Previous Page Next Page 
వసుంధర కధలు-5 పేజి 38

 

    "మావయ్యా నన్ను మీ ఇంటికి రమ్మని పిలిచినది అవమానించడానికా లేక....." ఉద్రేకపడుతూ అడిగాడు మురళీధర్.
    "ఇది నీకు అవమానం కాదురా, జ్ఞానభోద , మూసుకుపోయిన్న నీ కళ్ళు తెరిపించడం కోసం మనుషుల్ని నమ్మినందుకు నీ బాబు నిన్నేగతికి తీసుకువచ్చాడో చూశావా? ముష్టి పాతికవేలు ముగ్గురు కలిసి వారం రోజుల్లో సమకూర్చ లేని స్థితికి. "ఏ క్షణాన అప్పుకోసం నా యింటికి టెలిఫోన్ చేశావో అప్పుడే జరిగిందిరా నీకు అవమానం. నీలాంటి ఊరు పేరూ లేనివాడికి అప్పివ్వడానికి నా ఆస్తి వారసత్వం తోటీ, లాటరీ టిక్కెట్లతోటి సంపాదించినది కాదురా, కష్టపడి సంపాదించాను. కర్మం చాలక, ఏ లాటరీ అయినా తగిలి అప్పనంగా డబ్బోస్తే, నీకు తప్పకుండా ఇంటికి కబురు చేసీ మరీ అప్పిస్తాను లే...." అన్నాడు బాపిరాజు.
    "మావయ్యా , నువ్వింత దుర్మర్గుడివని నేను కలలో కూడా అనుకోలేదు. అప్పడిగితే లేదని ఒక్క ముక్క చెప్పడానికి నన్నూ, నా మిత్రుల్ని నీఇంటికి పిల్చి మరీ అవమానించేవు -" అన్నాడు ఆవేశంగా.
    "చూశావా, నామాటలకు మరో ఉడుకు రక్తమైతే ఉద్రేకపడి నన్ను చంపినంత పని చేసేది. డబ్బు లేని వాడి రక్తంలో ఉడుకు మాత్రం ఎక్కణ్ణించి వస్తుంది? అందుకే మరెన్నడూ నా గుమ్మం తొక్కకుండా వుంటావని , ఇలా చేశాను. మానేస్తావా, ఇంకా ఆశ వుందా?"
    'ఛ- నీలాంటి మనిషి మీదనా ఆశ? నేను మళ్ళీ నీ గుమ్మం ఎక్కితే, అది నీ ప్రాణం తీయడానికి మాత్రమే ననుకో ...." అన్నాడు మురళీధర్. తన మిత్రుల వంక తిరిగి - "పదండి పోదాం!" అన్నాడు.
    ఆ ఇంట్లోంచి బయటకు అడుగులు వేస్తుంటే బాపిరాజు నవ్వు వినబడుతోంది. అయన విరగబడి నవ్వుతున్నట్లున్నాడు. చాలా గట్టిగా ఆగకుండా వినిపిస్తోంది.
    మురళీధర్, పిడికిళ్ళు బిగుసుకున్నాయి. ముఖం ఎర్రబడి పోతోంది. రామారావు నతని వీపు నిమిరి, "టేకిట్ ఈజీ" అన్నాడు.
    మురళీధర్ కు నోట మాట కూడా రాలేదు. భానోజీరావు మాత్రం "ఛా - జీవితంలో ఇలాంటి వ్యక్తిని చూడవలసోస్తుందనుకోలేదు" అన్నాడు.
    "ఏమైనా ఎల్లుండి దాకా టైముంది కాబట్టి, ఇల్లక్కర్లెదన్న విషయం ఎల్లుండి ఉదయమే చెప్పవచ్చు"అన్నాడు రామారావు.
    ఎవ్వరూ మాట్లాడలేదు. మౌనంగానే మిత్రులు విడిపోయారు.
    మురళీధర్ ఇల్లు చేరి మౌనంగా బెడ్రూం లోకి వెళ్ళి , "ఏమైందండీ - కాయా, పండా " అనడిగిన ఉమా ఒడిలో తల పెట్టుకుని ఏడ్చేశాడు.

                                    11
    టైం చూసుకున్నాడు మురళీధర్. పదకొండు గంటలయింది. ఇంత రాత్రివేళ తనకు ఫోనేవరు చేస్తారు?"
    ఫోన్ అలా మ్రోగుతూనే వుంది.
    ఇంటాయన ఊళ్ళో లేని కారణంగా మురళీధర్ పక్క, ఫోనున్న హాల్లోకి మార్చేశాడు. ఉమ, రాజు అతని పక్కనే నిద్రపోతున్నారు.
