Previous Page Next Page 
ప్రేమకు పగ్గాలు పేజి 38


    పద్మావతి ఏం మాట్లాడలేదు.
    జయమ్మగారు కూడా కూతురి విముఖతకు కారణం ఆలోచిస్తున్నట్లు పరధ్యానంగా పనులు చూసుకో సాగింది.
    
                                *    *    *

    పద్మావతి పుస్తకం చేతుల్లో తీసుకుని ఆలోచిస్తున్నది. "అమ్మ న్నట్లు ఇద్యోగం చేసి.....ఉద్యోగం చేశాక కూడా తాను ఇంకొకర్ని పెళ్ళాడాలిగా......"
    "అసలు భాస్కరంగారిని ఇక తాను ఈజన్మలో....తాను ఈ జన్మలో....." ఆ పిల్లకి దుఃఖం వచ్చింది జయమ్మగారు ప్రతిపత్తికి పరువు ప్రతిష్టలకూ ప్రాకులాడుతున్నది. ఆమె ఒకనాడు చేసిన సాహసానికి ఇవాళ ముఫ్ఫై సంవత్సరాల తర్వాత కూడా నేరంగా పరిగణిస్తారేమోనని భయపడతున్నదామె. పద్మావతి తల్లి ఆవేదన గ్రహించలేనంత చంటిపిల్ల కాదు. కాని? కాని?........
    "ఈ అంతస్థులు వాటికోసం పాకులాట! ఈ పరువు ప్రతిష్టలు, సంఘ స్థాయీ వీటికై తహతహ ఎందుకూ? ఇవి లేకపోతేనేం?" అనుకున్నది. "ఇవన్నీలేని ఒక సమాజంవస్తే బాగుణ్ణు......" పద్మావతికి నవ్వొచ్చింది. "ఎలా వస్తుంది? ఆర్ధిక వ్యత్యాసాలులేని సమాజం రాదు. సంప్రదాయాలు సంపరకాలు వీటి హయాం పోయినా, అంతస్తుల తేడా మహుషులను ఎడం చేస్తుంది తప్పదు....." అనుకుంది.
    వాస్తవానికి తనకూ భాస్కరానికి తేడా ఏమిటి? ఎక్కడ వుంది?
    ఈ వూహ తట్టడంతోనే ఆ పిల్ల బుద్ది చురుకుగా పని జేసింది. ప్రేమ, ప్రణయం వీటన్నింటికీ పట్టి పగ్గంవేయగల బంధనం ఏదో తెలిసిపోయింది.
    "తన తల్లి చరిత్రయే బహుశా భాస్కరంగారి ఈ విముఖతకు కారణం" అన్న మాట అనుకుంది.
    ఈ ఆలోచన రావడంతో కుమిలిపోయింది. పద్మావతి. "ఛీ" అని తనను తానే అసహ్యించుకుంది. తనకూ సురేఖకూ తన తల్లికీ సురేఖ "పెంపుడు తల్లి" ధనమ్మకీ గల వ్యత్యాసం ఎక్కడా?
    ఈ ఆలోచనలతో పద్మావతికీ ఎవరో కళ్ళు తెరిపించినట్లైంది. అవమాన భారంతో కృంగిపోయింది.
    జయమ్మగారు "అమ్మాయీ! ఆలోచించకులే! స్నానం చెయ్యి! అన్నింటికీ దైవమే ఉన్నాడు" అనాది.
    "పాడు దైవం ఉన్నాడా?" ని పద్మావతి పుస్తకం అవతల పడేసి లేచింది.

                        
    "చూడు పద్మా! మనకి సమజంలో ఒక పరువైన ఉనికి కావలె అంటే రాజు, పార్వతీ, సుబ్రమణ్యం అనే నీ ముగ్గురు స్వాతి తోబుట్టువుల అండ దండలూ కావాలి......రాజు నిన్ను, నన్నూ గౌరవించడానికీ, పదిమందిలో మనం తల ఎత్తుకోడానికీ సమ్మంధమున్నదమ్మా!" కూతురు జెడ విప్పి స్వయంగా నూనె రాస్తూ చెప్పిందామె.
    "పోనీ ఇలాంటి సమ్మంధాలు, గౌరవాలూ అక్కర్లేని సమాజంలో కలిసిపోదామమ్మా మనం?" పద్మావతి అడిగింది.
    "అటువంటి వరుడు ఎవరు పద్మావతీ మనకీ?"
    పద్మావతికీ దుఃఖ మొచ్చింది. ఇదే ఐదారు నెలలక్రితం అయితే "భాస్కరంగారు అని ఒకాయన ఉన్నారమ్మా" అని చెప్పేది. కాని ఇవాళ...... రాడమ్మా అలాంటి బుద్దిహీనుడు బహుశా రాజన్నయ్యకే దొరుకుతాడేమో" నన్నది బాధగా.
    జయమ్మగా రడిగింది. "చూడమ్మా! నాకు నువ్వూ, నీకు నేనూ స్నేహితులమైనా బంధువుల మైన, ఎవరమైనా ఇద్దరమే......నాకు ఒక చరిత్ర ఉంది-లేచిపోయినదాన్ని అని- నీకు ఒక చరిత్ర ఉంది. అదే నా కూతురువు అని ..... ఈ చరిత్రకు నీ తండ్రి తరఫునించి విలువతల్లి తరఫు నించి ఏహత్యా వస్తాయమ్మా!"    
    పద్మావతి మాటాడలేదు కాస్సేపు.
    "ప్రేమకు అర్ధం, విలువ ఉండదా? అమ్మా?" అన్నది బరువుగా నిట్టూర్చి.
    జయమ్మగారు నవ్వింది పొడిగా......"నీ పిల్లలకి నువ్వీ ప్రశ్నకు ఏ సమాధానం ఎలా చెప్తావో బ్రతికుంటే చూడాలనుందమ్మాయ్?" అన్నది.
    పద్మావతి విస్తుబోయింది.
    జయమ్మగారన్నది. "నిన్ను ప్రేమించిన వాడు నీ తల్లిని గౌరవించగలడనే నమ్మకముందా?" జయమ్మగారు కూతురు రహస్యం కనుక్కోడమే కాదు. దానికి ఒక సవాలు విసిరి మరీ లేచి వెళ్ళిపోయింది వంట ఇంట్లోకి. ఆమె కన్నీరు ఒత్తుకున్న సంగతి దేవుడి పటానికి మాత్రమే తెలుసు!
    పద్మావతి నీళ్ళు పోసుకుంటూనే ఉన్నది. బుర్ర వేడెక్కుతూనే ఉన్నది. "నన్ను ప్రేమించినవాడు, నన్ను ప్రేమించిన వాడు, నా తల్లిని నా తల్లిని గౌరవం గౌరవం......" అదే ఆవేదన.
    "భాస్కరం తనను కాదని సురేఖ వేపు మొగ్గుచూపడాని క్కారణం ఏమిటీ?-"
    పద్మావతికీ గుండెల్లో కలుక్కుమంది. "ఛీ! ఇన్నాళ్ళు తనను భాస్కరం అవమానం చేశాడు....."
అనుకుంది. "ప్రేమించలేదు అవమానించాడు."
    "అంతే - ఇక రుణం తీరిపోయింది. మా అమ్మను పూజించగలవాడే, అమ్మను గౌరవించగలవాడే వాడెవడవనీ నాకు భర్త" అనుకుంది.
    ఆ రాత్రంతా ఏడ్చిందికాని భాస్కరంమీద ఇంకా ఆశ వదులుకోలేక పోయింది.
    రాజు తెచ్చిన సమ్మంధం కాదూ అంటే తన తల్లిని రాజా అతని కుటుంబమూ తిరిగి వెలివేస్తారు. ఈ సంగతి పద్మావతికి తెలుసు.
    జయమ్మగారు ఎన్నో సార్లు అన్నది కూడా.
    "ఆ మహానుభావుడు నీ తండ్రి నూతులో పడుతున్నదాన్ని నన్ను రక్షించాడు కాని అతని పిల్లలు మీరు నువ్వే అవనీ, మీ సవతి అన్నలే అవనీ నన్ను దిక్కుమాలిన చావు చంపుతారేమో" నని.
    "ఛీ! నేను అలా చెయ్యనమ్మా! నేను నేను నీ కోసమేనమ్మా బ్రతుకుతానూ" - పద్మావతి హృదయం ఆక్రోశించింది.
    
                                      48

    జానికమ్మగారు కొడుకు తిరుగుబాటును తట్టుకోలేక పోయింది. "వాడు ఇంత వాడై పోక మునుపే నేను చచ్చిపోయినా బాగుణ్ణు" అన్నది వసంతతో.
    వసంత చాలా ఎదిగి పోయింది.
    "ఛీ! ఏం మాటలుఅమ్మా అవి? అన్నయ్య వింటే ఏడుస్తాడూ" అన్నది.
    "ఏడుస్తాడంటావా?"
    "చచ్చిపోతాడు కూడా" నంది వసంత స్పష్టంగా.
    "ఛీ! నోర్ముయ్!" ఆ పిల్ల నోరుమూసింది. జానికమ్మగారు.
    "నిన్ను అత్తగారింటికి పంపేస్తాను-ఆనక సురేఖ ఈ ఇంట కొత్తదీపంలా మసలుతూ ఉంటుందనుకున్నాను" ఆవిడ బాధగా చెప్పింది.
    "సురేఖ కాకపోతే మరో అమ్మాయి కాకూడదా? అమ్మా!" వసంత భయం భయంగా ఆనంది.
    "ఎందుకవ్వాలీ?"
    "మరి అన్నయ్యకు యిది ఇష్టంలేదుగా....."
    "ఆ సంగతి ముందే చెప్పకూడదూ.....ఇప్పుడు మన పరువు బజారున పడేయకపోతే తప్ప వాడి ప్రయోజకత్వం తెలియదా?"
    "అప్పుడు కూడా తాను నాపెళ్ళి కోసరమే ఒప్పుకున్నట్టే" అంది వసంత అమాయకంగా.
    జానికమ్మగారు ఆశ్చర్యంగా అర్ధంగానట్లు చూసింది.
    "ఏమిటే నువ్వు అంటున్నదీ?" అన్నది.
    వసంత సిగ్గుపడి పోయింది. భయపడిపోయింది కూడా.
    "సురేఖను ఇవాళ కాదంటే వాళ్ళు నిన్నూ నన్నూ ఆడిపోసుకోరూ?" జానికమ్మగా రడిగింది.
    "వాళ్ళ కర్మ! ఏడవనీ మనకేం...." వసంత దైర్యంగా అంది.
    "ఇంతకీ ఆ సురేఖకు నా మొహం ఎలా చూపనమ్మాయ్?" బాధ పడ్డదామె.
    "ఎందుకమ్మా! అసలు సురేఖగారే అన్నయ్యను వద్దన్నదేమో?" నవ్వింది తెచ్చికోలుగా వసంత
    "ఎంతమాట? ఎంత బరిదీరి పోయారు ఆడపిల్లలు?" నోరు నొక్కుకుంది అంత బాధలోను జానికమ్మగారు.
    "నీ కాపురం ఆ ధనమ్మచేత బడ్డది కదా? ఇప్పుడు నాకేం దారీ?"
    ఆమెకు జ్వరం తీవ్రంగా కాస్తున్నదని గ్రహించిన వసంత ఆందోళన పడింది.
    లేచి గదిలోకి వెళ్ళి తల్లికి తెలియకుండా అన్నయ్యకు ఉత్తరం రాద్దామనుకుంది. కాని అన్నయ్య వెళ్ళి ఇంకా నలుగు రోజులే అయింది. ఆ ప్రయత్నం మానుకుంది తండ్రి దగ్గర ఆ పిల్లకు చనువులేదు.
    సురేఖ దగ్గరికి వెళితే? కాని ఎందుకూ...
    ఐనా ఎలా వెళ్ళడం? తమ్ముడు రాముణ్ణి పిలిచి అడిగింది.
    "ఏరా! రామూ! మనం గాంధీ నగరం రిక్షాలో వెళ్దామా?" అని. "కాని ఎందుకు?" అన్న ప్రశ్న ఎదురైంది వాడినించి.
    "ఓ! ఉండు అమ్మకి చెప్పొస్తా" నంటూ వాడు పరిగెత్తాడు.
    "ఓరి బాబోయ్!" ఆ పిల్ల గుండెలాగి పోయాయి.
    "వొరేయ్ రామూ!" అన్నది వెనక్కి కేకవేస్తూ.
    వాడికి పావలా తీసి ఇచ్చి "బాబూ! నువ్వూ నేనూ రేపు సినిమాకి వెళ్దాంగాని ఇవాళ్టికి, ఎదురింతి సత్యవతితో ఆడుకోమని" తోలేసింది "గాంధీ నగరమో?" నన్నాడు వాడు.
    "వద్దు వూరికే అన్నానంది"
    "కొంపలు తీస్తావు వెధవా?" అనుకుంది. నెలరోజుల్లోనే పెళ్లై బోలె డెదిగిపోయిన వసంత తుర్రున పారిపోతున్న తమ్ముణ్ణి చూస్తో!

                                  *    *    *

    సురేఖకు ఏమీ తోచలేదు.
    ధనమ్మగారు రాఘవేంద్రరావును పిలిచింది.
    "ఏమయ్యా! నీకు తెలుసా?" అని అడిగింది.
    "ఏమిటి తల్లీ! ఏమిటీ!" వినయంగా ఆశ్చర్యం వెలిబుచ్చాడతను.
    "ఈ భాస్కరం ఎవతెనో ప్రేమించాడట!"
    "శివశివా!"
    "శివాలేదూ రామాలేదూ......నీ కొడుకు పెళ్ళికని నేను ఒళ్ళు ఇల్లూ హూనం చేసుకున్నా కై నా ఇంటి విషయంలో నువ్వు ఇంత ప్రమత్తత వహించడం భావ్యమా?"
    "చెల్లీ చెల్లీ! నన్ను నువ్వు ఇంత పరాయి వాడిగా అదమాయించడం బాగోలేదు."
    "అదమాయింపుకాదు...... ఇదంతా నా కర్మ. ఈ సురేఖ చెబుతున్నది..... ఆ భాస్కరం అక్కడ వాల్తేరు బళ్ళో ఎవతెనో పద్మకుమారిని ప్రేమించాడట....... ఇప్పుడేం చేస్తావు?"
    విస్తుబోయాడు రాఘవేంద్రరావు కాస్త ధైర్యంగా మరి కాస్త కసిగా.
    "ఎంత దారుణం" అన్నాడు.
    "ఋణం సంగతి నేచూస్తా గాని ఈ దారుణం నువ్వాపాలి.....' 'ధనమ్మగారు విసుక్కుంది.'
    మళ్ళీ మెత్తబడి తానే స్వయంగా లోపలికి వెళ్ళి గ్లాసుతో కాఫీతీసుకుని వచ్చింది- ఆప్యాయంగా ఇచ్చింది.
    "అది కాదన్నయ్యా! చూడు మనకి ఇప్పుడా కుర్రాడు సురేఖను కాదంటే ఎంత అవమానమో?" నన్నది కాస్త దీనంగా మొహంపెట్టి.
    "కాదూ మరి!" అన్నాడు కండువా సవరించుకుని రాఘవేంద్రం కాఫీ చప్పరించి!
    "కాదూ మరి అని మీనమేషాలుగుడిస్తే ఎలా?"
    "సరే! నేను ఆ సంగతి చూస్తా నీవు నిశ్చింతగా ఉండు." అన్నాడు రాఘవేంద్రంగారు.
    "చూస్తాను అంటే కాదు. నేను నీ ముకుందం పెళ్ళి ఎలాగైతే జరిపించానో నీవు నా సురేఖపెళ్ళి నలాగ, జరిపించాలి....." అని అంతలో చటుక్కున మాటమార్చి "అన్నట్లు మరిచి పోయానన్నయ్యా! నీ ఇంటి తాలూకా కాయితాలు తీసుకుని వచ్చి మా లాయరుగారు అమ్మా! వడ్డీ రాలేదన్నాడు. నేనే ఇస్తాను వేరే పైకం కావాలీ అంటే ఆ వడ్డీ కట్టేయ్! లాయర్ దగ్గర నిన్ను కించపరచడం నాకు ఇష్టంలేదు" అన్నది. ధనమ్మ గారు.
    గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డది రాఘవేంద్రానికి.
    "ఎంతమాట చెల్లీ! మన మనం ఒకటే ఐనా లాయర్ లు నౌకర్ లు మొదలైన వాళ్ళ దగ్గర పరువు తీసుకుంటామా? ఇదో పెళ్లైంది గదా! నేనే కడతాను....." అంటూ లేచాడు "మొదట ఆ జానికమ్మ దగ్గరకివెళ్ళనా?" అంటూ.
    "వద్దు వద్దు.....పాపం ఆమె నెందుకు హింస పెట్టడం?- ఆమె యెప్పుడూ మన పక్షమే! నువ్వా వాల్తేరు వెళ్ళి ఆ వగలాడి ఎవతో దాని సంగతే చూడు....." మన్నది ధనమ్మ "కావాలంటే ఓ వెయ్యో ఎంతో పారేద్దాం" అన్నది కూడా.
    రాఘవేంద్రం ఏమనగలడు?
    తన ఇల్లు వేలం వేయించగలదు, ధనమ్మ తల్చుకుంటే! బుర్ర వూపాడు.
    "అమ్మాయ్! సురేఖా!" అన్నాడు లోపలికి కేకవేస్తో "దాన్నెందుకూ?" అడిగింది కాస్త అనుమానంగా ధనమ్మగారు.
    "ఆ పద్మకుమారి కాదు కాదు పద్మావతి గురించి....." అంటూన్న రాఘవేంద్రాన్ని వారించి మధ్యలోనే ధనమ్మ్గగారందుకుంది.
    "దాన్ని అడగవద్దు...... అసలీ కధంతా అదే నడిపించింది..... వెర్రిబాగుల్దికదా!" ధనమ్మ గారు వారించింది కాని అంతలోనే సురేఖ అక్కడకు వచ్చింది. రాఘవేంద్రరావు సీసాలో మంత్రించి దింపిన భూతంలాగ ఉన్నాడు. అవకాశం కాస్త దొరికింది గనుక జార విడవకుండా సురేఖను చూసి. "అవును మరి ఇంకా చిన్నపిల్లకదా" అంటూనే "అదిసరే సురేఖా! నేను వాల్తేరు వెళ్తా......నువ్వే కులాసాగా ఉన్నావూ అంటే రాపోదాం......నేను ఆ పద్మావతి పని పడితేగని రాను. నీకాభయం అక్కర్లేదు" అన్నాడు.
    మధ్యలో కోపంగా ధనమ్మ వారించింది. "నువ్వెళ్ళవయ్యా అన్నయ్యా? చిన్నదానితో నీకేమిటీ? దానికి మరోవారం శలవు పెట్టించాను....."
    "అహ అహఁ ! సరే సరే! రెస్టు తీసుకోతల్లీ!" అంటూ నిష్క్రమించాడు రాఘవేంద్రం.
    "ఏమిటి దొడ్డమ్మా! పద్మావతి దగ్గరికి ఇతగాడెందుకూ?" సురేఖ అడిగింది.
    "పెళ్ళి చేస్తాడులే అందుకూ?" వెటకారం ఆడింది ధనమ్మ.
    "నీ ధోరణి బాగులేదు. పద్మావతి భాస్కరం గారిని ప్రేమించింది. భాస్కరం కూడా ఆమెకు మాట ఇచ్చాడు."
    "నోర్ముయ్! మాట ఇచ్చాట్ట మాట! వాడు నాకూ ఇచ్చాడు మాట, అందుకే వాళ్ళ చెల్లిపెళ్ళి నిక్షేపంలా జరిగింది......"
    "వుహూఁ అందుకు బెరంగా భాస్కరం గారిని నీ అల్లుడవ్వాలంటావ్! అంతేగా!"
    "అంతే!"
    "కాని నేను ఆ పెళ్ళికి ఒప్పుకోను."
    "నేను చెప్పినాసరే ఒప్పుకోవా?"
    వెళ్ళిపోయింది సురేఖ అక్కణ్ణించి.
    పూనకమే వచ్చింది ధనమ్మగారికి.
    "ఆగు! భడవఖానా! చివరికి తల్లి రొమ్ములు గుద్ధారూ అన్నట్లు నన్నే ధిక్కరిస్తావా?.....నీవు ఈ భాస్కరాన్ని పెళ్ళి చేసుకోపోతే నా ఆస్తి చిల్లిగవ్వరాదు గ్రహించు" మన్నది.
    సురేఖ వెళ్ళిపోయింది. నిశ్చయంగా అడుగులు వేస్తూ.
    ధనమ్మగారికి పీకె పిసుకున్నంత కోపం వచ్చింది. "భాస్కరానికి నీకూ నా డబ్బు ఎలా చేదవుతుందో నేనే చూస్తా" నంది కసిగా.
    
                                    *    *    *

    మర్నాడు ఉదయం ధనమ్మగారు లేచి సురేఖను కాఫీకి రమ్మని కబురు పెట్టింది అలవాటు ప్రకారం, గదిలో సురేఖ లేదు. వంట వాడిమీద మండి పడుతూ ఆమె స్వయంగా సురేఖ గదిలోకి వెళ్ళింది. అక్కడ మేజామీద ధనమ్మగారి పటం క్రింద తెల్లని ఉత్తరం మడత ఉన్నది.
    "అయ్యో! కొంప ముంచేనే" నని గాభరా పడుతూ ఉత్తరం తీసుకుంది ధనమ్మ. కాని అది చదువుతూనే ఆమె ఆందోళన చెరిగి ఆ గ్రహంతో కనులు నిప్పులు చెరిగాయి. అందులో ఇలా ఉంది.
    "దొడ్డమ్మా! నన్ను తల్లికన్నా మిన్నగా పెంచావు, నాకు తెలుసు ఆ సంగతి. అందుకే నీ ఆస్తిని నీకే వదలి నీవు నాకు ప్రసాదించిన సంస్కారం మాత్రం తీసుకుని వెళ్తున్నాను. నీ సేవకు అవకాశం ఇస్తే వస్తానేగాని నీ ఆస్తికి, అమ్ముడవడానికి రాలేను క్షమించు. ఆడపిల్లలికి పుట్టింటి ఆస్తికాదు కదా! అందుకే నీ ఆశీస్సులకై సదా ఎదురు చూసే నీ కూతురు- సురేఖ."
    "నా కూతురు.....నా కూతురే అయితే ఇలా ధిక్కరిస్తుందా?" ఆమె మండిపడి- "చూడు గురువులూ!" అని నౌకర్ను కేకేసింది. సురేఖ వాళ్ళ నాన్నకి టెలిగ్రాం ఇవ్వు. అదక్కడికే వెళ్ళిందో గంగలోనే దూకిందో"-నన్నది. మళ్ళీ నౌకర్ ను వెనక్కి పిలిచి, "అతగాడికి స్టార్ట్ ఇమీడియట్లీ అని కూడా మరోవైర్ ఇయ్యి......నాలుగూ తేల్చేస్తాను" అన్నది. "తిరుగుబాటు చేస్తుందా వేలిడులేదు కదాయిదీ?" అనుకుంది.
    ఆ ఉత్తరం పట్టుకుని ధనమ్మగారు ఆగ్రహావేశాలతో ఇల్లంతా చిందులు తొక్కడం నౌకర్ లందరూ చూశారు గాని, కన్నీరు కార్చడం ఒక్క దేవుడి పటం, భర్తపటం మాత్రం చూశాయి.
    "ఈ ఆస్తి అక్కర్లేదట పింజారికి    ! మరెవరి కోసం దాచానుకుందో"నని దుఃఖ పడ్డదామె!


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS