్టల నుంచీ ధారగా నీళ్ళు కారుతున్నాయి. అలా కారిన నీళ్ళు అరుగు మీద అటూ, యిటూ ప్రవహిస్తున్నట్లున్నాయి. అక్కడ పడుకుని వున్న ఒక వ్యక్తీ ఉలిక్కిపడి లేచాడు. అక్కడ నిలబడి ఉన్న మురళీధర్ ని చూసి "ఎవరది?' అన్నాడు.
మురళీధర్ ఉలిక్కిపడి ఆ వ్యక్తిని చూశాడు. ఎవరో అపరిచితుడు. 'ఈ దారిని పోతూ వానలో చిక్కడి ఇక్కడ తలదాచుకుంటున్నాను" అన్నాడు.
ఆ అపరిచితుడు లేచి నిలబడి , "ఇంత రాత్రివేళ దారిని పడిపోవడమేమిటి? అయ్యో! బాగా తడిపి పోయారే" అన్నాడు. మురళీ ధర్ ఏమీ మాట్లాడలేదు.
'ఇంట్లో నిద్రపట్టక పక్క అరుగు మీద వేసుకున్నాను. లోపల వున్నది కొత్త దంపతులు లెండి- మా అమ్మాయీ, అల్లుడూ , అయినా వాళ్ళకు డిస్టర్బ్ చేయక తప్పదు " అంటూ అపరిచితుడు వెళ్ళి తలుపు తట్టాడు. అలా నాలుగైదు సార్లు తట్టాక తలుపులు తెరచుకున్నాయి. విడీవిడని మత్తు కళ్ళతో ఒక అమ్మాయి, "ఎందుకు నాన్నా" అంటోంది. అపరిచితుడు విషయం వివరించాడు.
మురళీధర్ కి తుడుచుకుందుకు తువ్వాలు దొరికింది, కట్టుకున్న బట్టలు పిండుకుని, మళ్ళీ కట్టుకునేటందుకు మరుగు దొరికింది. వాన తగ్గేవరకూ కాస్త తోడూ దొరికింది.
అతనిల్లు చేరుకునేసరికి సరిగ్గా రెండు గంటలయింది.
"ఎవరది?" అని అడిగి భర్త కంఠ స్వరం విన్నాకనే తలుపు తీసింది ఉమ. భర్తను చూస్తూనే ఆత్రుతగా విశేషాలడిగింది ఉమ.
తలుపులు వేసి లోపలక వెళ్ళేక జరిగినదంతా చెప్పి, పోలిధీన్ బ్యాగు అందించాడతను. ఉమ ఆ సంచీని కళ్ళ కద్దుకుని దేవుడి గదిలో వ్రేలాడుతున్న శ్రీ వెంకటేశ్వరస్వామి పటానికి వెనుక వుంచింది.
మురళీధర్ తడి బట్టలు విప్పి, పొడి లుంగీ కట్టుకున్నాడు. "అదృష్టం ఈ విధంగా మన్ని వెతుక్కు వస్తుందని నేనూహించలేదు ఉమ!"
బాధ్యభార్తలకారాత్రి హాయిగా నిద్ర పట్టవలసిందే కానీ, ఎందువల్లనో అలా జరగలేదు. ఇంట్లో పాతికవేల రూపాయల క్యాషు ఉందన్న భయం కూడా అందుక్కారణం కావచ్చు.
13
ఉమ వెళ్ళి తలుపులు తీసేసరికి, పోలీస్ దుస్తులలో భానోజీరావు కనిపించాడు. అదంతా పెద్ద విశేషం కాకపోయినా, అతని వెనుక మరికొందరు కానిస్టేబుల్స్ కూడా వుండడం ఆమెకు ఆశ్చర్యం కలిగించింది.
'ఆయనకు బాగా జ్వరంగా వుందన్నయ్యా" అంది ఉమ లోనికి నడుస్తూ.
"అదేం. నిన్నటి వరకూ బాగానే వున్నాడుగా."