    మురళీధర్ లేఛి ఫోన్ తీశాడు "హలో "
    "ఎవరది, కాస్త మురళీధర్ ను పిలవండి బాబూ."
    "నేనే మురళీ ధర్ ని" గంబీరంగా అన్నాడు మురళీధర్.
    "నువ్వేనా మురళీ, అవసానదశలో వున్నాను, ఈ ముసలి  పీనుగు మీద దయతల్చి ఒక్కసారి రాగలవా?"
    "ఎవరది మాట్లాడుతుంటా?"
    "నేనేరా , నీ మావయ్య ని. నా కంఠం విని ఫోన్ పెట్టేయకు. ఉదయం నా ప్రవర్తనకు నేను సిగ్గుతో చచ్చిపోతున్నాను. నువ్వు మళ్ళీ నా గుమ్మం తోక్కనన్నావు. కానీ, నీ మంచి మనసు తెలిసిన మీదట ఈ ఫోన్ చేస్తున్నాను. ఒక్కసారి బయల్దేరి రావూ?" చాలా కష్టంలో వున్నాను. నువ్వు రాకపోతే చచ్చిపోతానేమో కూడా."
    కంఠం చాలా నీరసంగా వుంది. మురళీధర్ మనసు ఊగిసలాడింది. "ఏమిటి చెయాడం - వెళ్లడమా, మానడమా ?" అని ఆలోచిస్తున్నాడతను.
    "మురళీ- త్వరగా రారా. ఆలోచించకురా. నా తప్పు లన్నీ క్షమించరా..." ఆ తర్వాత మరి మాటలు వినపడలేదు. చిన్న మూలుగు , టెలిఫోన్ క్లిక్ మన్న శబ్దం.
    మురళీధర్ కు అనుమానం కలిగింది. మావయ్య ఇంట్లో ఏదో జరుగుతోందని అతనికి అర్ధమైంది. ఎంత దుర్మార్గుడైనా, ముసలివాడు ఆపదలో వున్నాడు. మీదు మిక్కిలి బంధువు. మరి ఆలోచించలేదతను. ఫోన్ పెట్టేసి, భార్యను లేపాడు. కళ్ళు నులుముకుంటూ లేచిందామే.
    "మావయ్య ఫోన్ చేసి పిలిచాడు నన్ను, అర్జంటుగా వెళ్ళాలి నేను వెడుతున్నాను. తలుపులు జాగ్రత్తగా వేసుకో."
    ఉమ కింకా పూర్తీ మెలకువ రాక అయోమయంగా చూస్తోంది. ఈలోగా మురళీధర్ బట్టలు మార్చుకుని , బూట్లు తొడుక్కున్నాడు. వీధిలోకి నడుస్తుండగా ఉమకు పక్క మీద మెరుస్తూ ఉంగరం కనిపించింది.
    ఆమె హడావుడిగా వీధిలోకి వెళ్ళి, భర్తను పిలిచింది. అతను వెనక్కు వచ్చాడు. "మధ్యాహ్నం నాకు బెడ్ రూంలో దొరికిందని ఇచ్చానా, మళ్ళీ ఇదీ మీ పక్క మీద పడుంది" అంటూ ఉంగరం అందించింది.
    "అచ్చొచ్చిన ఉంగర మిది. ఉదయం నా వ్రేలి కిది వుండి వుంటే, బహుశా మావయ్య నన్నవమానపర్చి ఉండేవాడు కాదేమో, పోనీలే ఇపుడైనా వెళ్ళిన పని జయప్రదం కావచ్చు" అన్నాడతను.
    "ఇంతకూ , ఎందుకింత హడావుడిగా బయల్దేరుతున్నారు?"
    "ఏం లేదు, మావయ్య యెందుకో ఫోన్ లో పిలిచాడు" అంతకు మించి ఉమకు అప్పుడు చెప్పడం మురళీధర్ కిష్టం లేదు.
    ఉమకు పరిస్థితి అర్ధం కాలేదు. కానీ, భర్త కనుచూపు మరుగు కాగానే తలుపులు మాత్రం వేసుకుంది.
    మురళీధర్ వడివడిగా అడుగులు వేస్తున్నాడు. అతనికి రిక్షా ఒకటి యెదురుగా వచ్చింది. అతడు రిక్షా అతన్ని పలకరించి బాపిరాజు గారింటికి కడతాడేమో అడిగాడు. నాలుగు రూపాయాలు అడిగాడు రిక్షావాడు.
    'చాలా ఎక్కువ!" అన్నాడు మురళీధర్.
    "చూడండి బాబూ, అర్ధరాత్రి అందులోనూ ఎదురు గాలి...."
    అప్పుడే మురళీధర్ గమనించాడు. ఇందాకట్నించీ విపరీతంగా గాలి వీస్తోంది. వాతావరణం చూస్తుంటే వాన వచ్చేలా వుంది. రిక్షా అతను చెప్పేదాకా, తన ఆలోచనల్లో వాతావరణాన్ని గమనించనే లేదు.
    బెరమాడగా ఓ అర్ధరూపాయి తగ్గింది. మురళీధర్ రిక్షా ఎక్కాడు. రిక్షా యెదురు గాలిలో కూడా వేగంగానే పోతోంది. రిక్షా అతను చాలా బలంగా వున్నాడు.
    ఉరుములు, ఫెళ ఫెళ మంటున్నాయి. ఉండుండి మెరుపులు తళుక్కు మంటున్నాయి. గాలి వింత రకం సవ్వడులు చేస్తోంది. మురళీధర్ రిక్షా ఈ వాతావరణం లో బాపిరాజు గారింటికి వెడుతోంది. మురళీధర్ బుర్రలో ఆలోచనలు అస్తవ్యస్త్యంగా వున్నాయి.
    ఏం జరిగింది మావయ్య ఇంట్లో? నానా దుర్భాషలూ అడి తరిమేసిన మావయ్యకు, హటాత్తుగా తన మీద ప్రేమ ఎలా పుట్టుకొచ్చింది? అయన నన్ను పిలవడం లో ఉద్దేశ్యమేమిటి? అవసానదశలో ఉన్నాననీ, చాలా కష్టం లో వున్నాననీ, చిన్న మూలుగు మూలిగి అర్ధాంతరంగా ఫోన్ పెట్టేశాడు. అక్కడ ఆ పరిస్థితుల్లో యేవరున్నారు? మావయ్య ఒక్కడేనా లేక?
    ముసలివాడు కష్టంలో వున్నాడనగానే తన బుర్ర పనిచేయలేదు. కానీ చాలా పొరపాటు చేశాడు. తను కూడా భానోజీరావు ను కూడా తీసుకు రావలసింది....
    రిక్షా ఆగింది. మురళీధర్ దిగి రిక్షా అతనికి డబ్బు లిచ్చాడు. నాలుగడుగులు వేశాడు. అతనిప్పుడు బాపిరాజు గాటింటి ముందు నిలబడి వున్నాడు. హల్లో యింకా దీపం వెలుతురున్నట్లు బయటకు కనబాడుతోంది.
    మురళీధర్ మారు ఆలోచన చేయకుండా ముందడుగు వేశాడు. మరో క్షణం లో అతని చేయి బాపిరాజు యింటి కాలింగ్ బెల్ ను ఆదిమింది.
    తలుపులు తెరచుకున్నాయి. బాపిరాజే స్వయంగా తలుపులు తెరిచాడు. మనిషి పిడిరాయిలా వున్నాడు. నవ్వుతున్నాడు. "లోపలకు రా, నీతో చాలా మాట్లాడాలి"అన్నాడు.
    మురళీధర్ లోపలకు వెళ్ళాడు. ఇద్దరూ చెరో సోఫాలో కూర్చున్నారు.
    "ఉదయం నా ప్రవర్తనకు నేను చాలా సిగ్గు పడుతున్నాను. ఏ సైతాన్ నన్నావహించిందో తెలియదు" అన్నాడు బాపిరాజు.
    "మీ ప్రవర్తన నాకూ చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. నా స్నేహితుల యెదుట నన్ను, వాళ్ళనీ కూడా అవమానించావు...." అన్నాడు మురళీధర్ అదోలా.
    'అయితే , నా తప్పును నువ్వు క్షమించగలవా?"
    "అంత పెద్ద మాటలెందుకు లెండి, మీ అంత అస్తేక్కడ నా అంతస్తేక్కడ?"
    "అలాగనకురా, నన్ను క్షమించేననరా."
    "చూడు మావయ్యా, మనం చిన్న పిల్లలం కాదు. జీవితం బొమ్మలాట కాదు. మీరన్న మాటలన్నీ నా గుండెల్ని పిండేస్తున్నాయి. మీరిప్పుడు సింపుల్ గా క్షమించమని అడుగుతున్నారు..... అయినా నా క్షమలో నాకు నిమిత్తం మేముంది?"
    "ఉంది, మంచితనం విలువ ఈరోజునే నాకర్ధమైంది. అసలీ రోజున ఏం జరిగిందో తెలుసా?"
    "అబ్బ- ఇంకా నిద్దరో లేదా...." బాపిరాజు భార్య విసుక్కుంటూ అక్కడికి వచ్చి, "ఎవరూ నువ్వా నాయనా, అయన కసలే బ్లడ్ ప్రెషర్, ఉదయం పెట్టిన బాధ చాల దనుకునా, ఇప్పుడు మళ్ళీ వచ్చావు" అంటూ  విసుక్కుంది మురళిని చూసి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS