Previous Page Next Page 
ఆచరణ లో అభ్యుదయం పేజి 38


    'ఆవాళ మురళీ ఆఫీసు నుంచి వచ్చేసరికి కళ్యాణి మొహం వాడిపోయి వుంది-- చిన్నగా మొదలైన బాధని వోర్చుకుంటూ, వోచేత్తో నడుం నిమురుకుంటూ తలుపు తెరచిన కళ్యాణి, 'మరో అయిదు నిమిషాలు చూసి, అప్పటికీ మీరు రాకపోతే ఎవరినయినా తీసుకుని ఆస్పత్రికి వెళ్దామను కుంటున్నాను.' అంది అదోలా నవ్వుతూ.
    'పోనీ ఎవరి చేతనయినా నాకు ఆఫీసు ఫోను చేయించక పోయావా? ఉండు టాక్సీ తీసుకొస్తాను.' అంటూ హడావిడిగా మాట్లాడేస్తూ , పూర్తిగా లోపలికయినా రాకుండా అటు నుంచటే మళ్లీ వీధిలోకి పరుగు పెట్టాడు ఖంగారుగా.
    డాక్టర్ మహేశ్వరి మెటర్నిటీ హోమ్ కి హైదరాబాదు లోనూ సికింద్రాబాదు లోనూ కూడా మంచి పేరుంది-- చార్జీ కాస్త ఎక్కువయినా ఆధునికమైన అన్ని హంగుల తోటీ అధునాతనమైన వైద్య పరికరాల తోటి ఎంతో సౌకర్యంగా వుంటుంది.
    హిమాయత్ నగర్ లో వున్న ఆ మెటర్నిటీ హోమ్ కి జంట నగరాలలో ఎక్కడెక్కడ వుంటున్న వాళ్ళు వస్తుంటారు-- స్నేహితుల సలహాని అనుసరించి మురళీ కళ్యాణి ని కూడా ఆ డాక్టర్ కే చూపించాడు....మధ్య మధ్య వెళ్లి పరీక్ష చేయించుకోటం ఆవిడ సూచన మేరకు మందులు   టానిక్కులు వాడటం అన్నీ జరుగుతున్నాయి--
    'ఏమీ భయం లేదు. అంతా నార్మల్ గా వుంది....మరో వారం రోజులలో పండంటి పాపాయిని ఎత్తుకుంటారు.' అని చెప్పింది డాక్టర్ మహేశ్వరీ క్రితం సారి కళ్యాణి వెళ్ళినప్పుడు.
    'నిజమే -- సరిగ్గా వారమే అయింది' అనిపించింది కళ్యాణికి మురళీ కి.
    ఇద్దరూ టాక్సీ దిగి వరండా దాటి లోపలికి వెళ్ళారు-- ప్రక్కగా కన్సల్టింగ్ రూమ్ లో వున్న డాక్టర్ నర్సు ని పిలిచి కళ్యాణి ని లోపలికి పంపించింది.
    ఇంక మురళీ కి ఏం చెయ్యాలో తోచలేదు. 'నేను ఇక్కడే కూర్చుంటే నలుగురూ నవ్వుకుంటా రేమో , పోనీ యింటికి వెళ్లి పోతేనో అనిపించిందోక సారి. నవ్వితే నవ్వుతారు వాళ్ళకేం తెలుస్తుంది నా ఆదుర్దా?- ఇంట్లో ఒక్క క్షణం అయిన స్థిమితంగా కూర్చో గలనా ఇప్పుడు. అయినా కళ్యాణి కి హటాత్తుగా ఏ ఇంజక్షనయినా అవసరం అయి సమయానికి అది ఇక్కడ లేకపోతె నేను నిమిషాల మీద బజారు కెళ్ళి దాన్ని తీసుకు రావద్దా' అనుకుంటూ విజిటర్స్ రూమ్ లో పేపరు చదువుకుంటూ కూర్చున్నాడు. అతని కళ్ళకి అక్షరాలు కనిపిస్తున్నాయే కాని మనస్సు వాటిని పట్టించుకోకుండా సేకండ్లూ, నిమిషాలూ లెక్క పెడుతోంది-- ఎలాగో రెండు గంటల కాలం గడిచింది.