"ఏముంది, ఎంత బాగా వున్నా వానలో తడిస్తే పడదు కదా, ఆయనకు...."
"నిన్న వాన పడందే" అన్నాడు భానోజీరావు లోపలకు ప్రవేశిస్తూ.
"పడకేం, రాత్రి వేళ పడిందిగా."
భానోజీరావు ఉలిక్కిపడి, "రాత్రి ఒంటిగంటకు వానపడితే, వీడెందుకు తడిసాడు" అన్నాడు.
"అదే, బాపిరాజు గారింటికి కెళ్ళి వస్తూనూ" అంది ఉమ.
భానోజీరావు తల పట్టుకుని, "అయితే వీడు బాపిరాజు గారింటికి వెళ్లాడన్నమాట"అని, కానిస్టేబుల్స్ తో "యూ డూ యువర్ డ్యూటీ" అన్నాడు.
"ఏమిటి?" అంది కంగారుగా ఉమ.
"మీ అయన అర్ధరాత్రి వేళ బాపిరాజు గారింటికి వెళ్ళి పాతికవేలు క్యాషు పట్టుకొచ్చాడా?" అనడిగేడు భానోజీరావు.
"మీకెలా తెలుసు!" అంది ఉమ.
భానోజీరావు కానిస్టేబుల్స్ ని ఆగమని చెప్పి, "ఏదీ ఆ డబ్బు చూపించు" అన్నాడు. ఉమ లోపలకు వెళ్ళి డబ్బు తీసుకువచ్చి భానోజీరావు కిచ్చింది. భానోజీరావు డబ్బు లెక్క పెట్టాడు. ఆ నెంబర్లు చూశాడు. ఉమ వంక జాలిగా చూసి, "నీకొక్కటే సలహా ఇవ్వగలను. తక్షణం లాయర్ రామారావు గారికి ఫోన్ చేయి. నేనునీ భర్తను అరెస్టు చేస్తున్నాను" అన్నాడు.
ఉమ కళ్ళలో నీళ్ళు తిరిగాయి. "అసలేం జరిగింది?"
"ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ, నా డ్యూటీ నాచేత నీ భర్త రాత్రి బాపిరాజు ని హత్య చేసి పాతికవేల రూపాయలు క్యాష్ ఎత్తుకొచ్చాడని అనిపిస్తోంది. ఈ విషయంలో నేను పూర్తీ నిస్సహాయుణ్ణి" అన్నాడు.
"బాపిరాజు గారు హత్య చేయపడ్డారా?"
"ఆ విషయం రాత్రి నీ భర్త చెప్పలేదా?"
"అలా కూర్చో అన్నయ్యా" అంది ఉమ. అతడు కూర్చున్నాక రాత్రి తన భర్త తనకు చెప్పిన వివరాలన్నీ ఓపిగ్గా చెప్పింది ఉమ.
అన్నీ విని భానోజీరావు నిట్టూర్చాడు. "ఎవరు నమ్ముతారమ్మా ఈ కట్టుకధ! బాపిరాజులంటూ కఠినాత్ముడు అర్దారాత్రి వేళ పిలిచి నోటు లేకుండా పాతిక వేలిప్పించాడంటే ! నువ్వు కాక మరెవ్వరైనా చెపితే నవ్వి ఉండేవాడ్నీ"
'అయన అబద్దమాడరన్నయ్య" అంది ఉమ.
"ఆ సంగతి నాకూ తెలుసును. కానీ, బాపిరాజు ఔదార్యం చూపించలేడన్నది అంతకంటే పచ్చి నిజం. అయినా అయన మీ అయన కెప్పుడు ఫోన్ చేశాడు?"
"నేను వినలెదన్నయ్యా, నిద్రపోతున్నాను. ఆయనే నన్ను లేపి తనకిలా ఫోన్ వచ్చిందనీ, వెడుతున్నాననీ అన్నారు"అంది ఉమ.