    లోపల నుంచి 'కేర్' మన్న ఏడుపు వినిపించింది. మురళీ సంబరంగా పేపరు టీపాయ్ మీద పడేసి గబుక్కున లేచి నిలబడి ఒక్క వుదుటున ఇవతలకి రాబోయాడు. అంతలోనే అతనికో ఆలోచన వచ్చింది. 'ఈ ఆస్పత్రికి కళ్యాణి లాగ వచ్చిన వాళ్ళు ఎంతమందో వుంటారు-- ఈ ఏడుపు మరెవరి పాపడైనా కావచ్చు' అనుకుంటూ నవ్వుకుంటూ మళ్లీ కూర్చో బోయాడు. ఇంతలో గదికి వున్న కర్టెన్ తొలగించి తల లోపలికి పెట్టిన నర్స్ నవ్వుతూ అంది. 'మిస్టర్ మురళీధరరావు  కంగ్రాచ్యులేషన్సు.'
    'వో థాంక్సు' మురళీ ఆత్రంగా లేచి ముందుకు వచ్చి, 'ఏం పిల్ల' అన్నాడు. కుతూహలంగా .
    'ఆడపిల్ల.'
    "కళ్యాణి కులాసాగా వుందా?'
    'ఆ....వో గంట వోపిక పట్టండి ఆవిడ్ని మీ పాపని కూడా చూసుకుందురు గాని' అని మళ్లీ కర్టెన్ యధాప్రకారం మూసేసి వెళ్ళిపోయింది.
    కాస్సేపటికి తరువాత డాక్టర్ మహేశ్వరి కూడా వచ్చి మురళీ ని అభినందించి-- టైం అయిపోవటం వల్లా, అవాల్తి కి చూసుకోవలసిన అర్జంటు కేసులు ఏమీ లేకపోవడం వల్లా యింటికి వెళ్ళిపోయింది.
    సిస్టర్ చూపించిన గదిలోకి అడుగు పెడుతుంటే మురళీ గుండెలు అవ్యక్తమైన ఉద్వేగంతో , ఆనందంతో దడదడ లాడ సాగాయి.
    కళ్ళు మూసుకుని పడుకుని వుంది కళ్యాణి మంచం మీద -- ఆ ప్రక్కనే చిన్న ఉయ్యాల తొట్టె లో అప్పుడే నీళ్ళు పోసుకుని తెల్లటి జుబ్బా తొడుక్కుని తెల్లటి బట్టలలో పడుకుని వున్న పాప బొద్దుగా ముద్దుగా రబ్బరు బొమ్మలా వుంది-- ఈ పాప, నా పాప, నేను దీనికి తండ్రిని అనుకుంటుంటేనే మనస్సంతా ఏదో గర్వంతో నిండిపోతోంది మురళీ కి-- ఆపేక్షగా అతి సున్నితంగా మునివేళ్ళ తో పాల బుగ్గలు నిమిరాడు --
    'కళ్యాణి కి నిద్దర పట్టినట్లుంది ఇప్పుడు లేపటం ఎందుకు? వెళ్ళిపోయి కాస్సేపు తర్వాత మళ్లీ వస్తాను.' అనుకుంటూనే మనస్సు వుండబట్టక , కళ్యాణి దగ్గరగా వెళ్లి ఆమె మొహం మీద పడిన ముంగురులని అతి మృదువుగా వెనక్కి తియ్య బోయాడు-- కళ్యాణి వులిక్కిపడినట్లు కళ్ళు తెరిచింది-- ఎదురుగా మురళీ-- బిడియంగా చూపులు వాల్చుకుంటూ, 'మీ పాపని చూసుకున్నారా?' అంది.
    'ఏం? నా పాప అంటున్నావు నీ పాప కాదా?'
    'ఉహు నేను బాబు కావాలనుకున్నాను.'
    'అబ్బో....అబ్బాయి అయితే కట్నం గుంజవచ్చనా?'
    'కాదు....మనకి దాని పెళ్లి ఒక సమస్య కాకుండా వుంటుందని.......'
    'చాల్లే....అవన్నీ ఆలోచించటాని కింత కన్న మరో సమయం దొరకలేదా ఏమిటి నీకు. పిచ్చి పిచ్చి ఆలోచనలు మాని ప్రశాంతంగా కళ్ళు మూసుకు పడుకో -- ఊ-- ఏదీ ఇటు చూడు.' అంటూ కళ్యాణి గడ్డం పట్టి ఆమె చూపులు తన వేపుకి తిప్పుకుంటూ 'మనం మన పాప పెళ్లి కోసం ఏమీ కష్ట పడక్కర్లేదు-- మనల్ని బ్రతిమాలి ఒప్పించి మన అమ్మాయిని పెళ్లి చేసుకునే అల్లుడు....అంటే అలాంటి ఇలాంటి వాడు కాదు సుమా-- రాజాలాంటి వాడు వస్తాడు, నువ్వే చూస్తావు' అన్నాడు తల ఎగారవేస్తూ.
    'ఏమిటో ఆ ధైర్యం ?' అంది కళ్యాణి సుతారంగా నవ్వుతూ.
    'అది అంతేలే.' అన్నాడు మురళీ దర్పంగా.
    కళ్యాణి గర్వంగా మురిపెంగా వోసారి పాపనీ ఇంకోసారి భర్తనీ చూసుకుంది.
    మరి కాస్సేపు కూర్చుని ఆ ఖబురూ  ఈ ఖబురూ మాట్లాడి, 'నేను యింటికి వెళ్లి పాలు తీసుకు వస్తాను...డాక్టరు తో మాట్లాడాను. ఒక ఆయా రాత్రుళ్ళు నీ గదిలో పడుకునే ఏర్పాటు చేస్తానంది.' అని చెప్పి లేచి వెళ్ళబోతుంటే.
    "మనం ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండానే వచ్చేశాం....నీకు ఎప్పుడు అవసరం అనిపించినా నన్ను పిలు ఏం మొహమ్మాట పడకు అంటూ ఆ దేశ్ పాండే భార్య నాలుగు సార్లు చెప్పింది కూడా.....సరే ఇప్పుడు వెళ్ళగానే అందరికీ చెప్పండి.' అంది కళ్యాణి.
    'అలాగే....రేపు ప్రొద్దుట నీకు కాఫీ అదీ  ఇచ్చేశాక పది గంటల వేళ వోసారి ఆఫీసుకు వెళ్లి పది రోజులు శలవు పెట్టేసి వస్తాను. మా ఆఫీసు వాళ్ళకి చెప్పి అక్కడ్నించే వాసు ఆఫీసుకి ఫోను చేసి తనక్కూడా ఈ శుభవార్త అందజేస్తాను.........సరే, మరి వెళ్లి రానా?' అని మరోసారి చెప్పి లేచాడు.
    మర్నాడు సాయంకాలం మురళీ వెంట మణీ సుజాతా, వాళ్ళ చిన్న తమ్ముడు హరీ వచ్చారు.
    'పాప తెల్లగా బొద్దుగా చాలా బావుంది పిన్నీ' అంది మణి కాస్త దూరంగా నిలబడి పాపని చూస్తూ.
    'బుజ్జి పాపాయిని మనం ఇప్పుడు ముట్టు కోకూడదు కదూ! పిన్నిని కూడా ముట్టుకో కూడదు' అంది సుజాత అక్క గారి వంక చూస్తూ.
    'అవును , పిన్నీ పాపా యింటికి వచ్చి స్నానం చేశాక, అప్పుడు కావలసినంత సేపు పాపని ఎత్తుకుని ఆడించ వచ్చు.' అంది మణి ఆరిందాలా నవ్వుతూ.
    ఇంతలో వాసూ, శారదా పిల్లలూ వచ్చారు. నవ్వుతూ కళ్యాణి ని మురళీ ని పలకరించి కళ్యాణి ఆరోగ్యం గురించీ పాప ఆరోగ్యం గురించీ అడిగి తెలుసుకున్నాడు. ఆ తరువాత ఏవేవో మాట్లాడుతూ గుర్తు వచ్చినట్లే అన్నాడు వాసు మురళీ తో "మీకు చెప్పలేదూ కదూ , మాకు నిజామాబాద్ ట్రాన్సఫరయింది. పదిహేను రోజుల్లో వెళ్లి అక్కడ జాయిన్ అవాలి....సరే నువ్వు వుత్తరేం ఎలాగూ వ్రాసే వాడివనుకో , అయినా మేము ఇక్కడ వుండగానే పాప పుట్టటం తో మేమంతా చూడటం కూడా జరిగింది.'
    'సరేలే, మేనగోడల్ని చూసుకున్నందుకు నువ్వు మురిసి పోతున్నావు కాని, మీరు లేకపోతె మేం చాలా ఇబ్బంది పడిపోదుము. కళ్యాణి ఆస్పత్రి లో వున్నన్నాళ్ళు తనకి పద్యం వండి పంపిస్తానని అక్కయ్య మాకు ధైర్యం చెప్పింది....నిజంగా మీరు ఊళ్ళో లేకుండా పొతే........'
    'అదేమిటి బాబాయ్, వాళ్ళు వెళ్ళిపోతే మాత్రం మేమంతా లేమా-- పిన్నికి ఆ మాత్రం కారప్పొడి, చారూ అన్నం నేను తెచ్చి పెట్టలేనా ఏమిటి?' అంది మణి మధ్యలోనే అందుకుని.
    చిన్నతాంలోనే తల్లిపోయి, తండ్రి, మిగిలిన పిల్లలూ, ఆ బాధ్యతంతా మీద పడితే ఎలాగో దాన్ని నెగ్గుకు వస్తుండటమే కాకుండా ఇరుగూ, పొరుగూ వాళ్ళకీ స్నేహితులకీ అవసరంలో ఆదుకోటానికి చటుక్కున ముందుకు రావటం, చివరికి ఆ సహాయం చేయ్యగాలిగినా లేకపోయినా మనస్పూర్తిగా ఆ మాట అనగలగటం, ఆ పిల్ల ఇంగితానికి అందరికీ ముచ్చట వేసింది. కళ్యాణి కి మురళీ కి అయితే కళ్ళల్లో నీళ్ళు కూడా తిరిగాయి ఆ పిల్ల అభిమానానికి.
    మురళీ ఆప్యాయంగా ఆపిల్ల తల నిమురుతూ , 'నువ్వీ మాట అంటావని నాకు తెలుసు మణీ....మీ ఇంట్లో పనితోటే సతమత మయి పోతున్నావు.......ఇంకా మేమంతా కూడా నీచేత వంట చేయించుకు తినాలా?' అన్నాడు.
    'అందులో కష్టం ఏముంది బాబాయ్. చారూ, అన్నం కూర మాకోసం చేసుకున్నవే కదా, కాస్త కారప్పొడి మాత్రం పిన్ని కోసం కొట్టే దాన్ని.' అంది మణి ఏమాత్రం వెనక్కి తగ్గకుండా.
    ఇంతలో గోపాలరావు వచ్చాడు-- పిల్లల్ని మురళీ తో వెళ్ళమనీ తను ఆఫీసు నుండి ఆటే మెటర్నిటీ హోం కి వస్తాననీ కళ్యాణి నీ పాపనీ చూశాక తనూ పిల్లలూ కలిసి ఇంటికి వెళ్లి పోవచ్చు ననీ అతను వుదయమే చెప్పాడు.
    'చూశారా , అన్నగారూ , మీ మణి ఏమంటుందో -- వాళ్ళ పిన్నికీ పద్యం వండిపెడుతుందిట'-- అతను ఇంకా గుమ్మంలో వుండగానే మురళీ నవ్వుతూ ఆ మాటలు  చెప్పేశాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS